NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దుర్గగుడిలో నాసిరకం సరుకులు..! సర్కార్ సీరియస్
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలోనాసిరకం సరుకుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ సీరియస్ అయ్యింది.. నాసిరకం సరుకుల వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టింది దేవాదాయ శాఖ.. 2 రోజుల తనిఖీల్లో 15 లక్షల విలువైన నాసిరకం సరుకులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధం చేస్తున్నారు అధికారులు.. FSSAI ప్రమాణాలకు దూరంగా సరుకు వస్తుంటే అధికారులు గుర్తించక పోవటంపై రిపోర్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.. అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో ఎప్పటి నుంచి ఉద్యోగులు.. సిబ్బంది విధుల్లో ఉన్నారు, ఎన్నిసార్లు నాసిరికం గుర్తించారు.. వాటిని ఎన్నిసార్లు వెనక్కి పంపించారు.. ఇలా అనే విషయాలతో సమగ్ర విచారణ చేపడుతున్నారు.. ఆ దిశగా నివేదిక సిద్ధం చేస్తున్నారట.. నాసిరకం సరుకులు వస్తుంటే అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీ విభాగాల్లో ఉద్యోగులు గుర్తించకపోవడంపై సీరియస్‌ అయ్యింది ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధం చేయనున్నారట అధికారులు.. ఇప్పటికే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా.. ఇదే సమయంలో దుర్గగుడిపై కూడా ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

కడప వైసీపీలో కలవరం..! కూటమి వైపు కార్పొరేటర్ల క్యూ..
వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు. దీంతో కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలు.. కడప కార్పొరేషన్ లో విలీనం అయ్యాయి. ఆనాటి నుండి కడప ఎమ్మెల్యే తో పాటు కమలాపురం ఎమ్మెల్యేకి సంబంధించిన నేతలు కార్పొరేటర్లుగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రధానంగా కడప అసెంబ్లీ మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. కడప ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి. 2004 నుంచి ఇప్పటివరకు కడప అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. 20 సంవత్సరాలు తర్వాత మొదటిసారిగా కడప, కమలాపురం రెండు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారం చేపట్టడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టి కడప కార్పొరేషన్ పై పడిందట. గత 20 సంవత్సరాలుగా వైసీపీ కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ పై తమ ఆధిపత్యం చెలాయించడం కోసం వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి రావడానికి ఆ ఇద్దరు నేతలు ద్వారా తెరిచారట. కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. వాటిలో ఒక్క డివిజన్‌లో మాత్రమే టీడీపీ కార్పొరేటర్‌.. మిగతా 49 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. కరోనాకాలంలో ఒక్క కార్పొరేటర్ మృతి చెందారు. మేయర్ తో సహా 48 మంది కార్పొరేటర్లు వైసీపీకి చెందిన వారే.

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. మూత్రనాళం తొలగింపు..!
ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడి నిర్వాకం కలకలం సృష్టిస్తోంది.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. ఏ కంగా మూత్రనాళం తొలగించాడు వైద్యుడు.. అయితే, మూత్రం రాకపోవడంతో.. ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి చేరిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది.. గర్భసంచిలో సమస్య ఉందని… తన ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని సూచించాడు ప్రభుత్వ డాక్టర్ రమణ నాయక్.. దీంతో.. ఈ నెల 9వ తేదీన రమణ నాయక్ కు చెందిన లావణ్య ఆసుపత్రిలో రాధమ్మకు ఆపరేషన్ చేశారు.. అదేరోజు డిశ్చార్జ్ కూడా చేశారు.. అయితే, డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు కూడా మూత్రం రాకపోవడంతో తిరిగి రమణ నాయక్ ఆసుపత్రికి వచ్చింది బాధితురాలు రాధమ్మ .. తప్పు జరిగిందని తెలుసుకుని.. అసలు విషయం చెప్పకుండా.. బాధితురాలు రాధమ్మను వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించిన వైద్యుడు.. వేరే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాక.. రెండు రోజులుగా మూత్రం రాక.. కిడ్నీ వాపుతో బాధపడుతున్న రాధమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది.. గర్భసంచి ఆపరేషన్ కు బదులు.. మూత్ర నాళం తొలగించారన్న విషయం బయటపడింది.. దీంతో బాధితురాలి బంధువులు లావణ్య హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ రమణ నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

రాముడి గుడి రథం దహనం కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..
అనంతపురం జిల్లాలో రథం దహనం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు.‌ దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.‌ సొంత ఖర్చులతో రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తి శ్రీరాముని రథం చేయించారని.. ఆయనకు మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు రథానికి నిప్పు పెట్టారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు.

భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై విమర్శలు వచ్చాయి.. పర్యావరణ ప్రేమికులు ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు.. అయితే, దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో పిల్ (WP(PIL) 155/2024) దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్.. దీనిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1, జోన్-3 మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోనికి వస్తుందని పేర్కొంది.. సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు పొందకుండా నేరెళ్ల వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం:49/1)లో ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివ్ బిల్డింగు సొసైటీ పనులు చేస్తోందని.. తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) పరధిలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలు (కొండలు) తవ్వకాలు జరిపారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకొని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీకి మరియు ఇతర సంబంధిత శాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు..

రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు.. బిల్లులు రాక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారు.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు అని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనని పలకరించిన నాథుడే లేడు.. అడ్డదారులు తొక్కి అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చారు.. సర్పంచుల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. దసరాలోపు పెండింగ్ బిల్ల్స్ క్లియర్ చేయాలని ఈటల రాజేందర్ అన్నారు. లేకుంటే మిమ్మల్ని ఎక్కడికి అక్కడ అడ్డుకునేందుకు సర్పంచులు సిద్దంగా ఉన్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సర్పంచుల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తాం.. సర్పంచ్ ల పదవి కాలం పూర్తయ్యి ఏడు నెలలు దాటినా ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. పాలక మండలి లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతుంది.. రేవంత్ గ్రామాలను వల్లకాడుగా మార్చారు.. వెంటనే రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచు ఎన్నికలు జరపాలి అని కోరారు.

దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కాలనేది కాంగ్రెస్ అజెండా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కలనేది కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకుంటుంది.. కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారు.. కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఇక, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తేలిపోయింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. హర్యానాలో ఏడు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది అని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పేదల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలను కుల మతాలకు అతీతంగా మోడీ అమలు పరుస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే రాజీనామా చేశా..
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశాను అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నాను.. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయ బద్ద వాటా వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా కమిట్మెంట్ ను గుర్తించి నాకు రాజ్యసభ ఇచ్చారు.. రాజ్యాధికారంలో వాటా బీసీలకు దక్కాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.. పార్టీ రహితంగా ఉద్యమం నడపాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక, దేశ వ్యాప్తంగా బీసీలకు తగిన న్యాయం జరగాలి అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. చట్ట సభల్లో ప్రతినిధులము కావాలి.. సామాజిక న్యాయం కోసం జగన్ నాకు ఎంపి పదవి ఇచ్చారు.. తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంటే అది ఇతర రాష్ట్రాల మీద పడుతుంది.. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి.. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడం నా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో బీసీ నేతలు పార్టీలు పెట్టారు.. వివిధ కారణాలతో సక్సెస్ కాలేక పోయారు.. ఇప్పుడు పార్టీ పెట్టడానికి సరైన సమయం.. రాజకీయ పార్టీ పెట్టాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి వస్తుంది అని కృష్ణయ్య అన్నారు.

పబ్లిసిటీ స్టంట్తో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడప లేరు..
మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది.. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది.. 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మించామని ఆయన అన్నారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు.. లక్ష 50 వేల కోట్లు.. 70 వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు.. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇక, సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణ.. ప్రభుత్వం ప్రస్తుతం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు.. పబ్లిసిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకై‌న నగరం హైదరాబాద్.. STPలు కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీలో నిర్మించిన అన్ని ఎస్టీపీలను సందర్శిస్రాం.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

హైకోర్టు షాక్.. సిద్ధరామయ్య సీఎం కుర్చీ కదులుతుందా ?
ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు పెరుగుతున్నాయి. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పు అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎలాంటి విచారణకైనా వెనుకాడబోమని, న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. నా రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ప్రాసిక్యూషన్‌ను గవర్నర్ ఆమోదించారు. నేను హైకోర్టులో దానిపై ప్రశ్నలు లేవనెత్తానని తెలిపారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు, నేతలు సిద్ధరామయ్యకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి తప్పేమీ లేదని, విచారణ తర్వాత కూడా ఆయన క్లీన్‌గా ఉంటారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. పిటిషన్‌ తిరస్కరణకు గురవ్వడంతో సీఎం, డిప్యూటీ సీఎం శివకుమార్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎం అధికారిక నివాసానికి సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. ఇప్పుడు సీఎంకు న్యాయపరమైన అవకాశాలు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి దోషి అని ఏమీ చెప్పలేదు లేదా అలా సూచించే నివేదికలు లేవు. అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలని కోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో ముఖ్యమంత్రికి రెండు న్యాయపరమైన అవకాశాలు మిగిలి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కర్నాటక హైకోర్టులో ఇంట్రా-కోర్టు అప్పీల్ దాఖలు చేసి, డివిజన్ బెంచ్ ద్వారా కేసును విచారించడం మొదటి ఎంపిక. సుప్రీం కోర్టులో SLP (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడం రెండవ ఎంపిక. కర్ణాటక హైకోర్టు నిర్ణయం ప్రకారం.. దర్యాప్తును అనుమతించాలన్న గవర్నర్ నిర్ణయం స్వతంత్రమైనది.. ఇది అతని అధికారంలో ఉంది. దీంతో సిద్ధరామయ్యపై విచారణ ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

ఈ రెండు దేశాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి. త్వరలో ఇది ఆఫ్రికా , దక్షిణ అమెరికాలో కూడా ప్రారంభమవుతుంది. UPI వంటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి NPCI విదేశీ కంపెనీ NIPLతో పెరూ, నమీబియా కేంద్ర బ్యాంకులతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అనేక దేశాలకు UPI బ్లూప్రింట్లను ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని NIPL CEO రితేష్ శుక్లా తెలిపారు. అలాగే, 2027లో పెరూ, నమీబియాలో UPIని ప్రారంభించవచ్చు. NPCI అనేది దేశంలో రిటైల్ చెల్లింపు వ్యవస్థ యొక్క నియంత్రణ సంస్థ. ఇది దేశంలో UPIని అమలు చేస్తుంది. ఆగస్టులో 15 బిలియన్ల UPI లావాదేవీలు జరిగాయి. భారతదేశ UPIని విదేశాలకు తీసుకెళ్లేందుకు NPCI.. NIPLని ఏర్పాటు చేసింది. NIPL ప్రస్తుతం UPIకి సంబంధించి ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని 20 దేశాలతో చర్చలు జరుపుతోంది. పెరూ, నమీబియా సెంట్రల్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదిరింది. ఈ బ్యాంకులు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో తమ UPI లాంటి సిస్టమ్‌ను ప్రారంభించవచ్చు.

ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్ పేర్లు.. కష్టమే సుమీ!
అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్‌ను చండీగఢ్‌తో ఆడనుంది. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్ నవ్‌దీప్‌ సైనీ కూడా చోటు దక్కించుకున్నాడు. గత సీజన్‌లో ఆడిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఈసారి చోటు దక్కలేదు. ఢిల్లీ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు సెప్టెంబర్ 26న ఫిట్‌నెస్ పరీక్షలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న క్రికెటర్లకు ఫిట్‌నెస్ టెస్టు నుంచి మినహాయింపు ఉంది. అంటే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇద్దరు ఢిల్లీ జట్టులో ఉన్నా.. రంజీ ట్రోఫీలో ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఉంది. కోహ్లీ, పంత్‌లు తుది జట్టులో ఉంటారు. ఈ సిరీస్‌ అనంతరం కొద్దిరోజులకే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్య ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగడం సాధ్యం కాదు.

దేవర నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్..
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి అధిక ధరలకు టికెట్స్ అమ్మెందుకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆంధ్రలో మొదటి 14 రోజులు అధిక ధరకు అమ్మేలా జీవో ఇచ్చింది. సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవరకు 14 రోజులు పాటు అధిక టికెట్ ధరకు టికెట్స్ అమ్ముకునేలా జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ  ఏపీ హై కోర్టులో పిల్ దాఖలైంది.  ఆ పిల్ పై  విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని   పిటిషనర్ వాదనలు వినిపించాడు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది దేవర నిర్మాతలకు షాక్ తగిలిందనే చెప్పాలి. కాగా తెలంగాణాలో మొదటి రోజు మాత్రం ఒకరేటు, మిగిలిన 9 రోజులు మరొక రేట్ కు టికెట్ ధరలు నిర్ణయించింది. అయితే రెండవ రోజు నుండి ఇచ్చిన రేట్స్ ను మరి కొంత పెంచమని తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మతలు మరోసారి దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు.

మంచు పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లి లోని ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుండి  గణేశ్‌ కనిపించకుండా పోయాడు. దీంతో గణేష్ ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తు‌తో  గణేష్ పాయిపోయినట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కాగా ఇదివరకు ఫిల్మ్ నగర్ నగర్ లోని ఇంట్లో కూతురు మంచు లక్ష్మితో కలిసి ఉండేవారు మోహన్ బాబు.  కొంత కాలంగా జల్‌పల్లి లోని ఇంట్లోకి మారారు. తమకు నమ్మకమైన వ్యక్తిని తమ దగ్గర పని చేసేందుకు పెట్టుకున్నారు మోహన్ బాబు.  నమ్మకంగా ఉంటూనే మోహన్ బాబు సొమ్ము నొక్కేసేందుకు స్కెచ్ వేసాడు గణేష్. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో నుండి పది లక్షల రూపాయలు చోరీ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు గణేష్. గణేష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చి చూడగా పది లక్షలు రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు.  నిందితుడి కోసం గాలించిన పోలీసులు తిరుపతిలో గణేష్ ను అరెస్ట్ చేసారు.