NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీలో నామినేటేడ్ పోస్టుల భర్తీ.. కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నేతలు చాలా మంది నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్‌ చెబుతూ.. వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం.. ఇక, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 20 కొర్పొరేషన్లకు ఛైర్మన్‌లను ఏపీ ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించగా.. అందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి..

కనకదుర్గమ్మ ఆలయ శుద్ధిలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. సంచలన వ్యాఖ్యలు..
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.. దుర్గమ్మ టెంపుల్ మెట్లను స్వయంగా శుభ్రం చేసిన పవన్‌.. ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు.. ఇక, అమ్మవారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు.. మేం రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం.. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదు.. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారు అని మండిపడ్డారు.. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా? లేదా నాకు తెలీదు.. వైఎస్‌ జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు.. మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలి అని డిమాండ్‌ చేవారు. రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నాం మేం.. సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలి అన్నారు పవన్‌ కల్యాణ్.. సాటి హిందువులు.. తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అన్నారు.. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా..? హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించారు.. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు… తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా..? అంటూ మండిపడ్డారు.. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా..? అని నిలదీశారు.. మరోవైపు.. ప్రకాష్ రాజ్ కూడా చెపుతున్నా… సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు అని సూచించారు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ, ఆయన సరిగా మాట్లాడాలన్నారు.. సనాతన ధర్మంపై దాడి జరిగినపుడు మాట్లాడకూడదా? ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు‌. మాకు ఇదంతా చాలా బాధ అని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌..

భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి… ఇక ఆయనే చూసుకుంటారు..
మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనే బాధ.. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోనున్న వేళ.. ట్విట్టర్‌ (ఎక్స్‌)లో స్పందించిన ఆయన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే, ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే జగన్ తిరుమల ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. జగన్‌కు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా.. కానీ, సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు.. అది అడిగితే బూతులు తిట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రథం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుందని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని పేర్కొన్నారు.. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్ట్‌ కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం.. అంటూ ట్వీట్‌చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అనంతపురం జిల్లాలో రథం దగ్ధంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కనేకల్ మండలం హనకనహల్ లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధం అయిన ఘటనను తీవ్రంగా ఖండించారు సీఎం చంద్రబాబు.. అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.. అయితే, అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు తెలిపిన జిల్లా అధికారులు.. దీంతో.. ఘటన పై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.. ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు. నిందితులని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు..

కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు.. లడ్డూ వ్యవహారం వీధుల్లోకి వద్దు..!
తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి‌‌.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు‌‌..? తక్కువ రేటుకు నెయ్యి వస్తుందని.. లడ్డూలో ఎక్కడలేని దరిద్రాలు కలిపి తినమని చేబుతారా‌‌‌‌..? బుద్దిలేదా? అని ఫైర్‌ అయ్యారు.. తిరుమల నెయ్యి టెండర్లను రివర్స్‌లో చేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు నారాయణ.. దానివల్ల కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్టు వచ్చింది.. నెయ్యి విషయంలో ఎలాంటి అలోచన లేకుండా వైసీపీ టెండర్లు ఇచ్చింది.. లోపం దొరికింది కాబట్టి చంద్రబాబు బయటపెట్టారని తెలిపారు.. జగన్ ఇసుక మాఫియాకు, ఎర్రచందనం మాఫియాకు బోర్డు సభ్యులుగా ఇచ్చాడు‌‌‌ అని విమర్శించారు.. లడ్డూ నాణ్యత అనేది వైసీపీ ప్రభుత్వంలో లేదని.. వారం రోజుల ఉండే నాణ్యత ఒక్కరోజు కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు.. విచారణ కమిటీలో అన్ని తెలుతాయి… ఇకపై వీధుల్లో లడ్డూ వ్యవహారాన్ని తీసుకుని రాకండి అని సూచించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు సనాతన ధర్మం అంటే ముందు పవన్ కల్యాణ్ పూర్తిగా చదువుకోవాలని సూచించారు.. ఇంకోవైపు.. మోడీ మన ప్రధాన మంత్రి కాదు.. ఎప్పుడు విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాలో ఉంటాడని సెటైర్లు వేశారు.. ఇక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మేం ఒప్పుకోం అని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ
తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమోదించి గవర్నర్‌కు పంపింది. ములుగు మున్సిపాలిటీ వ్యవహారం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్‌ను కోరాం. ఆదిలాబాద్ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి తెలియజేశాం. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కోరాం. ములుగులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో గవర్నర్ ఉన్నారు. దత్తత గ్రామాల జాబితాను గవర్నర్‌కు పంపామని, ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సీతక్క పేర్కొన్నారు.

అనుముల తిరుపతి రెడ్డి గారు!.. ఆ కిటుకేదో చెప్పండి..
హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికపై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎల్‌కేజీ చదువుతున్న వేదశ్రీకి పుస్తకాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు.. 50 ఏళ్ల కస్తూరి బాయి జీవనోపాధి కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది.. వారం రోజుల క్రితం గృహప్రవేశం చేసిన ఇంటికి అన్ని సాక్ష్యాలతో కాగితాలన్నీ ఉన్నా పేక మేడలా కూలగొట్టారు.. తిరుపతి రెడ్డి గారూ.. ఒక్క క్షణం కూడా టైం ఇచ్చే ప్రయోజనం లేదన్న హైడ్రా .. మీ విషయంలో నోరు మొదపలేదన్నారు. వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజులు సమయం ఇచ్చింది. కోర్టులో స్టే తెచ్చుకున్నారు.. బహుశా ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల్లో మట్టి కూడా అంటనిది బహేశా మీకు మాత్రమేనా.. బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు మీరు అవలంబించిన కిటుకు చెప్పండి అంటూ కేటీఆర్ ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్‌కౌంటర్‌!
గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ఇద్దరు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్‌ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్‌ జాహిద్‌ అలియాస్‌ సోను మృతి చెందాడు. జాహిద్‌ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు ఘాజీపుర్‌ జిల్లా ఆస్పత్రిపై వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 20న అర్ధరాత్రి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్‌లు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మద్యం స్మగ్లర్లు ఇద్దరు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. ఆపై కదులుతున్న రైలు నుంచి వారిని తోసేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. అప్పటి నుంచి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ మద్యం స్మగ్లర్.. మరోసారి మద్యంను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సోమవారం రాత్రి సమాచారం అందింది.

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు.. నేటి గోల్డ్ రేట్స్‌ ఇవే!
ఓ సమయంలో తులం బంగారం ధర రూ.75 వేలను దాటి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2024లో సుంకం తగ్గించడంతో.. ఒక్కసారిగా గోల్డ్ రేట్స్‌ పడిపోయాయి. బడ్జెట్ అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.210 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,360గా నమోదైంది. మరోవైపు పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై రూ.100 తగ్గి.. 92,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 87 వేలుగా ఉంది.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన థమన్..
మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’.  ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్  నటిషున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్  ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ చేసాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్  చివరి దశలో ఉంది. కాగా  ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.  తమన్  X ఖాతాలో ఈ సినిమా రిలీజ్ డేట్   పై క్లారిటీ  ఇచ్చాడు తమన్.  గేమ్‌ ఛేంజర్‌ ను రానున్న డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని ట్వీట్ చేసాడు తమన్ .  ఈ సినిమా గురించి అప్డేట్ తెలుపుతూ మరో పోస్ట్ చేశారు తమన్. సెప్టెంబర్ 25న గేమ్‌ ఛేంజర్‌ సెకండ్ సింగిల్  రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా  రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. IAS ఆఫీసర్ గా, పొలిటిషన్ గా రెండు పాత్రలో అలరించనున్నాడు చరణ్. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్‌ గా నటిస్తుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్‌, తమిళ నటుడు ఎస్‌.జె. సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజెర్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి  చేసి అమ్మవారి ఆలయం మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్, సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు పవన్.. లడ్డు వివాదంపై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు సమాధానంగా పవన్ మాట్లాడుతూ ” అసలు ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటి,  నేను ఏమైన ఇస్లాంని నిందించినా, లేక క్రిస్టినీయానిటీని నిందించానా, ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని, కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదన్నారు. తప్పు జరిగితే మాట్లాడకూడదా. హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడం తప్పా,  ఏం జరిగింతో తెలుసుకుని ప్రకాష్ రాజ్ మాట్లాడాలి, తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా?  సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని” ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.