NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన మరువక ముందే.. మరో కంపెనీలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు.. మరోవైపు.. బాణాసంచా అమ్మకాల లైసెన్స్ తో ఏకంగా బాణాసంచా తయారు కేంద్రం నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.. ఇక, పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.. తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడికి కారణమా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. స్వాగతం పలికిన వైసీపీ నేతలు..
నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

సీఎంకి మంత్రి కోమటిరెడ్డి లేఖ.. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా వేటు..!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖ పైన త్వరిత గతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్.. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్టీఎల్ ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపిన మంత్రి.. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందిచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. మంత్రి లేఖ పై విచారణ జరిపి రంగంలో దిగిన హైడ్రా.. ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. కాగా, ఇవాళ తెల్లవారు జామున భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లు పూర్తిగా పడగొట్టింది. కొన్ని గంటల్లోనే కన్వెన్షన్ సెంటర్లోని హాళ్లను అధికారులు కూల్చి వేశారు. కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం గోడకు నోటీసులను అంటించి కూల్చివేతలు చేపట్టిన అధికారులు.. ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన హైడ్రా టీం.. అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులను అధికారుు ఇవ్వ లేదు.. తుమ్మిడి కుంట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారని నాగార్జునపై ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి.. 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మించిన హాల్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది.

అక్రమార్కుల గుండెల్లో ‘హైడ్రా’ దడా.. మీ ఆస్తులు సేఫేనా..?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో హైడ్రా పని చేయనుంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తూ.. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది. ఆపరేషన్ హైడ్రా ప్రారంభమైన దగ్గర నుంచి ఆక్రమణదారుల గుండెల్లో భయం స్టార్ట్ అయింది. ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తుండటతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు వెళ్లడంతో సామాన్యుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. అన్ని పక్కాగా ఉంటే ఓకే.. ప్రభుత్వం భూముల్లో కట్టడాలు నిర్మిస్తే మాత్రం కూల్చివేతలే ఉంటాయనే సంకేతం అందిరిలోకీ వెళ్లింది.

ఉక్రెయిన్‌కు 4 భీష్మ క్యూబ్‌లను అందజేసిన ప్రధాని నరేంద్ర మోడీ..
శుక్రవారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ లో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని., తాము యుద్ధానికి దూరంగా ఉంటామని.. అందుకోసం భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉందని సాపేస్తాం చేసారు. అలాగే మా వైపు శాంతి ఉంది.. మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చామని తెలిపారు. ఇక ప్రధాని తన పర్యటనలో భారత ప్రభుత్వం తరుపున ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీష్మ క్యూబ్‌ లను అందజేశారు మోడీ. పోలాండ్ నుంచి ప్రత్యేక రైలులో ఉదయం కీవ్ చేరుకున్న ప్రధానికి ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, మోదీ నాలుగు క్యూబ్‌ లను ఉక్రెయిన్ ప్రభుత్వానికి అందజేసారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్యూబ్‌ లు గాయపడిన వ్యక్తుల చికిత్సను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా ప్రాణాలను కాపాడడంలో సహకారాన్ని అందిస్తాయి. ప్రతి భీష్మ క్యూబ్‌ లో వివిధ రకాల గాయాలు, వైద్య పరిస్థితులకు మందులు, ఇంకా అనేక పరికరాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

రూ.1200కోట్లు పెట్టుబడి పెట్టి 40వేల మందికి ఉద్యోగాలివ్వనున్న సింగపూర్ కంపెనీ
యాపిల్ ఉత్పత్తులు, ఐఫోన్లను తయారు చేస్తున్న ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ కాంట్రాక్టుపై రూ.1200 కోట్లు వెచ్చించాలని ప్లాన్ చేసింది. భారత్‌లో రూ.1200 కోట్లు వెచ్చించి 40 వేల ఉద్యోగాలు కల్పించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి, ఫాక్స్‌కాన్ దాని కర్ణాటకకు చెందిన హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సుమారు రూ. 1,200 కోట్లు (దాదాపు $144 మిలియన్లు) పెట్టుబడి పెట్టింది. కాంట్రాక్ట్ ఐఫోన్ తయారీ కంపెనీకి చెందిన సింగపూర్ యూనిట్ అయిన ఫాక్స్‌కాన్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 120.35 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ.10 చొప్పున ఇటీవల కొనుగోలు చేసింది. బళ్లాపూర్ సమీపంలో భారీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ దొడ్డా రూ.25,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని, దీని ద్వారా 40,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కర్ణాటక ప్రభుత్వం గత వారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియు ప్రకటనను ఉటంకిస్తూ, కర్ణాటకలో ఉన్న ఈ యూనిట్ త్వరలో చైనా తర్వాత ఫాక్స్‌కాన్ యొక్క రెండవ అతిపెద్ద ప్లాంట్‌గా అవతరించనుందని మీడియా నివేదికలు తెలిపాయి. దీని వల్ల 40000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. భారత్‌లో ఫాక్స్‌కాన్ వ్యాపారం 2024 నాటికి 10 బిలియన్ డాలర్లు దాటనుంది.

వేలంలో రూ.40 లక్షలు పలికిన విరాట్ కోహ్లీ జెర్సీ.. ధోనీ, రోహిత్ బ్యాట్‌లు ఎంత రేట్ పలికాయంటే..?
” క్రికెట్ ఫర్ చారిటీ ” వేలాన్ని తాజాగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి నిర్వహించారు. వేలం ఉద్దేశం నిరుపేద పిల్లలకు విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఓ సంస్థకు సహాయం చేయడమే. ఈ వేలంలో టీమిండియా తరఫునుండి చాలామంది క్రికెటర్లు వారి వ్యక్తిగత వస్తువులను వేలానికి అందించారు. ఇందులో విరాట్ కోహ్లీ ధరించిన జెర్సీ, ఆయన బ్యాటింగ్ సమయంలో వాడిన బ్యాటింగ్ గ్లోవ్స్ ఇంకా, రోహిత్ శర్మ బ్యాట్, మహేందర్ సింగ్ బ్యాట్, రాహుల్ ద్రావిడ్ బ్యాట్ ఇలా అనేక వస్తువులకు వేలంపాట నిర్వహించారు. ఇక ఈ వేలంలో ఏ వస్తువు ఎందుకు అమ్ముడుపోయిందో ఓసారి చూస్తే.. ఈ వేలంలో అత్యధికంగా ధరించిన జెర్సీ ఏకంగా 40 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ సమయంలో వినియోగించిన గ్లోవ్స్ 28 లక్షలు పలికాయి. ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ను క్రికెట్ ఫర్ చారిటీ వేలంలో 24 లక్షల రూపాయలు పలికింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ కు 13 లక్షల రూపాయలు, టీమిండియా మాజీ ఆటగాడు & కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాట్ కు 11 లక్షల రూపాయలు, అలాగే కేఎల్ రాహుల్ ధరించిన జెర్సీ కి 11 లక్షల రూపాయలు వచ్చాయి.

మరోసారి తండ్రి కానున్న రోహిత్..? జూనియర్ హిట్ మ్యాన్ రాబోతున్నాడా..?
ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం లభించింది. ఈ సమయంలో ప్రతి ఒక్క టీమిండియా క్రికెట్ ఆటగాడు వారి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇకపోతే టి20 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ముగిసిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించాడు. తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు ఆడనున్నాడు. ప్రస్తుతం లాంగ్ బ్రేక్ దొరకడంతో ఆయన వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికతో కలిసి CEAT క్రికెటర్ రేటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈవెంట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో రోహిత్ శర్మ భార్య రితికను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. రితిక మళ్లీ కడుపుతో ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చిన్నపాటి బేబీ బంప్ తో ఉన్నట్లు ఈ వీడియోలో కనబడుతుంది. అయితే ఈ విషయం రోహిత్ శర్మ నేరుగా స్పందిస్తే తప్ప.. అది నిజమా..? అబద్దమా..? అన్న విషయం తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. అతి త్వరలోనే రోహిత్ జోడి జూనియర్ హిట్ మ్యాన్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ 2015లో రితిక ను వివాహం చేసుకోగా.. 2022 లో కూతురు సమైరా పుట్టింది.

రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..
రుహాణి శర్మ నటించిన ఆగ్రా సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహాణి శర్మ పరిధికి మించి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను కొందరు రుహాణి శర్మ ప్రైవేట్ వీడీయోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రుహాణి శర్మ క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఆగ్రా’లోని సన్నివేశాలు లీక్‌ అయినప్పటినుంచి నేను ఎంతో బాధలో ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్‌ చేయడం అనేది నీతిమాలిన చర్య. ఆర్ట్ సినిమాలను రూపొందించడం సవాలుతో కూడుకున్న పని. వాటి కోసం నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపాలి. అలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి. మా కష్టాన్ని, కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దానిగురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో ప్రదర్శించారు. అది మా యూనిట్ కు దక్కిన గౌరవం. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప సినిమాలో నటించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యవంతంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక రెబల్ స్టార్ వంతు.. మురారి రికార్డు బ్రేక్ అవుతుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అతడు మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుంది.  అక్టోబరు 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రీరిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తోన్నారు. దింతో పాటుగా రెబల్ స్టార్ కెరీర్ లో డార్లింగ్ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నట్టు టాక్. వీటిలో ఈశ్వర్ మాస్ సినిమా కాగా డార్లింగ్ క్లాస్ సినిమా.. ఇలా క్లాస్ మాస్ కలిపి ఒకేరోజు రెండు సినిమాలను రీరిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఎంత కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్..!
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్​ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత పనులను కొనసాగించింది. ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం.. మా ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను అని అక్కినేని నాగార్జున తెలిపారు. ఇక, ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది అని టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలిపారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని.. తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని అక్కినేని నాగార్జున వెల్లడించారు.