NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దేవుడితో పెట్టుకున్నారు.. ఆ పార్టీ మూతపడటం ఖాయం..!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది.. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.. ఇక, టీటీడీ ఈవో స్టేట్‌మెంట్‌.. ల్యాబ్స్‌ రిపోర్టులు బయటకు రావడం కలకలం సృష్టించింది.. ఇక, ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా జగన్ మోసం చేశాడని ఫైర్‌ అయ్యారు.. తిరుపతి లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.. దేవుడితో పెట్టుకున్న వైఎస్‌ జగన్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూత పడిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.. ఇక, వైసీపీ పాతాళంలోకి వెళ్లిపోవడం ఖాయం అన్నారు.. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ పార్టీలో ఉన్నవారు ఒకసారి ఆలోచించండి అని హితవుపలికారు.. దేవుడిని కూడా వదలని జగన్ పార్టీని వదిలి మీకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి అంటూ పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు..

అన్నంత పని చేసింది..! వారం రోజుల శిశువును అమ్మేసిన తల్లి..
మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది. కుటుంబ కలహాలతో భర్తతో కాకుండా రాయదుర్గంలో ఒంటరిగా జీవిస్తుంది. ఈమె గర్భవతిగా ఉన్నపుడే ఆమె రాయదుర్గం పట్టణ శివారులో ఒంటరిగా ఉండేది. అప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సలు అందించారు. అయితే, అప్పటి నుంచి తనకు పుట్టే సంతానాన్ని అమ్మేస్తానంటూ చెబుతూ వచ్చేది. దీంతో ఆమె బంధువులకు, కుటుంబీకులకు సమాచారం అం దించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసవించేదాకా పర్యవేక్షిస్తూ వచ్చారు. అంతిమంగా మగశిశువును 15 రోజుల క్రితం జన్మనిచ్చింది. కాగా ఆమెకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆమె జన్మనిచ్చిన మగశిశువు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఆమె ఉన్న ఇంటి వద్దకు వెళ్లి శిశువు గురించి ఆమెను ఆరా తీశారు. కానీ వారం క్రితమే ఆమె శిశువును రూ. 80 వేలకు ఆమె విక్రయించేసినట్లు వెల్లడించింది. దీనిపై అప్రమత్తమైన సిబ్బంది పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా, రాయదుర్గం పట్టణానికి చెందిన ఎరుకుల రాజశేఖర్‌కు దత్తత ఇచ్చినట్లు పత్రాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించి శిశువును ఎక్కడ ఉంచారన్న విషయంపై గాలించాలని కోరడంతో రాజశేఖర్‌ను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. అతని సమీప బంధువులకు సంతానం లేకపోవడంతో వారి వద్ద ఉన్నట్లు తెలిపారు. శిశువును వెంటనే స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించడంతో హుటాహుటిన తీసుకొచ్చి ఐసీడీఎస్ సీడీపీవో పద్మావతికి అప్పగించారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాలలో పరీక్షలు చేయించి స్వాధీనం చేసుకున్నారు. శిశువును నేరుగా దత్తత ఇవ్వడం కుదరదని తల్లి రూపమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని తన తదనంతరం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే కారణంతో వారికి అప్పగించినట్లు ఆమె చెప్పింది. సంతృప్తి చెందని అధికారులు ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు ఉండడంతో శిశువును శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు.

జనసేన వర్సెస్‌ టీడీపీ..! ఒంగోలులో ఫ్లెక్సీల రగడ
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. బాలినేని వంటి నేతలు గతంలో తమను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు జనసేనకు వస్తున్నారని ఆరోపించారు.. బాలినేని పార్టీ మార్పు వ్యవహారంలో తమ నేతల అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికలకు ముందు జనసేనలోకి వచ్చిన వారిని స్వాగతిస్తామని.. ఇప్పుడు వచ్చే వారు మీ ఇష్టానుసారం చేయాలని చూస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.. రాజకీయాలు వేరు.. బంధుదుత్వాలు వేరంటూ లేఖలో ఘటు వ్యాఖ్యలు చేసిన బాలినేని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు… ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీంతో ఆయన దాదాపుగా వచ్చే 4వ తేదీన ఒంగోలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుచరులతో పాటు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు..

దవాఖానలో గుంపులుగా వీధి కుక్కలు.. భయాందోళన లో పేషెంట్లు
ఆస్పత్రిలో కుక్కలు సంచరిస్తుండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జనరల్‌ దవాఖాన, ప్రాంగణంలో వీధి కుక్కలు స్వైర విహారంతో పేషెంట్లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు ఏడు వీధి కుక్కలు దవాఖానలోకి ప్రవేశించాయి. కుక్కల ఒకే సారి గుంపులుగా వచ్చి ఆస్పత్రి ఓపీ గది ముందు సంచరించాయి. చాలా సేపు ఓపీ గది ముందు బైఠాయించాయి. అనంతరం ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ రోగులను భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుక్క కనిపిస్తేనే భయంతో పరుగులు పడతాం.. అలాంటిది ఆసుపత్రిలో ఒకే సారి కుక్కల గుంపును చూసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఆసుపత్రి సిబ్బంది కుక్కల గుంపును వెళ్లగొట్టకపోవడంతో రోగులు, వారి బంధువులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల గుంపు ఆస్పత్రి వార్డుల్లో తిరుగుతూ రోగుల ఆహారం లాక్కెళ్లి తింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన వనపర్తి జిల్లా అమరచింతలోని శ్రీకృష్ణనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు అభినాష్, అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. అక్షయ్ కుమార్ ఎడమ చెవిపై, అభినాష్ వీపుపై గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అక్షయ్‌కుమార్‌ను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా, అభినాష్‌కు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, మున్సిపల్ అధికారులు వీటిని నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

సైకిల్ దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురిపై గుంపు దాడి.. ఒకరి హత్య
బీహార్‌లోని కతిహార్‌లో సైకిల్ దొంగతనం చేశారనే ఆరోపణపై ఓ గుంపు ముగ్గురిని దారుణంగా కొట్టింది. హింసాత్మక గుంపులు కొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. జిల్లాలోని కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్వారియా వార్డు నంబర్ 4లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ సైకిల్ దొంగతనం ఆరోపణలపై ముగ్గురు యువకులను ప్రజలు గుంపు పట్టుకున్నారు. అతని చేతులు కట్టేసి కొట్టారు. ప్రేక్షకులు ముగ్గురిపై తన్నడం, కొట్టడం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు యువకులను గుంపు నుంచి రక్షించారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఓ యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఇంట్లో గందరగోళం నెలకొంది.

పాలస్తీనా జెండా పట్టుకోవడంలో తప్పు లేదు… వివాదానికి ఆజ్యం పోసిన కర్ణాటక మంత్రి
కర్ణాటకలో మిలాద్-ఉల్-నబీ ఊరేగింపుల సందర్భంగా పాలస్తీనా జెండాలు రెపరెపలాడాయి. ఈ కారణంగా రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. కాగా, రాష్ట్ర మంత్రి బి. జాడే. జమీర్ అహ్మద్ ఖాన్ జెండాలు ఊపడాన్ని సమర్థించారు. అదే సమయంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా జెండాను రెపరెపలాడించడం సమస్య కాదని మంత్రి ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇస్తుంది. చిత్రదుర్గ, దావణగెరె, కోలార్ వంటి ప్రాంతాల్లో ఊరేగింపుల సందర్భంగా పాలస్తీనా జెండాలను రెపరెపలాడించడం పట్ల భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యంతరం చెబుతోందని జమీర్ అహ్మద్ ఖాన్ విమర్శించారు. ఇతర దేశాలకు అనుకూలంగా నినాదాలు చేయడం ఆమోదయోగ్యం కాదని, అయితే కేవలం జెండా పట్టుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వమే పాలస్తీనాకు మద్దతిచ్చింది. పాలస్తీనాకు మద్దతిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలస్తీనా జెండాను ఎవరో పట్టుకున్నారని, అందుకే బీజేపీ దాన్ని పెద్ద సమస్యగా మారుస్తోందన్నారు. ఎవరైనా వేరే దేశాన్ని పొగిడితే అది తప్పు, అతను దేశద్రోహి, ఉరితీయాలి. కానీ నా ప్రకారం (పాలస్తీనా) జెండా పట్టుకోవడంలో తప్పు లేదు. ఇది కాకుండా, మాండ్య జిల్లాలోని నాగమంగళలో ఇటీవల జరిగిన హింసాకాండకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి లింక్ చేస్తూ బిజెపి చేసిన ఆరోపణలపై మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కూడా ఎదురుదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, అయితే వారు 50 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, ఇప్పుడు వారిని స్థానికులుగా పరిగణించాలని ఆయన అన్నారు.

షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఈ సమయంలో, విరాట్ కోహ్లీ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 37 బంతుల్లో 17 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ బౌలర్‌పై ఆసక్తికరమైన జోక్ చేశాడు. కోహ్లీ దగ్గర షకీబ్ ఉల్ హసన్ నిలబడి ఉన్నాడు. ‘మలింగ లాగా, యార్కర్‌ తర్వాత యార్కర్‌ బౌలింగ్‌ చేస్తున్నావని’ అన్నాడు. దీంతో షకీబ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీతో పాటు, రిషబ్ పంత్ యొక్క ఆసక్తికరమైన వీడియో కూడా బయటపడింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అతను రవీంద్ర జడేజాతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.

జానీ మాస్టర్‌ కేసులో మరో ట్విస్ట్.. ఆమెపై కూడా కేసు..!
సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌ కేసు కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే జానీకి వ్యతిరేకంగా కొందరు.. మద్దతుగా మరికొందరకు ముందుకు వస్తున్నారు.. అయితే, ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ మాదిరిగా.. కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా.. జానీ మాస్టర్‌ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్‌ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.. బాధితురాలిగా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్‌ ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసినందుకు చర్యలకు సిద్ధం అవుతున్నారట పోలీసులు.. జానీ మాస్టర్‌ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. జానీ మాస్టర్‌ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్‌ వేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారు.. ఇప్పటికే ఈ కేసులో మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదుతో సమగ్ర దర్యాప్తు జరుపుతోన్న విషయం విదితమే..

‘వెంకీ మామ’ సెట్లో.. ‘బాల బాబాయ్’ సందడి.. వీడియో వైరల్..
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్  వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సెట్స్‌ లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. RFCలో లేటెస్ట్ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ #వెంకీఅనిల్3 సెట్స్‌ లో సందడి చేశారు. ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య సోదరభావం చూడటం డిలైట్ ఫుల్ గా వుంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులు. అనిల్ రావిపూడి NBK ఆల్-టైమ్ హిట్ భగవంత్ కేసరిని రూపొందించారు, ఈ మూవీ SIIMAలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.  విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, SVC ప్రొడక్షన్ నెం 58 కు టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్. ‘వెంకీ అనిల్’ 03ని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో నాని, SJ సూర్యల అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ నిరాశపరిచినా ‘సరిపోదా శనివారం’ తో ఆ బాకీ తీర్చేసాడు. థియేటర్ రన్ దాదాపు ముగించుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాను ఈ నెల 26న స్ట్రీమింగ్ కు తీసుకు రానున్నట్టు అధికారకంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సరిపోదా శనివారం ఓటీటీలో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.