NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కృష్ణమ్మ పరవళ్లు.. రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులుగా ఉండగా.. ఓవైపు రెండు గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. విద్యుత్‌ ఉత్పత్తి నేపథ్‌యంలో.. డ్యామ్‌ నుంచి ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నిండుకుండలా అంటే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది నీటిమట్టం.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది.. కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేందంలోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది..

ఆవేశంతో బీజేపీ పెద్దలపై కవిత స్టేట్‌మెంట్లు కరెక్ట్‌ కాదు..!
బెయిల్ మీద విడుదలైన కవిత.. శశికళలా ఆవేశపడి బీజేపీ పెద్దలపై స్టేట్‌మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే.. ఏ కేసీఆర్‌నో.. ఏ కేటీఆర్‌నో అరెస్ట్ చేసేవాళ్లమన్న ఆయన.. కానీ, కవిత చేసిన చెడుసావాసాల వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.. వాస్తవాలు తెలుసుకోకుండా శశికళల ఆవేశపడి పనికిరాని స్టేట్‌మెంట్లు ఇస్తే ఆమెకే నష్టమన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే వార్తలు హాస్యాస్పదంగా ఉందన్నారు.. విలీనమే అంటే ఇంత తతంగం ఉండేది కాదన్నారు. మరోవైపు.. గతంలో మేం మంత్రులుగా పని చేసిన కాలంలో సేకరించిన సమాచారంతోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారని పేర్కొన్నారు టీజీ వెంకటేష్‌.. ఏపీలో కూడా ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.. ఇక, శ్రీవాణి టిక్కెట్ ద్వారా వచ్చే డబ్బులకు అకౌంటబులిటీ ఉండేలా చూడాలని.. ఏదో దొంగ నోట్లు కొట్టినట్టు టికెట్లను ముద్రించి గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. అయితే, దానిపైన విచారణ కొనసాగుతుందని త్వరలోనే వాస్తవాలు బయటపడతాయన్నారు టీజీ వెంకటేష్‌..

కడప చెత్త వివాదం.. టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు
కడపలో చెత్త వివాదం కాస్తా.. కడప మేయర్‌ సురేష్‌ బాబుతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల నమోదు వరకు వెళ్లింది.. చెత్త వివాదం ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు దాదాపు 15 మంది వైసీపీ నేతల పైన కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ పోలీసులు తెలిపారు. ఇక, మేయర్ సురేష్‌ బాబు ఇంటి వద్ద చెత్త వేసిన ఘటనలో టీడీపీకి చెందిన దాదాపు 12 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ పోలీసులు పేర్కొన్నారు.. మేయర్ సురేష్ బాబు అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడం.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి అంశాలపై ఆయన పై.. ఆయన వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య తలెత్తిన వివాదం కేసులు వరకు వెళ్లింది.. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినందున నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్‌..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంత్రులంతా హాజరైన కేబినెట్‌ సమావేశంలో.. పలు అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్‌.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది ఏపీ కేబినెట్‌.. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం లభించగా.. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఓకే చెప్పింది.. 77 లక్షల సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.. 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆమోదం లభించగా.. వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు రూ. 11.51 నిధులు విడుదలకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.. సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో పోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు కేబినెట్‌లో చర్చసాగింది.. పోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వల్ల రూ. 330 కోట్లు ఆదా అవుతాయని అంచనావేసింది.. సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి ఆమోదం లభించగా.. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. విజన్ 2047 రూపకల్పన పై కేబినెట్‌లో చర్చ సాగింది.. కొత్త మద్యంపాలసీ తెచ్చే అంశంపై కేబినెట్‌ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.. ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై కేబినెట్‌ ముందుకు ప్రతిపాదనలు పెట్టారు..

‘హైడ్రా’ అనే పేరు భయానకంగా ఉంది.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
హైడ్రా అనేది ఒక భయానకమైన పేరు లాగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ హడలెత్తిస్తున్నపేరు హైడ్రా .. ఇది డ్రాగన్ గా మారొద్దు.. అందరికీ ఉపయోగపడేవిధంగా ఉండాలన్నారు. నాగార్జున పెద్ద పర్సన్… ఆయన నిజంగా న్యాయం ఉంటే.. కోర్టు డిసైడ్ చేస్తుందన్నారు. ఇప్పటివరకు నాగార్జున, దానం నాగేందర్ లాండ్ ల కూల్చివేత జరిగిందన్నారు. కానీ… పెద్దవాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు… చిన్నవాళ్ళు కూడా అనేకమంది భయపడుతున్నారని తెలిపారు. పలుకుబడి ఉన్నవాళ్లు ఏదోకటి చేసుకుంటారు… కానీ పేదల ఇళ్ళని అలా కూలిస్తే రోడ్డున పడతారు.. వారి గురించి ఒకసారి ఆలోచించాలన్నారు. ధరణి పేరుతో గతంలో అనేక వేల ఎకరాల భూమి నీ ఆక్రమణలకు గురైందన్నారు. వీటన్నిటి పైనా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!
హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. హైదరాబాద్‌లోని ప్రసిద్ది చెందిన బేగంబజార్‌లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగంబజార్ లో భూముల ధర ముంబైతో పోటీ పడుతోంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం రూ.20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు ధర రూ.20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం.

ప్రధాని మోదీ, షాల తరహాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది. హోం మంత్రిత్వ శాఖ అతని భద్రతను Z Plus నుండి ASL (అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్)కి పెంచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వంటి వారికి భద్రత ఉంది. ప్రధానమంత్రి, హోంమంత్రికి ASL భద్రత ఇవ్వబడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ భద్రతను పెంచుతూ కొద్ది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) వద్ద జెడ్-ప్లస్ కేటగిరీ భద్రతను కలిగి ఉన్నాడు. కొన్ని రాష్ట్రాలలో భగవత్ భద్రతలో అలసత్వాన్ని హోం మంత్రిత్వ శాఖ గమనించింది. ఆ తర్వాత కొత్త భద్రతా ప్రోటోకాల్‌లు రూపొందించారు. ఆయన భద్రతను పటిష్టం చేశారు. అతను అనేక భారత వ్యతిరేక సంస్థల టార్గెట్ అని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వివిధ ఏజెన్సీల నుండి పెరుగుతున్న ఆందోళనల మధ్య భగవత్‌కు ASL భద్రతను అందించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భద్రతను పెంచడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. ఇప్పుడు కొత్త భద్రత తర్వాత, మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో ఇప్పటికే CISF బృందం ఉంటుంది.

థియేటర్ స్క్రీన్ కోసం బౌన్సర్లు.. ఇదెక్కడి మాస్ రా మావా
ఈ మధ్యకాలంలో పాత సినిమాలను బాగా రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయింది. హీరో పుట్టినరోజునో లేక సినిమా రిలీజ్ అయిన వార్షికోత్సవం అనో వాటిని రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి మరీ యూత్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే థియేటర్లలో పరిస్థితులు శృతిమించి ఒక్కోసారి కుర్చీలను ధ్వంసం చేసి మరోసారి తెరను ధ్వంసం చేసిన ఘటనలు కూడా అనేకం నమోదయ్యాయి. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ దేవి థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాని 4k వెర్షన్లో రీ రిలీజ్ చేశారు. అయితే యువత థియేటర్ స్క్రీన్ దగ్గరకు వెళ్లి హంగామా చేస్తుందని ఉద్దేశంతో వాళ్లను అక్కడికి ఎక్కనివ్వకుండా బౌన్సర్లను నియమించారు. దీంతో బౌన్సర్లు యువత స్క్రీన్ వరకు రాకుండా చూసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో చూసుకుంటే మాస్ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధియేటర్లలోని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో సంస్థ రీ రిలీజ్ చేసింది. మొదటిరోజు కావడంతో ఈరోజు గట్టిగానే థియేటర్ల దొరికాయి. రేపు సరిపోదా శనివారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు మాత్రం థియేటర్లో ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. దీంతో కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్లో విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత
టాలీవూడ్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’, కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’ సినిమాలతోపాటు అనేక తెలుగు సినిమాలకు మాటల రచయిగా సేవలు అందించిన నడిమింటి నరసింగరావు (72) తాజాగా కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలం నుండి అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (బుధవారం) కన్నుమూశారు. ఇకపోతే గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతగా ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలలోని డైలాగ్స్ కూడా మంచి అదరణని పొందాయి. ఇప్పటికి యూట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమాలను చూసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలంటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది నరసింగరావు. గత కొద్ది కాలంగా నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో సోమాజిగూడలో ఉన్న యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే., పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే ఆయన కోమాలోకి వెళ్లారు. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింగరావుకి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. నడిమింటి నరసింగరావు పాతబస్తీ, ఊరికి మొనగాడు,కుచ్చికుచ్చి కూనమ్మా లాంటి పలు సినిమాలకి ఆయన మాటల రచయితగా పని చేసారు. ఈయన పలు సినిమాలకే కాకుండా సీరియల్‌కి కూడా రచయితగా పనిచేసారు. సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కంగనా రనౌత్ సినిమాపై కలకలం.. నిర్మాతలకు నోటీసులు..
ఎంపీ, నటి కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాతలకు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) మంగళవారం లీగల్ నోటీసు పంపింది. శిరోమణి కమిటీ న్యాయ సలహాదారు అమన్‌బీర్ సింగ్ సియాలీ పంపిన నోటీసులో.. కంగనా రనౌత్‌ తో సహా చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి విడుదల చేసిన ట్రైలర్‌ను తొలగించాలని, అలాగే సిక్కు సమాజానికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా.. శిరోమణి కమిటీ సెక్రటరీ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. సినిమాను ఆపాలని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషికి పలుమార్లు లేఖలు రాశామని ఆయన తెలిపారు. శిరోమణి కమిటీ ఛైర్మన్‌ అడ్వకేట్‌ హర్జిందర్‌ సింగ్‌ ధామి సూచనల మేరకు కంగనా రనౌత్‌తో సహా ఈ చిత్ర నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపారు. ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత అనేక సిక్కు వ్యతిరేక సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయని, ఇది సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన అన్నారు. సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా, వేర్పాటువాదులుగా చూపించే ప్రయత్నం చేశారని ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సిక్కు సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని శిరోమణి కమిటీ చట్టపరమైన చర్యలను ప్రారంభించిందని ప్రతాప్ సింగ్ తెలిపారు. అభ్యంతరకరమైన సిక్కు వ్యతిరేక సన్నివేశాలను కంగనా రనౌత్ అలాగే చిత్ర నిర్మాతలు కత్తిరించకపోతే వారిపై అన్ని స్థాయిలలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఖుష్బూకి గాయం.. అసలేమైంది?
కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు సినీ నిర్మాతగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త సుందర్ నటించి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 చిత్రానికి ఆవిడ నిర్మాతగా వ్యవహరించి ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టారు. ఇంకోవైపు ఆమె రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడిపేస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆమె గాయపడినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఫోటోను పంచుకుంటూ విషయాన్ని తెలిపింది. ఈ ఫోటోలో ఆమె కాళ్ళకి కట్టుతో కనిపించింది. దాంతో ఆమెకి ఏం జరిగింది..? ఆ గాయానికి కారణాలేంటి..? అసలు ప్రమాదం ఎలా జరిగిందంటూ..? అనేకమంది సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన చాలామంది సోషల్ మీడియా వీడియో వినియోగదారులు ఆవిడ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో బిజెపి పార్టీతో కలిసి ఆవిడ కీలకంగా పనిచేస్తున్నారు.