NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దాచేప‌ల్లిలో డ‌యేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..
పల్నాడు జిల్లా దాచేప‌ల్లిలో డ‌యేరియా ప‌రిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి నారాయ‌ణ‌.. ప‌ల్నాడు జిల్లా క‌లెక్టర్ తో పాటు ఇత‌ర అధికారుల‌తో మాట్లాడారు మంత్రి.. అయితే, ప్రస్తుతం దాచేప‌ల్లిలో డ‌యేరియా అదుపులోనే ఉంద‌ని కలెక్టర్‌ వివరించారు.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేద‌ని వెల్లడించారు.. ఇక, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యాధికారులు తెలియజేశారు.. స్థానికంగా ఉన్న బోర్లను మూసివేసి ట్యాంక‌ర్ల ద్వారా మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు దాచేపల్లి న‌గ‌ర‌పంచాయ‌తీ అధికారులు.

చిరుత మృతి కేసులో పురోగతి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు..
చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, వారి నుంచి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు డీఎఫ్‌వో భరణి.. తాళ్తమడుగు గ్రామం వెతలచేను అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను చంపడానికి పొలం వద్ద విద్యుత్‌ తీగలను అమర్చినట్లు గుర్తించామని వెల్లడించారు.. అయితే, అడవి జంతువులను వేటాడడానికి వేసిన అక్రమ విద్యుత్ వైర్ల ఉచ్చులో పడి చిరుత దెబ్బతిని అచేతన స్థితిలోకి వెళ్లిపోయిందని.. ఆ తర్వాత పులిని హింసించి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి అయ్యిందన్నారు.. చిరుతను చంపిన కేసులో బంగారుపాళ్యం వెలుతురుచేనుకు చెందిని ఇద్దరు సహా ఐదుగురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశాం.. వారి వద్ద నుంచి చిరుత పులి కాళ్లు, గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎఫ్‌వో భరణి.. అయితే, ఈ కేసులో విచారణ పూర్తి అయిన తర్వాత మొత్తం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.. ఎవరైనా వన్యప్రాణులను చంపడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎఫ్‌వో..

హనీట్రాప్ కేసు.. పోలీసుల కస్టడీలో నోరుమెదపని కిలాడీ లేడి..!
సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు… అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు… అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.. ఫారెస్ట్ అధికారితో కిలాడీ లేడీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.. ఇక, హనీట్రాప్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఠా కీలక సభ్యుడు వేముల కిషోర్ ను అరెస్ట్ చేసి.. పోలీసులు కస్టడీ లోకి తీసుకొని క్రాస్ ఎగ్జామింగ్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం..

ప్రధాని మోడీకి ధన్యవాదాలు.. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని చేసి చూపిస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు.. 55 కిలో మీటర్ల ఈ రైల్వే లైన్ ఉంటుంది.. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని అని చెప్పి, ఆ మాటకే కట్టుబడి వున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.. కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌లకు కేంద్రం సహకారం అందించింది.. పోలవరానికి కూడా కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఏపీ కూడా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ చెబుతారని.. సాధ్యమైనంత త్వరగా అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తాం అన్నారు పురంధేశ్వరి.. కాగా, అమరావతికి 57 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు.. గురువారం రోజు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించిన విషయం విదితమే.. రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు గ్నీన్‌ సిగ్నల్‌ వచ్చిందని.. హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఉచిత సిలిండర్ల పథకం.. షరతులు ఇవే..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూపర్‌ సిక్క్‌లో భాగంగా మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు.. ఈ పథకంలో అమలులో అర్హతలు.. దరఖాస్తు.. మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేయగా.. ఈ రోజు మరింత క్లారిటీ ఇచ్చారు మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్.. సూపర్ సిక్స్ లో ప్రధానమైనది ౩ ఉచిత సిలిండర్ల పథకాన్ని ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం అన్నారు.. 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు లాభం కలిగిందుకు ఈ ఆలోచన చేశాం.. అక్టోబర్ 31న మొదటి డెలివరీ రోజు.. ఖాళీ సిలిండర్, LPG కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని.. ఈనెల 29 నుంచీ బుకింగ్స్‌ చేసుకోవచ్చు అని వివరించారు. ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఒక మెసేజ్ వెళ్తుంది.. పట్టణాలలో 24 గంటలలోపు, గ్రామాలలో 48 గంటలలోపు సిలిండర్ డెలివరీ అవుతుందని.. సిలిండర్ డెలివరీ చేసిన‌ 48 గంటలలోపు సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు వస్తుందన్నారు మంత్రి మనోహర్‌.. 29న ఆయిల్ కంపెనీలకి మొదటి చెక్ ఇస్తున్నాం.. ఈ పథనానికి రూ.2,674 కోట్లు ప్రాథమికంగా ప్రభుత్వానికి ఖర్చు అవుతుందన్నారు.. డెలివరీ, బుకింగ్ సమస్యలకు 1967 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్న ఆయన.. మొత్తం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం అని స్పష్టం చేశారు.. లబ్ధిదారుల సంఖ్య పెంచడానికే మేం ప్రయత్నం చేస్తున్నాం.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి అందించే విధంగా పని చేస్తున్నాం అన్నారు.. 1.47 కోట్ల రేషన్ కార్డులు మా రికార్డులు ఉంటాయి.. ప్రధానమంత్రి ఉజ్వల నుంచీ వచ్చేది 9.8 లక్షలే.. 3 నుంచీ 5 సిలిండర్లు ప్రతీ ఇంట్లో సంవత్సరానికి వినియోగం ఉంటుందని తెలిసిందన్నారు.

బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం..
గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన The southern Rising Summit 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందన్నారు. పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామనిత తెలిపారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? అని సీఎం ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతానికి చెందిన రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు, రచయితలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

అమీర్ పేట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. ఎక్స్పైర్ అయినా సర్టిఫికెట్స్ తో..
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అమీర్ పేట్ లోని పలు స్వీట్ షాప్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ వాసిరెడ్డి ఫుడ్స్, విన్నూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఫైర్ అయ్యారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని ఇలాంటివి ప్రజలకు ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ కూడా చేయించుకోలేదని యాజమాన్యం పై మండిపడ్డారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. షాప్‌ సీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. షాప్‌ యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా షాప్ లను కొనసాగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పండుగ రానున్న సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. స్వీట్ షాపుల్లో ఎక్కడ చూసిన ఎక్స్ పైర్ అయిన ఫుడ్ గుర్తుస్తున్నట్లు తెలిపారు. షాప్ యాజమాన్యం ఫుడ్ పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయినా ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ను ఇలాగే కొనసాగిస్తే షాప్ లను సీజ్ చేసి, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

‘డొనాల్డ్ ట్రంప్ ముప్పు’ అంటూ 23 మంది నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్తల లేఖలు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 23 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తల మద్దతు లభించింది. ఈ ఆర్థికవేత్తలు కమలా హారిస్‌ను ఉద్దేశించి లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థపై కమలా హారిస్ విధానాలను 228 పదాల లేఖలో ఆర్థికవేత్తలు ప్రశంసించారు. కమలా హారిస్ విధానాలు చాలా బాగున్నాయన్నారు. జూన్ నెల ప్రారంభంలో, 15 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తలు అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రశంసించారు. కమలా హారిస్‌ను ప్రశంసించిన ఆర్థికవేత్తలు ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు సైమన్ జాన్సన్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారన్ అసెమోగ్లులు కూడా ఉన్నారు. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందు, కమలా హారిస్‌కు ఈ నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తల మద్దతు ఉంది. ఆర్థిక విధానాలపై మనందరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు లేఖలో రాశారు. అయితే ట్రంప్ కంటే కమలా హారిస్ ఆర్థిక ఎజెండా మెరుగ్గా ఉందని మేము నమ్ముతున్నామని.. ఇది మన దేశ ఆరోగ్యం, పెట్టుబడులు, స్థిరత్వం, స్థితిస్థాపకత, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని వారు పేర్కొన్నారు. ఆర్థిక విధానాలపై మనందరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు లేఖలో రాశారు.

ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులే ఎక్కువ..
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పని చేసిన సీనియర్‌ దౌత్యాధికారి సంజయ్‌ వర్మ ఆరోపణలు చేశారు. రాజకీయ కారణాలతో వారికి ట్రూడో సర్కార్ రక్షణ కల్పిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ప్రధాని ట్రూడో‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ వర్మ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నారు. భారత్‌ పట్ల కెనడా వ్యవహరించిన తీరు ఏమాత్రం పద్దతిగా లేదన్నారు. అంతేకాదు, భారత్‌కు వెన్నుపోటు పొడిచిందన్నారు. 26 మంది వేర్పాటువాదులు, గ్యాంగస్టర్ల అప్పగింతపై ట్రూడో ప్రభుత్వాన్ని పదే పదే అభ్యర్థించిన పట్టించుకోలేదన్నారు. ఇక, కెనడాది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలు.. మీకు ఒక చట్టం వర్తిస్తుంది.. మాకు మరొక చట్టం వర్తిస్తుంది అనేలా వ్యవహరిస్తుందని సంజయ్ వర్మ పేర్కొన్నారు.

భారీగా లోకల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2024న మొదలైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Unionbankofindia.co.inలో వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24, 2024న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 13, 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1500 మంది అధికారులు నియమించబడతారు, అభ్యర్థులు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. బ్యాంకు అధికారుల ప్రకటించిన ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లో అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, విద్యార్హత, ఇతర ముఖ్యమైన సమాచారం ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవడానికి Unionbankofindia.co.in పై క్లిక్ చేసి చూడండి.

384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!
చిన్న సినిమాగా విడుదలైన ’35 చిన్న కథ కాదు’ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు ఐఎఫ్ఎఫ్ఐ 55వ ఈవెంట్‌ జరగనుంది. ఇందులో మొత్తం 25 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం 384 చిత్రాలు ఎంట్రీ చేయగా.. తెలుగు నుంచి 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఈ విషయాన్ని పోస్ట్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది. ఇది తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణమని పేర్కొంది. ఇండియన్‌ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

రాజమౌళిని మించిపోయే విధంగా తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై 1000 కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇండియాలోనే హైయెస్ట్ థియాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డులకెక్కింది. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్ బజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగానే ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కంప్లీట్ గా అల్లు అర్జున్ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోయే సినిమాపై ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అన్నాడు. రాజమౌళి మూవీస్ విషయంలో చాలా హైట్స్ చూపించారు. అయితే రాజమౌళి గారు టచ్ చేయని జోనర్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఉండబోతోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఫ్రీ అయిపోతే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే మార్చి నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేసిన వరల్డ్ ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. అలాగే ఆ విజువల్ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!
బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా ‘అమరన్‌’. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కమల్ హాసన్‌ నిర్మించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న అమరన్‌ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.