NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట
ఓవైపు కుటుంబ వ్యవహారాలు.. మరోవైపు కేసులతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు సతమతం అవుతున్నారు.. హైదరాబాద్‌ జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్‌ పోలీసులు.. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. ఇక, మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు.. ఈ నెల 9వ తేదీన మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుల పై దాడి జరగగా.. జర్నలిస్టుల ఫిర్యాదుతో పీఆర్వో సతీష్ తో పాటు మరికొందరి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు వారికి ఊరట కలిగిస్తూ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు..

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీలు.. దీక్షల విరమణ ప్రారంభం..
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ ఇచ్చిన తర్వాత అంటే ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు.. ఇక, భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవాని దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి.. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం అన్నారు సీపీ రాజశేఖర్‌బాబు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఏడాది 7 లక్షల పై చీలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నాం.. భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం.. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుందని పేర్కొన్నారు..

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు సమీక్ష
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ ఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి.. అయితే, అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు. ఇక, భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వర్షాల అనంతరం పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు సీఎం.. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కాగా, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్‌..

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైన విషయం మరువక ముందే.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు మళ్లీ టెన్షన్‌ పెడుతున్నాయి.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందంటున్నారు.. అయితే, ఈ ఘటనతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు.. స్వల్ప భూప్రకంపనలే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఇక, ఈ భూప్రకంపనలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

ప్రభుత్వానికి రోజా సవాల్‌.. నేను చేసిన అవినీతి ఏంటి..?
తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి ను చూస్తే భయపడ్డారు, ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.. ఓట్లు కోసం కాళ్ళు, చేతులు పట్టుకున్నారు… ఇప్పుడు వదిలేశారన్న ఆమె.. ఈవీఎంలు మేనేజ్‌ చేయడం వల్లే.. ఈ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.. అధికారంలో ఉన్న కూటమీ ప్రభుత్వంపై నెల రోజులకే వ్యతిరేకత మొదలైంది‌‌‌.. జగన్ అన్న నాయకత్వంలో జగన్ అన్నకు తోడుగా, అండగా ప్రజలు పక్షాన పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.. రాబోయే ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని సూచించారు.. కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నా, మా పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచినా, వేధించినా, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఆర్.కే.రోజా, సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష.. ఇక, కూటమీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్‌ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం‌.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.. కులం, మతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు.. అబద్దాపు హామీలు ఇచ్చి కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.. మళ్లీ ఏపీ ప్రజలు ఎప్పుడప్పుడు జగన్ సీఎం అవుతారా? అని ఎదురుచూస్తున్నారు.. బాబు షూరిటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. కరెంట్ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచారు‌‌.. తిరుపతిలో పబ్ లు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్‌ జగన్ కటౌట్ చూస్తూ కూడా కూటమీ నేతలు భయపడుతున్నారు.. అధికారులను అడ్డం పెట్టుకుని పుట్టిన రోజు వేడుకలను అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

కేటీఆర్ స‌వాల్.. రాజీనామా ఇచ్చి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా..
రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా రైతు రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కొండారెడ్డి పల్లి, పాలేరు నుంచి ఎక్కడికైనా వెళ్లాలని సవాల్ విసిరారు. ఇవాళ అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రైతులను అడగాలని అన్నారు. 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపించాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్‌ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని.. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీకి రూ.49 వేల 500 కోట్లు అని చెప్పారు. మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో సీఎం రూ. 19 వేల కోట్లు. ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం.. ఈ రాష్ట్రంలోని ఏ పల్లెకైనా వెళ్దాం.. కొండారెడ్డిపల్లె, సిరిసిల్ల, పాలేరు.. ఎక్కడి వెళ్దాం మంటే అక్కడికి వెళ్దాం. ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇలాంటి బుకాయింపులు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టేందుకు యత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల భరోసా బడ్జెట్‌లో 15 వేల కోట్లు కేటాయించారు. రూ. 70 లక్షల మంది రైతులకు 23 వేల కోట్లు కావాలి. రైతుబంధు కోత సిద్ధమైన తర్వాతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం వేసి కాలయాపన చేస్తున్నారు. వర్షాకాలంలో రైతుబంధును నివారించినట్లే ఇప్పుడు కూడా రైతుబంధును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనిఫెస్టోలో కోతలను ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రాష్ట్రంలో కోటికి పైగా పాన్ కార్డులు ఉన్నాయి. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా? ఐటీ కట్టే వాళ్లకు కట్ట్‌ చేస్తామంటే ఎలా ? రైతు బంధు పథకాన్ని ఉరి వేయబోతున్నారని మా అనుమానం అని కేటీఆర్ అన్నారు.

రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన..
అసెంబ్లీ సమావేశాలు 7వరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం శాసనసభ ప్రారంభం కాగా స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. రైతు భరోసా ప్రక్రియపై సభ్యులు సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను సంక్రాంతి పండుగ నాటికి ఖరారు చేసి అనంతరం రైతు భరోసా చెల్లింపులు జరుపుతామని మంత్రి ప్రకటించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017-18లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి సీజన్‌కు ఎకరాకు రూ.4వేలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచామన్నారు. ఈ పథకంలో పేర్కొన్నట్లు భూమిని సాగుచేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని, అయితే ఈ పథకం అమలులో చాలా తేడా ఉందన్నారు. దీనిని సక్రమంగా అమలు చేసేందుకు వివిధ నిధులను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. పలువురు నిపుణులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ కమిటీ విధివిధానాలను సిద్ధం చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జనవరిలో అమలు చేయాలని భావించిన ఈ పథకానికి సంబంధించి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి.. వీటన్నింటిని క్రోడీకరించి తుది విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమాను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు భారీ షాక్‌..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో భారీ అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కాగా, ఈ కేసులో డిసెంబర్ 5న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఈడీ అనుమతి కోరింది. తాజాగా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్‌ను విచారించేందుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మరోసారి ఈడీ విచారణ చేయనుంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 13న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఇవ్వడంతో.. ఆయన ఆరు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత తీహార్‌ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

జార్జ్‌ సోరోస్‌ను విందుకు ఆహ్వానించారన్న కేంద్ర మంత్రి.. శశి థరూర్‌ సీరియస్..!
భారత్‌ను అస్థిరపర్చడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్‌ చేతులు కలిపిందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. అమెరికా వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌తో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు ఆహ్వానితుల జాబితాలో జార్జ్‌ సోరోస్‌ పేరును కాంగ్రెస్‌ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి వెల్లడించారు. ఆ సమయంలో తాను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పూరి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. 2009లో వివిధ దేశాలలోని ముఖ్య నేతలు, వ్యక్తుల పేర్లను సేకరించి వారికి ఆహ్వానం పంపించాం.. అప్పుడు సోరోస్‌ ఓ వ్యాపారవేత్తగానే తెలుసు.. ఆయనకు భారత్‌లోని ఏ సంస్థతో సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదన్నారు. దాని గురించి ఆయనతో ఏ రోజు కూడా చర్చించలేదన్నారు. ఆ మీటింగ్ లో గ్లోబల్‌ వార్మింగ్‌కు పశ్చిమదేశాలదే బాధ్యత అని భారత సర్కార్ ఆరోపనలు చేసింది.. అయితే దానికి ఆయన తీవ్ర అభ్యంతరం తెలపడం మాత్రమే గుర్తుందని శశిథరూర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. 30శాతం లేట్ పేమెంట్ ఛార్జీలపై బ్యాంకులకు సుప్రీంకోర్టు షాక్
క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 30 శాతంగా నిర్ణయించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. క్రెడిట్ కార్డ్ హోల్డర్ల నుండి సంవత్సరానికి 36 శాతం – 50 శాతం మధ్య వడ్డీ వసూలు చేయడం అధిక వడ్డీ రేటు అని కమిషన్ పేర్కొంది. హెచ్ ఎస్ బీసీ, ఇతరుల నేతృత్వంలోని బ్యాంకులు చేసిన అప్పీళ్లపై న్యాయమూర్తులు బేలా ఎం. త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎన్‌సిడిఆర్‌సి 2008 నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఈ ఆర్డర్‌ను సస్పెండ్ చేయకుంటే తమకు నష్టం వాటిల్లుతుందని బ్యాంకులు వాదించడంతో 2009లో వినియోగదారుల కమిషన్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బ్యాంకుల పనితీరును నియంత్రిస్తూ ఇటువంటి ఉత్తర్వులను జారీ చేసే అధికారం ఎన్‌సిడిఆర్‌సికి లేదని కూడా బ్యాంకులు పేర్కొన్నాయి. ఎన్‌సిడిఆర్‌సి తన నిర్ణయంలో బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ హోల్డర్ల బేరసారాల స్థితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని అంగీకరించకపోవడమే తప్ప క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు బేరసారాలు చేసే శక్తి లేనందున ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని పేర్కొంది. ఎన్జీవో ఆవాజ్ ఫౌండేషన్ పిటిషన్‌పై ఇచ్చిన నిర్ణయంలో.. క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటానికి బ్యాంకులు వివిధ మార్కెటింగ్ వ్యూహాల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తాయని కమిషన్ అంగీకరించింది. వినియోగదారు ఒక షరతు ప్రకారం తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనందుకు పరిహారంగా అసమానమైన అధిక మొత్తాన్ని చెల్లించవలసి వస్తే, అది అన్యాయమైన వాణిజ్య విధానం అవుతుంది.

పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్నా
రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అమ్మడు వరుస హిట్లు కొడుతూ నేషనల్ క్రష్ గా కొనసాగుతూ ఉంది. తాజాగా తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె “పుష్ప 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించుకుంది. పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ లోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది పుష్ప 2. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకించి జాతర ఎపిసోడ్ లో రష్మిక డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. రష్మికకు ఎంతోమంది కొత్త అభిమానులను సంపాదించిపెట్టింది పుష్ప 2 సినిమా. “పుష్ప 2” తో పాటు రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రష్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సికిందర్ సినిమా కూడా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో నటించడం కూడా రష్మికకు 2024 మిగిల్చిన ఒక మంచి మెమొరీ. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ కు సెండాఫ్ ఇస్తూ మరో సెన్సేషనల్ స్టార్ట్ కోసం 2025 కు వెల్ కమ్ చెప్పేందుకు ఆమె ఈగర్లీ వెయిట్ చేస్తోంది.

సగం సినిమా చూసి వెళ్లిపోతే టికెట్ డబ్బులు వాపస్.. బంపర్ ఆఫర్ కదూ
డిజిటల్ యుగంలో సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో సినిమాలు, వెబ్ షోలను చూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో ఓటీటీ వీక్షణ చాలా సులభం అయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడం లేదు. పుష్పరాజ్ రేంజ్ లో ఏదైనా స్పెషాలిటీ ఉంటే తప్ప, బుక్ మై షో, ఆన్‌లైన్ పోర్టల్‌లలో టిక్కెట్లు అమ్ముడు పోవడం లేదు. అమెరికాలో లాగా మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే `సినిమా పాస్` వ్యవస్థను అమలు చేస్తున్నాయి. ఒక నెలలో సినిమాల వీక్షణను పెంచడానికి, ప్రజలను థియేటర్లకు తీసుకురావడానికి, వారు బల్క్ బుకింగ్‌లతో ఉచిత టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ప్రముఖ మల్టీప్లెక్స్‌లు ఇప్పటికీ ఇటువంటి వినూత్న విధానాల కోసం ప్రయత్నిస్తున్నాయి. PVR INOX సాంప్రదాయ దృఢమైన సినిమా వీక్షణ నమూనా నుండి మరింత సౌకర్యవంతమైన వీక్షణ నమూనాకు మారుతున్నట్లు ప్రకటించింది. PVR `FLEXI Show` అనే కొత్త భావనను ప్రవేశపెడుతోంది. PVR ఒక వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీనిలో వీక్షకుడు షోను మధ్యలో వదిలివేయాలనుకుంటే, వీక్షణ శాతం ఆధారంగా వారికి టికెట్ ధరను తిరిగి చెల్లిస్తారు. FLEXI Show టికెటింగ్ మోడల్ సమయ-ఆధారిత వాపసు వ్యవస్థను పరిచయం చేస్తుంది. ప్రేక్షకులు సినిమా నచ్చకపోయినా లేదా ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా, షోను మధ్యలో వదిలివేయవచ్చు.

Show comments