కొడాలి నానికి అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చేరిక..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్‌లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కొడాలి నాని.. అయితే, గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెబుతున్నారు ఏఐజీ వైద్యులు.. కాగా, గతంలో గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు కొడాలి నాని.. దీంతో, ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యయేనా..? లేక మళ్లీ గుండెకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది జరిగిందా? అనేది తేల్చేందుకు సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏఐజీ వైద్యులు..
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ..!
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నోటీసులు ఇచ్చిన కూటమి సంఖ్యాబలం సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ గండికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది. వలసల తర్వాత మిగిలిన 33మంది కార్పొరేటర్లు ను బెంగుళూరులో బేస్ క్యాంప్‌కు తరలించింది. అక్కడ నుంచి వాళ్లందరినీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని దేవాలయాలు, పర్యటక కేంద్రాల చుట్టూ తిప్పే విధంగా టూర్ డిజైన్ చేసి విశాఖ దాటిచేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వైసీపీ కార్పొరేటర్లతో లోపాయికారీ ఒప్పందంతో మేయర్ కైవసం చేసుకోవాలని చూసిన కూటమికి ప్రతికూల పరిస్థితి తలెత్తింది. పైగా ఇటీవల అభివృద్ధి కోసం అంటూ ఫ్యాన్ పార్టీని వీడి వచ్చిన కార్పొరేటర్లు పైన పూర్తి స్థాయిలో నమ్మకం వుంచలేని సందిగ్ధత నెలకొంది. దీంతో ఆరుగురు కార్పొరేటర్లు ను ఓ హోటల్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాసం నల్లేరు మీద నడక అనుకుంటే మారుతున్న పరిస్థితులు రాజకీయ సంక్లిష్టకు కారణం కావొచ్చు అనే నెగెటివ్ సంకేతాలు జనసేన, టీడీపీ అధి నాయకత్వానికి చేరాయి. దీంతో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి బాధ్యతలు అప్పగించింది. మారుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలను కుంటే క్యాంప్ ఏర్పాటు చేయడం అనివార్యమనీ భావిస్తోంది కూటమి నాయకత్వం. ఈనెల 29న గ్రేటర్ బడ్జెట్ సమావేశం వుంది. ప్రస్తుతం మేయర్ హరి వెంకట కుమారి., ఇద్దరు డిప్యూటీ మేయర్ లు క్యాంపు లో వున్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు మేయర్ హాజరు అవుతారా..? లేదా అనేది ఆసక్తికరం. వైసీపీ నుంచి వున్న సమాచారం ప్రకారం బడ్జెట్ కీలకం గనుక ఆరోజు మేయర్ క్యాంప్ నుంచి వచ్చి సమావేశం అనంతరం తిరిగి వెళ్లిపోతారు.
సీఎం చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ.. లిక్కర్ స్కామ్‌పై సీరియస్‌గా సర్కార్..!
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ.. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్.. ఢిల్లీలో జరిగినదానికంటే పెద్దది అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.. దానికి తగినట్టుగానే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. పార్లమెంట్‌ను తాకిన మద్యం కుంభకోణం వ్యవహారంపై చర్చించనట్టుగా తెలుస్తోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ.. ఇటీవల పార్లమెంట్ లో లేవనెత్తారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. నాలుగు వేల కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని సైతం కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. మద్యం కుంభకోణంపై చర్చించారట.. అయితే, ఈ పరిణామాలు అన్నీ సీఎం చంద్రబాబును కలిసి వివరించారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. అయితే, ఢిల్లీలో సైతం హాట్ టాపిక్ గా మారిన ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్‌గా ఉందట.. మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పందించిన ఏపీ సీఎం..
తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్నే ప్రస్తావించారు సీఎం.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కలెక్టర్ల సదస్సులో రెండో రోజు చర్చ జరిగింది.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో ప్రస్తావించారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు.. ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారు అంటూ చెప్పుకొచ్చారు కూనంనేని.. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ తెలంగాణ సభలో అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే కూనంనేని.. అయితే, పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు.. నాపై విమర్శలు చేశారు.. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారు అని గుర్తుచేశారు.. తాను చెప్పిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు..
పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు.. సంతోషం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..
పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది.. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్.. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట – ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు.. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపడుతున్నాం అన్నారు.. ఇక, ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు డిప్యూటీ సీఎం.. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన డిప్యూటీ సీఎం భట్టి..
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది మీరు.. మాపై నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం కమిషన్ అని అడ్డగోలుగా మాట్లాడితే ఎలా. కేటీఆర్ తక్షణమే క్షమపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ బాగుందా లేదా అనేది ఎన్నికల్లో ప్రజల తీర్పుతో స్పష్టమైంది..
తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.. ధరణిలో ఏర్పడిన సమస్యలతో తమ భూముల సమస్యలు పరిష్కారం కోసం నా దగ్గరికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు వెల్లడించారు. మేము వచ్చే ఎన్నికల్లో భూ భారతి గురించి చెప్పి ఎన్నికలకు పోతాం.. బీఆర్ఎస్ ధరణి పేరుతో ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు.. ధరణి తెచ్చి రూల్స్ అసలు ఫ్రేమ్ చేయలేదు.. మేము చట్టం తెచ్చి రూల్స్ సిద్ధం చేస్తున్నాం.. మీరు మాకు చెప్పడం ఎందుకు అని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెప్పి, ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు అని మంత్రి పొంగులేటి విమర్శించారు.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సంజయ్ మిశ్రా నియామకం
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా ఈఏసీ-పీఎంలో పూర్తి సభ్యుడిగా ఉండనున్నారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణుడు. అనేక ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈడీ చీఫ్‌గా ఆయన పదవీకాలం నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పొడిగించబడింది. ఇక 2025, మార్చి 25(మంగళవారం) అర్థరాత్రి ఉత్తర్వులో మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో పూర్తి సమయం సభ్యునిగా కార్యదర్శి హోదాలో నియమించడానికి ఆమోదం తెలిపింది. EAC-PM అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక మరియు సంబంధిత అంశాలపై సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్వతంత్ర సంస్థ.
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు.. ఇటీవల వక్షోజాలపై కీలక తీర్పు
మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, పైజామాను కిందకి లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడాని ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. ఈ తీర్పు పూర్తి అసమర్థత కూడినదంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది తీవ్రమైన విషయమని.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి వైపు పూర్తి అసమర్థత కనిపిస్తుందని జస్టిస్ బీఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇది పూర్తి సున్నితత్వం కూడిందని.. ఈ విషయాన్ని చెప్పడానికే తమకు బాధగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి సమాధానాలను కోరింది. ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా సమాజమంతా నిరసనగళం ఎత్తారు. ఇక ఈ తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రంగా ఖండించారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు పున:సమీక్షించాలని కోరారు. ఇలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వ్యా్ఖ్యానించారు.
మస్క్-జేడీ వాన్స్ మధ్య వైర్యం.. పాలనలో జోక్యంపై ఉపాధ్యక్షుడు అసహనం!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది. మస్క్ అమెరికన్ కాదని.. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అని.. అమెరికన్‌గా వేషధారణ కలిగి ఉన్నాడంటూ జేడీ వాన్స్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇద్దరికీ పొసగడం లేదంటూ ఓ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఆడియో రికార్డ్‌ను తోసిపుచ్చారు. అది ఏఐ సృష్టించిన ఆడియో అంటూ కొట్టిపారేశారు. ట్వీట్ చేసిన వ్యక్తికి ఏఐ ద్వారా సృష్టింపబడిన కంటెంట్ అని అర్థం చేసుకునేంత తెలివితేటలు లేవా? అంటూ ప్రశ్నించారు. అది నకిలీదని తెలిసిన తర్వాతైనా దానిని తొలగిస్తే మంచిది.. లేదంటే అది పరువు నష్టం దావా కిందకు వస్తుందని పోస్టు చేసిన వ్యక్తికి జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఆడియోపై మస్క్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఆ డబ్బును గౌతమ్ గంభీర్ వెనక్కి ఇచ్చేస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.58 కోట్లను నజరానా ప్రకటించింది. భారత ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ చొప్పున దక్కనుంది. అలానే సహాయక కోచింగ్ సిబ్బందికి రూ.50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున దక్కనుంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినప్పుడు అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇచ్చి.. సహచరులకు సమంగా పంచాలని కోరారు. ఈ అంశంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ద్రవిడ్‌లా గంభీర్ కూడా తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇస్తాడా? అని ప్రశ్నించారు. ‘టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన టీమిండియాకు బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటించింది. అప్పుడు భారత జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు ఇతర సిబ్బందితో పోలిస్తే.. భారీగా నజరానా అందింది. ద్రవిడ్ ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి.. తన సహచరులకు సమంగా పంచమన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా బీసీసీఐ రివార్డు ప్రకటించింది. రివార్డులను ప్రకటించి పక్షం రోజులు అయ్యింది. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ద్రవిడ్‌లా గంభీర్ చేస్తాడా? లేదా?’ అని స్పోర్ట్స్‌స్టార్ కాలమ్‌లో సునీల్ గవాస్కర్ రాసుకొచ్చారు.
డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ కు ప్లస్సా.. మైనస్సా..?
ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్ రాలేదు. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవతున్నా మొదట్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ కనిపించలేదు. టీజర్ సాంగ్స్ ఆకట్టుకున్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఐపిఎల్ సీజన్ మొదలుకావడంతో రాబిన్‌హుడ్‌కు రావాల్సినంత హైప్ రాలేదనే చెప్పాలి. ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి నుంచి ఇన్‌స్పైర్ అయిన వెంకీ డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్‌తో వచ్చాడు. అయితే ఇవేవీ జనాల్లోకి తీసుకెళ్లలేకపోయినా డేవిడ్ వార్నర్‌తో చేసిన వీడియో మాత్రం దూసుకెళ్లింది. సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న డేవిడ్ వార్నర్ రాకతో. రాబిన్‌హుడ్‌కు కొత్త కళ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఇది మొదలుకాగా నితిన్, శ్రీలీల కలిసి డేవిడ్‌కు తెలుగు నేర్పే వీడియో సరదాగా ఆకట్టుకుంది. గత ఏడాది ఇదే టైంలో ఐపిఎల్‌తో బిజీగా వున్న డేవిడ్ వార్నర్ ఈసారి ఒకవైపు ఐపిఎల్ మ్యాచెస్ జరుగుతుంటే ఈ ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్‌మేన్ మాత్రం రాబిన్‌హుడ్ ప్రమోషన్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడోగానీ ప్రమోషన్స్‌కు ఎక్కువ టైమే కేటాయించాడు. ఆస్ట్రేలియన్ మాజీ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ.. డబ్ స్మాష్‌లు చేస్తూ గడిపేసే వార్నర్ తెలుగు సినిమాతో వెండితెరకు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆమధ్య రాజమౌళితో కలిసి చేసిన యాడ్‌లో రకరకాల గెటప్స్‌తో కామెడీ చేశాడు. మరి రాబిన్‌హుడ్ యాక్టింగ్ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి మరి.