NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం.. తొలి సభ్యత్వం తీసుకున్న చంద్రబాబు..
టీడీపీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌ ప్రారంభం అయ్యింది.. తొలి సభ్యత్వాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకోవడంతో.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అయితే, రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించింది తెలుగు దేశం పార్టీ. అంతేకాదు.. రూ. లక్షతో శాశ్వత సభ్యత్వం పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.. పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ వస్తుంది టీడీపీ.. 11 గంటల 59 నిమిషాలకు తొలి సభ్యత్వం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వం కార్డు అందుకున్నారు చంద్రబాబు.. 100 రూపాయలు చెల్లించి తొలి సభ్యత్వం ఉండవల్లి గ్రామ అధ్యక్షుడు నుంచి నమోదు చేయించుకున్నారు చంద్రబాబు.. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో తన సభ్యత్వాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెన్యువల్ చేసుకున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తలే బలం అన్నారు.. ప్రాణాలు అడ్డుపెట్టి మొన్నటి ఎన్నికల్లో టీడీపీని కార్యకర్తలు గెలిపించారన్న ఆయన.. వైసీపీ నేతలు బూత్ లోకి వచ్చి కొడుతున్న కార్యకర్తలు అలానే నిలబడి పార్టీని గెలిపించారని గుర్తుచేశారు.. అందరూ సీరియస్ గా తీసుకుని సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు.

ఒకేరోజులో పంచారామ క్షేత్రాల సందర్శన.. అధ్యాత్మిక యాత్రకు మంత్రి దుర్గేష్‌ శ్రీకారం..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చూట్టారు. ఆధ్యాత్మిక యాత్ర బస్సును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద ఉన్న టూరిజం శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్ద నుండి ఆధ్యాత్మిక యాత్ర బస్సు బయలుదేరింది. ఇక, ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక ఈ యాత్ర ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామని తెలిపారు.. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ సాగే యాత్రకు ప్రతి శనివారం అందుబాటులో బస్సులు ఉంటాయన్నారు. పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచన ఉందని వెల్లడించారు. ఈ బస్సుల్లో పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు 800 రూపాయలుగా టికెట్‌ ధరలను నిర్ణయించారు.. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ కోరారు. అధ్యాత్మిక భావంతో పాటు సాంస్కృతిక, చారిత్రాత్మిక ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే టూర్ ప్యాకేజీ ముఖ్యోద్దేశమని అన్నారు మంత్రుల కందుల దుర్గేష్‌..

తిరుపతిలో మళ్లీ కలలం.. ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు..
టెంపుల్‌ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తు్న్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.. ఇక, రెండు రోజులు క్రితం నాలుగు హోటల్స్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ-మెయిల్‌ వచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరోసారి బాంబు బెదిరింపులతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.. అయితే, ఐఎస్ఐ పేరుతో తాజాగా బెదిరింపులు వచ్చిన రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో రష్యన్, మలేషియాకు చెందిన మహిళలు 25 మంది వరకు బస చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు విదేశీయులు‌.. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపులతో ఈ మెయిల్ పంపించారు దుండగులు.. ఐఎస్ఐ ఉగ్రవాదులు పేరుతో వచ్చిన ఆ ఈ మెయిల్‌పై వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన సోదాలు నిర్వహిస్తున్నారు.. అయితే, టెంపుల్‌ సిటీని టార్గెట్‌గా చేసుకుని.. వరుసగా ఇలాంటి మెయిల్స్‌ వస్తున్న నేపథ్యంలో.. భక్తులు కలవరం మొదలైంది..

పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు
పాపికొండలు విహారయాత్ర టూరిస్టులను ఎంతగానో కట్టిపడేస్తుంది.. ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో సందర్శించారని నమ్ముతారు. కొండలు, లోయ మరియు జలపాతాల వీక్షణను ఆస్వాదించడమే కాకుండా, పర్యాటకులు క్యాంపింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలతో ఈ టూరు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది.. అయితే, గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి. దేవీపట్నం మండలం గండి పోశమ్మ ఆలయం వద్ద ఉన్నర బోటింగ్ పాయింట్ నుంచి ఇవాళ ఒక టూరిస్ట్ బోట్ పర్యాటకులను తీసుకుని పాపికొండల పర్యటనకు బయల్దేరింది.. ప్రకృతి సోయగాలు కనువిందు చేసే పాపికొండలు వద్దకు తీసుకు వెళ్లేందుకు రాజమండ్రి నుంచి పెద్దలకు 1250 రూపాయలు… పదేళ్లలోపు చిన్నారులకు వెయ్యి రూపాయలు టికెట్ గా ఖరారు చేశారు. రాజమండ్రిలోని పర్యాటకశాఖ కార్యాలయం నుంచి ఉదయం 7:30 కు వాహనంలో గండి పోశమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్తారు. ఉదయం 9 గంటలకు గోదావరిలో పర్యాటకుల బోటు ప్రారంభమై సాయంత్రం ఐదున్నరకు తిరిగి చేరుకుంటుంది. సుమారు 75 కిలోమీటర్ల మేర గోదావరిలో ప్రయాణం సాగనుంది. నిన్న పర్యాటక బోట్లకు ట్రైల్ రన్ నిర్వహించారు‌‌. అనుకోని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బోటు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన విషయం విదితమే..

నిన్న పెళ్లి మండపం నుంచి పరార్.. నేడు ప్రియుడితో కలిసి పీఎస్‌లో ప్రత్యక్షం..
కర్నూలు జిల్లా పత్తికొండలో శుక్రవారం తెల్లవారుజామున అదృశ్యమైన పెళ్లికూతురు ఈ రోజు తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.. పత్తికొండలోని గోపాల్ ప్లాజాలో కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది.. తాను పెళ్లి చేసుకున్న విశ్వాస్‌ని వెంటపెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది.. ఇక, వైష్ణవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కాగా, అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడుకి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి , రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయింది. దీంతో.. మరికొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వధువు తండ్రి.. అయితే, తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం విదితమే..

కొనసాగుతున్న కానిస్టేబుల్స్ భార్యల నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన
తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బెటాలియన్‌ పోలీసులు సీఎం రేవంత్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, స్థానిక పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క సరిగా ఉదృతంగా మారడంతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాయింది. అలాగే, నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి నిరసన చేస్తున్నారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించిన కానిస్టేబుల్స్ సిబ్బంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో కానిస్టేబుల్స్ భార్యలు బయటకు రాకుండా ఆగిపోయారు.

వారణాసి కోర్టులో హిందూ పక్షం పిటిషన్ తిరస్కరణ.. కారణం ఇదే
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన్‌వాపి కేసులో, మొత్తం కాంప్లెక్స్‌ను సర్వే చేయాలని దాఖలు చేసిన దరఖాస్తు హిందూ పక్షం వాదనల్లో బలం లేకపోవడం కారణంగా కోర్టు తిరస్కరించింది. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి యుగల్ శంభు తీర్పు ఇస్తూ.. 839 పేజీల ఏఎస్‌ఐ సర్వే నివేదికను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. పరిశీలించిన తర్వాతే దీనిపై పూర్తి నిర్ధారణకు రావచ్చు. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 8 ఏప్రిల్ 2021న నిర్ణయం తీసుకున్న తర్వాత, ఫిబ్రవరి 2024లో అదనపు సర్వేను కోరుతూ దరఖాస్తు దాఖలు చేయబడింది. మసీదు గోపురం కింద నిర్మించిన 100 అడుగుల భారీ శివలింగంతో పాటు అర్ఘ్యం కూడా ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. చొచ్చుకొని పోవడంతో ఏఎస్ ఐ సర్వే నిర్వహించాలని దరఖాస్తులో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, మొత్తం మిగిలిన ప్రాంగణాలు, స్నానపు గదులు, నేలమాళిగలను కూడా సర్వే చేయాలి. ఈ వాదనలన్నింటిపై కోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందో తెలుసుకుందాం.

మహారాష్ట్ర ఎన్నికల బరిలో కాంగ్రెస్ 23 మంది అభ్యర్థుల జాబితా విడుదల
మహారాష్ట్ర ఎన్నికల పోరులో 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితాలోని చాలా మంది పేర్లు విదర్భ ప్రాంతానికి చెందినవి. నాగ్‌పూర్‌ సౌత్‌ నుంచి గిరీష్‌ పాండవ్‌, వార్ధా నుంచి శేఖర్‌ షిండే, యవత్‌మాల్‌ నుంచి అనిల్‌ మంగూల్కర్‌లకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా నేడు విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రకారం.. భుజ్‌బల్‌ నుంచి రాజేష్‌ తుకారాం, జల్‌గావ్‌ నుంచి స్వాతి వాకేకర్‌, సవనేర్‌ నుంచి అనుజా సునీల్‌ కేదార్‌, భండారా నుంచి పూజా ఠక్కర్‌, రాలేగావ్‌ నుంచి బసంత్‌ పుర్కే, కమతి నుంచి సురేశ్‌ భవార్‌, అర్జుని నుంచి దిలీప్‌ బన్‌సోద్‌, బసాయి నుంచి విజయ్‌ పాటిల్‌ అభ్యర్థులుగా నిలిచారు. కందవలి-తూర్పు నుంచి కాలు బధెలియా, అమీ నుంచి జితేంద్ర మోఘే, జల్నా నుంచి కైలాష్ గోరంటియాల్, షిరోలి నుంచి గణపత్ రావ్ పాటిల్‌లకు కూడా పార్టీ గుర్తులు ఇచ్చింది.

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిన్న కాస్త శాంతించింది అనుకునే లోపే ఈ రోజు మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్‌ ధర 80 వేల మార్క్‌ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.65 పెరిగి.. రూ.73,600గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.71 పెరిగి.. రూ.80,290గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర 80 వేలు మార్క్‌ దాటేయగా.. సిల్వర్‌ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్‌ దాటేసి.. పరుగులు పెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఎలాంటి మార్పు లేదు. లక్షా ఏడు వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా ఏడు వేలుగా నమోదైంది

రెండో ఇన్సింగ్స్లో న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది. ఇక, భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందరి 4 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక, రెండు ఇన్నింగ్స్ ల్లో వాషింగ్టన్ సుందర్ 11 వికెట్లు తీశాడు. ఇక, 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 57 పరుగులు జోడించిన తర్వాత మిగతా ఐదుగురు బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఔట్ చేశారు. అయితే, కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టామ్‌ లాథమ్‌ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్‌ బ్లండెల్‌ (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (48 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. అయితే, అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలిపోయింది. మిచెల్‌ సాంట్నర్‌ ఏడు వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, సౌతీ ఓ వికెట్‌ తీసుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్‌ చెరో 30 పరుగులు చేశారు.

సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్‌న్యూస్‌.. పుకార్లకు చెక్ పెట్టిన ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగబోతుంది. ఆలోపు రిటెన్షన్, రైట్‌ టు మ్యాచ్‌తో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమ దగ్గర అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి గడువు అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉండగా.. ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ప్లేయర్ల జాబితాలను రిలీజ్ చేయలేదు. అయితే, ఒక్క ప్లేయర్‌ విషయంలోనే అభిమానుల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. అతడు ఈసారి ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది ప్రశ్న ఫ్యాన్స్ లో మెదులుతుంది. కానీ, తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఐపీఎల్‌లో పాల్గొనడంపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పెట్టినట్లైంది. మరి కొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు, మరో మూడేళ్ల వరకు అతడిని మైదానంలో చూసే ఛాన్స్ ఉంది. రిటైన్‌ చేసుకొనే ఆటగాళ్లను కనీసం మూడేళ్ల పాటు ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక, గోవాలో జరిగిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇకపై నేను ఆడబోయే క్రికెట్‌ను మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.. ప్రొఫెషనల్‌ గేమ్‌ ఆడేవాళ్లు ఎప్పుడు ఎంజాయ్‌ చేయలేరు.. కానీ, నేను మాత్రం అలా ఉండకూడదని అనుకుంటున్నాను.. కానీ, ఇది చాలా కష్టమైనది.. కమిట్‌మెంట్స్, భావోద్వేగాలు చాలా ఉంటాయి.. వీటన్నింటినీ పక్కన పెట్టేసి రాబోయే కొన్నేళ్లు ఆటను మరింతగా ఆస్వాదిస్తాను అని చెప్పారు. అందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను.. ఐపీఎల్‌లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడతా.. అందుకోసం పక్కాగా ప్రణాళిక చేసుకోవాలి.. అదే సమయంలో వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వెల్లడించాడు.

తెలుగు బిగ్ బాస్ కు సాయిపల్లవి, శివకార్తికేయన్
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మరికొందరు హౌస్ లో అడుగుపెట్టారు. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి వివిధ సినిమా సెలెబ్రిటీస్ కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో సరదాగా గడుపుతున్నారు. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెట్స్ లో తమిళ స్టార్ హీరో సూర్య అడుగుపెట్టాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా కంగువ ప్రమోషన్స్ లో భాగంగా విచ్చేసి సినిమా విశేషాలతో పాటు పలు సరదా సంభాషణలను కూడా పంచుకుంటూ హౌస్ మేట్స్ కు ఎంకరేజ్ మెంట్ ఇచ్చి వెళ్లారు. తాజాగా మరో హీరో కూడా సూర్య ని ఫాలో అవుతూ తమ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేస్తున్నారు. తమిళ స్టార్ హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ తెలుగు బిగ్ బాస్ లో అడుగుపెడుతున్నారు. అయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం అమరన్ దీపావళి కనుకగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అందులో భాగంగా తెలుగులో నేడు అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ విచ్చేసిన శివకార్తికేయన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో అమరన్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబందించిన షూటింగ్ ను నేడు పూర్తి చేయనున్నారు మేకర్స్. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది.

పుష్ప – 2 అంటే ఆ మాత్రం భయం ఉండాలా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. కాగా మొదట సినిమాను డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా నిర్వహించిన మీడియా మీట్ లో ఈ సినిమాను డిసెంబరు 5 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప – 2 కు పోటీగా వేరే ఏ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు సదరు నిర్మాతలు. ఒకవేళ వచ్చిన థియేటర్స్ దొరకని పరిస్థితి. పుష్పరాజ్ క్రేజ్ ముందు తమ సినిమాలు నిలబడవని భావించి తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు పుష్ప లైన్ క్లియర్ చేశాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ ను రిలీజ్ చేస్తామని ఆ ఆ మధ్య ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డిసెంబరు 6న వచ్చే అవకాశం కనిపించట్లేదు. పుష్ప -2 తో పోటీ ఎందుకులే అని భావిస్తున్నారట ఛావా మేకర్స్. అటు పుష్ప, ఇటు ఛావా రెండింటిలోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం.

Show comments