NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీ అభివృద్ధికి సూచనలు, సలహాల స్వీకరణ.. ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసింది.. ప్రజల నుంచి సలహాల స్వీకరణ కోసం స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు.. ఏపీ అభివృద్ధి సలహాల కోసం పోర్టల్ ప్రారంభించింది ప్రణాళిక విభాగం. సూచనలు చేసిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తోంది ప్రభుత్వం.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేసేలా సలహాలివ్వాలి అంటూ ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2047 నాటికి 2.4 ట్రిలియన్ల డాలర్ల GSDP మరియు 43,000 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో భారతదేశాన్ని నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్వర్ణాంధ్రదేశ్ @ 2047 వైపు ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లడానికి ప్రజలు సూచనలు చేయాలని కోరారు.. ప్రతి ఒక్కరి ఆలోచన ముఖ్యమైనదే.. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి ఏపీని నిర్మించుకుందాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్‌ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.. ఇది వైఎస్‌ జగన్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగాగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు.. కానీ, అప్పుడు అడ్డుకోలేదు.. కానీ, ఇప్పుడు మతాలు గుర్తు వస్తున్నాయి.. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు, రాజకీయాలకు దేవుడ్ని వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని వ్యాఖ్యానించారు.. జగన్ కు కుట్ర, కుతంత్రాలు తెలియవు.. నిజాయితీగా మాట్లాడటమే తెలుసు అని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..

తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు‌‌‌… అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు… సినిమాల్లో ఒక్కో గెటప్.. ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కల్యాణ్‌ అంటూ.. డిప్యూటీ సీఎం పవన్‌ పై సెటైర్లు వేశారు.. పాపం పవన్ కల్యాణ్‌కి ఏమి తెలియదు.. ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే ఆయన పని.. ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్నీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అన్నారు.. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారని ఆరోపించారు రోజా.. సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పు చేశామని తెలిసే సైడ్ అయ్యారు.. పవన్ కల్యాణ్‌ను ముందర పెట్టి డ్రామాలాడిస్తున్నాడు.. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు.. బూట్లతో.. చెప్పులతో దేవుడిని మొక్కుతాడు, పూజలు చేస్తాడని విమర్శించారు..

సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర..! కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. ఒక స్వైన్ ఫ్లూ కేసు రోగి పక్కన సీతారాం ఏచూరి ఉంచారు.. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.. ఇక, ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా కూడా బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు చింతా మోహన్‌..

36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న.. కేటీఆర్‌ కీలక ప్రకటన..
హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు. దీంతో ఈరోజు బాధితులంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్ తో తమ గోడు వెళ్లబోసుకుందామని భావించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బీఆర్‌ఎస్‌ నేతలకు వివరించేందుకు వచ్చారు. కానీ తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రామా బాధితుల వద్దకు కేటీఆర్ రాలేకపోయారు. దీంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా తాను అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను కేటీఆర్ వివరించారు. 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ట్వీట్ లో వెల్లడించారు.

త్వరలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఇంటి కోసం అన్వేషణను ముమ్మరం చేశారు. త్వరలోనే ఆయన సీఎం నివాసాన్ని ఖాళీ చేస్తారని చెబుతున్నారు. ఢిల్లీలో వారి కోసం కొత్త ఇంటి కోసం వెతుకుతున్నారు. అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, సాధారణ పౌరులు వారి సామాజిక-ఆర్థిక లేదా రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా వారికి ఇళ్లు అందిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన నియోజకవర్గం న్యూఢిల్లీకి సమీపంలో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా అతను తన నియోజకవర్గంతో కనెక్ట్ అయ్యాడు. నిజానికి, కేజ్రీవాల్ వివాద రహిత ఆస్తి కోసం వెతుకుతున్నాడు. అక్కడ నివసించడానికి ఎటువంటి సమస్య లేదు, ఇందుకోసం కేజ్రీవాల్ ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దుర్గాపూజపై ఆంక్షలు.. నమాజ్ ఆరంభానికి ముందే లౌడ్‌స్పీకర్లు బంద్
బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు ఆంక్షలు విధిస్తుంది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32 వేల 666 వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. గత కొంతకాలంగా మత అల్లర్ల జరుగుతున్నాయి.. వీటిని దృష్ట్యాలో ఉంచుకుని.. దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ చెప్పారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా బెదిరించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ అయ్యర్‌ అనే వ్యక్తి గతంలో తిలక్‌నగర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వెళ్తే.. అతడి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక, దీనిపై విచారణ పూర్తి చేసిన జడ్జ్ సంతోశ్‌ గజానన హెగ్డే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కాగా చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలతోనైనా పోలీసులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై కేసు నమోదు చేస్తారో లేదో అనేది వేచి చూడాలి.

ఛీ.. ఛీ.. ఆస్ట్రేలియా జట్టు బుద్ది మారదా.? మరోసారి వక్రబుద్ధి బయటపడిందిగా.!
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ క్యాచ్ పట్టాడు. కాకపోతే అది పూర్తి క్యాచ్ కాకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే, కొద్ది చర్చ తర్వాత ఇద్దరు అంపైర్లు క్యాచ్‌ను మళ్లీ తనిఖీ చేయమని థర్డ్ అంపైర్‌ను కోరారు. అందులో బంతి కీపర్ గ్లోవ్స్ ముందు భూమిని తాకినట్లుగా స్పష్టంగా కనిపించింది. 17వ ఓవర్‌లో, మిచెల్ స్టార్క్ వేసిన ఐదో బంతికి లెగ్ సైడ్ వెలుపల కీపర్ జోష్ బంతిని పట్టదు. బంతి బ్యాట్ అంచుని తీసుకొని వెనక్కి వెళ్లింది. అక్కడ క్యాచ్ ను ఎడమవైపు డైవింగ్ చేస్తూ పట్టుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు కీపర్ జోష్. ఆస్ట్రేలియా ఆటగాళ్లను చూసిన అంపైర్ జోయెల్ విల్సన్ కూడా క్యాచ్ కరెక్ట్ గా తీసుకున్నాడని భావించి ఔట్ ఇచ్చాడు ఫీల్డ్ అంపైర్. అయితే ఆ తర్వాత అంపైర్లు మాట్లాడిన తర్వాత, అంపైర్లు ఇద్దరూ క్యాచ్‌ను మళ్లీ తనిఖీ చేయమని థర్డ్ అంపైర్‌ను కోరారు.

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిల్మ్ ఛాంబర్‌లో భార్య ఫిర్యాదు
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్‌ వచ్చిచేరింది.. బాధితురాలపై ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది.. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది.. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది.. నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది.. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని పేర్కొంది.. ఇక, బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతాను అని చెప్పాను అన్నారు సుమలత.. కానీ, బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు.. మీరు నాకు వదిన అంటూ నమ్మించింది.. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో బాధితురాలికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది.. అయితే, ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు.. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది.. పేరున్న.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుందని.. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది.. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత.. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుతున్నట్టు వెల్లడించారు సుమలత..

డే 1.. దేవర విధ్వంసం!
ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు దేవర బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన దేవర.. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా.. ఇండియాలో తొలి రోజు 83.71 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. గ్రాస్ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 154.36 కోట్ల వరకు వచ్చినట్టుగా అంచనాలు ఉన్నాయి. దీంతో సోలోగా ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. అలాగే.. 2024లో డే వన్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా దేవర నిలిచింది. ఏపీ తెలంగాణ తొలిరోజు 83.71 కోట్లు, కర్ణాటక 10.03 కోట్లు, తమిళనాడు 2.59 కోట్లు, కేరళ 64 లక్షలు, మిగతా ఇండియా అంతా కలిపి 9.27 కోట్లు, ఓవర్ సీస్ 48.12 కోట్లు(ఇంకా రిపోర్ట్ చేయని లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఫైనల్ గా సినిమా యూనిట్ 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ప్రకటించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టించిన దేవర.. రిలీజ్ అయ్యాక భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.

బాలయ్య కాళ్ళు మొక్కిన ఐష్
అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ మంచి సినీ తారలతో పాటు స్టార్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది అదేమంటే పొన్నియన్ సెల్వన్ సినిమాకి గాను ఐశ్వర్యరాయ్ తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ అవార్డుని నందమూరి బాలకృష్ణ చేతుల మీదగా అందజేశారు. ఈ క్రమంలో అవార్డు అందుకునేందుకు స్టేజి మీదకు వచ్చిన ఐశ్వర్యారాయ్ అవార్డు అందుకునే ముందు నందమూరి బాలకృష్ణ కాళ్ళకు నమస్కారం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IIFA 2024 అవార్డులు అబుదాబిలో జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు అందుకున్నారు. ఆయనను బాలకృష్ణ, వెంకటేష్ అభినందించారు.