NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పగడ్బందీగా ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల మోడ్‌లోకి వెళ్లింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ స్థానాల‌కు… రేపు ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. ఈ జిల్లాల ప‌రిధిలోని ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల సంఘం క్యాజువ‌ల్ లీవ్‌ను ప్రక‌టించింది. దీంతో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు తమ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేష‌న్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 22,493 మంది ఓట‌ర్లు ఉన్నారు. 13,503 మంది పురుషులు, 8,985 మంది మ‌హిళ‌లు ఉన్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల ప‌రిధిలో ఎన్నిక జ‌రుగుతోంది. యుటీఎఫ్‌ నుంచి కోరెడ్ల విజ‌య‌గౌరి, ఏపీటీఎఫ్‌ తరపున పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ, పీఆర్‌టీయూ నుంచి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక, ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్‌, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘ‌వులు మ‌ధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓట్లు ఉంటే.. 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండ‌ర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 30 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ ల‌క్ష్మణ‌రావు మ‌ధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వైరల్ ఫీవర్‌తో బాధపడుతోన్న జగన్‌.. అయినా రాజారెడ్డి ఐ సెంటర్‌ ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు.. గత రెండు రోజులుగా ఆయన ఫీవర్‌తో బాధపడుతోన్నట్టుగా తెలుస్తుండగా.. అయినా, ఈ రోజు కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు మాజీ సీఎం.. పులివెందుల పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా తన కంటికి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు… ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరియు రాజారెడ్డి ఐ సెంటర్ సంయుక్తంగా చేపడుతున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కాగా, నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు వైఎస్‌ జగన్‌.. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందుల నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు.. ఇక, వచ్చే నెల 3వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారట వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

వల్లభనేని వంశీకి వరుస షాక్‌లు.. మరో మూడు కేసులు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్‌లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి.. అయితే, వంశీపై నమోదైన ఆ మూడు తాజా కేసులు ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వల్లభేని వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యం చేశారని.. పొలం రిజిస్ట్రేషన్ చేయించారని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికి చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు.. ఇక, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు లో కేసు నమోదు చేశారు ఆత్మకూరు పోలీసులు. మరోవైపు వీరవల్లిలో ఓ కంపెనీ వచ్చిన సమయంలో రైతులకు పరిహారం ఇవ్వటంలో అవకతవకలకు పాల్పడాని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వీరవల్లి పోలీసులు.. ఇదిలా ఉంటే తన భూమిని కభ్జా చేశాడని నిన్న ఓ‌ న్యాయవాది భార్య.. గన్నవరంలో ఫిర్యాదు చేవారు.. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేయడం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా చేయడం వల్లన ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు.

సర్కార్‌ కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై సర్వే..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై కూడా సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.. వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెక్నీకల్ స్కిల్.. విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాల సేకరిస్తారు.. మార్చి 10వ వరకు సర్వే నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. ప్రస్తుతం చేస్తున్న వర్క్‌తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే.. ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. బ్రాండ్ బ్యాండ్ కనెక్టవిటీ.. స్పీడ్ ఇంటర్ నెట్.. తగిన వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది..

శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల!
ఉపాధి కూలీలకు శుభవార్త. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రిలీజ్ అయ్యాయి. వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. వ్యవసాయ పట్టా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఎవరికి వ్యవసాయ భూమి ఉన్నా.. ఈ పథకానికి అనర్హులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా (ఒక్కో విడతకి రూ.6 వేలు) సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందుతుంది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం అయింది. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి.. కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ అయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నిధులు విడుదలయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం చెల్లించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమయ్యాయి.

మహా శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం.. చిన్న నాటి మిత్రులతో కలసి..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి డిప్యూటీ సీఎం కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి.. మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు.

పర్యాటకులకు షాక్.. నెహ్రూ జూపార్క్‌లో పెరిగిన టికెట్‌ ధరలు!
పర్యాటకులకు భారీ షాక్‌. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్‌ ధరలు పెరిగాయి. అన్ని రకాల టికట్‌ ధరలను ప్రభుత్వం పెంచింది. మంగళవారం పార్క్‌లో జరిగిన జూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్‌ బాడీలో చర్చించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జూపార్క్‌ క్యూరేటర్‌ వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి నెహ్రూ జూపార్క్‌ ఎంట్రీ టికెట్ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45గా ఉండేది. ఫోటో కెమెరా అనుమతికి రూ.150, వీడియో కెమెరా (ప్రొఫెషనల్)కు రూ.2500 రూపాయలు, కమర్షియల్‌ మూవీ షూటింగ్ కోసం రూ.10 వేలు ఛార్జి చేస్తారు. అన్ని రోజుల్లో ట్రైన్ రైడ్ 20 నిమిషాలకు పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ అయితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున వసూలు చేయనున్నారు. అలానే నెహ్రూ జూపార్క్‌లోని పార్కింగ్ ఫీజు కూడా పెంచారు. సైకిల్‌కు రూ.10, బైక్‌కు రూ.30, ఆటోకు రూ.80, కారు/జీప్ రూ.100 వసూలు చేయనున్నారు. టెంపో,తూఫాన్‌ వాహనంకు రూ.150, 21 సీట్లు గల మినీ బస్సుకు రూ.200, 21 సీట్లు పైగా ఉన్న బస్సుకు రూ.300 చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దేశ ప్రజలకు మోడీ శివరాత్రి శుభాకాంక్షలు.. వీడియోలో భక్తి టీవీ కోటి దీపోత్సవం
దేశ ప్రజలకు ప్రధాని మోడీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ప్రత్యేక వీడియోను మోడీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని చూపించారు. ఏడాదిన్నర క్రితం భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. నాటి కోటి దీపోత్సవం ప్రాంగణాన్ని కాశీవిశ్వేశరుడి ఆలయంతో ప్రధాని పోల్చారు. ఇక దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని.. మంచి ఆరోగ్యం దయ చేయాలని.. అభివృద్ధి చెందిన భారత దేశంగా రూపొందేందుకు శక్తినివ్వాలని శివుడిని వేడుకున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఇక గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళా బుధవారం ముగుస్తోంది. చివరి రోజు కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి… పుణ్యస్నానాలు ఆచరిస్తు్న్నారు.

కేజ్రీవాల్‌కు రాజ్యసభ లైన్‌క్లియర్.. లూథియానా వెస్ట్ బైపోల్‌కి సంజీవ్ అరోరా
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి తొలుత కేజ్రీవాల్.. పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి… ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని భావించినట్లు వార్తలు వినిపించాయి. కానీ పంజాబీయులు బయట వ్యక్తులను అంగీకరించరని తెలియడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా.. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కేజ్రీవాల్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. మొత్తానికి అంతా అనుకున్నట్టు జరిగితే.. కేజ్రీవాల్ త్వరలో పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఇక  సంజీవ్ అరోరా పదవీకాలం 2028 లో ముగియనుంది.

నా అవసరం హీరో విజయ్‌కి లేదు.. చెన్నైకి ఎందుకొచ్చానంటే..!
తన ఆలోచనలు, వ్యూహాలు విజయ్‌కు అవసరం లేదని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రశాంత్ కిషోర్ హాజరై మాట్లాడారు. ‘‘విజయ్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదు. గత నాలుగేళ్లుగా నేను ఎవరికి‌ పనిచేయలేదు. కానీ నేను ఈ వేడుకకు రావడానికి కారణం నా బ్రదర్ విజయ్‌‌నే కారణం. టివీకే పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను తమిళనాడులో సృష్టించబోతుంది. తమిళనాడు మార్పు కోరుకుంటోంది. ఆ సమయం వచ్చింది. ఒక కొత్త రాజకీయాన్ని విజయ్ ప్రజలకు పరిచయం చేస్తారు‌‌‌. గత 35 ఏళ్లుగా ఉన్న రాజకీయాన్ని విజయ్ తన ఆలోచనలతో మార్పు తీసుకుని వస్తారు‌‌.’’ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ‘‘విజయ్ అలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు. అందుకే విజయ్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను.‌‌ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత నేను స్వయంగా తమిళంలో మాట్లాడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతాను‌‌. తమిళనాట అవినీతి, కుటుంబ పాలనా పోవాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలి. దేశంలో ఎక్కడలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కమ్యూనిజం, కుటుంబ పాలనా తమిళనాడులో పోవాలి. నా కంటే ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఎక్కువ. కానీ వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపించి ధోనీ కంటే ఎక్కవ క్రేజ్‌ను తమిళనాడులో నేను సంపాదిస్తాను. రానున్న రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోనీ గెలిపిస్తే‌‌‌‌‌‌‌‌…‌ నేను విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీనీ గెలిపిస్తాను. వచ్చే వంద రోజుల్లో టీవీకే పార్టీని పది ఇంతలు పటిష్టంగా కార్యకర్తలు మార్చాలి.’’ అని ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు.

బసవతారకం ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం
ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో క్యాన్సర్ పరిశోధనల కోసం NRI డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, డాక్టర్ కల్యాణి ప్రసాద్ భారీ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘క్యాన్సర్ నుంచి అతి తక్కువ ఖర్చుతో బయటపడాలని ఈ ఆస్పత్రి నీ ఏర్పాటు చేశాము. క్యాన్సర్ చికిత్స తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యం. ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం. ఇక్కడున్న వైద్యులు, సిబ్బంది ట్రీట్మెంట్ విషయంలో ఎల్లవేళలా జాగరూకతతో ఉంటారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ క్యాన్సర్ పరిశోధనల కోసం భారీ విరాళం అందజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. రెండు విడతలుగా 10 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆస్పత్రి లో పరిశోధనలు అభివృద్ధికి ప్రతి పైసా వినియోగిస్తామని మాట ఇస్తున్నా. మనిషి తనని తాను అధ్యయనం చేసుకోవడం చాలా అవసరం. క్యాన్సర్ గురించి అవగాహన అవసరం. అవగాహన లేకపోవడం తో లాస్ట్ స్టేజ్ లో తెలుసుకుని చనిపోతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాము.ఆస్పత్రి విస్తరణకు కృషి చేస్తున్నాం. చికిత్స తో పాటు, పరిశోధనలు కూడా చేపడుతున్నాం. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్ గా ఆహ్వానిస్తున్నాం. కొత్తగా నిర్మించే బ్లాక్ కి క్యాన్సర్ నీ జయించిన కల్యాణి ప్రసాద్ పేరును ప్రకటిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం కోసం విరాళం అందించినందుక చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. అనంతరం అమెరికాలో ప్రముఖ ఫిలంత్రాఫిస్ట్ గా ఉన్న డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి ప్రసాద్ లను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ సన్మానించారు.

రీ – రిలీజ్ కు రెడీ అయిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది. శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సింగీతం దర్శక నైపుణ్యం, ఎస్. పి బాల సుబ్రహ్మణ్యం గాత్రం-సమర్పణ, జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా అద్భుత సంగీతం, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ప్రతీ ఒక్కరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నా , కొన్ని ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయేవి, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునేవి ఉంటాయి ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఆదిత్య 369’. రీ- రిలీజ్ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ” ఆదిత్య 369 మొదటి సారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో, ఇపుడు రీ – రిలీజ్ కి కూడా అలాగే ఉన్నాను. ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని డిజిటల్ 4K లో ఇంకా అద్భుతంగా తీర్చదిద్దాము. అన్ని వయసుల, వర్గాల ప్రేక్షకులని, నందమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది వేసింది ‘ఆదిత్య 369’. ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.