Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్.. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్‌ను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ పడటంతో లోకో పైలట్ రైలును ఆపేశారు. వెంటనే దొంగల ముఠా సభ్యులు రైల్లోకి చొరబడి ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోని ఇద్దరు మహిళల మెడలో 68 గ్రాముల బంగారు గొలుసులు, ఓ మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసు దోచుకున్నారు. ఎస్-5 బోగిలోనూ చోరీకి యత్నించగా ప్రయాణికులు కేకలు వేయడంతో పరారయ్యారు. ఆ సమయంలో రైలు 35 నిమిషాలపాటు నిలిచిపోయింది. విజయవాడ చెందిన ప్రయాణికురాలు శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ తెలిపారు. కాగా, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు..

రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌ ..!
జైల్లో ఉన్న రౌడీషీటర్ ప్రియుడు శ్రీకాంత్ కోసం అరుణ తపన పడితే… ఆ అరుణ కళ్ళలో ఆనందం కోసం చాలామందే పనిచేశారట. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారి నుంచి ఐపీఎస్‌ల మీదుగా… నెల్లూరు జిల్లాలోని ఓ విద్యాసంస్థ అధినేత దాకా… చాలామందే శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇప్పించడానికి పని చేశారట. ఆమెతో ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుబంధం. ఒక్కో రకం అవసరం. అంతా కలిసి సాగిలపడ్డారు. రౌడీషీటర్‌కు పెరోల్‌ ఇప్పించడం కోసం అడ్డదారులు తొక్కారన్న వాస్తవాలు ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ వివాదంలో రోజుకో పేరు బయటికి వస్తూ… వింటున్న వాళ్ళంతా అమ్మనీ… ఇంతుందా..? అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారట. ఇంకొందరైతే…ఈ అరుణ కిరణాలు బాగానే విస్తరించాయి…. గట్టిగానే పని చేశాయంటూ సెటైర్స్‌ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తన ప్రియుడికి పెరోల్‌ కోసం అరుణ సెక్రటేరియెట్‌ స్థాయిలో చక్రం తిప్పారని, అత్యున్నత అధికారి ఐపీఎస్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని మరీ… పెరోల్‌కు రికమండ్‌ చేశారన్న వార్తలు ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయట. సదరు అత్యున్నత అధికారితో పాటు ఇంకో ఇద్దరు ఐపీఎస్‌ల పాత్ర ఇందులో ఉందన్న ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా మరోపేరు బయటికి వచ్చింది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఇందులో కీలకంగా వ్యవహరించారన్న చర్చ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. సదరు విద్యాసంస్థల ఛైర్మన్‌ అరుణకు చాలా సన్నిహితంగా ఉంటారట. దీంతో ఆమె కళ్ళలో ఆనందం కోసం ఆయన తన కులం కార్డ్‌ను గట్టిగానే వాడారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలు రిజెక్ట్ అయ్యాక కూడా… శ్రీకాంత్ పెరోల్‌ ఫైలు ఆగమేఘాల మీద కదిలింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖ వల్లే పెరోల్ వచ్చిందంటూ మొదట్లో గట్టిగా ప్రచారం జరిగింది. కానీ… ఆ తర్వాతే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. గూడూరులో కాలేజీ నడుపుతున్న విద్యాసంస్థల చైర్మన్‌కు, సచివాలయంలోని ఓ అతిపెద్ద అధికారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్‌..
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ సెల్‌ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు. ఇటీవల ఆలయ పాలకమండలి సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేకించి శరన్నవరాత్రుల కాలంలో లక్షలాది భక్తులు తరలివస్తారు.. ఆ సమయంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ వస్త్ర విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదే నమూనాను కనకదుర్గమ్మ ఆలయంలోనూ అమలు చేస్తే ఆలయ మర్యాదలు మరింత పెరుగుతాయి అని అ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. ఈ మేరకు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారి స్థాయిలో చర్చలు జరిపారు.. గత కొద్ది రోజులు నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిపిస్తూ దుర్గగుడిలో సంప్రాయాదాయ దుస్తుల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు.. భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ సారీ లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.

ఉత్తరాంధ్ర లో దంచికొడుతున్న వానలు
ఉత్తరాంధ్రజిల్లాల్లో ముసురు ముప్పుగా మారుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకు అల్పపీడనం ఏర్పడింది. క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ ప్రకటించింది. అల్పపీడన ప్రాంతం నుంచి రుతుపవన ద్రోణి ఒకటి సంబల్పూర్ మీదుగా వ్యాపించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్త రించింది. దక్షిణ చత్తీస్ ఘడ్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావం వల్ల వ చ్చే ఐదు రోజులు ఉత్తరాంధ్రకు వానగండం పొంచి వుంది. అల్పపీ డనం ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం పరిసరాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ వెలవెలబోతోంది. జలపాతాలు ఉధ్రుతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో డుడుమ, చాపరాయి, సరియ వాటర్ ఫాల్స్ మూసివేశారు. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం హెచ్చరికలు ఉత్తరాంధ్రకు వున్నాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇదే పరిస్ధితి వుండే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు నమోదుకానున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదు రుగాలులు వీస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్‌ కేసులో నలుగురు అరెస్టు..
బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్‌ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటికి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ తో పాటు మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. డగ్స్‌ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను గుర్తించింది ఈగల్ టీమ్. కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్‌ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న విద్యార్థులు.. మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్ల కీలక సూత్రధారిగా గుర్తింపు.. నోవెల్ల తో పాటు మరో విద్యార్థి అశర్ జావెద్ ఖాన్ లను అరెస్టు చేసిన ఈగల్.. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్న నోవెల్ల.. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ.2500కు అమ్ముతున్న నోవెల్ల జావెద్‌లు కీలక సూత్రధారులు.. గంజాయి, ఓజీ కుష్‌ కలిపి సిగరెట్లు తయారు చేసి యూనివర్సిటీలో అమ్ముతున్న స్టూడెంట్స్.. ఢిల్లీకి చెందిన అరవింద్‌ శర్మ, అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్.. నైజీరియాకు చెందిన నిక్ నుంచి డ్రగ్స్ ను కొరియర్ లో తెప్పించుకుంటున్నాడు నోవెల్ల. యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలంతో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ ఖా శాన్.. ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ
దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బొజ్జగణపయ్య కొలువుదీరారు. హైదరాబాద్ ఖా శాన్… ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహా వినాయకుడు.. స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క లలిత త్రిపుర సుందరి… శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరారు.. ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ లో కొలువు తీరుతున్న మహా గణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు… ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి ఏటా లక్షలాదిగా దర్శించుకుంటారు.. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు..

గాజాలో జర్నలిస్టుల హత్యను ఖండించిన భారత్.. మృతులకు విదేశాంగ శాఖ సంతాపం
గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. దీంతో ఐడీఎఫ్ భీకరదాడులు చేస్తోంది. తాజా దాడులు మీడియా సంస్థలు లక్ష్యంగా జరుగుతున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య ఆస్పత్రిపై దాడి ఘటనలో ముగ్గురు జర్నలిస్టులు చనిపోగా.. ఈ మధ్య కాలంలో జరిగిన దాడిలో మరో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను ఆయా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సోమవారం గాజాలో ఐదుగురు జర్నలిస్టుల మృతిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికరం.. విచారకరం అని పేర్కొంది. గాజాలోని ఒక ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టుల హత్యను భారతదేశం ఖండిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే మృతులకు సంతాపం తెెలిపారు.

మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెబుతూనే ఉంటోంది. కానీ ట్రంప్ మాత్రం లేదు.. లేదు యుద్ధాన్ని ఆపింది తానేనంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా మరోసారి వైట్‌హౌస్ వేదికగా మంగళవారం అవే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తిరిగి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ప్రధాని మోడీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారు. ‘‘ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు జరుగుతుందని మోడీని అడిగాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్‌, పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ సుంకాలతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. కానీ ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‎కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ఈరోజు (ఆగస్ట్ 27) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన అశ్విన్.. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.. గత సీజన్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగిన ఈ స్టార్ స్పిన్నర్.. గత సీజన్‎లో అంచనాల మేర రాణించలేకపోవడంతో సీఎస్కే వచ్చే సీజన్‎కు ఆర్. అశ్విన్‎ను వేలానికి వదిలి పెట్టడంతో గత కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్‎కు వీడ్కోలు చెప్పడం గమనార్హం. ఐపీఎల్ ప్లేయర్‎గా నా టైమ్ నేటితో ముగిసింది.. కానీ వివిధ లీగ్‌ల్లో ఆటగాడిగా నా సమయం ఈరోజుతో ప్రారంభమైందని అశ్విన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్, బీసీసీఐకి నా ధన్యవాదాలు.. భవిష్యత్‎ను మరింత ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రిటైర్మెంట్ ప్రకటనలో అశ్విన్ వెల్లడించారు.

‘ద్రౌప‌తి -2’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..
నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జీఎం ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపతి -2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ‘పళయ వన్నారపెట్టై’, ‘ద్రౌపతి’, ‘రుద్ర తాండవం’, ‘బకాసురన్’ లాంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మోహన్‌.జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అదనంగా వైజీ మహేంద్రన్, నాడోడిగల్ భ‌ర‌ణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version