NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేయండి..
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌లో వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు మంత్రి నారా లోకేష్‌.. టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్‌తో లోకేష్.. దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు… ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలన్నారు.. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటుచేయమని కోరారు లోకేష్.. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు.. స్థిరమైన సప్లయ్ చైన్ నిర్థారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీరజ్ కన్వర్ తెలిపారు. ఇక, కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం అన్నారు లోకేష్.. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA) ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలన్నారు లోకేష్.. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు.. ఏపీకి కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది..

నకిలీ జడ్జి గుట్టు రట్టు.. భార్య ఫిర్యాదుతో బయటపడిన బాగోతం..
ఏలూరులో జడ్డినంటూ మోసం చేసి యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భగవత నగర్‌కు చెందిన నామాల నరేందర్ (33).. మ్యాట్రిమోనీకి తన బయోడేటా పంపించారు. తాను జడ్జి అని తెలంగాణలో పనిచేస్తున్నానని చెప్పి వివరాలు పెట్టాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన సామంతుల నిర్మలకు 2019లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. అయితే అతను జడ్జి అని చెప్పడంతో ఇరువురు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని 2022లో రూ.75 లక్షలు కట్నం అడగగా రూ.25 లక్షలు ఇచ్చి వివాహం జరిపించారు.. కొంతకాలం ఖమ్మంలో కాపురం పెట్టారు. ఆ తరువాత అతను అప్పటికే పలువురికి కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించడంతో ఖమ్మం, ఉప్పల్, పొందానగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేశారు. అంతేకాకుండా నిర్మలను రూ.50 లక్షలు తీసుకురావాలని వేధింపులకు గురి చేయసాగాడు.. అతను జడ్జి కాదని తెలుసుకున్న నిర్మల.. గత నెల నవంబర్ 12న ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. సీఐ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ కాంతి ప్రియ కేసు నమోదు చేశారు. అయితే, అప్పటి నుంచి నామాల నరేందర్ పోలీసులకు చిక్కకుండా పరీరాలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడని గుర్తించిన పోలీసులు.. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం రైలు ఆగిన వెంటనే అరెస్టు చేశారు. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..

ఏపీలో మంత్రి లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు.. చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్‌ విషెస్‌..
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్‌ పర్యటనలో ఉన్నారు లోకేష్‌.. బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లోకేష్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రియమైన లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు.. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి, సోదరసమానులు లోకేష్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు, తెలుగుదేశం నేతలు..

పటాన్‌చెరు కాంగ్రెస్‌ ధర్నాలో ఉద్రిక్తత.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట!
పఠాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ – సేవ్ పఠాన్ చెరు స్లోగన్స్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో ఈ వివాదం మొదలైంది. పార్టీలోని పాత – కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నీలం మధు ముదిరాజ్‌, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను మొదటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌ వ్యతిరేకిస్తు్న్నారు.

కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే.. ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్లా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వస్తున్న రూ. 2 వేల పింఛన్ ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని హరీశ్ రావు ఆరోపించారు. ఇక, ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ.. మరో వైపు చేతికందిన పింఛన్ ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయం అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని.. ఇంటి పన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

“ఇండియా కంటెంట్‌పై మమ్మల్ని కిడ్నాప్ చేశారు”.. బతికే ఉన్న పాక్ యూట్యూబర్లు..
పాకిస్తాన్ యూట్యూబర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రో-ఇండియా కంటెంట్ చేసే ప్రముఖ యూట్యూబర్ల అయిన సనా అమ్జాద్, సోయబ్ చౌదరిలు గత 21 రోజులుగా కనిపంచలేదు. వీరిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కిడ్నా్ప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీరే కాకుండా 10 మందికి పైగా యూట్యూబర్లు గత కొన్ని వారాలుగా పత్తా లేకుండా పోయారు. సనా అమ్జాద్, చౌదరిను అక్కడి ప్రభుత్వం ఉరి తీసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు ఆన్‌లైన్‌లోకి వచ్చారు. తాజాగా వీరి వీడియోలు యూట్యూబ్‌లో కనిపించాయి. ఇన్నాళ్లు వీరికి ఏమైందా అని అటు పాకిస్తాన్‌లో ఇటు భారత్‌ నెటిజన్లలో ఆందోళన నెలకొంది. తాము భారతీయ అనుకూల కంటెంట్ చేస్తున్నామని చెబుతూ ఒక రాజకీయ సమూహం తమను కిడ్నాప్ చేసిందని వీరిద్దరు అసలు విషయాన్ని వెల్లడించారు. తమ కంటెంట్‌ని ఆపాలని తమపై ఒత్తిడి చేశారని, తమను కిడ్నాప్ చేసి హింసించినట్లు వీరిద్దరు చెప్పారు. “తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, సాయుధులైన వ్యక్తులు నా ఇంటికి చొరబడి, నా కళ్ళకు గంతలు కట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. వారు నన్ను 3 వారాల పాటు హింసించారు” అని సోయబ్ చౌదరి చెప్పారు. ‘‘ నేను వారికి బహిరంగ సవాల్ చేస్తున్న.న నేను ఎవరికి భయపడను. ఎవరైనా పాకిస్తాన్‌కి హాని చేస్తుంటే, చట్టపరిధిలోనే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతా’’ అని అన్నారు.

ట్రంప్ కొత్త చట్టంతో వారిలో వణుకు.. ఫిబ్రవరి 20కి ముందే పిల్లలను కనేందుకు ప్లాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం తర్వాత ‘బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌’లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పై సంతకాలు చేశారు. దాని ప్రకారం, ఇకపై అమెరికాలో జన్మించిన ప్రతీ పిల్లవాడు స్వతంత్రంగా అమెరికన్‌ పౌరసత్వాన్ని పొందకూడదు. ఈ నిర్ణయం 20 ఫిబ్రవరి తర్వాత జన్మించే పిల్లలకు అమలులోకి రానుంది. దీంతో అమెరికాలో బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌ పొందేందుకు ఆసక్తి చూపించే ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి, ఆ హాస్పిటల్స్ లో డెలివరీ కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. న్యూజర్సీలోని ఒక మ్యాటర్నిటీ క్లినిక్‌ డాక్టర్‌ డాక్టర్‌ ఎస్డీ రామా వెల్లడించినట్లుగా.. ట్రంప్‌ ప్రభుత్వ ఆదేశం అనుసారం 20 ఫిబ్రవరి తర్వాత పుట్టే పిల్లలకు జన్మనగత పౌరసత్వం పొందడం కష్టం కానున్నందున, చాలామంది తల్లులు ముందస్తుగా సి-సెక్షన్‌ పద్ధతిలో డెలివరీ చేయమని డాక్టర్‌లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో ఎక్కువగా భారతీయ మహిళలు 8-9 నెలల గర్భంతో ఉన్నారు. వీరంతా 20 ఫిబ్రవరి కంటే ముందే తమ పిల్లలను జన్మించమని డాక్టర్‌లను కోరుతున్నారు. అయితే, చాలా మంది గైనెకోలజిస్ట్‌లు, డాక్టర్‌లు ఈ డెలివరీని ముందే చేయడం పిల్లలకే కాకుండా తల్లులకూ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. టెక్సస్‌కు చెందిన డాక్టర్‌ ఎస్‌.జి. ముక్కలా పేర్కొన్నట్లుగా.. “గర్భిణీ తల్లులు ముందస్తుగా డెలివరీ చేయాలని కోరుతున్నప్పటికీ, ఇది పిల్లల ఆరోగ్యానికి, అలాగే తల్లుల ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగించవచ్చు. దీనివల్ల పిల్లల ఫెఫులు సరిగా అభివృద్ధి కాలే అవకాశాలు ఉండవచ్చు, అలాగే తల్లులు కూడా జబ్బులు లేదా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు” అని అన్నారు.

ఎయిర్‌టెల్‌, జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఇక వారికి పండగే!
దేశంలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ట్రాయ్‌ ఆదేశాల మేరకు వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను లాంచ్ చేశాయి. డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు రెండు చొప్పున రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చాయి. కొత్త రీఛార్జ్ ప్లాన్ల ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్లను (రూ.499, రూ.1959) ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ గల రూ.499 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ.1959 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు. ఈ రెండు ప్లాన్‌లపై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌ మెంబర్‌షిప్‌, హలో ట్యూన్‌ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ రెండింటితో పాటు రూ.548, రూ.2249 ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం రూ.458, రూ.1958 ప్లాన్‌లను రిలయన్స్‌ జియో ప్రవేశపెట్టింది. రూ.458 ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు కాగా.. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 1000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అదనంగా జియో టీవీ, సినిమా, క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు లభిస్తాయి. రూ.1958 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో కూడా జియో టీవీ, సినిమా, క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు ఉన్నాయి.

ఇది నేను అస్సలు ఊహించలేదు: జోస్ బట్లర్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ… ‘ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. త్వరగా వికెట్లను చేజార్చుకోవడంతో వెనకపడిపోయాం. వికెట్స్ చేతిలో ఉంటే భారీ లక్ష్యం విధించే అవకాశం ఉండేది. పిచ్‌ పొరపాటు ఏమీ లేదు. భారత బౌలర్లు పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్నారు. స్పిన్నర్లు అద్భుత బంతులు వేశారు’ అని ప్రశంసించాడు. ఈ మ్యాచులో బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేశాడు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. వివరాలోకెళితే 2018లో ముంబై లో దర్శకుడు ఆర్జీవీపై  చెక్‌బౌన్స్‌ కేసు నమోదైంది. శ్రీ అనే కంపెనీకి చెందిన మహేష్ చంద్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ విషయమై ఫిర్యాదు చేసాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కోర్టుకు పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ   ఒక్కసారి కూడా ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి  డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ. 3.72లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వక పోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించింది. ఇటీవల సత్య రీరిలీజ్ సందర్భంగా ఆ సినిమా చేసి తాను మారిపోయాయని ఇక భాద్యత గా సినిమాలు చేస్తానని చెప్పిన వర్మ ‘సిండికేట్’ అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారెమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు
ఓ ప్లాప్ హీరోయిన్  రష్మికను తలదన్నే లైనప్ తో అదరగొడుతూ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న భామామణి సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఆ బ్యూటీ వామికా గబ్బీ. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ను మించిపోయిన లైనప్స్ సెట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ గా మారినప్పటికీ వామికా ఆఫర్లకు కొదవలేదు. స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికను మించిపోయేలా ఆఫర్లను దక్కించుకుంటూ ఐదు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. జబ్ వి మెట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పంజాబీ గుడియా పంజాబీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. 2015లో వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది. అడివి శేష్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్లో కన్ఫమ్ అయ్యింది. రీసెంట్లీ ఆమె ఎంట్రీని ఎనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ వామికా గబ్బీ చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి. కిక్లీ పంజాబీ మూవీతో పాటు జీని, ఇరవాకలం తమిళ్ మూవీస్, తెలుగులో గూఢచారీ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ బాలీవుడ్ ప్రొడక్ట్, మలయాళ మూవీ టికీ టాకాలో యాక్ట్ చేస్తుంది. ఇలా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది బ్యూటీ. మరీ ఈ సారైనా టాలీవుడ్ లో హిట్ రీసౌండ్ వింటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.