Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కర్నూలులో బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు..
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో పూర్తిగా బస్సు దగ్ధమైంది.. అయితే, ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆందోళనకు గురి అవుతోన్న నేపథ్యంలో.. బాధితుల కోసం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061.. కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010 ఏర్పాటు చేశారు.. అయితే, బాధిత కుటుంబాలుపై నంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు అని సూచించారు కర్నూలు జిల్లా కలెక్టర్‌ డా.ఏ. సిరి

టీడీపీ ఏపీ అధ్యక్షుడి అపాయింట్‌మెంట్‌ కోరిన కొలికపూడి..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్‌ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ నేతలతో మాట్లాడాల్సింది ఏమీ లేదని టీడీపీ ఏపీ చీఫ్‌ పల్లా శ్రీనివాసరావుకు దుబాయ్‌ నుంచి ఫోన్‌ చేసి స్పష్టం చేశారు.. అయితే, తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇవాళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అపాయింట్‌మెంట్‌ కోరారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఇప్పటికే బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి తీవ్ర విమర్శలు చేయడం.. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావం.. టీడీపీ కార్యాలయానికి ఎవర్ని పిలవద్దని చెప్పిన తర్వాత.. ఎమ్మెల్యే కొలికపూడి అపాయింట్‌మెంట్‌ కోరవడం చర్చగా మారింది.. దీంతో ఇవాళ పల్లా శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ సమావేశంలో.. తాను ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వరుస పోస్టులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.. అయితే, ఈ వ్యవహారం ఇంలా ఎటువైపు దారి తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది..

మన ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..
మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. దాని కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా.. ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా.. వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యం అన్నారు.. రివ్యూ మీటింగుల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడున్న అధికారులకు పని భారం ఎక్కువ ఉంది.. నేను అర్థం చేసుకోగలను.. ఈ సమస్య గురించి కేబినెట్ లో కూడా ప్రస్తావించాను అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్‌ కల్యాణ్‌. ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు.. వారి భద్రత, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు పవన్‌ కల్యాణ్‌.. మనందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. ఉన్న 22 శాతంలోనే పచ్చదనం తక్కువ ఉంది దాన్ని పెంపొందించడం.. మరోటి 2047 కి 50 శాతానికి చేరుకోవడం అన్నారు.. అయితే, ఇది కష్టతరమైన విషయం, అంత తేలికైనదికాదన్నారు.. కానీ, ఎలా చేరుకోగలము అని మీతో అధికారులతో, నిపుణులతో చర్చించి ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కీలక తీర్పు..
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలాగే, A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక, 2015 నవంబర్ 15న మాజీ మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. తన అత్తమామలను దారుణంగా హత్య చేశారని తెలిపారు. న్యాయం గెలిచిందని ఆమె అన్నారు. ఈ నెల 27వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనున్నట్లు వివరించారు హేమలత..

భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి బీహార్‌లో మోడీ ప్రచారం ప్రారంభం
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్‌ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు. ప్రధాని మోడీ రెండు రోజుల పాటు బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెగుసరాయ్‌తో పాటు ఇతర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం బీహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిని ‘లత్‌బంధన్’ కూటమి (నేరస్థుల కూటమి)గా పిలిచారు. ఆ కూటమిలో ఉన్నవారంతా బెయిల్‌పై బయటకు తిరుగుతున్నవారేనని పేర్కొన్నారు. ‘‘జంగిల్ రాజ్’’ను మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని.. ఆ కాలపు అనుభవాలను యువతరానికి అందించాలని కోరారు.. ప్రతిపక్షాలు తమ తప్పును దాచడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రజలు దానిని క్షమించరన్నారు. ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడాలో.. స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు అన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, స్టార్టప్ హబ్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందని.. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని… యువత కీలక పాత్ర పోషించాలని మోడీ పేర్కొన్నారు.

ఈ నెలలో రెండు ప్రమాదాలు.. 40 మంది మృతి.. ఇంతకీ స్లీపర్‌ బస్సులో ప్రయాణం సురక్షితమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వీ.కావేరి ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం చిన్నటకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. మొదట బైక్‌ను ఢీకొన్న బస్సు.. ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం వ్యాపించింది. కొద్దిసేపటికే బస్సు మొత్తం బూడిదైంది. ఈ విషాద సంఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించినట్లు సమాచారం. పలువురి ప్రయాణికులకు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.ఈ నెలలో ఇది మొదటి ప్రమాదం కాదు. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. అక్టోబర్ 14న, రాజస్థాన్‌లోని జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై ప్రయాణిస్తున్న ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో సహా ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. గాయపడిన ఇద్దరు ప్రయాణికులు చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవలి ఈ సంఘటనలు బస్సు ప్రయాణ భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తాయి. ఇంతకీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా..? అనే ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నమవుతోంది.

ఢిల్లీలో ఆత్మాహుతి కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. వీరిద్దరూ ఆత్మాహుతి మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారని తేలింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధం ఉన్న హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలా పగడ్బందీగా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఛేదించినట్లుగా తెలుస్తోంది. పక్కా నిఘాతో భద్రతా సంస్థలు ఈ కుట్రను పసిగట్టాయి. పక్కా ప్రణాళికతో ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అనుమానితుల్లో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుంచి అరెస్టు చేయగా.. రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

పాక్‌-అఫ్గాన్‌ బోర్డర్‌ బంద్.. కిలో టమాటా రూ. 600!
పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్‌- అఫ్గాన్‌ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బోర్డర్‌ మూసివేయడం వల్ల రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఘర్షణకు ముందుతో పోలిస్తే పాక్‌లో టమాటా ధరలు 5 రెట్లు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం కిలో టమాటా ధర 600 పాక్ రూపాయలుగా అమ్ముతున్నట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్‌ ధరలు కూడా భారీగా పెరిగిపోయినట్లు టాక్. కాగా, సాధారణంగా పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దు నుంచి ఏటా 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం కొనసాగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు పెరగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలియజేశారు. దీంతో రోజుకు రెండు దేశాల్లో దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం జరుగుతున్నట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైతునట్లు చెప్పుకొచ్చారు. సరిహద్దుకు రెండు వైపులా దాదాపు 5వేల కంటైనర్లు ఆగిపోయాయని పాక్ లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఉన్న ఓ అధికారి వెల్లడించినట్లు దాయాది దేశ మీడియా వర్గాలు కథనాలు ప్రచురించింది.

ఫెవికాల్, వొడాఫోన్ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే కన్నుమూత
ప్రముఖ భారతీయ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే (70) కన్నుమూశారు. శుక్రవారం ప్రముఖ అడ్వర్టైజింగ్ లెజెండ్ పియూష్ పాండే చనిపోయినట్లుగా స్నేహితులు వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కోసం రూపొందించిన ‘‘అబ్ కీ బార్.. మోడీ సర్కార్’’ అనే నినాదం మార్మోగింది. ఈ నినాదంతో పియూష్ పాండే గుర్తింపు పొందారు. అప్పట్లో ఈ రాజకీయ నినాదం చాలా పాఫులర్ అయింది. అలాగే క్యాడ్‌బరీ ‘కుచ్ ఖాస్ హై’, ఆసియన్ పెయింట్స్ ‘హర్ ఖుషీ మే రంగ్ లే’, వొడాఫోన్ ఐకానిక్ పగ్ యాడ్ వరకు ఎన్నో యాడ్స్ గుర్తింపు పొందాయి. పాండే ఆలోచనలు భారతీయ పాప్ సంస్కృతిలో నాటుకుపోయాయి. పాండే.. ఓగిల్వీ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. 2024లో LIA లెజెండ్ అవార్డు, 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పాండేది సన్‌లైట్ డిటర్జెంట్ ప్రింట్ ప్రకటన మొదటిది. చిరస్మరణీయ వాణిజ్య రచనల్లో అమితాబ్ బచ్చన్‌తో పోలియో అవగాహన ప్రచారం, ఫెవిక్విక్ ‘‘తోడో నహిన్, జోడో’’, పాండ్స్ గూగ్లీ వూగ్లీ వూష్, వొడాఫోన్, గుజరాత్ టూరిజం కోసం ప్రచారాలు, క్యాన్సర్ పేషెంట్స్ అసోసియేషన్ కోసం ధూమపాన వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి.

పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.380 పెరగగా రూ.1, 25, 460 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 పెరగగా రూ.1, 15, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 280 పెరగగా రూ.94, 090 దగ్గర అమ్ముడవుతోంది. వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధరపై రూ.3,000 తగ్గి రూ.1, 56, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 71, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 56, 000 దగ్గర అమ్ముడవుతోంది.

బాలయ్య – గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్
బాలయ్యకు వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.  ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు. NBK111 టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  నవంబరు 7 తారీఖున ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీ అని చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్‌మెంట్ షూటింగ్ కూడా ఫినిష్ చేసాడు దర్శకుడు గోపీచంద్. టెక్నికల్ టీమ్ విషయంలోను ఈ సారి ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు మేకర్స్. ఈ సినిమాకు సీనిమాటోగ్రాఫర్ గా కాంతార కు పని చేసిన అర్వింద్ కశ్యప్ ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ వర్క్ చేయబోతున్నారు. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్ర కథ తెలిసిన కొందరు టాలీవుడ్ సిర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మరికొద్ధి రోజుల్లో బాలయ్య – గోపించంద్ ల యాక్షన్ షురూ కాబోతుంది.

ఫౌజి.. రాజాసాబ్.. స్పిరిట్.. ఫ్యాన్స్ ను మెప్పించిన అప్డేట్ ఏది?
>రెబల్ స్టార్  బర్త్ డే కానుకగా వచ్చిన మూడు సినిమాలలో ఏ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ ను అలరించారంటే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. అయితే ఈ సినిమా పోస్టర్ పట్ల ఎన్నో అంచనాలు పెట్టుకున్న రెబల్ ఫ్యాన్స్ ను కాస్త డిజప్పోయింట్ చేసారు మేకర్స్. ప్రభాస్ ఫోటోతో వదిలిన టైటిల్ పోస్టర్ సో సో గా అనిపించింది. రాజాసాబ్ : డార్లింగ్ బర్త్ డేకు రాజాసాబ్ నుంచి కూడా మేకర్స్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. “హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్” అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్‌లో వింటేజ్ వైబ్‌తో అదిరిపోయాడు డార్లింగ్. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది రాజాసాబ్ టీమ్.

Exit mobile version