Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కర్నూలు జీజీహెచ్‌లోనే 19 మృతదేహాలు.. బంధువులకు అప్పగింత మరింత ఆలస్యం..!
కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. అయితే ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న వాళ్లు నిద్రలోనే సజీవదహనం అయ్యారు.. దీంతో, ఏది ఎవరి మృతదేహం అని గుర్తించడమే సవాల్ గా మారిపోయింది.. మాంసపు ముద్దలుగా మారిపోవడంతో.. మృతదేహాలను గుర్తించే పనిలో పడిపోయారు వైద్యులు.. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్‌లోనే ఉన్నాయి 19 మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు.. 19 మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించారు.. ఇప్పటికే 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు.. డీఎన్‌ఏ శాంపిల్స్‌ను మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.. ఇవాళ మరికొన్ని మృతదేహలకు సంబంధించి బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించనున్నారు.. అయితే, ఈ ప్రాసెస్‌ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో.. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు..

బస్సు డ్రైవర్‌ అరెస్ట్.. నకిలీ సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్..!
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. అయితే, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. అయితే, లక్ష్మయ్య నకిలీ సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్‌ పొందినట్టు గుర్తించారు పోలీసులు.. 5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందాడట లక్ష్మయ్య.. ఇక, ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా ఒప్పిచర్లగా గుర్తించారు.. నకిలీ సర్టిఫికెట్లతో హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన లక్ష్మయ్య. కావేరీ ట్రావెల్స్‌లో చేరి.. ప్రమాదానికి గురైన బస్సును నడిపాడు.. కాగా, కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌తో పాటు 19 మంది ప్రయాణికులు మృతిచెందారు.. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్‌లోనే ఉన్నాయి 19 మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు.. 19 మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించారు.. ఇప్పటికే 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు.. డీఎన్‌ఏ శాంపిల్స్‌ను మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.. ఇవాళ మరికొన్ని మృతదేహలకు సంబంధించి బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించనున్నారు.. అయితే, ఈ ప్రాసెస్‌ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో.. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌ వీడియో వైరల్..
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బైక్‌ను బస్సు ఢీకొనడం.. కొంత దూరం అలాగే లాక్కెళ్లడంతో.. బైక్‌లో మంటలు.. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే ప్రమాదానికి గురైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు.. ఫేక్‌ సర్టిఫికెట్లతో హెవీ వెహికల్ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు.. మరోవైపు.. ఇప్పుడు బైకర్‌ శివశంకర్ వీడియో వైరల్‌ అవుతోంది.. ఈ ప్రమాదానికి ముందు స్థానికంగా ఉన్న పెట్రోల్‌ బంక్‌లోకి బైక్‌పై శివశంకర్‌ వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది.. పెట్రోల్‌ కొట్టించుకునేందుకు పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు శివశంకర్‌.. అతడితోపాటు మరో యువకుడు బైక్‌ వెనకాల ఉన్నాడు.. అయితే, తిరిగి పెట్రోల్ బంక్‌ నుంచి వెళ్లిపోతున్న సమయంలో మాత్రం శివశంకర్‌ ఒకడే బైక్‌పై ఉన్నాడు. అంతేకాదు. ఆ సమయంలో శివశంకర్‌ మద్యం మత్తులో ఉన్నట్లుగా దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది.. పెట్రోల్ బంక్‌ నుంచి బైక్‌పై వెళ్తోన్న సమయంలో.. బైక్‌పై ఉన్న శివశంకర్‌ తూలినట్టు.. ఆ బైక్‌ కూడా స్కిడ్‌ అయినట్టు కనిపిస్తోంది.. ఆ తర్వాత బైక్ హైవే మీదకు రావడం.. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు.. ఈ ప్రమాదంలో బస్సులో 19 మంది సజీవదహనం కాగా.. శివశంకర్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే..

విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ విద్యా విధానంలో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యా విధానంలో మార్పులతో పాటు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.. అలాగే, ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేసినట్లు ప్రకటించారు. 12 సంవత్సరాల తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బొటనీ, జువాలాజీలో సిలబస్ లో మార్పులు జరిగాయని ప్రకటించారు. హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ఏప్రిల్ మొదటి వారంలో బుక్స్ అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. అలాగే, కొత్త కోర్స్( HEC, CEC లాగానే) ACE కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ లో ఉన్నట్టు గానే మిగతా లాంగ్వేజెస్ లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇకపై 80 మార్కులు ఎక్స్‌టర్నల్‌, 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులుగా ఉంటాయన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్‌ ప్రతి సంవత్సరం 15 మార్కుల చొప్పున నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు మృతి
హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ సందర్భంగా కృష్ణ కారు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక, స్థానికులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించినా, మితిమీరిన వేగంతో డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
మహారాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి (26) ఆత్మహత్య సంచలనంగా మారింది. సతారా జిల్లా ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ రాసిపెట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. ఐదు నెలల్లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. ఇక సూసైడ్ నోట్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఎంపీ, అతడి సహాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయని ఆరోపించింది. ఇక వైద్య పరీక్షలకు తీసుకురాకుండానే నిందితులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ పోలీసులు పదేపదే తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. అందుకు నిరాకరించడంతో ఎస్‌ఐ గోపాల్‌ బడ్నేతో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. ఇక ఎస్‌ఐ గోపాల్‌ బడ్నే తనపై ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని.. పైగా మానసికంగా, శారీరకంగా హింసించాడని వాపోయింది. ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్‌ బంకర్‌పై కూడా ఇవే రకమైన ఆరోపణలు వైద్యురాలు చేసింది.

ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
ఒసామా బిన్ లాడెన్.. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మరిచిపోలేని పేరు. 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిగించిన మారణహోమంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన లాడెన్ కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి. ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత అనగా 2011, మే 2 అర్ధరాత్రి పాకిస్థాన్‌లో లాడెన్‌ను అమెరికా దళాలు అంతమొందించాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక విషయాలను 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్‌లో పని చేసిన మాజీ అధికారి జాన్ కిరియాకౌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సెప్టెంబర్ 11, 2001లో 19 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై నాలుగు జట్లుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 3,000 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద చర్య. ప్రపంచ దేశాలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఇంత ఆదరణ రావడానికి కారణం భారత్..
క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు. టీమిండియా క్రికెట్ వాణిజ్య కేంద్రంగా మారడమే కాదు, ఆట పట్ల అసమానమైన అంకిత భావాన్ని కూడా సంపాదించుకుందన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో బ్రెట్‌ లీ మాట్లాడుతూ.. తన వాదనకు బలం చేకూరేలా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో పరిమితులు ఉంటాయని తెలిపాడు. అయితే, ఆస్ట్రేలియాలో ఎంత ప్రచారం చేసినా భారీ స్థాయిలో క్రికెట్‌కు ఫ్యాన్స్ ఉండరని బ్రెట్‌లీ చెప్పుకొచ్చారు. ఇక భారత్‌లో అయితే ఆ సంఖ్య కోట్లలో ఉందన్నారు. 150 కోట్ల మంది భారతీయుల్లో క్రికెట్ ఇష్టపడని వ్యక్తులను నేను ఓ 10 మందిని కలిసి ఉంటాను.. ఇప్పుడు టీ20లను వీక్షించే వారి సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోయింది. పేరెంట్స్ ధోరణి కాస్త స్లోగా ఉంటే.. పిల్లలు మాత్రం త్వరగా విషయాలు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే, టీ20 ఫార్మాట్‌కు ఇంత ఆదరణ పెరిగిందని ఈ మాజీ పేసర్ పేర్కొన్నాడు. బ్రెజిల్‌ లాంటి దేశాల్లో ఫుట్‌బాల్‌ ఆటకు ముగింపు పలికే రోజు వస్తుందేమో కానీ.. భారత్‌లో క్రికెట్‌కు ఆ పరిస్థితి ఏ రోజు రాదు.. భారతీయుల వల్లే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ కొనసాగుతుంది.. అక్కడి అభిమానులకు ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇది సాధ్యమైందని బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు.

హిట్ అండ్ రన్ కేసు.. బిగ్‌బాస్ బ్యూటీపై కేసు
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బిగ్ బాస్‌ బ్యూటీపై కేసు నమోదైంది.. కన్నడ బిగ్ బాస్ ద్వారా కర్ణాటకలో బాగా ఫేమస్‌ అయిన నటి దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు.. బెంగుళూరులో యాక్సిడెంట్‌ చేసి పరారైన దివ్య సురేషపై హిట్ అండ్ రన్‌ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.. ఓ బైక్‎ను ఢీకొట్టిన కారు.. ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్‎పై వెళ్తున్న మహిళ తీవ్రగాయాలపాలయ్యారు.. ఆ బైక్‌పై ఉన్న అనూష, కిరణ్‌కు స్వల్పగాయాలు అయ్యాయి.. అయితే, కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారు నంబర్‌ను కనుగొని ఆ కారు నటి దివ్య సురేష్‎దిగా గుర్తించారు.. దీంతో, దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.. అంతేకాదు, ఆమె కారును కూడా పోలీసులు సీజ్‌ చేయడం.. మళ్లీ ఆమె తన కారును విడిపించుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటన సోషల్ మీడియాలో వేదికగా విమర్శలు వస్తున్నాయి.. నటి ది్య సురేష్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు.. అయితే, ఈ కేసులో దివ్య సురేష్‌ను బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు..

మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ మాస్ ఎంట్రీకి రెడీ!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ జాతర నుంచి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 27న (సోమవారం) విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్లు వేగంగా జోరందుకున్నాయి. ఇక ‘మాస్ జాతర’ లో రవితేజ ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. భానుభోగవరపు రైటింగ్ స్టైల్‌కి అనుగుణంగా మాస్, ఎమోషన్, కామెడీ అన్నీ కలగలిపిన పకడ్బందీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పంచ్ డైలాగులు, రవితేజ ఎనర్జీ – ఇవన్నీ కలగలిపి సినిమాను మాస్ ఫెస్టివల్‌గా మార్చేలా ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. ఇక ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. రవితేజ కెరీర్‌లో మరో పకా మాస్ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి.

Exit mobile version