NTV Telugu Site icon

Top Headlines- @ 1 PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

సిరిసిల్లలో మరోసారి ఫ్లెక్సీల కళకం బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయి అని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం మరో వైపు అమ్మాయి నవ్వుతుండటం ఫోటో పెట్టారు. ఫ్లెక్సీలో నవ్వే ఆడవాళ్లను అనే పదాలకు బదులు అందులో నవ్వే వాళ్లను అని ప్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలిగించారు.

మోడీ ముందు ED రావడం సహజం.. జైల్లో పెడతాం అంటే భయపడం!
ఢిల్లీ లిక్కర్‌ స్కాం పై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందన్నారు. మోడీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ అని ఆరోపించారు. మోడీ వచ్చే ముందు ED రావడం సహజమని కొట్టి పారేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ED కేసులు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. రాజకీయమైన ఎత్తుగడలో భాగంగానే ED కేసులని కవిత పేర్కొన్నారు. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతియ్యడానికే మీడియా లీకులు అంటూ మండిపడ్డారు. జైల్లో పెడతాం అంటే భయపడం…జైల్లో పెడుతే ఏం అవుతుంది. జైల్లో పెట్టి ఉరి వెయ్యరు కదా? అని ప్రశ్నించారు.

నేడు సీబీఐ విచారణకు మంత్రి గంగుల, ఎంపీ
మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నేడు ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్‌ ను నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్‌ లో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. గంగుల, శ్రీనివాస్‌తో దిగిన ఫోటోలతో పాటు పలు అంశాలు వెలుగు చూశాయి. కానీ అతను సీబీఐ అధికారి కాదు. ఈ నకిలీ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగులను సాక్షిగా చేర్చింది సీబీఐ. దీంతో ఆయనతోపాటు ఎంపీని విచారించనుంది.ఈ కేసులో సాక్షులుగా విచారణకు సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌ ను విచారణకు పిలిపించారు. ఈనేపథ్యంలో.. అలాగే టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది, ఆయన కూడా ఈరోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

రేపటి నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.

నేటి నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాల్లో మార్పు
శ్రీవారి ఆలయంలో నేటి నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది టీటీడీ. అయితే.. బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా తెల్లవారు జామున 5:30 గంటలకు ఆరంభం అయ్యే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 8 గంటలకు మార్చారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపాటు
ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇవాళ డిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పేరు ఉందనే వాదనతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. మోడీ ముందు ఈడీ వచ్చిందని ఎద్దేవ చేశారు. అరెస్ట్‌ లు చేస్తే చేయండి జైలుకు పోయేందుకు సిద్దమే అంటూ ప్రస్తావించారు కవిత. అయితే ఈ వ్యాఖ్యలపై డీకే అరుణ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల పోతుంది, అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి పోయేందుకు సిద్ధం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా వుందని ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో నిందితులకు బెయిల్‌
ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరైంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు బెయిల్ లభించింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. రూ.3లక్షల పూచీకత్తుతో తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో రైలు కింద పడి బీటెక్ విద్యార్థి అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ బెంగుళూరులో బీటెక్ చదువుతున్నాడు. చనిపోయిన యువకుడిది గుంతకల్ పట్టణం తిలక్ నగర్ వాసిగా గుర్తించారు. లోన్ యాప్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కుటుంబ సభ్యులు ఆరోపణలపై వివరణ ఇస్తూ అఖిల్ లోన్ యాప్ బాధితుడు కాదంటున్నారు. లోన్ అప్ వల్ల చనిపోయాడంటూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

నేటి నుంచి విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ అమలు
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల అటెండెన్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను ఏపీ సర్కార్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు సైతం ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు సన్నాహాలు కూడా చకచక జరిగిపోయాయి. అయితే.. నేటి నుంచి విద్యార్థులకు సైతం ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం.

ఏనుగు ఆకస్మిక మృతి.. విచారం వ్యక్తం చేసిన గవర్నర్‌ తమిళిసై
పుదుచ్చేరిలోని మణకుళ వినాయక ఆలయంలోని ‘లక్ష్మీ’అనే ఏనుగు మృతి చెందింది. లక్ష్మీని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. లక్ష్మితో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో తమిళిసై స్వయంగా పుదుచ్చేరి మణకుళ వినాయక ఆలయానికి వెళ్లి లక్ష్మికి నివాళులు అర్పించారు.

సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు.

రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరాభాస్కర్
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రతో కన్యాకుమారిలో ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో ముగిసిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ చేరింది. ఇదిలా ఉంటే గురువారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని అందులో పాజిటివ్ గా తేలిందని ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయినా తాను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని ప్రకటించారు.

నేడు డిజిటల్ రూపాయి ప్రారంభం.. తొలి విడతలో నాలుగు నగరాల్లో లాంచ్
ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో తొలుత డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.