NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పెండింగ్‌ దరఖాస్తులపై సర్కార్‌ స్పెషల్ ఫోకస్..
భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది టౌన్ ప్లానింగ్ విభాగం.. 9398733100, 9398733101 నంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా apdpmshelpdesk@gmail.com ఈ-మెయిల్ కు కూడా వివరాలు పంపవచ్చని వెల్లడించింది.. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పనిచేయనుంది ఈ ప్రత్యేక విభాగం.. నిబంధనల ప్రకారం అన్నిరకాల డాక్యుమెంట్లు ఉండి ఫీజు చెల్లించినట్లు అయితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.

ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని హత్య.. బాధిత కుటుంబానికి సీఎం భరోసా..
కడప జిల్లా బద్వేల్‌లో మృతిచెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విద్యార్థిని ప్రాణాలు విడిచిన విషయం విదితమే కాగా.. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.. ఈ రోజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయానికి సంబంధించిన రూ.5 లక్షల చెక్కును అందజేశారు కడప జిల్లా ఇంఛార్జ్‌ కలెక్టర్ అతిథి సింగ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, స్థానిక కూటమి నాయకులు. అయితే.. ఆ కుటుంబానికి మొత్తంగా ఎక్స్‌గ్రేషియా కింద రూ.10 లక్షలు అందించనుంది ప్రభుత్వం.. ఇక, బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.. బాధిత కుటుంబ సభ్యులచే సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి.. విద్యార్థిని కుటుంబ సభ్యలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

వైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై.. వైఎస్‌ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు సీనియర్‌ నేత వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.. ”YCPకి గుడ్ బై”.. వైయస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పద్మ.. ”పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు.. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”.. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు..” అంటూ లేఖలో దుయ్యబట్టారు.. ఇక, “పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు.. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది.. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను..” అంటూ ఓ లేఖను విడుదల చేశారు వాసిరెడ్డి పద్మ..

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది.. శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.. అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులు హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది.. బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో జరుగుతుండడంతో వందలాదిగా భక్తులు, స్థానికులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు.. స్వర్ణరథంపై ఆసీనులైన శ్రీస్వామి అమ్మవార్లు.. స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం మాడవీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహించారు.. స్వర్ణ రథోత్సవంలో భారీగా భక్తులు, స్థానికులు పాల్గొన్నారు..

సహన కుటుంబానికి జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై ఫైర్‌.. వైసీపీ నుంచి పరిహారం ప్రకటన..
గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో సహన కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. అయితే, జగన్ చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో తోపులాట జరిగింది.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్‌.. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేది.. ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.. తప్పు చేసిన వాళ్లు.. వాళ్ల వాళ్లు అయితే చాలు ప్రభుత్వం నిందితులకు రక్షణగా ఉంటుందని దుయ్యబట్టారు.. నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వాడు… పని చేస్తున్న సహన ను కారు ఎక్కించుకుని వెళ్లి దారుణంగా హత్య చేశారు.. నవీన్ ఒక్కడే కాదు ఇంకొందరు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు.. సహనను శారీరకంగా, లైంగికగా వేధించారు.. తీవ్ర దాడి చేసి నిందితులు హాస్పిటల్లో వదిలేసి వెళ్లి పోయారు.. కానీ, తప్పు చేసిన వాళ్లను ప్రభుత్వం ఉపేక్షిస్తుందని మండిపడ్డారు..

వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలి.. బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీలసులు పంపారు. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ టీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధరమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు.

లారెన్స్‌ బిష్ణోయ్‌ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్‌
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య సంచలనం రేపింది. కాగా, ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. సిద్ధిఖీని హత్య చేయడానికి ముందు లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్నాప్‌చాట్‌ ద్వారా నిందితులు తరచూ అన్మోల్‌తో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్‌ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి సంప్రదింపులు చేశారని.. దాని ద్వారానే అన్మోల్‌ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు వెల్లడించారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు శివకుమార్‌ గౌతమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఇక, స్నాప్‌చాట్‌లో 24 గంటల తర్వాత మెసేజ్‌లు మాయమయ్యే ఆప్షన్‌ ఉండటం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్‌ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సిద్ధిఖీపై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మరో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రచారంలో డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలోని నిలిచిన కమలా హరీస్, మాజీ ప్రెసిడెంట్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తాజాగా ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక పోర్న్ స్టార్‌తో అతడికి సంబంధం ఉన్నప్పటికి.. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే.. మొత్తం పరిశ్రమను మూసివేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ వచ్చే నెలలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి యువకులను ప్రేరేపించాలని తీర్మానం చేసుకున్నారు. ఇక, #HandsOffMyporn అనే హ్యాస్ ట్యాగ్ తో చేస్తున్న ప్రచారంలో ప్రధానంగా పురుషులను ఈ పోర్స్ స్టార్స్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇప్పటి వరకు పలు వెబ్‌సైట్‌లలో ప్రకటనల కోసం ఈ అడల్డ్ ఫిల్మ్ స్టార్స్ $200,000 వెచ్చించారు. ప్రధానంగా అశ్లీలతను నిషేధించాలని.. అడల్ట్ స్టార్స్ ను జైలులో పెట్టాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నట్లు గ్రాఫిక్ డిజైన్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, ప్రాజెక్ట్ 2025 అనేది పోర్న్‌ను పూర్తిగా నిషేధించాలనేది. దీనికి ప్రతిస్పందనగా అమెరికాలోని అడల్ట్ స్టార్స్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆందోళనలు పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా లాంటి రాష్ట్రాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్‌’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్‌మెంట్‌ అడిగారా అని ఓ జర్నలిస్ట్‌ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా’’ అని చెప్పారు. అలాగే మరొక ఇంటర్వ్యూ లో ఈ విషయమై మాట్లాడుతూ ‘ కొన్ని ప్రశ్నలకు మనం సంస్కారంతో ఆన్సర్ చేయాలి. ఎదుటివారికు అది ఉన్న లేకున్నా మన లిమిట్స్ లో మనం ఉండి  చేయాలి నేను అదే చేశాను. ఇక ఈ విషయంలోనాకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం  ఆనందంగా ఉంది. చాలా మంది మీడియా మిత్రులు పర్సనల్ గా కాల్ చేసి ఆమె ఆలా ఆగినందుకు మేము క్షమాపణలు చెప్తున్నాం. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు, సినిమాలల్లో మంచి పాత్రలు చేసారు. అయినా ఒక  తెలుగు అమ్మాయిని అలా అడగడంభావ్యం కాదని మీడియా వాళ్ళు చెప్తుంటే నన్ను సినిమా వాళ్ళు ఇంతగా అభిమానిస్తారా, ఒక తెలుగు అమ్మాయిగా ఇంత వాల్యూ ఇస్తారా అని చాలా సంతోషం అనిపించింది” అని అన్నారు.

లండన్‌లో అనుఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి చెట్టాపట్టాల్
పెళ్లి చూపు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు  శివ కందుకూరి హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్  గా, ఐ ఆండ్రూ, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్నిసంయుక్తంగా నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. లండన్ లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్న మూవీ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. డైరెక్షన్‌తో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్‌తో కూడుకున్న ఈ సినిమాకి ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ కూడా నిర్వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. డిఆర్‌కె కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, రియల్ సతీష్ స్టంట్ డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో  అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి, తో పాటుగా హాస్యనటులు వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షకలక శంకర్,  మహేంద్ర, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటిస్తున్నారు. త్వరలో ఈ సినెమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్ .

మళ్లీ మళ్లీ చేయాలనుకున్నాడు.. ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?
2002లో ‘ఈశ్వర్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్‌ బ్లాక్‌ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్‌, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్‌’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం. ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్స్ జాబితా చాలా పెద్దదే. ఒక్కో సందర్భంలో ఒక్కో హీరోయిన్ పేరును డార్లింగ్ చెప్పుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ భామల వరకు ఉన్నారు. త్రిష, శ్రీయ, నయనతార, అనుష్క, సాయిపల్లవి, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అలియా బట్.. ఉన్నారు. ఇంతమంది ఫెవరేట్ లిస్ట్ ఉన్నా.. మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుకుంది మాత్రం ‘సౌత్ ఇండియన్ క్వీన్’ త్రిషతోనే. ఈ విషయాన్ని ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రిషతో నటించడం తనకు చాలా కన్వీనెంట్‌గా అనిపిస్తుందని తెలిపాడు. ఏ సీన్ అయినా సరే ఓకే షాట్‌లో పూర్తి చేస్తారట.