NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

శ్రీశైలంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం.. బెంబేలెత్తిన భక్తులు, స్థానికులు
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్‌లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట జీపుల్లోనూ స్థానికులు గడపాల్సి వచ్చిందట.. లాలితంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో కె,ఎల్ బ్లాక్ మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం ఉధృతంగా సాగింది.. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి బెంబేలెత్తిపోయారు శ్రీశైలం గ్రామస్థులు, భక్తులు, పర్యాటకులు.. మరోవైపు.. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ, ఆంధ్రని కలిపే రహదారిపై పడ్డాయి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చరియలు రాత్రి సమయానికి విరిగి పడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చరియల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..
వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్‌కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.. గత ప్రభుత్వ హయాంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో.. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు.. అయితే, నిన్న జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఆయన తరఫున న్యాయవాదులు పోలీసులకు కలిసి వివరణ ఇచ్చారు.. తాజాగా నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాగా, ఇప్పటికే ఓసారి పోలీసుల విచారణకు హజరైన జోగి రమేష్.. మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. అయితే, జోగి రమేష్‌ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. విచారణకు రావడం లేదని తెలియజేశారు. గత శుక్రవారం జోగి రమేష్‌ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరుకావడంతో.. గంటన్నర పాటు ప్రశ్నించి పంపించారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరోసారి విచారణకు మంగళవారం హజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. ఆయనను అరెస్టు చేస్తారని చర్చ మొదలైంది.. దీంతో.. ఆయన విచారణకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతుండగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చావు కూడా ఆ దాంపత్యాన్ని విడదీయలేదు.. భర్త మరణంతో కుప్పకూలి భార్య మృతి
మూడుముళ్ల బంధంతో ఒకటైన దూదేకుల చిన్న తిరుపాలు, దూదేకుల అక్కమ్మ దంపతుల దాంపత్య జీవితం మరణం వరకు కొనసాగింది.. ఇద్దరు ఒకే రోజు మృత్యువు ఒడిలోకి చేరారు.. బండి ఆత్మకూరు మండల పరిధిలోని వెంగళరెడ్డిపేట గ్రామానికి చెందిన దూదేకుల చిన్న తిరుపాలు (70), భార్య దూదేకుల అక్కమ్మ (65).. ఇద్దరిదీ 50 ఏళ్ల దాంపత్య జీవితం. వారికి ఐదుగురు సంతానం. అయితే, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చివరకు తిరుపాలు మృతి చెందాడు.. ఓవైపు తిరుపాలుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. తన భర్త తిరుపాలు మృతదేహం వద్ద అక్కమ్మ కూడా కుప్పకూలి కన్నుమూసింది.. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఇక, ఒకేసారి ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించడం కూడా ఆ కుటుంబానికి భారంగా కావడంతో.. గ్రామస్తులు తలా ఒక చెయ్యి వేసి తిరుపాలు- అక్కమ్మలకు అంత్యక్రియలు నిర్వహించారు..

ఏపీకి ఎన్నో పరిశ్రమలు వస్తాయి.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇబ్బంది లేదు..!
ఈ ఐదు ఏళ్లలో అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని సమాకూరుతాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర గనులు, ఎక్కైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు.. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు వేదాశీర్వచనం చేశారు పండితులు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేవుడు.. రాష్ట్ర ప్రజలంతా సుఖషాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాము.. ప్రజల కోరిక మేరకు సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు.. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు.. ఉన్న పరిశ్రమల్ని మూసేశారని విమర్శించారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద సంస్థలు వస్తున్నాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, విశాఖ పట్నంలో కొండాలని, ఘనులను, భూములను దోచుకున్నారు.. ఋషికొండలో ప్రజల సొమ్ముతో ప్యాలస్ లు కట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు.. ఈ రోజు మాట ప్రకారం పెన్షన్లను 1వ తేదీన అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం… ఈ ఐదు సంవత్సరాలలో అనేక పరిశ్రమలు వస్తాయన్నారు.. గతంలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు సైతం రాష్ట్రానికి రాబోతున్నాయని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.

2 నెలల వ్యవధిలోనే ఆ రోడ్లు పూర్తి చేస్తాం..
బనగానపల్లెలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ దుస్థితిని పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. అయితే, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత లేని పనులు చేశారన్న ఆయన.. 2 నెలల్లో పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లలో గుంతలు లేకుండా , డ్రైనేజీల్లో మురికి నీరు నిలువ లేకుండా చేస్తామని ప్రకటించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్, కరెంట్ ఆఫీస్ ఏరియా, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ల్లో అద్వాన స్థితిలో ఉన్న గుంతలు పడి ఉన్న రోడ్లను, మురికినీటి తో నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అయితే, గత ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలు లేకుండా చేపట్టిన పనులను లేని ఏ విధంగా అంగీకరించారంటూ ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ అధికారులను, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పలు కాలనీల్లో పర్యటించిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్ల యాక్సిడెంట్లు జరుగు తున్నాయని విమర్శించారు, ఎన్నికల ముందు బనగానపల్లెకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేకుండా.. ఇష్టారాజ్యాంగ పనులు చేశారని.. ఆర్భాటాల కోసం రోడ్లు , సెంట్రల్ లైటింగ్ అంటూ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు నాణ్యత లేని పనులు చేశారని మండిపడ్డారు.. అయితే, 2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని, పట్టణంలో ఎక్కడ కూడా రోడ్ల లో గుంతలు లేకుండా , డ్రైనేజీ ల్లో మురికి నీరు, నిలువ లేకుండా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

ఏపీలో పెరిగిన క్రైమ్‌ రేట్.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య 46.8 శాతం ఎక్కువ..!
ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌ రేట్‌ భారీగా పెరిగిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.. ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.. ఇక, గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైంకు అడ్డుకట్ట, టెక్నాలజీ వాడకం, పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ. ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రత.. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన తీసుకురానున్నారు.. అదే విధంగా.. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు..

బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌, వరంగల్‌ నుంచి హైదరాబాద్‌, కాజీపేట నుంచి బల్లార్ష రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 30 వరకు రద్దయ్యాయి. సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబరు 1 వరకు బల్లార్ష నుంచి అక్టోబరు 1 వరకు, సిర్పూర్‌ టౌన్‌ నుంచి కరీంనగర్‌, కరీంనగర్‌ నుంచి బోధన్‌ రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు రద్దయ్యాయి. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు బోధన్ టు కరీంనగర్, కాచిగూడ నుంచి నడికుడి, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నడికుడి నుంచి కాచిగూడ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హెచ్‌ఎస్ నాందేడ్ నుండి రాయచూర్ రైలు, తాండూరు నుండి రాయచూర్ వరకు తాత్కాలికంగా రద్దు చేయబడింది. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రైళ్లకు కాజీపేటలో స్టాప్‌ను తొలగించారు.

ఎస్సీ వర్గీకరణపై కొనసాగుతున్న ఆందోళన- ఉద్రిక్తతలకు దారి తీసిన భారత్ బంద్..!
ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని చెప్పుకొచ్చింది. కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అత్యున్నత న్యాయం స్పష్టం చేసింది. దీనిపై 2004లో ఐదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కాగా, దీన్ని నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదంటూ డిమాండ్ చేస్తోన్నారు. రిజర్వేషన్లల్లో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి మార్పులూ చేయకూడదని మాల సామాజిక వర్గానికి చెందిన శ్రేణులు పట్టుబట్టారు. అయితే,ఉత్తరాది రాష్ట్రాలపై భారత్ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నిరసనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తోన్నారు.

రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి..
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దీనికి బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై మాయావతి భారత్ బంద్ గురించి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఈ వర్గీకరణను తీసుకొచ్చారని పేర్కొనింది. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో క్రీమీలేయర్‌ విధానం అమలు చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతామని మాయావతి చెప్పుకొచ్చింది. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లలో మార్పులను రద్దు చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కు చెందిన ప్రజలు ‘భారత్ బంద్’లో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకి మెమోరాండం సమర్పిస్తున్నారు.. ఎలాంటి హింసాకాండకు తావులేకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా ఈ బంద్ నిర్వహించారని ఆమె చెప్పుకొచ్చింది. ఎస్సీ-ఎస్టీలతో పాటు ఓబీసీ వర్గాలకు కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కు వచ్చింది.. ఈ వర్గాలకు నిజమైన దూత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కృషి ఫలితమే.. దీని అవసరం, సున్నితత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు తిరస్కరించాయని మాయావతి గుర్తు చేశారు.

మా నాన్నను జైల్లో పెట్టండి.. 5 ఏళ్ల బుడ్డోడు కంప్లైంట్..
ఒకప్పుడు తల్లిదండ్రులు కళ్లలోకి చూడగానే పిల్లలు భయంతో వణికిపోయేవారు. ఇప్పుడు కాలం మెల్లగా మారుతోంది. భయానికి దూరంగా నేటి పిల్లలు తమ తల్లిదండ్రులను తిట్టడానికి లేదా వారికి గుణపాఠం చెప్పడానికి పోలీసు స్టేషన్‌కు వెళుతున్నారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది నిజం. ఇటీవల ఐదేళ్ల చిన్నారి తన తండ్రిపై ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. అంతే కాదు, పిల్లాడు అక్కడికి వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. వారు తమ తండ్రిని జైలులో పెట్టాలని పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ ని అభ్యర్థించాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఆలోచించవచ్చు. మధ్యప్రదేశ్‌ లోని ధార్‌లో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రజలను షాక్‌కి గురిచేయడమే కాకుండా నవ్విస్తోంది కూడా. పోలీసులంటే భయం చూపి ఏ పని చేయాలన్నా అమ్మ మనల్ని పోషించే రోజులు అవి.. ఈ భయం చూపించి చాలా తేలిగ్గా చేసేది. కానీ., ఈనాటి పిల్లల ముందర పరిస్థితి వేరేలా ఉంది. తల్లిదండ్రులను తాము భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మేం చెప్పడం లేదు కానీ, ఇటీవల ఓ 5 ఏళ్ల చిన్నారి వైరల్‌గా మారిన వీడియో చూసి జనాలు ఇలా అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. దీనిలో ఒక చిన్న పిల్లవాడు పోలీస్ స్టేషన్‌ కు చేరుకుని తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ పిల్లాడి వాదనలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు.

రెండో బెస్ట్‌ వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోనీ.. టాప్‌లో ఎవరంటే? అస్సలు ఊహించరు
ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో బెస్ట్‌ వికెట్‌ కీపర్‌లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాప్‌లో ఉంటాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం, రెప్పపాటులో స్టంపింగ్ చేయడం మహీ ప్రత్యేకత. ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే.. బ్యాటర్‌కు క్రీజు బయట అడుగు వేయాలనే ఆలోచనే రాదు. మహీ కీపింగ్‌లో అత్యంత డేంజరస్ నానుడి. అలాంటి ధోనీకి ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ రెండో స్థానం ఇచ్చాడు. బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ అయిన గిల్లీ.. తాజాగా తన టాప్‌-3 బెస్ట్ వికెట్‌ కీపర్ల జాబితాను వెల్లడించాడు. బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ జాబితాలో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ తన రోల్‌ మోడల్‌, ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ రాడ్నీ మార్ష్‌ను ఎంచుకున్నాడు. 2022లో మరణించిన రాడ్నీ.. ఆసీస్ తరఫున 1970-84 మధ్య 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. 96 టెస్టుల్లో 355 అవుట్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోనీని తీసుకున్న గిల్లీ.. మూడో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను ఎంపిక చేశాడు. మహీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. లంక తరపున సంగా 134 టెస్టులు, 404 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాడ్నీ మార్ష్‌ను తన ఆరాధ్యదైవం అని ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభివర్ణించాడు. ‘రాడ్నీ మార్షల్ నాకు మార్గదర్శి. ఆయనలా కావాలని నేను ఎప్పుడూ అనుకొనేవాడిని. ఎంఎస్ ధోనీ కూల్‌నెస్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ తన పని చేసుకుంటూ వెళ్ళాడు. కుమార సంగక్కర క్లాసిక్ ప్లేయర్. బ్యాటింగ్‌లో ముందొచ్చి ఆడటమే కాకుండా కీపింగ్‌ నైపుణ్యాలు అద్భుతం’ అని గిల్‌క్రిస్ట్‌ చెప్పుకొచ్చాడు.

తమిళ చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్.. నేను చేదు సంఘటనలు ఎదుర్కొన్నా: హీరోయిన్
తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్‌మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం, హత్య కేసు తర్వాత మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండిస్తూ.. ర్యాలీకి అనుమతి కోరేందుకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంకు సనమ్ శెట్టి వెళ్లారు. ర్యాలీకి పోలీసుల నుంచి పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం సనమ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ… ‘కోల్‌కతాలోని వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలనుకుంటున్నా. అందుకు పోలీసుల నుంచి పర్మిషన్‌ కోసం దరఖాస్తు పెట్టా. పోలీసులు నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా’ అని చెప్పారు.

ఆస్కార్ అవార్డ్ విన్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల..
ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ “వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్ ను చూసాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రం తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరో గా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ గారికి దర్శకుడు వెంకటరమణ మిద్దె గారికి నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం లో పని చేసిన అందరికి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదల అవుతుంది. అందరు చూసి ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి” అని కోరుకున్నారు.