Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ముంబై నటి జత్వానీ కేసు.. సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులును అరెస్ట్‌ చేశారు ఏపీ పోలీసులు.. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఇవాళ ఉదయం బేగంపేటలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు.. సాయంత్రంలోగా పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్‌ చేసినట్టు అధికారికంగా చూపే అవకాశం ఉంది.. ఇక, ఇదే కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు క్రాంతి రానా టాటాతో పాటు విశాల్ గున్నిలపై ఆరోపణలు ఉన్నాయి.. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జత్వానీని వేధించి నందుకు కేసు నమోదు చేశారు.. గత ప్రభుత్వ సమయంలో నటి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తన తమ్ముడిని టార్గెట్‌ చేసిన కేశినేని నాని.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు..!
సీఎం నారా చంద్రబాబు నాయుడును సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ.. తన సోదరుడు ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు.. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు భూమిని కేటాయించడం చంద్రబాబు తీసుకున్న దార్శనిక చర్య.. ఇటువంటి కార్యక్రమాలు నిజమైన పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి ఉపయోగం.. అయితే, రూ. 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి కొత్తగా ఏర్పడిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపు సరికాదన్నారు కేశినేని చిన్ని.. ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపొందించిన బినామీ మరియు మోసపూరిత పథకంగా ఆరోపించిన ఆయన.. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి కేటాయింపుకు కొన్ని వారాల ముందు స్థాపించబడింది.. దీనికి గత అనుభవం లేదు, విశ్వసనీయ నేపథ్యం లేదు.. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, MPకి చాలా కాలంగా సహచరుడు మరియు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్‌మేట్.. గతంలో ఇన్వెస్ట్‌మెంట్స్ & ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అపఖ్యాతి పాలైన కంపెనీలో అతని మాజీ వ్యాపార భాగస్వామి.. ఈ కంపెనీ ప్రజల నుండి కోట్లు వసూలు చేసి, చాలా మంది అమాయక కొనుగోలుదారులను మోసం చేసి మూసివేసిందని పేర్కొన్నారు..

లిక్కర్‌ స్కామ్‌లో సాయిరెడ్డి సంచలన ట్వీట్.. వారి పని పట్టండి.. నేను పూర్తిగా సహకరిస్తా..
లిక్కర్‌ స్కామ్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ”ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను” అంటూ ట్వీట్‌ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కాగా, సిట్‌ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి రాజ్‌ కసిరెడ్డే నంటూ వ్యాఖ్యానించారు.. మరోవైపు.. రాజ్‌ కసిరెడ్డి విడుదల చేసిన ఆడియోలో సాయిరెడ్డిపై మండిపడ్డారు.. లిక్కర్‌ కేసు వ్యవహారం తేలిన తర్వాత.. విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ వ్యాఖ్యానించారు రాజ్‌ కసిరెడ్డి.. ఈ నేపథ్యంలో.. ట్వీట్‌తో మరింత రచ్చకు తెరలేపారు విజయసాయిరెడ్డి..

కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ సీఎం భేటీ.. పోలవరం రండి.. బనకచర్లకు అనుమతి ఇవ్వండి..!
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు.. అయితే, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులుతో పాటు, బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతులుపై ఈ సమావేశంలో చర్చించారు.. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కునే రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది.. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.. గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనగా ఉంది.. అయితే, దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు, ఆర్థిక సహకారాన్ని కోరుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తయ్యేలా సహకారం అందించాలని కూడా కేంద్రమంత్రిని కోరారు చంద్రబాబు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించాలని కేంద్రమంత్రిని ఆహ్వానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

ఏం చదువులు ఇవి..? టీచర్‌‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..
టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ టీచర్ కంట పడింది. వెంటనే టీచర్ ఆ విద్యార్థిని సెల్ ఫోన్‌ను తీసుకున్నారు. అంతే విద్యార్ధిని కోపం నసాలనికెక్కింది. చదువు చెప్పిన టీచర్ అని మరిచి అక్రోషంతో అంతటి గౌరవ ప్రథమైన టీచని చెడా మడా తిట్టేసింది. అక్కడితో ఆగలేదు.. తన కాళ్లకి వేసిన చెప్పు తీసి.. ఆ చెప్పుతో చెప్ప చెల్లుమనుపించింది విద్యార్థిని. ఇది చూసిన తోటి విద్యార్థులు సైతం విడిపించే ప్రయత్నం చేసినా.. ఆ విద్యార్థిని వెనుక్కి తగ్గలేదు కాదా.. ముష్టి యుద్ధానికి దిగింది.. ఇదంతా చూసిన వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేమి విష సంస్కృతి అని తోటి ఉపాధ్యాయులు ముక్కున వేలేసుకుంటున్నారు.. అయితే, ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన మొబైల్‌లో చిత్రీకరించడంతో.. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..

ఇంటర్ ఫలితాలు విడుదల.. మళ్లీ బాలికలదే హవా…
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ‌ మధ్యాహ్నం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు 25న ముగిసిన విష‌యం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని కోసం ఎన్టీవీ తెలుగు లింక్ పైన క్లిక్ చేయాలి. మీ.. హాల్ టికెట్ నెంబర్ ను టైప్ చేసి సెర్చ్ చేస్తే స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా చేసుకునే స‌దుపాయం కూడా క‌ల్పించారు. కాగా.. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలు రాణించారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 4,88,430 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్ బాలికలు 73.83, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 5,08,582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం బాలికలు 74.21, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో 76.65 %, సీఈసీలో 45.56% ఉత్తీర్ణత నమోదైంది. ఈ నెల 30 వరకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీ నుంచి రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై!
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ప్రమోషన్ దక్కే ఛాన్సుంది. బీజేపీ అధిష్టానం వారిద్దరిని పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ నుంచి స్మృతి ఇరానీ లేదా అన్నామలై పోటీ చేసే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో వారిద్దరిలో ఒకరిని పంపించాలని చూస్తున్నారు. ఇక మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్ షా.. అన్నామలైను ఢిల్లీకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే అన్నామలైను పెద్దల సభకు పంపించాలని ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా జరగనుంది. అయితే ఈసారి కొత్త ముఖాలకు చోటు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో బీహార్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు పెద్ద పీట వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

భర్తను చంపేముందు గూగుల్‌లో మాజీ డీజీపీ భార్య ఏం వెతికిందంటే ..!
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంట్లో అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యారు. దాదాపు 10-15 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ విలవిలలాడి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ రాక్షసుడిని చంపేశానంటూ పెద్ద పెద్దగా అరుస్తూ భార్య పల్లవి హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు ఒకింత భయాందోళనతో వణికిపోయారు. రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలో గౌరవ, మర్యాదలు పొందిన వ్యక్తి ఆ విధంగా హత్యకు గురి కావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ కేసులో నిందితురాలు పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను ఎలా చంపాలన్న విషయంపై గత 5 రోజులుగా గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎక్కడ నరాలు తెగితే త్వరగా చనిపోతారో.. ఆ విషయాన్ని ఆమె శోధించినట్లుగా కనుగొన్నారు. హత్యలో భార్య పల్లవి, కుమార్తె కృతి ఉన్నారు. కానీ హత్య తానే చేశానంటూ పల్లవి నేరాన్ని అంగీకరించింది. దీంతో భార్యనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఇక సోమవారం పోలీసులు.. సంఘటనాస్థలికి తీసుకుని వెళ్లి విచారించారు. అయితే కృతి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర
భారతదేశంలో బంగారం పరుగులు ఆగట్లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జెట్ స్పీడులో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర లక్ష దాటింది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పసిడి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభకార్యాలకు బంగారం కొనాలన్నా.. ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,000 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,750 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900గా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే వెండి ధర లక్ష దాటిన విషయం తెలిసిందే. నిన్న కిలో వెండిపై రూ.1000 పెరగగా.. ఈరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,11,000గా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.

మేము గెలవాల్సిన మ్యాచ్‌.. ఓపెనింగ్ సరిగా లేదు!
తమ బౌలింగ్‌ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్‌ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా అయిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ అనంతరం కోల్‌కతా కెప్టెన్‌ అజింక్య రహానే మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ‘199 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తాం అనుకున్నాం. భారీ ఛేదనలో ఓపెనింగ్ ఆరంభం బాగుండాలి. మా జట్టు ఓపెనింగ్ సరిగా లేదు. ఈ టోర్నమెంటంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాము. నిజానికి మా బౌలింగ్‌ విభాగం బాగుంది. బ్యాటింగ్‌లోనే మేము తడబడ్డాము. మేం మా తప్పుల నుంచి తొందరగా నేర్చుకోవాల్సి ఉంది. ఈ పిచ్‌ కాస్త నెమ్మదిగా ఉంది. ప్రత్యర్థి జట్టును 200 లేదా 210లోపు కట్టడి చేయాలనుకున్నాం. మాకు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. గుజరాత్‌ను కట్టడి చేయడంలో సఫలం అయ్యాము’ అని జింక్స్ చెప్పాడు.

ఐపీఎల్ టికెట్స్ తో ప్రమోషన్స్ కు తెరలేపిన చౌర్య పాఠం టీమ్
సినిమా పబ్లిసిటీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అనిల్ రావిపూడి అనే దర్శకుడు సినిమా ప్రమోషన్స్ ను కొత్త ట్రెంట్ సెట్ చేసాడు. ఇప్పుడు అందరు అదే దారిలో వెలుతున్నారు. మరికొందరు సినిమా టికెట్స్ ను ఫ్రీ గా ఇస్తూ తమ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా చౌర్య పాఠం అనే సినిమా మేకర్స్ మరో కొత్త ట్రెండ్ కు తెరలేపారు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఐపీల్ ట్రెండ్ నడుస్తోంది. దాన్ని పసిగట్టిన మేకర్స్ ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ వెదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు చౌర్యపాఠం మేకర్స్ ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కానీ టికెట్స్ గెలవాలంటే చిన్నపాటి కాంటెస్ట్ నిర్వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించి అందుకు సంబంధించి మేకర్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులను మేకర్స్ ఇచ్చిన నంబర్ కు వాట్సప్ చేయాలని, సరైన జవాబులు చెప్పిన వారిలోనుండి కొందరిని విజేతలుగా ప్రకటిస్తూ వారికీ ఐపీఎల్ టికెట్స్ ఇవ్వనున్నారట. నక్కిన త్రినాథరావు నిర్మించిన చౌర్య పాఠం నెల 25న విడుడుల కాబోతుంది. ఏదేమైనా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు మేకర్స్. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ లో ఇంకెన్నీ జిమిక్కులు చూడాలో.

అజిత్, విక్రమ్ బాకీ తీర్చారు.. ఇక సూర్య వంతు
లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చాంరా బాబు సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చితో డిజాస్టర్ చూశాడు అజిత్. కానీ ఒక్కొక్కరుగా లెక్కలు సరిచేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో తన హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టేశాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా కొల్లగొట్టి తలా హయ్యెస్ట్ గ్రాసర్ తనివు రికార్డును చెరిపేసింది. ఇక విక్రమ్ కూడా వీర ధీర శూరన్ 2తో డీసెంట్ హిట్ కొట్టేశాడు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా మాస్ ఎలివేషన్స్, కంటెంట్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు చియాన్ అండ్ అజిత్. ఇలా ఈ స్టార్ హీరోస్ ప్లాపుల నుండి గట్టేక్కేశారు. ఇప్పుడు సూర్య వంతు వస్తోంది. కంగువాతో ఆల్ట్రా డిజాస్టర్ చూసిన సూర్య రెట్రోతో టెస్ట్‌కు సిద్ధమయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య- పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రెట్రో మే1న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్ డిఫరెంట్‌గా ఉంది. స్టోరీ రివీల్ చేసి చేయనట్లు కనిపిస్తోంది. ఇక సూర్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంగువా నుండి రెట్రోకు ఫుల్‌గా మేకోవరై మెస్మరైజ్ చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో. రెట్రోపై ఎక్స్ పర్టేషన్స్ హై లెవల్లోనో ఉన్నాయి. మరీ సూర్య హిట్ అందుకుంటాడో లేదో మరో కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version