NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం అన్ని రకాల్లో వైఫల్యం చెందిందని.. తమ ప్రభుత్వం అన్నింటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.. అయితే, గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేశారు వైసీపీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన వెంటనే.. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆ తర్వాత సభ వాకౌట్‌ చేశారు.. గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే.. సభ నుంచి వెళ్లిపోయారు..

గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్.. మా ప్రభుత్వ లక్ష్యాలు ఇవే..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, గవర్నర్‌ ప్రసంగం ప్రారంభించినప్పట్టి నుంచి సభలో నినాదాలు చేస్తూనే ఉన్నారు వైసీపీ సభ్యులు.. వైసీపీ ప్రతిపక్షంగా గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు చేశారు.. ఓ దశలో పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేసి సభ నుంచి వెళ్లిపోయారు వైసీపీ సభ్యులు.. అయితే, గవర్నర్‌ ప్రసంగంలోని హైలైట్స్‌.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్‌.. ప్రణాళికలు, లక్ష్యాలను ఓసారి పరిశీలిస్తే.. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్.. అయితే, సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం.. 200 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశాం.. పెన్షన్లు రూ.4 వేలకు పెంచాం.. మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నాం.. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు.. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్లే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు..

ప్రతిపక్ష హోదా ఫస్ట్.. ఆ తర్వాతే అన్నీ..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా డిమాండ్‌ ఆది నుంచి ఉంది.. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో.. ప్రతిపక్ష హోదా కోల్పోయింది వైసీపీ.. అయితే, తమ పార్టీ మినహా అన్ని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలే కాబట్టి.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది వైసీపీ.. ఇక, ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలోనే అది డిమాండ్‌ వినిపించింది వైసీపీ.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ప్రారంభించగా.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రజల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లడం.. కాసేపు నిరసన తెలిపిన తర్వాత.. గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేయడం జరిగిపోయాయి.. దీనిపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేశాం.. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లాక ఆలోచించడం మొదలు పెట్టారని తెలిపారు.. రైతులకు న్యాయం చేస్తే సంతోషం.. కానీ, అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు.. మిర్చి రైతుల పరామర్శలకు వెళ్తే కేసులు పెడతారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మ్యూజికల్ నైట్ కు ఇవేమీ ఉండవు అని దుయ్యబట్టారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం పై ప్రభుత్వ స్పందన తర్వాత అసెంబ్లీకి వస్తామో లేదో చెబుతాం. లేకపోతే ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాం అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ..

ఒకటి, రెండు నిమిషాల సమయం మాకు సరిపోదు.. హోదా కావాలి..!
మొదటి నుంచి అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమ నేత ప్రజా సమస్యలపై మాట్లాడాలని అడిగామన్నారు. అందరూ సభ్యుల లాగే అసెంబ్లీలో అవకాశం ఇస్తే తమ నేత వైఎస్‌ జగన్ కు కూడా కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ ను అడిగామని.. కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. కానీ, వారు ఇంత వరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం తమ అభ్యర్థనకు పాజిటివ్ స్పందిస్తుందనే నమ్మకం లేదన్నారు పెద్దిరెడ్డి.. అయితే, ప్రతిపక్ష హోదా వచ్చే వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామంటున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించగా.. గవర్నర్‌ ప్రసంగం సమయంలోనే.. సభలో ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేసిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఎన్టీవీవో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికార పార్టీ (కాంగ్రెస్) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ (బీఆర్ఎస్)కి బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారని సెటైర్లు విసిరారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తాజా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేలిపోయింది. అధికార పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకీ బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు’ అని అన్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేం: ఎన్డీఆర్ఎఫ్
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) అధికారులు స్పష్టం చేశారు. టన్నెల్ లోపల ప్రాణాలతో ఎవరు ఉన్నారో చెప్పడం సాధ్యం కాకపోయినా, శిథిలాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) పూర్తిగా ధ్వంసమైన కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం 14 కిలోమీటర వద్ద టన్నెల్‌లో ఉండగా, దాదాపు 500 మీటర్ల మేర మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో మూసుకుపోయిందని అన్నారు. ఇది సహాయక చర్యలకు ప్రధాన అవరోధంగా మారిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగించడానికి లోపలికి ప్రవేశించడానికి రైల్వే ట్రాక్‌నే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్మికులు, యంత్ర పరికరాలను తరలించేందుకు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినా.. భారీ యంత్రాలను లోపలికి తీసుకెళ్లడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాదాపు 2 కిలోమీటర్ల మేర నీటిలో మునిగిపోయిందని, ఆ ప్రాంతంలో నీరు నడుము లోతు వరకు చేరడంతో సహాయక చర్యలు మరింత కష్టతరమయ్యాయని అధికారులు తెలిపారు.

ఊబకాయంపై యుద్ధం.. 10 మందిని నామినేట్ చేసిన మోడీ
దేశంలో ఊబకాయంపై పోరాటం చేసేందుకు ప్రధాని మోడీ సంకల్పించారు. ఆదివారం మన్ కీ బాత్ వేదికగా ఊబకాయంపై పోరాటం చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆహారంలో నూనెల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నందన్ నీలేకని, క్రీడాకారులు మను భాకర్, మీరాబాయి చాను, ఎంపీ మోహన్‌లాల్, సుధా మూర్తి, బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్, నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషల్ వంటి వ్యక్తులను మోడీ నామినేట్ చేశారు. ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఒక్కొక్కరు మరో పది మందిని నామినేట్ చేయాలని ప్రధానమంత్రి కోరారు. ఊబకాయంపై పోరాటంలో తనను నామినేట్ చేయడం పట్ల జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా ఆందోళనకర అంశం. ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అది మన బాధ్యత కూడా..! తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం మేర తగ్గించుకోవాలి’’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఎన్ హెచ్ ఏఐ కీలక చర్య.. ఇకపై జాతీయ రహదారి నాణ్యత మెరుగుపడుతుంది
జాతీయ రహదారుల నాణ్యతను మెరుగుపరచడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కొత్త అడుగు వేసింది. జాతీయ రహదారులలోని కొన్ని విభాగాలపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణ నాణ్యతను పెంచడానికి, ప్రమాణాలను మెరుగుపరచడానికి కొత్త బహుళ-స్థాయి నాణ్యత నియంత్రణ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాన కార్యాలయం నుండి వన్-టైమ్ సోర్స్ ఆమోదాన్ని భర్తీ చేస్తూ ఐదు ప్రాంతాలలో స్వతంత్ర ప్రాంతీయ నాణ్యత కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అథారిటీ ప్రతిపాదించింది. ఈ కొత్త కార్యాలయాలు NHAI ప్రమాణాలు, పరిశోధన, అభివృద్ధి, నాణ్యత విభాగం కింద పనిచేస్తాయి. ప్రతి కార్యాలయానికి ప్రాంతీయ నాణ్యత అధికారి (RQC) నేతృత్వం వహిస్తారు. ఆయన తన ప్రాంతంలో నాణ్యత నియంత్రణ విషయాలను సమన్వయం చేయడం, నిర్వహించడం తన బాధ్యత. RQCలు తమ అధికార పరిధిలోని ప్రాజెక్ట్ సైట్లలో సిమెంట్, స్టీల్, ఎమల్షన్ వంటి పదార్థాలను, బేరింగ్లు, విస్తరణ జాయింట్లు ఇతర భాగాల వంటి ఉత్పత్తులను సంవత్సరానికి రెండుసార్లు థర్డ్ పార్టీ ల్యాబ్ ల ద్వారా టెస్టింగులను నిర్వహిస్తాయి.

వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్.. తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. గత వారంలో వరుసగా ఐదు రోజులు పసిడి ధరలు పెరిగితే.. శుక్రవారం కాస్త తగ్గింది. మళ్లీ శనివారం పెరగ్గా.. ఆదివారం స్థిరంగా ఉంది. సోమవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 పెరిగి.. రూ.80,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగి.. రూ.87,870గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న వెండి.. మరలా పుంజుకుంటోంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఎనమిది వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా కొనసాగుతోంది.

ఒకరోజు ముందుగా ‘మజాకా’ పెయిడ్ ప్రీమియర్స్
టాలీవుడ్ లో ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్ హంగామా ఎక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది మజాకా. అయితే రిలీజ్ కంటే ముందు ఒక్కరోజు ఈ సినిమాకు పైడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇక్కడెక్కడ ఈ షోస్ ఉంటాయి అనేది మాత్రం వెల్లడించలేదు. మేకర్స్ ఈ శివరాత్రి రోజు నవ్వులతో జాగారం చూపిస్తామని ముందు నుండి చెప్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పట్ల చిత్ర హీరో సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సందీప్ కిషన్ ప్రీవియస్ సినిమా ఊరుపేరు భైరవకోన క్లోసింగ్కలెక్షన్స్ ను మొదటి వీకెండ్ నాటికీ మజాకా దాటేస్తుందని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించాడు. కెరీర్ లో హయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుందనికాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ముందు రోజు వేయనున్న ప్రీమియర్స్ తో హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుందో లేదో వెయిట్ అండ్ వాచ్

‘రాజా సాబ్’ తో నా కల నెరవేరింది:మాళవిక మోహనన్
కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘వేట’ మూవీతో సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. తన రెండో సినిమాతోనే దళపతి విజయ్‌తో నటించే అద్భుతమైన అవకాశం కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీలో చారు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టిన మాళవిక అక్కడ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో కార్తీ ‘సర్దార్’ సినిమా తో పాటు ‘మిత్రన్’ అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవ్వని ఒకెత్తు అయితే తెలుగులో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ సినిమాలో కూడా నటిస్తుంది మాలవిక. కామెడీ, హారర్ జోనర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది మాళవిక.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ‘ ‘బాహుబలి’ మూవీ నుంచి ప్రభాస్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ ని. ఆయనతో కలిసి నటించాలి అని ఎన్నో కలలు కన్నా. మొత్తానికి ‘రాజా సాబ్’ మూవీతో నా కల నెరవేరింది. ఇక సెట్‌లో ప్రబాస్‌ని చూసి ఆశ్చర్యపోయా. అంతపెద్ద స్టార్‌ అయిన చాలా నార్మల్‌గా ఉంటాడు.. సపోర్ట్ చేస్తారు. ఆయన చూట్టు ఉన్న వారితో ఎంతో సరదాగా ఉంటూ ఆ ప్రదేశాన్నంతా కంఫర్టబుల్‌గా మార్చేస్తారు. ముఖ్యంగా సెట్‌లో ఉన్న టీమ్‌ మొత్తానికీ మంచి ఫుడ్‌ని పంపిస్తారు. దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.. మంచి కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. నిజంగా ప్రభాస్‌ చాలా స్వీట్‌’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది మాళవిక మోహనన్‌.