NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అచ్యుతాపురం ఘటన మరువక ముందే.. ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం..
అచ్యుతాపురం సెజ్‌ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం ఘటనను మరువకముందే.. అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సెజ్‌లోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో అర్థరాత్రి 1 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. బాధితులను ⁠ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు.. మరోవైపు.. అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. కలెక్టర్‌కు ఫోన్‌ చేసిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.. ఇక, హోంమంత్రి అనితతో మాట్లాడుతూ.. తక్షణమే ఇండస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరోవైపు.. విశాఖ ఇండస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ నలుగురు కార్మికులను ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు.. వారికి అందుతోన్న చికిత్స.. వారి పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీశారు. ఇండస్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కార్మికుల వివరాలు వెల్లడించారు.. కె.సూర్యనారాయణ- కెమిస్ట్ … రోయా అంగిరియా, పి.లాల్ సింగ్ , కె.వైభన్ – హెల్పర్స్ గా గుర్తించారు..

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ షాక్‌.. ఆ వివాదమే కారణం..!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్‌ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య వివాదం నెలకొంది. అదికాస్తా చినికిచినికి గాలి వానలా మారింది. దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ మధ్య సంబంధం బయటకు రావడం రచ్చకు దారితీసింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ వాణి నిరసన చేపట్టింది. 15 రోజులుగా శ్రీనివాస్ ఇంటి ఆవరణలోనే కారు షెడ్‌లో పడుకుంటూ దువ్వాడ శ్రీను వైఖరిపై దుమ్మెత్తి పోసింది. దువ్వాడ వాణితో పాటు కుమార్తె హైందవి కూడా శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక.. ఈ వ్యవహారంలో ఇరువర్గాలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఐదు షరతులతో కుటుంబ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా సఫలం కాలేదు. దీంతో దువ్వాడ శ్రీనివాస్-వాణి వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. మాధురి సైతం సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య బంధంపై రచ్చ చేసింది. దువ్వాడ వాణి స్థానిక జడ్పీటీసీ… కాగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ వ్యవహారం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తోందని హైకమాండ్ భావించింది. దువ్వాడ శ్రీనివాస్‌ను ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త ఇంచార్జ్‌గా పేరాడ తిలక్‌ను నియమించింది. దీంతో.. కుటుంబ వ్యవహారం కాస్తా దువ్వాడ శ్రీనివాస్‌ పొలిటికల్‌ కెరీర్‌పై ప్రభావాన్ని చూపినట్టు అయ్యింది.

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. కానీ, జాగ్రత్త సుమీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం… పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్యాలకు కేరాఫ్ అడ్రస్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్ సిటీలో జటిలమైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్. ఇక్కడ చిక్కుకుంటే ఎదురయ్యే కష్టాలు అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, భౌగోళిక పరిస్థితులు కారణంగా ప్రైవేటు వాహనాల సంఖ్య ఏటికి ఏడాది పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రతీ ఏటా పదివేల కొత్త వాహనాలు విశాఖ రోడ్లపైకి వస్తున్నాయి. అనకాపల్లి నుంచి అనందపురం వరకు ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆటో నంబరు ప్లేట్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. AI ఆధారంగా జంక్షన్‌లో ఎటు వైపు నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయో, వాటి సంఖ్య ఎంత ఉందో అంచనా వేస్తాయి. ఏ వైపునకు ఎక్కువ వాహనాలు వెళుతున్నాయో టెక్నాలజీ ద్వారా కాలిక్యులేట్‌ చేసుకొని సిగ్నలింగ్‌ సమయాన్ని ఆటోమేటిక్‌గా మార్చుకుంటాయి.

రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి సిసోడియా పర్యటన ఎఫెక్ట్‌.. అధికారులపై చర్యలు షురూ
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి సిసోడియా విజయనరంలో విస్తృత ప‌ర్యట‌న‌ అనంతరం చర్యలు మొదలయ్యాయి. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు, నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు అందాయి. ఇటీవల రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా. ఎస్. కోట లోని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి పలు దస్త్రాలను పరిశీలించారు. పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వేటు వేశారు.. దీంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులలో గుబులు మొదలైంది. ఎవ్వరిపై వేటు పడుతుందోనని ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. అయితే, ఆర్‌పీ సిసోడియా గతవారం జిల్లాలో విస్తృతంగా ప‌ర్యటించారు. భోగాపురం, ఎస్‌.కోట, వేపాడ మండ‌లాల్లో క్షేత్రస్థాయి ప‌ర్యట‌న‌లు చేసి ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేశారు. భూరికార్డుల‌ను ప‌రిశీలించి భూముల వ‌ర్గీక‌ర‌ణ‌పై వివిధ ప్రభుత్వ శాఖ‌ల వ‌ద్ద రికార్డుల్లో తేడాలు వుండ‌టాన్ని గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఆర్‌.డి.ఓ.లు, త‌హ‌శీల్దార్‌లు, స‌బ్ రిజిస్ట్రార్లతో స‌మావేశమై 22ఏ కేట‌గిరీ భూములు, ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేష‌న్‌, భూముల రీస‌ర్వే అనంత‌రం త‌లెత్తిన ప‌రిస్థితులు, గృహ‌నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూముల గుర్తింపు త‌దిత‌ర అంశాల‌పై సూచ‌న‌లు చేశారు. భూముల వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో రానున్న రోజుల్లో త‌హ‌శీల్దార్ వ‌ద్ద, రిజిష్ట్రార్‌ల వ‌ద్ద రికార్డులు ఒకేలా న‌మోదై వుండాల‌ని స్పష్టంచేశారు. క‌లెక్టర్ కార్యాల‌యంలో ప్రజ‌ల నుంచి భూ స‌మ‌స్యల‌పై విన‌తులు స్వీక‌రించారు. భోగాపురంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం, స‌బ్ రిజిష్ట్రార్ కార్యాల‌యాల‌ను సంద‌ర్శించి భూముల‌కు సంబంధించిన ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలించారు.

గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తా.. సినిమాలను.. రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తా..
గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మైసూర్‌వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు.. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం.. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త.. మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా… గ్రామస్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో 70 శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లే.. అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.. స్వర్ణ గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే, సినిమాలను.. రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తాను అన్నారు. ఇక, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి.. గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది… గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. గత ప్రభుత్వం 51 వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు.. అయితే 25 వేల కోట్లు ఏమై పోయాయో తెలియాలన్నారు.. అన్నా హజారే సర్పంచ్‌గా గెలిచి దేశంలోనే మార్పు తీసుకొచ్చారు.. ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తేవచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ… గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పని చేస్తా.. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉన్న పెన్షన్లు అందించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫైనాన్స్ పై మంచి పట్టు ఉందని ప్రశంసించారు.

ఫార్మా బాధితులకు పరామర్శ.. ప్రభుత్వం తీరుపై జగన్‌ అభ్యంతరం..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు.. హోం మంత్రి సహాయచర్యలు పర్యవేక్షణ కోసం వెళుతున్నాను అనే మాటే చెప్పలేదు.. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశ్రమల మంత్రికి తెలియదు… ఎంత మంది చనిపోయారు తెలియదని చెప్పారు.. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు.. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటు మండిపడ్డారు.. అదే, LG పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలికి హుటాహుటిన తరలించాం.. 11 గంటలకు నేను స్పాట్ కు వచ్చాను అని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ ఇబ్బందులు అధిగమించి సైతం రెస్క్యూ చేశాం… తొలిసారి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించామన్నారు. అయితే, అచ్యుతాపురం ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం అన్నారు జగన్‌.. ప్రభుత్వం అనేది సానుభూతి, బాధ్యత తో వ్యవహరించాలన్న ఆయన.. జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు.. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల సంగతేంటి? అని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎస్‌ నీరాబ్ కుమార్ కమిటీ వేసి వైసీపీ ప్రభుత్వం హయంలో సమగ్ర నివేదిక రూపొందించి అమలు చేశాం.. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ ఆడిట్ లు, సేవలు దుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రతీ పరిశ్రమను తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలను సరిదిద్ది కోవడానికి గడవు ఇచ్చి ప్రోటో కాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తుచేశారు.

టంగుటూరి ధైర్య సహాసాలు, నిజాయితీ తెలుగు పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం
అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు. ఆయన ఓ జ్ఞానశీలీ, త్యాగశీలి.. ఆ రోజుల్లో ఆయనకున్న సంపద జమీందారులకు మించినది.. ప్రకాశం పంతులుకు ఉన్న పేరు ప్రతిష్టలు అనాడున్న కాంగ్రెస్ నేతలకు అసూయ కలిగేలా ఉండేది.. ఆయన సేవలు, త్యాగాలు మరువలేనిది.. ఆయన చరిత్ర పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.. ఆయన బయోగ్రాఫి పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చి భావిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.. వాళ్ళ కుటంబ సభ్యులను కలుసుకుని అయన చరిత్ర తెలుసుకుని సమాజం ముందు ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు.

కూతురిని కాపాడేందుకు భర్తను హత్య చేసిన భార్య.. కోర్టు షాకింగ్ తీర్పు
ప్రస్తుతం దేశం మొత్తం కోల్‌కతా నిర్భయ గురించి మాట్లాడుతోంది. కోల్‌కతా నిర్భయకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మహిళల భద్రత కోసం డిమాండ్లు ప్రతిచోటా లేవనెత్తుతున్నాయి. లైంగిక నేరాలకు గురైన కుమార్తెలకు న్యాయం చేయాలని ప్రజలు ఉద్యమిస్తున్నారు. 16 డిసెంబర్ 2012 రాత్రి ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు, ఆమె తల్లి తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు విశ్రమించలేదు. 2022వ సంవత్సరంలో చెన్నైలో అలాంటి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది, ఓ తల్లి తన కూతురిని రక్షించడానికి ఒక అడుగు వేసింది. మద్రాసు హైకోర్టులో ఓ కేసు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2022లో చెన్నైలో మద్యం మత్తులో ఓ తండ్రి తన 21 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి యత్నించాడని, కూతురి గొంతు వినిపించిన వెంటనే తల్లి గదిలోకి వెళ్లి భర్తను హతమార్చిన సంగతి తెలిసిందే. కూతురిపై నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా కదలకపోవడంతో తల్లి చెక్క పీటతో వీపుపై కొట్టగా, అతడు కదలకపోవడంతో కూతురిని కాపాడేందుకు తల్లి సుత్తితో భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో వెంటనే ఆమె భర్త చనిపోయాడు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసును పరిశీలించిన తర్వాత వ్యక్తిగత రక్షణ కోసమే ఈ చర్య చేసినట్లు స్పష్టమవుతోందని, తన కుమార్తెను కాపాడుకునేందుకే మహిళ ఈ నేరానికి పాల్పడిందని జస్టిస్ జి జయచంద్రన్ అన్నారు. కూతురు పరువు కాపాడేందుకు తల్లి తన భర్తను హత్య చేసిందని కోర్టు పేర్కొంది. తండ్రి మద్యం మత్తులో కూతురిపై అత్యాచారానికి యత్నించినట్లు రికార్డులు చెబుతున్నాయని కోర్టు పేర్కొంది.

విజయవంతమైన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష..దాని ప్రత్యేకత ఏమిటంటే ?
న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. పృథ్వీ-2 ఈ వెర్షన్‌ను DRDO తయారు చేసింది. ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. పృథ్వీ-2 అనేది దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. దానితో పాటు ఆయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంతకుముందు కూడా ఒడిశా తీరం నుంచి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయవంతంగా పరీక్షించారు. గతేడాది జనవరిలో ఈ పరీక్ష జరిగింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో ప్రకటించింది. పృథ్వీ-2 క్షిపణి భారతదేశ అణ్వాయుధాలలో ముఖ్యమైన భాగం.

నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..
నేపాల్‌ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించారు. UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కమలా హారిస్ నామినేషన్ ఆమోదం.. ట్రంప్ కు వార్నింగ్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించారు. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హారిస్‌కు మధ్య ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొంది. గురువారం రాత్రి చికాగోలో జరిగిన ‘డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్’ సందర్భంగా భారతీయ-ఆఫ్రికన్ సంతతికి చెందిన హారిస్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన రెండో మహిళా నాయకురాలిగా ఆమె నిలిచారు. ఆమె డొనాల్డ్ ట్రంప్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రేక్షకులను ఉద్దేశించి, కమలా హారిస్ తన కథను చెప్పారు. ప్రసంగం సందర్భంగా ఆమె తన భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్‌కు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న టిమ్ వాల్జ్ కు మీరు గొప్ప వైస్ ప్రెసిడెంట్ అని నిరూపిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ, ప్రతి అమెరికన్ తరపున, పార్టీ, జాతి, భాషలకు అతీతంగా, నా తల్లి తరపున తమ అసాధ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించిన వారందరికీ ధన్యవాదాలు. నేను కష్టపడి పని చేసేవారు, కలలు కనేవారు, ఒకరినొకరు చూసుకునేవారు, భూమిపై ఉన్న గొప్ప దేశంలో మాత్రమే కథలు రాయగలిగే వారి కోసం నేను నడుస్తున్నాను.

అనిల్ అంబానీకి షాక్.. 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు సెబీ నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలు నిషేధించబడ్డాయి. వీరందరినీ సెక్యూరిటీ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. నిషేధంతో పాటు రూ.25 కోట్ల పెనాల్టీని కూడా సెబీ విధించింది. ఈ నిషేధం తర్వాత అనిల్ అంబానీ ఇకపై సెక్యూరిటీ మార్కెట్‌లో పాల్గొనలేరు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా రూ. 6 లక్షల జరిమానా విధించింది. ఈ కంపెనీపై 6 నెలల నిషేధం విధించింది. కంపెనీ నుండి నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబి వారిపై పెద్ద చర్య తీసుకుంది. సెబీ అనిల్ అంబానీకి రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 5 సంవత్సరాల పాటు ఏదైనా లిస్టెడ్ కంపెనీలో లేదా ఏదైనా మధ్యవర్తిగా సెక్యూరిటీస్ మార్కెట్‌లో డైరెక్టర్‌గా లేదా కీలకమైన మేనేజర్‌గా పాల్గొనకుండా నిషేధించింది. సెబీ వార్త వచ్చిన వెంటనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌లో భారీ క్షీణత నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. రిలయన్స్ పవర్ షేర్లు గత 3 రోజులుగా బలమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. సెబీ వార్త రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నేను బాగానే ఉన్నా.. టీమిండియాలోకి మళ్లీ వస్తా!
‘ఉమ్రాన్‌ మాలిక్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ ఫాస్టెస్ట్‌ బంతిని విసిరిన ఈ ‘కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌’ అందరి దృష్టిని ఆకర్షించాడు. 157 కిమీ వేగంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని ఉమ్రాన్ సంధించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో 2022లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 10 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకొని మ్యాచ్‌లకు సిద్ధమయ్యాడు. ఈలోగా డెంగీ బారినపడ్డాడు. డెంగీ నుంచి కూడా కోలుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వంలోని టీమ్‌ సీలో ఉమ్రాన్‌ మాలిక్‌ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీకి సిద్దమవుతున్న ఉమ్రాన్‌ తాజాగా మాట్లాడుతూ… ‘నేను ఇప్పుడు బాగున్నాను. గాయాలు, డెంగీ నుంచి పూర్తిగా కోలుకున్నా. దులీప్‌ ట్రోఫీపై దృష్టిపెట్టా. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా. తప్పకుండా భారత జట్టులోకి మళ్లీ వస్తా. అందుకు ఈ సీజన్‌ను వినియోగించుకుంటా. దులీప్ ట్రోఫీ మా జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నా’ అని చెప్పాడు.

ప్రభాస్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. ఖబర్దార్: మంచు విష్ణు
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి మన టాలీవుడ్ హీరోపై అక్కసు వెళ్లగక్కారు బాలీవుడ్ నటుడు. రెబల్ స్టార్ నటించినలేటెస్ట్ రిలీజ్ కల్కి 2898 ఏడీ. వరల్డ్ వైడ్ రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ మండి పడుతోంది.ప్రభాస్ పై అర్షద్ వార్శి వ్యాఖ్యలను ఖండిస్తూ నటి, సినిమా అంట్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు లేఖ రాసిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఆర్షద్ ఇక మీదట అలా మాట్లాడకుండా చూసుకోవాలనిం ఆ లేఖలో పేర్కొన్నాడు మంచు విష్ణు మనందరం యాక్టర్స్ ఫ్యామిలీ మనం అలా ఒకరిపై మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించాడు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసిందని మంచు విష్ణు ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి చిన్నపాటి హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేసాడు మంచు విష్ణు.

“సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో
హిట్టు ఫ్లాప్స్ తోసంబంధం లేకుండా విభిన్న చిత్రాలు నిర్మించి సౌత్ సినిమా స్థాయిని పెంచాలని భావిస్తోంది పీపుల్స్ మీడియా. ఒక పక్క తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే తమిళంలో కూడా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. రెబల్ స్టార్ తో ది రాజా సాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో ఓ సినిమాను నిర్మించింది. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”. ఈ గురువారం హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మీట్ అయ్యారు. ఈ సందర్భంగా సాలా సినిమాకు తన బెస్ట్ విశెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్ కు సాలా సినిమా కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. విశ్వప్రసాద్ ఇలాగే అన్ స్టాపబుల్ గా సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించారు ఐకాన్ స్టార్.