NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

న్యూయార్క్‌లో ఏపీ మంత్రి పర్యటన.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ
న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు.. . వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై చర్చలు జరిపారు.. మైక్ వెబ్‌స్టర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పని విధానాన్ని, పకృతి వనరులను కాపాడటంలో ఆయన కున్న చిత్తశుద్ధిని కొనియాడారు. గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన అనుభవాన్ని, అప్పట్లో తమకు అందిన ప్రోత్సాహన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో తమకు అవకాశం అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, కరువు నివారణ కోసం తప్పకుండా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

వంగవీటి రాధాకు అస్వస్థత
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. స్వల్ప గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్టుగా చెబుతున్నారు.. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు.. ఇక, 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్టుగా రాధా సన్నిహితులు తెలిపారు.. వంగవీటి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.. మరోవైపు వంగవీటి రాధా అస్వస్థకు గురికాడం.. ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారట కూటమి నేతలు.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వంగవీటి రాధా.. ఈ సారి ఎన్నికలో బరి దిగుతారు.. ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినా.. పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన విషయం విదితమే..

జనసేన వైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు..!? క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లమీద షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య సహా పలువురు కీలక నేతలు జనసేన గూటికి చేరబోతున్నారు.. మరోవైపు.. వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు ఇప్పుడు జనసేన వైపు అంటూ ప్రచారం సాగుతోంది.. దీంతో.. త్వరలోనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆ తర్వాత జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై క్లారిటీ ఇచ్చారు దాడిశెట్టి రాజా.. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు.. ప్రస్తుతం తాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌లో ఉన్నానని.. త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటించారు.. ”వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు.. నేను తునిలో లేని సమయంలో నేను జనసేన వైపు చూస్తున్నట్టు ఫేక్ న్యూస్‌ సృష్టించారు.. ఆ ఫేక్‌ న్యూస్‌ మా పార్టీ నాయకులు, కార్యకర్తల మనస్సు నొప్పించాయి.. ఇలాంటి కథనాలతో అపోహలు కల్పించాలని చూస్తున్నారు.. అయితే, మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని న ఆ వెన్నంటే ఉండి.. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ.. అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ.. మన నాయకులు జగన్మోహన్‌రెడ్డి గారిని కానీ నేడే వీడి వెలతానని.. ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు.. అనారోగ్యం రీత్యా టెస్ట్‌ల కోసం హైదరాబాద్‌లో ఉన్నారు.. తుని వచ్చిన వెంటనే అందరినీ కలుస్తాను అంటూ.. వైసీపీ తుని వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ పోస్టు పెట్టారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా..

కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. కొప్పర్తి నుంచి బెజవాడకు ఎంఎస్ఎంఈ..!
కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కంటెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందట. రాజధాని ప్రాంతంలోని 20 ఎకరాల భూమిని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటుచేసిన తొలి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదే తరహాలో గుంటూరు జిల్లాలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది అట.

రిమాండ్‌ను సవాల్‌ చేసిన విద్యాసాగర్‌.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనంగా మారిన. ముంబై సినీ నటి జిత్వానీ కేసులో రిమాండ్ ను సవాల్ చేస్తూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేశారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.. అయితే, కుక్కల విద్యాసాగర్ లో తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ లో విచారించాలని ఒత్తిడి చేయబోమని హైకోర్టుకు తెలిపారు పోలీసులు.. దీంతో.. విద్యాసాగర్ రిమాండ్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. కాగా, హీరోయిన్ జిత్వానీ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే.. ఇక. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చిన విషయం విదితమే.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం విదితమే.

తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ధి..
తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవ‌నోపాధిని పెంచుతున్నాం అన్నారు మంత్రి నారాయణ.. విజ‌య‌వాడ‌లో తీర‌ప్రాంత ప‌ర్యావ‌ర‌ణ ర‌క్షణ అంశంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తున్న జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో తీర‌ప్రాంత అభివృద్దికి, ప‌ర్యావ‌ర‌ణ ర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తోందన్నారు.. వాతావ‌ర‌ణ మార్పులు, ప్రకృతి వైప‌రీత్యాల‌తో తీర‌ప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.. మ‌త్స్యకారుల‌తో పాటు వ్యవసాయంపై ఆధార‌ప‌డిన వారి జీవనోపాధికి ముప్పు క‌లుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స‌ముద్రంపై ఆధార‌ప‌డిన వారికి తీర‌ప్రాంత వాసులకు ప్రభుత్వం అన్ని ర‌కాలుగా స‌హ‌కారం అందిస్తోందని వెల్లడించారు.. తీర‌ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవ‌నోపాధిని పెంచుతున్నామని పేర్కొన్నారు.. ప‌ర్యావ‌ర‌ణ ప్రభావిత‌మైన అంశాలకు ప‌రిష్కారం దిశ‌గా జాతీయ స‌ద‌స్సు నిర్వహించ‌డం అభినంద‌నీయం.. స‌ద‌స్సు ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప్రభావిత అంశాల‌కు ఆర్కిటెక్ట్ లు, ప్లాన‌ర్ లు ప‌రిష్కారం చూపిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.

సంజౌలీ మసీదులోకి ఏఐఎంఐఎం అధినేత ప్రవేశం.. కొనసాగుతున్న ఉద్రిక్తత..!
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది. షోయబ్ జమై మసీదుకు వెళ్లి వీడియో తీసి దానిపై న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. తక్కువ ముస్లీంలు ఉండటంతో మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడం వల్ల మసీదు కమిటీ రాజీ పడవలసి వచ్చిందని అన్నారు. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి విక్రమాదిత్య కూడా జామాయి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని షోయబ్ జమై ఆరోపించారు. కాగా, సంజౌలి మసీదును ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధినేత సోయబ్ జమై సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో న్యాయం అందరికీ సమానం, మసీదు చట్టబద్ధమైనదా లేదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. మసీదుతో సమానమైన అంతస్తులు ఉన్న భవనాలను చూపుతూ.. ఈ మసీదు చట్టవిరుద్ధమైతే, అనేక ఇతర నిర్మాణాలు కూడా చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై మేము కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం.. నాలుగున్నర అంతస్తులకు పైగా ఉన్న ఇతర భవనాలు ఎందుకు కూల్చి వేయకూడదో అడుగుతామన్నారు.

వ్యవసాయ చట్టాలపై కంగనా కామెంట్స్.. పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు నష్టం..!
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మూడు చట్టాలను తిరిగి తీసుకురావాలని సూచించడంతో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఆమె వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉండటంతో నిన్న క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలు.. పార్టీది కాదని తెలిపారు. అయితే, కమలం పార్టీ ఎంపీ కంగనా క్షమాపణలు చెప్పినప్పటికీ పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు కలిగించిన నష్టాన్ని తగ్గించలేకపోయాయి. ఇక, పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు వ్యక్తిగతం పార్టీకి సంబంధించినది కాదని తెలిపారు. కానీ ఒక పంజాబీలపై సిక్కు సమాజంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈలాంటి కామెంట్స్ వల్ల పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. పంజాబీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేసిన మంచి మొత్తం పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కంగనా రనౌత్.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకు రావాలని తెలిపింది.

దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వండి.. హిందూ టెంపుల్స్ కి బెదిరింపులు..!
బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందూ సమాజమే లక్ష్యంగా బెదిరింపులకు దిగుతున్నారు. దుర్గుపూజ చేసుకునేందుకు 5 లక్షల బంగ్లాదేశ్ టాకా ఇవ్వాలని ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు దేవాలయాలు, కమిటీలకు బెదిరింపు లేఖలు పంపినట్లు సమాచారం. ఆ మొత్తం చెల్లించకుంటే పూజకు అనుమతించబోమని చెప్పారు. అలాగే, దుర్గామాత విగ్రహాన్ని పగలగొడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు దుర్గాపూజ చేయడానికి దేవాలయాల నుంచి 5 లక్షల రూపాయలను డిమాండ్ చేశాయని హిందూ సంఘాలు తెలిపాయి. అలాగే, ఖుల్నా జిల్లాలోని డాకోప్‌లో ని హిందూ సంఘాలకు చెందిన పూజా కమిటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి లేఖలు వచ్చాయి. చెప్పిన మొత్తాన్ని చెల్లించకుంటే.. దుర్గాపూజకు అనుమతించేది లేదని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న లక్ష్మీగంజ్ జిల్లాలోని రాయ్‌పూర్ ప్రాంతంలో కొందరు మదర్సా కుర్రాళ్లు దుర్గా విగ్రహాలను పగలగొట్టారు. దీంతో పాటు బార్గునా జిల్లాలోని ఒక ఆలయంలో గల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు హిందూ సంఘాలు వెల్లడించాయి. ఇక, బంగ్లాదేశ్ లో అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుర్గాపూజ జరుపుకుంటారు. విశేషం ఏమిటంటే ఇది బంగ్లాదేశ్ హిందువులకు అతి పెద్ద పండుగ.

చైనా 400 కోట్ల గేమింగ్ యాప్ కుట్ర బట్టబయలు చేసిన ఈడీ ..రూ.25కోట్లు స్వాధీనం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చైనా పెద్ద కుట్రను బట్టబయలు చేసింది. చైనీస్ ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌లపై దర్యాప్తు సంస్థ పెద్ద చర్య తీసుకుంది. మొదటిసారిగా, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ FIEWINతో అనుబంధించబడిన చైనీస్ పౌరుల క్రిప్టో ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. చైనా పౌరుల నుంచి రూ.25 కోట్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ గేమింగ్ యాప్ ద్వారా భారత్ నుంచి చైనాకు రూ.400 కోట్లు చేరినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ కేసులో నలుగురు భారత పౌరులను కూడా ఈడీ అరెస్టు చేసింది. భారతదేశంలో ఈ గ్యాపింగ్ ద్వారా చైనా మూలాలు ఉన్న పౌరులు భారతదేశంలో పెద్ద మొత్తంలో 400 కోట్ల రూపాయలు సంపాదించారని.. ఈ డబ్బు చైనాకు చేరిందని ఈడీ దర్యాప్తులో తేలింది. ముగ్గురు చైనా పౌరులకు చెందిన 3 క్రిప్టో ఖాతాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. గేమింగ్ యాప్‌ల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చైనా పెద్ద కుట్ర పన్నింది.

తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?.. 15 వేల్లోపు బెస్ట్‌ ఫోన్లు ఇవే!
ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌’, అమెజాన్‌లో ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు సేల్స్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్‌ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్‌ కొనాలనుకుని?.. మీ బడ్జెట్‌ 15 వేల్లోపే ఉంటే ఈ ఫోన్లు ఓసారి చూడండి.
శాంసంగ్‌ ఎం35 5జీ అమెజాన్‌లో రూ.13,749కే లభిస్తుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఇందులో ఉంటాయి.
మోటోరొలా జీ64 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కు లభిస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఉంది.
అమెజాన్‌లో నార్జో 70 ప్రోను రూ.14,999కు.. రియల్‌మీ నార్జో 70 ఎక్స్‌ రూ.12,498కి అందుబాటులో ఉంది.
ఒప్పో కే12ఎక్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999కే లభిస్తుంది. 32 ఎంపీ కెమెరా, 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్‌ వస్తోంది.
లావా బ్లేజ్‌ కర్వ్‌ అమెజాన్‌లో రూ.14,499కే లభించనుంది. 64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది.

టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!
‘దేవర’ ఊచకోతకు సముద్రం ఎరుపెక్కగా.. ఫ్యాన్స్ తాకిడికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఎరుపెక్కనున్నాయి. మరో కొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరంను దాటనుంది. మేకర్స్ ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. దేవర నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా అంచనాలను మించాయి. సినిమా ఓపెనింగ్ రోజే.. మృగాల వేట చూస్తారని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. అందుకు తగ్గట్టే టీజర్‌లో బ్లడ్ మూన్ షాట్‌తో హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లిన కొరటాల.. ఫియర్ సాంగ్‌తో భయపెట్టేశారు. చుట్టమల్లే, దావూదీ సాంగ్‌లకు డిజిటల్ రికార్డ్స్ బద్దలయ్యాయి. సినిమాకే హైలెట్‌గా ఉంటుందని చెబుతున్న ఆయుధ పుజ సాంగ్‌ను థియేటర్లోనే చూడాలి. ఇక ఇప్పుడు దేవర థియేటర్లోకి రావడమే మిగిలింది. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని దేవరలో చూడబోతున్నాం. ఇప్పటికే టైగర్ ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియా ఎరుపెక్కింది. థియేటర్ల వద్ద ఎర్రసముద్రాన్ని తలపించేలా ప్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఇక టైగర్ కటౌట్‌లకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో.. దేవరను ఓ పండగలా ఫాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది దేవర.

నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’..
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని థియేటర్ లో చుసిన వారికి ధన్యవాదాలు. చూడని వారికోసం ఒక శుభవార్త. మా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు..  ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.