ఏపీ తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.. ఇక, గోపాలపూర్ (ఒడిశా) 550 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోంది.. తుఫాన్ ఈ సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం – కాళింగపట్నం మధ్యలో, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.. గాలి వేగం గంటకు 90–100 కిలో మీటర్లు.. అంత కంటే ఎక్కువగా గంటలకు 110 కిలో మీర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. రాబోయే కొన్ని గంటల్లో ఏపీ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతన్నారు..
విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ పెడుతోన్న మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు పడుతున్నారు మత్స్యకారులు.. ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు..
పెను తుఫాన్‌గా మారిన మొంథా..
మొంథా తుఫాన్ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతూ తీరం వైపు దూసుకొస్తుంది.. పెను తుఫాన్‌గా మారిపోయింది మొంథా తుఫాన్.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మొంథా పెను తుఫాన్‌గా మారిపో్యింది.. గత 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది.. తుఫాన్ ప్రస్తుతం.. మచిలీపట్నంకి దక్షిణ–ఆగ్నేయంగా 160 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకి దక్షిణ–ఆగ్నేయంగా 240 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైంది.. ఇక, గోపాల్‌పూర్ (ఒడిశా) కి దక్షిణ–దక్షిణ పశ్చిమంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మొంథా పెను తుఫాన్.. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంథా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.. తీర దాటే సమయానికి గాలివేగం గంటకు 90–100 కిలో మీటర్ల నుంచి గరిష్టంగా 110 కిలో మీటర్ల వరకు వీస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..
సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు..
మొంథా తుఫాన్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలి అంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఉదయం మొంథా తుఫాన్ పరిస్థితులపై మంత్రులు. ఎమ్మెల్యేలు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. తుఫాన్ పరిస్థితి ఎదుర్కోవడానికి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఈ రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.. సహాయ చర్యల కోసం రెడీగా ఉండాలి.. ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించాలి.. ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మొంథా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది.. భయానకంగా మారిపోయాయి సముద్రతీర ప్రాంతాలు.. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి.. కోస్తా తీరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.. అంతకంతకు ఈదురు గాలుల తీవ్ర పెరుగుతోంది.. గాలుల తీవ్రతకు ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి.. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి.. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు..
ప్రజలు పిచ్చోళ్లు కాదు.. జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎంపీ అరవింద్ ఫైర్..
జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్ మెంటు ఆపింది ఎవరు? అని ప్రశ్నించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగొద్దు అనే కుటిల ఆలోచనతో కల్వకుంట్ల కుటుంబానిధని ఆరోపించారు. అణగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దౌర్భాగ్యూలు మీరని విమర్శించారు. ఒక జనరేషన్ మొత్తాన్ని అణగదొక్కింది కల్వకుంట్ల కుటుంబం.. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మెన్ కు బీజేపీ తరఫున లేఖ పంపిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డికి కవితకు ములాఖత్ ఎంటి..? ఎందుకు రాజీనామా ఆమోదించటం లేరు..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇద్దరు ఒక్కటే..ఇద్దరు బిజినెస్ పార్ట నర్లని విమర్శించారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారని ఎంపీ అరవింద్ తెలిపారు.
పెళ్లిళ్లలో మూడు బంగారు నగలు మించితే రూ.50 వేలు ఫైన్..!
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. ఆల్ టైం హై రికార్డులు సృష్టించి.. మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది.. అయితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు.. కొనుగోలు చేసేవారు లేకపోలేదు.. మరోవైపు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు.. కొందరు ఎక్కువ బంగారం నగలు పెట్టుకొని వస్తే.. మరికొందరు.. వారి స్థాయికి తగ్గట్టు.. కొన్ని నగలే పెట్టుకుంటారు.. అయితే, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలోని రెండు గ్రామాల్లో వింత నిర్ణయం తీసుకున్నారు గ్రామ పెద్దలు.. జిల్లాలోని కందద్, ఇంద్రోలి అనే రెండు గ్రామాల్లో.. మహిళలు బంగారు నగలు ధరించడంపై కొన్ని ఆంక్షలు విధించారు.. ఇక నుంచి ఎవరైనా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో మూడు బంగారు ఆభరణాలు మాత్రమే ధరించాలని షరతులు పెట్టారు గ్రామ పెద్దలు.. వీళ్లు షరతులు పెడితే మేం పాటించాలా? అని బ్రేక్ చేస్తే మాత్రం.. రూ.50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. విలాసవంతమైన వివాహ సంప్రదాయాలు మరియు భారీ ఆభరణాల ప్రదర్శనల నిరంతరాయంగా కొనసాగడం వల్ల పేద కుటుంబాలపై మోపబడిన అణిచివేత ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా కమ్యూనిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.. గ్రామంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వివాహిత మహిళలు మూడు నిర్దిష్ట బంగారు ఆభరణాలను మాత్రమే ధరించడానికి అనుమతించబడతారు.. అన్ని ఇతర భారీ లేదా అదనపు ఆభరణాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. పెరుగుతున్న బంగారం ధర పేద కుటుంబాలు ముందుకు సాగడం అసాధ్యం చేసింది.. ధనవంతులను అనుకరించడం వల్ల తరచుగా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతాయి.. లేదా వారి పొదుపు తగ్గిపోతుంది అని ఒక గ్రామ పెద్ద విచారణ సందర్భంగా వివరించారు.
బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఎన్నికల వేళ అన్నదాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు.. నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్‌కు నో ఎంట్రీ.. బీఎస్ 6 ఇంజన్లు లేని వాహనాలకు కూడా అనుమతి నిరాకరణ.. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపద్యంలో పాత కమర్షియల్ వాహనాలకు బ్రేక్ వేసింది.
కెనడాలో దారుణం.. భారత సంతతి మహిళ హత్య
కెనడాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన అమన్‌ప్రీత్ అనే మహిళ (27) దారుణ హత్యకు గురైంది. లింకన్‌లోని ఒక పార్కులో అమన్‌ప్రీత్ సైని మృతదేహం లభ్యమైంది. గాయాలతో మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు భారతదేశానికి పారిపోయాడని చెప్పారు. అమన్ ప్రీత్ సైనీ బ్రాంప్టన్‌లో నివాసం ఉంటుంది. అక్టోబర్ 21న లింకన్‌లోని ఒక పార్కులో సైని మృతదేహం లభ్యమైంది. అయితే ఈ హత్యలో మన్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు పంజాబ్‌కు చెందిన వాసిగా గుర్తించారు. తాజాగా అతడికి సంబంధించిన చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. అతడి సమాచారం తెలియజేయాలని కోరారు. అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అమన్‌ప్రీత్ సైని మృతదేహం దొరికిన కొద్దిసేపటికే మన్‌ప్రీత్ సింగ్ దేశం విడిచి పారిపోయాడని.. దర్యాప్తు సాగుతోందని నయాగరా ప్రాంతీయ పోలీసు సర్వీస్ అధికారిక ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగానే చెప్పారు. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
షాకింగ్ న్యూస్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. ఏకంగా 30 వేలు..!
ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15.5 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం వ్యాపార విస్తరణతో పెరిగిన ఖర్చులను తగ్గించుకోవడమే ఈ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లుగా అమెజాన్ పరికరాలు, కమ్యూనికేషన్లు, పాడ్‌కాస్టింగ్, ఇతర చిన్న విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం మానవ వనరులు, డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ వంటి విభాగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. హెచ్ఆర్ విభాగంలోనే దాదాపు 15 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన నోటీసులు వచ్చే వారం నుంచి ఈమెయిల్ ద్వారా పంపనున్నారు. దీనికి సంబంధించి ప్రభావితమయ్యే విభాగాల మేనేజర్లకు అమెజాన్ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిందని సమాచారం. ప్రధాన కార్యాలయం ఉన్న మిన్నియాపాలిస్‌లో ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
భారీగా పడిపోతున్న పసిడి ధరలు.. నేడు బంగారంపై 820, వెండిపై 4 వేలు ఢమాల్!
పసిడి ప్రేమికులకు అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత పది రోజుల్లో 7 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.82 తగ్గి.. రూ.12,246గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము పసిడి రేటు రూ.75 తగ్గి.. రూ.11,225గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఈరోజు ధర రూ.1,22,460గా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,250గా నమోదైంది. అక్టోబర్ 28న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,250గా కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.820.. 22 క్యారెట్లపై రూ.750 తగ్గింది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,280గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,13,000గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,610గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,12,350గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. గత 10 పది రోజులుగా వెండి ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉండడమే తప్ప.. పెరగలేదు. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈరోజు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై 4 వేలు తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర రూ.1,51,000గా ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో తులం వెండి రూ.1,65,000గా నమోదైంది. పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు జీఎస్‌టీ అదనంగా పడుతుంది. జీఎస్‌టీ కలుపుకుంటే బంగారం, వెండి ధరలు ఇంకా ఎక్కువ ఉంటుందని గుర్తించుకోవాలి.
‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో సోనాల్ ఎంట్రీ..!
తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్ చౌహాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో చేరడం నా కెరీర్‌లో ఒక స్పెషల్ మైలురాయి. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్స్” అని పేర్కొంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ – రితేశ్ సిధ్వానీ కలసి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్‌గా మూడు సీజన్లతో సక్సెస్ సాధించిన మీర్జాపూర్ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తృతంగా, ఘర్షణాత్మకంగా పెద్ద తెరపైకి రాబోతోంది. సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, శ్వేతా త్రిపాఠిలు చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. ఈసారి సినిమాగా తెరకెక్కుతున్న వెర్షన్‌లో పాత తారాగణంతో పాటు కొత్తగా జితేంద్ర కుమార్, రవి కిషన్, అలాగే సోనాల్ చౌహాన్ వంటి ప్రముఖులు చేరుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ సినిమా మీర్జాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అధికార పోరాటాలు, అండర్‌వర్ల్డ్ యుద్ధాలు, గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న ప్రతీకార రాజకీయాలు చుట్టూ తిరగనుంది. క్రైమ్, యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మీర్జాపూర్ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది మరొక ఘాటైన సర్ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సోనాల్ చౌహాన్ కోసం ఇది బోల్డ్, పవర్‌ఫుల్ రీ–ఎంట్రీగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఫుల్ ఫీస్ట్ లాగా అనిపించింది. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకుంటున్నామో, అలా చూసేశారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఖుషి అయిపోయి, ఈ సినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంటే ప్లాన్ చేసుకోమని సుజిత్‌కి ఏకంగా సభాముఖంగానే చెప్పేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా ఉంటుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేందుకు సుజిత్ సిద్ధమయ్యాడు.
