NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గురువారం నుంచి వరద బాధితులకు నష్టరిహారం పంపిణీ..
వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్‌ కేశినేని చిన్ని.. విజయవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ.. పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ ఓల్డ్ ఆర్.ఆర్. పేటలో ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.. ఇక, ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి బయట పడగలిగిందన్నారు.. వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు.. అయితే, వైఎస్‌ జగన్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన ఉత్తరంలో వైఎస్‌ జగన్.. టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్..

అన్నవరం ఆలయానికి వచ్చే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..!
తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మిగతా ఆలయాలకు సరఫరా చేసే నెయ్యిపై కూడా దృష్టి పెట్టింది.. కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయం అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ… రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది? అనే విషయంపై ఆరా తీస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అన్నవరంలో ఏడాదికి లక్ష కేజీలకు పైగా నెయ్యి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, తిరుమలకు వచ్చే నెయ్యి వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిన వేళ.. అన్నవరం.. ఆ తర్వాత సింహాచలం నెయ్యిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుండడం ఆసక్తికరంగా మారింది.

హంద్రీనీవా దుస్థితికి వైసీపీ ప్రభుత్వమే కారణం.. మేం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..
హంద్రీనీవా దుస్థితికి గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే కారణం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు.. 5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టుకుందన్నారు.. అయితే, తమ ప్రభుత్వం అలా కాదు.. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.. ప్రస్తుతం పదనాలుగు లక్షలకోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిమీద ఉందన్నారు.. 2014లో రాష్ట్ర విభజనకన్నా.. 2019-24లో వైఎస్‌ జగన్ పాలన వళ్లే రాష్టానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..

కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా.. పూడ్చివేతలు రాదా?
కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా.. పూడ్చివేతలు రాదా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాలపున సముద్రామున్న చేపపిల్లలు నీటి కేడ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయ్ అని మండిపడ్డారు. 22 రోజులైన కాల్వకు గండి పూడ్చడం చాతకాగ.. రైతుల పొలాలు ఎండ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉందన్నారు. సాగర్ లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయ్ అన్నారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారన్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం నిద్రపోతున్నదన్నారు. గతేడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయ్ అని గుర్తు చేశారు. ఈసారి పుష్కలంగా వర్షాలు పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు.

ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల పై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్ లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. కూల్చివేతలు చేసాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని మండిపడ్డారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందన్నారు. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారు? అని ప్రశ్నించారు. చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నారు. నిన్న షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం వారి సామాన్లను తరలించేందుకు సైతం సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చి వేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటి?? అని ప్రశ్నించారు. నిన్న కూల్చివేతలలో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. శనివారం, ఆదివారం హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిన్న కూల్చివేతలు చేపట్టారు.. ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకు ఆ సీఎం సీటు వద్దు.. ఖాళీగానే ఉంచండి..!
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా ఈరోజు (సోమవారం) బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కోసమే ఉంటుందని తెలిపారు. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం యొక్క బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఎంతో కఠిన సమయంలో ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన ఎలా చేశాడో.. నేను కూడా అదే విధంగా రాబోయే నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైలులో ఉంచిన.. ఢిల్లీ ప్రజలు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంచారని వెల్లడించింది. ఢిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది.. ప్రజలు మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని అతిషీ మర్లెనా వ్యాఖ్యనించింది.

చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరమే: సుప్రీం కోర్టు
ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే, పోక్సో చట్టం సెక్షన్‌ 15 ప్రకారం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను (ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొనింది. ఇక, ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగించాలని తెలిపింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని సుప్రీం కోర్టు సూచనలు జారీ చేసింది.

మహారాష్ట్రీయులు లేదా ముస్లిం వ్యాపారాలకు మద్దతు ఇవ్వను..
వెస్ట్రన్ రైల్వేలో పని చేస్తున్న టిక్కెట్ కలెక్టర్ (TC) ఆశిష్ పాండే మరాఠీ లేదా ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ముంబైలో తీవ్ర వివాదం కొనసాగుతుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతడు ముంబైలోని విక్రోలిలో నివసిస్తున్నాడు. తాను మరాఠీ లేదా ముస్లిం డ్రైవర్లు నడిపే ఆటో-రిక్షాలను ఉపయోగించనని ప్రకటించాడు. ఈ ఆడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఇది పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే దాదాపు 1,000 రీపోస్ట్‌లతో పాటు 1. 30 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. కాగా, ఆశిష్ పాండే వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక హక్కులపై బలమైన వైఖరికి పేరుగాంచిన రాజకీయ పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వెంటనే రియాక్ట్ అయింది. వెస్ట్రన్ రైల్వే టీసీ ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంఘాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఎంఎన్ఎస్ పార్టీ పేర్కొనింది. ఈ సంఘటనతో మహారాష్ట్ర స్థానిక జనాభా పట్ల వలసదారుల వైఖరి ఏంటో స్పష్టం అవుతుందన్నారు.

సహచర మంత్రిని టీజ్ చేసిన నితిన్ గడ్కరీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో పలు సందర్భాల్లో చమత్కరాలు వినిపిస్తుంటాయి. తాజాగా సహచర మంత్రిని ఉద్దేశించి సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేం.. కానీ, రాందాస్‌ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం కచ్చితంగా ఉందని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. దాంతో అక్కడున్న వారందరు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ఆ వేదికపై రాందాస్ అథవాలే కూడా ఉన్నారు. తోటి మంత్రిని టీజ్‌ చేసి.. జస్ట్ జోక్ చేస్తున్నాను అని నితీన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) నేత అథవాలే.. వరుసగా మూడుసార్లు మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోసారి బీజేపీ విజయం సాధిస్తే.. తన పరంపరను కొనసాగిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాందాస్ అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది.

బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
దేశంలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలు దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు సిల్వర్ రేట్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి 93,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 85 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా కొనసాగుతోంది.

రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర.. ఎక్కడంటే..?
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ  బడ్జెట్ పై  సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్ భారీ  స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. కాగా ఇటీవల దేవర ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగోట్టాయి. మరి ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికా రైట్స్ ను ఇండియన్ రూపీస్ ప్రకారం 26 కోట్లకు అమ్ముడవగా అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు రూ. 21 కోట్లు రాబట్టింది. విడుదలకు ఇంకా 4 రోజులు ఉండడంతో ఆ రోజు నాటికీ బ్రేక్ ఈవెన్ సాధించి విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ కు లాభాల పంట పండినట్టే.  టికెట్స్ పరంగాను దేవర దూకుడు కనిపిస్తోంది. ఇప్పటివరకు 60k టికెట్స్ బుక్ అయి రికార్డు సృష్టించింది దేవర.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. మరో 10 లక్షల విరాళం!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చెక్‌ను మహేష్ బాబు దంపతులు అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్‌ను అందజేశారు. అంతేకాదు ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10 లక్షలు విరాళంను కూడా సూపర్ స్టార్ అందించారు. తెలంగాణకు మరో 10 లక్షల విరాళంను ఇవ్వడంతో మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సూపర్ స్టార్‌ది మంచి మనసు’, ‘సాయం చేయడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు దంపతులు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్‌ న్యూలుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేశ్‌, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘SSMB 29’ కోసమే ఈ నయా లుక్ అన్న విషయం తెలిసిందే. ఇక నేడు ఏపీ సీఎం చంద్రబాబును కూడా సూపర్ స్టార్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంక ‘దేవర’కు నో ఈవెంట్స్.. కారణం ఇదే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిషున్న ‘దేవర’ నిర్మాణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి సరైన ప్లానింగ్ లేకుండా నిర్లక్యంగా వ్యహరిస్తున్నారని, సినిమా సంబంధించి అప్ డేట్స్ సరైన టైమ్ కు ఇవ్వకుండా ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సహానికి గురిచేసారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ముంబై నిర్వహించి, ప్రెస్ మీట్ ను తమిళనాడులో నిర్వహించి తెలుగు ఆడియెన్స్ ను పూర్తి గా పక్కన పెట్టేసారు. ఈ ఆదివారం నిర్వహించ తలపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర ఆవేదానికి గురయ్యారు. ఇప్పటికి తెలుగులో ఒక్క ఈవెంట్ కుడా నిర్వహించలేదు నిర్మాణసంస్థ. దాదాపు 6 ఏళ్ల తర్వాత టైగర్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్  భారీగా తరలివచ్చారు.  ఆ ఈవెంట్ కూడా నిర్వహించలేక చేతులెత్తేస్తూ క్షమాపణలు తెలిపారు నిర్మాణ సంస్థ. ఇదిలా ఉండగా  తారక్ కూడా తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు. అక్కడ జరిగే Beyond Fest, Hollywood Premiere కు హజరుకానున్నాడు.  అక్కడ ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు. సో తెలుగులో ఇక దేవరకు సంబంధించి ఏ ఈవెంట్ లేనట్టే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను మనోవేదనకు గురి చేస్తుంది. అప్పట్లో యంగ్ టైగర్ నటించిన కంత్రి తర్వాత తారక్ సినిమాకు ఏ  ఈవెంట్ లేకుండా వస్తున్న సినిమా ఇదే. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది దేవర.

కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని,  మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన ఆ యువతి మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప -2 లోని ఓ సాంగ్ కు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారమై మత్తువదలరా -2 సక్సెస్ మీట్ లో  మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాతుతూ ”  ఆ యువతీ లాంగ్ బ్యాక్ పుష్ప -2 స్టార్ట్ చేసినప్పుడే ఓక సాంగ్ కోసం వర్క్ చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ సూచించిన స్టెప్స్ టీమ్ కు వివరించేందుకు ఆయన అడిషనల్ కొరియోగ్రాఫర్ గా విజయ్, ఈ యువతీ వర్క్ చేస్తుంటారు. అలాగే పుష్ప -2 లోని అన్ని సాంగ్స్ కు వర్క్ చేస్తున్నారు, ఇంకా 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబరు లో ఆ సాంగ్స్ ఇఓ షూట్ చేస్తాం, వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. కానీ ఈలోగా ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి సెట్స్ లో ఉన్నపుడు బన్నీతో హాయ్ సార్ అంతవరకే ఉంటారు. కానీ కొందరు కొత్త వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ సెన్సేషన్ కోసం బన్నీ జానీ మాస్టర్ ను తప్పించి ఆ యువతికి  అండగా ఉన్నారు అని ఫేక్ న్యూస్ లు రాసారు. అల్లు అర్జున్‌కు డాన్స్ టీమ్ గురించి పెద్ద‌గా ఏం తెలీదు. బ‌న్నీ గారి స్టేచ‌ర్‌కి ఇవ‌న్నీ చాలా చిన్న విష‌యాలు. వాళ్ల మ‌ధ్య ఏం గోల ఉన్నా మాకు సంబంధం లేదు ”  అని అన్నారు.