NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఐటీ పాలసీపై ఫోకస్‌.. నేడు సీఎం సమీక్ష సమావేశం..
కొత్త ఐటీ పాలసీపై ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్‌.. అందులో భాగంగా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ఐటీ సేవల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని ఏపీ సర్కార్‌ భావిస్తోంది.. ఐటీ సేవలు.. ఏపీ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపకల్పన చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.. ఐటీ రంగం ద్వారా భారీగా ఉపాధి కల్పించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక రెడీ అవుతున్నాయి.. మరోవైపు.. ఈ రోజు మధ్యాహ్నం మున్సిపల్‌ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. పట్టణాల్లో మౌళిక వసతుల కల్పన, హౌసింగ్, డ్రైనేజీ వ్యవస్థ, అనధికారిక లే అవుట్ల కట్టడి వంటి అంశాలపై మున్సిపల్‌ అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్‌ కామెంట్స్‌
వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనపై హాట్‌ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ఇక, మాజీ సీఎం జగన్.. శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.. ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే నాని.. అయితే శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నుంచి వైసీపీ నేతలతో పాటు రౌడీలు 10 వేల మందిని పోగుచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. వైఎస్‌ జగన్ దర్శనానికి వస్తున్నారా..? దేవుడిపై దాడికి వస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు.. తిరుమల దర్శనానికి వచ్చే వారు కొందరితో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు.. మరి ఇంత మందిని ఎందుకు పిలుస్తున్నారు..? అని నిలదీశారు.. అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.. దర్శనం పేరుతో తిరుమలకు వస్తున్న గూండాలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఈ సమయంలో.. తిరుపతిలో సమావేశమైన ఎన్డీఏ కూమటి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్ కుమార్ తదితర నేతలు హాజరు అయ్యారు. ఇక, ఈ సమావేశంలో.. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

జగన్‌ డిక్లరేషన్‌పై భూమన సంచలన వ్యాఖ్యలు.. ఆ హక్కు టీటీడీకి లేదు..
వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్‌ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు.. ఇక, సోనియా గాంధీ డిక్లరేషన్ పెట్టలేదు.. దానికి సాక్షం నేనే అన్నారు.. తిరుమలకు నడిచివెళ్లే అడిగే అధికారం కూడా టీటీడీకి లేదన్నారు.. కానీ, వైఎస్‌ జగన్‌ కాలినడకన తిరుమల వెళ్తారని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.. ఒక భక్తుడిగా వెంకన్న క్షేత్రానికి జగన్ వస్తున్నారు‌.. దర్శినానికి వస్తుంటే అడుగు అడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు.. చంద్రబాబు చెప్పినట్లు పోలీసులు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు.. నగర వైసీపీ నేతలను, కార్యకర్తలు బెదిరిస్తున్నారు‌.. భయభ్రాంతులకు గురి చేస్తూ నోటీసులు ఇచ్చారు.. అసలు జగన్ అంటే ఎందుకు చంద్రబాబు కు భయం అని ప్రశ్నించారు..

అటవీశాఖ సిబ్బంది పై దాడి ఘటన.. చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ ఆదేశం..
దాడికి తెగబడి తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ లోని దామరవాయి అటవీ కార్యాలయంలో అటవీశాఖ సిబ్బంది పై జరిగిన దాడి ఘటన పై కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటనను పిసిసిఎఫ్ డోబ్రియాల్.. మంత్రికి ఫోన్లో వివరించారు. గురువారం అర్ధరాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి, నేలను చదును చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్ బిఓలు శరత చంద్ర, సుమన్ లు జెసిబిని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారన్నారు. ఈ నేపథ్యంలో జెసిబిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారుల పై విచక్షణారహితంగా దాడి చేసి లైట్లను, జీపును ధ్వంసం చేసి జెసిబిని తీసుకుని పోయినట్లుగా మంత్రికి వివరించారు. దీంతో తీవ్ర గాయాలపాలై వరంగల్ జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత చంద్రలతో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి సురేఖ తెలుసుకున్నారు. అటవీ చట్టాలను అతిక్రమించి, అటవీ అధికారుల పై దాడికి తెగబడి, తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు.

రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (ఈ నెల 28)న నగరంలో పర్యటించనున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం 28న జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరవుతారని యూనివర్సిటీ వీసీ కృష్ణదేవరావు తెలిపారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 స్టేట్ స్టాల్స్, 4 ఫుడ్ కోర్టులు, మీడియా సెంటర్ తదితర స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పిఎస్‌, పిఎన్‌టి జంక్షన్‌, రసూల్‌పురా, సిటిఒ, ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోత్‌కుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని తెలిపారు.

నిజాయతీ గల రాజకీయ నేత రాహుల్‌గాంధీ..
కాంగ్రెస్‌ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని బాలీవుడ్‌ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు.. ప్రజల్లో తన ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్‌ ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ వచ్చింది.. ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి సైఫ్‌ బదులిస్తూ.. ‘ధైర్యంగా, నిజాయతీగా ఉండే పొలిటికల్ నాయకులంటే ఇష్టం’ అని చెప్పారు. అప్పుడు వ్యాఖ్యాత కొందరు పేర్లను తెలపగా.. ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాహుల్‌ గాంధీలో ఎవరిని ఎంచుకుంటారని క్వశ్చన్ చేశారు. ఇక, దీనికి సైఫ్‌ ఆలీఖాన్ స్పందిస్తూ.. వాళ్లందరూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులే.. కానీ, రాహుల్‌గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది అన్నారు. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంత మంది అగౌరవపర్చారు.. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారని సైఫ్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు.. ఆ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజపై కొనసాగుతున్న డైలమా
దుర్గా పూజకు కేవలం మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ సంవత్సరం పండుగ ఉత్సాహం తగ్గినట్లు అనిపిస్తుంది. బెంగాలీలకు దుర్గాపూజ అనేది ఒక పండుగ మాత్రమే కాదు- ఇది వారి గుర్తింపు. అయితే, ఈ సంవత్సరం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తరువాత తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆగస్టు 9వ తేదీన ట్రైనీ డాక్టర్ హత్యతో కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతుంది. దుర్గా పూజ ఉత్సవాలను తిరిగి నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాత మాత్రమే ఉత్సవాల్లో పాల్గొంటామని కోల్‌కతా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సంఘీభావంగా ఈ వేడుకలను విరమించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

కార్మికులకు కనీస వేతనాలను పెంచిన కేంద్ర ప్రభుత్వం..
వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.783, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.868, స్కిల్డ్ వర్కర్లకు రూ.954, హై స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.1035 లభిస్తాయి. నైపుణ్యం, నివసించే ప్రాంతం ఆధారంగా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్మాణం, లోడింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్, ఇంటి పని, మైనింగ్, వ్యవసాయంతో సహా వివిధ అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. VDA సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1 – అక్టోబరు 1) 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా సవరించబడుతుంది. కొత్త సవరణ ప్రకారం, జోన్ “A”లో నిర్మాణ, శుభ్రత వంటి రంగాలలో నైపుణ్యం లేని కార్మికులు ఇప్పుడు రోజుకు రూ.783 సంపాదిస్తారు, ఇది నెలకు రూ.20,358 అవుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్లు ఇప్పుడు రోజుకు రూ.868 కాగా., నెలకు రూ.22,568 పొందుతారు. అయితే నైపుణ్యం కలిగిన, క్లరికల్ కార్మికులు రోజుకు రూ.954 కాగా నెలకు రూ. 24,804 పొందుతారు. అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు, వార్డు సిబ్బంది, సాయుధ గార్డులు రోజుకు రూ.1,035 సంపాదిస్తారు. మొత్తంగా నెలకు రూ.26,910 పొందుతారు.

రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్‌గా బాధ్యతలు.. గంభీర్‌ పోస్ట్ కొట్టేశాడు!
వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సందర్భంగా గాయానికి గురికావడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవకముందే.. అతడిని మెంటార్‌ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)కు మెంటార్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఐపీఎల్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించి.. ఛాంపియన్‌గా నిలిపాడు. గౌతీ భారత జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికవడంతో.. అతడి పోస్ట్ ఖాళీగా ఉంది. గంభీర్‌ పోస్టును డ్వేన్ బ్రావోతో పూరిస్తున్నట్లు కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూరు వెల్లడించారు. ‘డ్వేన్ బ్రావో కోల్‌కతాతో కలిసి పనిచేయనున్నాడు. అతడు తన జట్టు విజయం కోసం తీవ్రంగా కష్టపడతాడు. బ్రావో అనుభవం, నిబద్ధత మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆటగాళ్లు మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రపంచంలోని లీగ్‌లలో బ్రావో చాలా క్రికెట్‌ ఆడాడు. ఐపీఎల్‌, సీపీఎల్, ఐఎల్‌ టీ20, ఎంఎల్‌సీ టోర్నీలకు ప్రాతినిధ్యం వహించాడు’ అని వెంకీ మైసూర్‌ తెలిపారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్
ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా తెల్లవారు జామున నుండి షోస్ స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆట ముగిసాక  సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమం లో నిప్పు రవ్వ పక్కనే ఉన్న ఎన్టీయార్ కటౌట్ పై పడింది. చెక్క కటౌట్ కావడంతో నిప్పు రవ్వ పడడంతో ఒక్కసారిగా    మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఎన్టీయార్ కటౌట్ పూర్తిగా తగలబడింది. దీంతో బయాందోళకు గురైన ప్రేక్షలులు పరుగులు తీసారు. ఫ్యాన్స్  మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

‘దేవర’ థియేటర్‌లో విషాదం.. కేకలు వేస్తూ కుప్పకూలి అభిమాని మృతి
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.. అర్ధరాత్రి నుంచి బెన్‌ఫిట్‌ షోల్లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.. అయితే, ఆ ఆనందమే ఓ ఎన్టీఆర్‌ అభిమాని ప్రాణాల మీదకు తెచ్చింది.. కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్‌ ఎంట్రీ.. ఫైట్స్‌, డైలాగ్స్‌.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు పోలీసులు. మస్తాన్‌ వలీ.. ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్‌ అనీ.. కానీ, సినిమా చూస్తూ ఇలా ప్రాణాలు విడుస్తాడని అనుకోలేదంటూ కన్నీరు పెడుతున్నారు స్నేహితులు..

తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు.  కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర. విలన్ రోల్ లో తనదైన శైలిలో సైఫ్ మెప్పించాడు. తనపాత్ర పరిధి మేరకు సైఫ్ బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ బాలీవుడ్ నటుడు ఇటీవల ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో సైఫ్ మాట్లాడుతూ ” తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా బాగా ఇష్టపడతారు, సినిమా చూసేటప్పుడు వాళ్లు లీనమై చూస్తారు. టాలీవుడ్ ఆడియెన్స్ తమ తమ అభిమాన హీరోలను  దేవుళ్లలా చూసుకుంటారు. తెలుగు దర్శకులు వాళ్లు తీసే కథ, కథనంపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంటారు. బాహుబలి సినిమాను వారు తెరకెక్కించిన విధానం అద్భుతం. పౌరాణిక మరియు చరిత్రాత్మకమైన సినిమాలను చాలా బాగ తీస్తారు. నేను తెలుగులో నటించిన ‘దేవర’లోని నా పాత్ర  డైలాగ్స్‌ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు. ప్రతి మాట ఎలా పలకాలో కూడా నేర్పించారు. నేను  ముంబై నటుడినే అయినా కూడా  తెలుగులో చాలా కంఫర్ట్‌గా పనిచేశాను. దక్షిణాది ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి దర్శకులు హీరోలను చూపించిన తీరు నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని అన్నాడు.