NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

డైవర్షన్‌ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం
రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడల్లా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది.. దీనిపై పలు సందర్భాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా మాట్లాడుతూ వస్తున్నారు.. అయితే, ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పార్టీ శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు చేసింది.. డైవర్షన్‌ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.. ‘జగన్‌ ఇంతే చేశాడు.. మేం అంతకన్నా ఎక్కువ చేస్తామంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, అంతకుముందు అమల్లో ఉన్న పథకాలను ఎత్తివేయడమే కాదు, కొత్తగా వారు చెప్పిన ఒక్క పథకమూ అమలు చేయడంలేదు, కొత్తగా ప్రజలకు చేసింది ఏమీ లేదు. అన్నిరంగాల్లో తిరోగమనమే కనిపిస్తోంది. మరోవైపు మహిళలకు రక్షణకూడా లేని పరిస్థితులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం, సూపర్‌ 6- సూపర్‌ 7లు మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్‌ ఇలా అన్నీ పడకేసిన పరిస్థితులు, వీటికితోడు ఉచిత పంటలబీమాకు మంగళం, కరెంటు ఛార్జీల బాదుడు. ఓవైపు ఇవి చేస్తూ మరోవైపు ఇసుక , లిక్కర్‌ స్కాం, వరద సహాయంలో అంతులేని అవినీతికి పాల్పడుతోంది అని పేర్కొంది.

ఎలాంటి భయాలు అవసరం లేదు.. ధైర్యం చెప్పిన తిరుపతి ఎస్పీ..
టెంపుల్‌ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు అటు తిరుపతి వాసులతో పాటు.. ఇటు తిరుమల శ్రీవారి భక్తులకు ఆందోళనకు గురి చేశాయి.. తిరుపతిలోని ప్రముఖ హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి.. ఐఎస్‌ఐ పేరుతో వచ్చిన మెయిల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆయా హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.. ఎలాంటి బాంబులు లేవని తేల్చారు.. ఇక, ఈ ఘటనలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు.. వస్తున్న మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సహకారంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం అని వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు..

టెస్లా హెడ్‌ ఆఫీస్‌కి మంత్రి లోకేష్‌.. ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. అక్కడ వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు అవుతూ.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు.. ఇక, ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయానాకి వెళ్లారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ… ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 18.8శాతం వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 97బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు.

ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలం.. ఏవియేషన్‌లో పెట్టుబడులు పెట్టండి
అమెరికాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ సంస్థలు.. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు అవుతూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, డల్లాస్ లోని పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తోభేటీ అయ్యారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ అండ్‌ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి. విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. మా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి అని కోరారు..

ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..
ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్.. భారీ యంత్రాలతో మునేరులో తవ్వకాలు చేస్తున్నట్టు గుర్తించడంతో సర్కార్ సీరియస్‌గా ఉంది.. కంచల గ్రామంలో 15 లారీలు, కీసర గ్రామ పరిధిలో 45 లారీల ఇసుక నిల్వలు గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది టాస్క్ ఫోర్స్.. స్థానిక టీడీపీ నేత వెంకట్ ఇసుక మాఫియలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందంటున్నారు.. మునేరు కాల్వలో అక్రమ ఇసుక తవ్వకం, రవాణా జరుగుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.. డ్రోన్స్ తో తవ్వకాలపై రికార్డు చేసిన వీడియోలు ప్రభుత్వానికి నివేదికతో పాటు అందజేసింది టాస్క్ ఫోర్స్.. కీసర స్టాక్ యార్డులో కూడా 50 లారీల ఇసుకను మాయం చేసినట్టు గుర్తించారు.. దీంతో.. అందరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధం అవుతోంది టాస్క్ ఫోర్స్

మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుందని చెప్పారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మట్టితో తయారు చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. మట్టి చాయ్ కప్పులు అయినా, మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణమిదే..!
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ 28వరకు వరకు నెలరోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

2025లో జనాభా లెక్కలు.. 2028 నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన!
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కుల గణన కోసం పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనాభా గణన ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇంకా బహిరంగపరచలేదు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR)ని అప్‌డేట్ చేయడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన 2021కి షెడ్యూల్ చేయబడింది, అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు, జనాభా లెక్కల చక్రం కూడా మారుతుందని భావిస్తున్నారు. రాబోయే జనాభా గణన రౌండ్‌లో సాధారణ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణనలతో పాటు మతం, సామాజిక తరగతిపై సాధారణ సర్వేలు ఉంటాయి. అయితే, వచ్చే ఏడాది జనాభా లెక్కలు జనరల్ మరియు SC-ST కేటగిరీలలోని ఉప-వర్గాలను కూడా సర్వే చేయవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి.

ముడా కేసులో పలు చోట్ల ఈడీ దాడులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తాజా సోదాలు నిర్వహించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. కర్ణాటకలోనిమైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) సంబంధించిన లింక్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరులోని పలు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసిన ఈడీ బిల్డర్ మంజునాథ్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. గతంలో అక్టోబర్‌లో, భూ కుంభకోణంపై విచారణకు సంబంధించి ముడా మైసూరు తాలూకా కార్యాలయాలపై ఈడీ రెండు బృందాలు దాడులు నిర్వహించాయి. ముడా కుంభకోణానికి సంబంధించి లోకాయుక్త దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ (FIR)ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసింది.

10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. ఫుల్‌ ఛార్జింగ్‌పై 365 కిలోమీటర్ల ప్రయాణం!
దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వాహనదారులకు ఇది పెను భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్నారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పండుగ సీజన్‌ కాబట్టి చాలామంది కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే బడ్జెట్ రూ.10 లక్షల వరకు మాత్రమే ఉంటే.. ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ధర రూ.7 లక్షల 99 వేల (ఎక్స్‌షోరూం) నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.11 లక్షల 49 వేలు (ఎక్స్‌షోరూం). ఈ కారు ఫుల్‌ ఛార్జింగ్‌పై 275 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. 0 నుండి 60కి స్పీడ్ చేరుకోవడానికి 5.7 సెకన్లు పడుతుంది. చైనాకు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్‌కు చెందిన ఎలక్ట్రిక్ కారువిండ్‌సోర్‌ ఈవీ. ఈ కారు ధర రూ.9.90 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారులో సింగల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. ఇది 38 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆధారంగా పనిచేస్తుంది. అక్టోబర్‌ 12 నుంచి డెలివరీలు మొదలయ్యాయి.

గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్!
న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్‌ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్‌ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్‌ మూడో వారం (నవంబర్ 22) నుంచి మొదలుకానుంది. రోహిత్ సేన నవంబర్ 10న ఆసీస్ బయలుదేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనతో రెగ్యులర్​ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా అవ్వనున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్​ నవంబర్ 8 నుంచి ఆరంభం అవుతుంది. రెండు సిరీస్​లు క్లాష్ అవ్వడంతో.. దక్షిణాప్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడం గంభీర్‌కు సాధ్యపడదు. అందుకే వీవీఎస్ లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుంది. వీవీఎస్ లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ ఉండనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌ కోసం భారత-ఏ జట్టుకు సాయిరాజ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టును సూర్యకుమార్‌ యాదవ్‌ నడిపించనున్నాడు.

కిరణ్ అబ్బవరం కోసం అక్కినేని నాగ చైతన్య..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో దూసుకువెళుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్ మొత్తం చుట్టేశాడు కిరణ్ అబ్బవరం. వరుస ప్రెస్ మీట్ స్టూడెంట్స్ మీట్ తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాడు. అందులో భాగంగానే క ట్రైలర్ ను విజయవాడలోని రాజ్ థియేటర్ లో రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29th మంగళవారం సాయంత్రం నిర్వహిచబోతున్నారు మేకర్స్. ఈ వేడుకకు ముక్య అతిధిగా అక్కినేని నాగ చైతన్య రానున్నాడు. యంగ్ హీరో కిరణ్ కోసం నాగ చైతన్య తన వంతుగా సినిమాను సపోర్ట్ చేయడం శుభపరిణామం. మరోవైపు క సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘క’ యూనిట్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 లోను సందడి చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను వైజాగ్‌లో నిర్వహించారు. నటులు సూర్య, బాబీ దేవోల్‌, దేవిశ్రీ ప్రసాద్‌ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్‌ మీడియాలో చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు. చెన్నైలో ఎన్జీవో ప్రారంభించడానికి ఆయనే స్ఫూర్తి. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోను ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారు. చాలా మంచి మంచి మనసున్న వ్యక్తి పవన్ కల్యాణ్‌.. చరణ్‌ నాకు తమ్ముడితో సమానం. తనతో నాకు చాలా మెమొరీస్‌ ఉన్నాయి. చరణ్ నా సినిమాలు చూసి ఫోన్‌ చేసి అభినందిస్తారు.మెగా ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. కుదిరితో చరణ్ తో కలిసి నటించేందుకు కూడా రెడీ అన్నారు.. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మహేశ్‌ నాకు జూనియర్‌. మహేశ్ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంటుంది. ఎమోషన్స్‌ బాగా పలికిస్తాడు..ఎన్టీఆర్‌ తెలుగు మాట్లాడే విధానం చుస్తే ముచ్చటేస్తుంది. డైలాగ్స్ చాలా స్పష్టంగా పలుకుతాడు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది.