NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

స్టీల్‌ ప్లాంట్‌పై కుట్ర.. మాటలు కాదు. చేతుల్లో చూపించండి..
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఓవైపు ప్రైవేటీకరణకు అవకాశం లేదని చెబుతున్నా.. మరోవైపు ఆ దిశగా అడుగు పడుతున్నాయే విమర్శలు ఉన్నాయి.. అయితే, స్టీల్ ప్లాంట్‌న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే అని దుయ్యబట్టారు.. ఇక, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే రాజీనామా చేస్తాను ప్రకటించాడు.. ఆహ్వానిస్తున్నాం.. కానీ, రిజల్ట్ కావాలి అన్నారు వి. శ్రీనివాసరావు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ చేపట్టాలి.. సీఎం బాధ్యత వహించి సీఎం ఆధ్వర్యంలో ఈ మిషన్ పనిచేయాలి.. సంవత్సరంలోపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లో నడపడానికి సీఎం చొరవ తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలు కొంతమంది అమ్ముడుపోయారని కామెంట్ చేస్తున్నవాళ్లే అమ్ముడుపోయి ఉంటారు.. కార్మికుల అమ్ముడుపోయారు అనే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు..

చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..
రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు మంత్రి నారా లోకేష్‌.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు.. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆరోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదలచేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతునొక్కాలని విఫలప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. యువగళం దిగ్విజయం అయ్యిందన్నారు.. యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు… 5 కోట్ల మంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్..

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు.. రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు..
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం మంచి పరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు. కోవిడి కాలం నుంచి కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యం దిట్టం మేరకు చేయడం లేదని ప్రశ్నించిన తనపై గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టారని తనపై ఉన్న కేసులను తొలగిస్తే 50 సంవత్సరాల అనుభవంతో పాడైన అర్చక ఆలయ వ్యవస్థలను సరిదిద్దుతానని పేర్కొన్నారు రమణ దీక్షితులు. అయితే, పింక్ డైమండ్ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించిన రమణ దీక్షితులు.. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.

లడ్డూ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌..!
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో మక్కువ.. అలాంటి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌ను కాకరేపుతున్నాయి.. అయితే.. తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆవేదన చెందాను అన్నారు.. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. మరోవైపు, జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌.. ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు జాతీయ స్థాయిలో ఓ విధానం రూపొందించాలన్నారు.. మఠాధిపతులు.. పీఠాధిపతులతో చర్చించాలి. ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సచించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

బ్యాంకులు షరతులు లేకుండా పేదలకు రుణాలు ఇవ్వాలి..
పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని తెలిపారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు. పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. విద్యానగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అని తెలిపారు. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని అన్నారు. తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని అన్నారు. భారతదేశం యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుందని తెలిపారు. ప్రోత్సాహకాలు అందిస్తుందని.. నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడం అని తెలిపారు. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయన్నారు.

నేడు పెండింగ్ ప్రాజెక్ట్ లపై మంత్రుల సమీక్ష..
దక్షిణ తెలంగాణాలో దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపద్యంలో ఇవాళ నల్లగొండ జిల్లా దేవరకొండ కొండలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు గాను ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖామంత్రుల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. గడిచిన దశాబ్దా కాలంగా బి.ఆర్.యస్ ప్రభుత్వం లో వివక్షతకు గురైన ప్రాజెక్ట్ ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. పైగా ప్రాజెక్ట్ ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2292 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టగా బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన అంచనాలు రెట్టింపు కావదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ఉద్దేశ్యపురంకంగానే గడిచిన బి.ఆర్.యస్ సర్కార్ ఈ ప్రాజెక్ట్ సై ఉదాసినత చూపిందంటూ విరుచుకపడుతున్నారు. ప్రధానంగా 2005 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆమోదంతో 2292 కోట్లకు పాలనా అనుమతులు పూర్తి చేసుకుని పనులు మొదలు పెట్టినా 2014 తరువాత ఈ ప్రాజెక్ట్ పనులను దాదాపు ఆటకెక్కించారు.2005 నుండి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 1279.04 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బి.ఆర్.యస్ ప్రభుత్వం లో ఖర్చు పెట్టిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్ పై 2643.50 కోట్లు ఖర్చు చేశారు.

చెన్నై సెక్స్ వర్కర్ హత్య కేసు.. ఆర్థిక కారణాలే అని దర్యాప్తులో వెల్లడి
చెన్నైలోని తురైపాక్కంలోని ఓ నిర్మాన స్థలంలో సూట్‌కేస్‌లో ఒక మహిళ ఛిద్రమైన మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే. చెన్నైలోని మనాలి ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల దీపగా గుర్తించారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. తక్షణమే పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. సూట్‌కేస్ నుండి రక్తం కారడాన్ని గుర్తించిన బాటసారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించారు. విచారణలో అధికారులు నేరస్థలం నుండి కేవలం 100 మీటర్ల దూరంలో నివసించిన 23 ఏళ్ల మణికందన్‌ను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ద్వారా దీపా హత్యతో అతనికి సంబంధం ఉందని గుర్తించారు. పోలీసుల విచారణలో ఆర్థిక విభేదాల కారణంగానే దీపను హత్య చేసినట్లు మణికందన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట ఆమెను సుత్తితో కొట్టి ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి సూట్‌కేస్‌లో దాచిపెట్టాడని తేలింది. తదుపరి విచారణలో దీప సెక్స్ వర్కర్ అని, మణికందన్‌కు బ్రోకర్ ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిసింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో దీప సోదరుడు ఫిర్యాదు చేయడంతో ఈ వివరాలు బయటపడ్డాయి. దీప హత్యతో చెన్నై ఉలిక్కిపడింది. నగరంలో నేరాల చీకటి అండర్ బెల్ ను బహిర్గతం చేసింది. విచారణ ఇంకా కొనసాగుతున్నందున, దీప హత్యకు దారితీసిన మరేమైనా సంఘటనలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హిజ్బుల్లా స్థావరాలపై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్
లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాడులు ఎలా జరిగాయో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. వీడియోలో బాంబుల వర్షం కురుస్తుంది. దాడుల తర్వాత హిజ్బుల్లా రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉద్యమానికి చెందిన సుమారు 100 రాకెట్ లాంచర్లు, లక్ష్యాలపై వరుస దాడులను పూర్తి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అంతకుముందు రోజు ఐడీఎఫ్ 30 హిజ్బుల్లా రాకెట్ లాంచర్‌లను.. ప్రాథమిక మౌలిక సదుపాయాల లక్ష్యాలను తాకినట్లు తెలిపింది. ఐడిఎఫ్ లక్ష్యంగా చేసుకున్న బారెల్స్, లాంచర్లు ఇజ్రాయెల్ వైపు కాల్పులు జరపడానికి ఉద్దేశించినవి. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను.. ఆయుధ నిల్వలను కూడా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన పేర్కొంది. సంఘర్షణ ప్రారంభమైన తర్వాత ఐడీఎఫ్ తన పౌరులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి. ప్రజలు తమ కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని పేర్కొంది. ఇది కాకుండా, ప్రజలు ఒకే చోట గుమిగూడాలని, గ్రామ ద్వారాలను రక్షించాలని.. సురక్షిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. మెరోమ్ గలీల్, అప్పర్ గలిటి, మీట్ హెర్మోన్, యాసోద్ హమాలా, హజోర్, రోష్ పినా, సఫేద్, మెతులా, నార్తర్న్ గోలన్ కమ్యూనిటీలకు ఆదేశాలు జారీ చేశారు.

సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్‌ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది. నెమ్మదిగా వ్యాపారం ప్రారంభించిన కొద్దిసేపటికే మార్కెట్‌లో విపరీతమైన ర్యాలీని నమోదు చేసి, బిఎస్‌ఇ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 84 వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ తొలిసారిగా 84,100ను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతకుముందు గురువారం కూడా సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.. మొదటిసారిగా 25,650 దాటింది. దేశీయ మార్కెట్ ఈరోజు ట్రేడింగ్‌ను స్వల్ప పెరుగుదలతో ప్రారంభించగా, ప్రారంభ సెషన్‌లో మార్కెట్‌పై ఒత్తిడి కనిపించింది. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు పెరిగాయి. కొన్ని నిమిషాల తర్వాత, ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ లాభం 175 పాయింట్లకు తగ్గింది.. 83,370 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అయితే, తర్వాత ట్రేడింగ్ సమయంలో మార్కెట్ అద్భుతమైన పునరాగమనం చేసింది.

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర
మొన్నటిదాకా భగ్గుమన్న బంగారం ధరలు.. కాస్త దిగివచ్ఛాయి. వరుసగా మూడు రోజులు గోల్డ్‌ రేట్స్ తగ్గాయి. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ తగిలింది. పుత్తడి ధరలు నేడు భారీగా పెరిగాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.660 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది. దాంతో మరోసారి 75 వేల మార్కును దాటింది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై నేడు రూ.1500 పెరిగి.. రూ.92,500గా కొనగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.97,500గా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో 85 వేలుగా నమోదైంది.

ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్.. 376 ఆలౌట్..
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ముగించాడు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్‌దీప్ కూడా 30 బంతుల్లో 17 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత అద్భుత ప్రదర్శన చేసి 133 పరుగులు చేసిన ఆర్. అశ్విన్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అశ్విన్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో బంగ్లా కెప్టెన్ శాంటోకి క్యాచ్ ఇచ్చి అశ్విన్ ఔటయ్యాడు. అశ్విన్ ఔట్ అయిన తర్వాత స్టేడియంలోని ప్రజలు మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇక చివరగా జస్ప్రీత్ బుమ్రా 9 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 7 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇక హసన్ మహమూద్ 5 వికెట్లతో రెచ్చిపోయాడు. ఒక బంగ్లాదేశ్ బౌలర్ ఇండియాలో జరిగిన టెస్ట్ లో 5 వికెట్స్ తీసుకోవడం ఇదే ప్రథమం.

ఓటీటీల్లో ‘కన్యక’ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. నిర్మాతల ఆనందం!
మైథాలాజికల్ మూవీ ‘కన్యక’ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌, హంగామా, టాటా ప్లే బింజ్‌, వాచో, వి మూవీస్ టీవీ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్‌తో కన్యక మూవీ దూసుకుపోతోంది. దాంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నిర్మాత కూరపాటి పూర్ణచంద్ర రావు అన్నారు. కన్యక చిత్రాన్ని బిసినీఈటి సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర తిరువాయిపాటి దర్శకత్వం వహించారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల అయింది. విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరికొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలో ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది. కన్యకకు ఏమైంది, వచ్చిన అమ్మాయి ఎవరు?, చివరికి ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో.. మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుందనే మెసేజ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

‘లడ్డు గాని పెళ్లి’ లిరికల్‌ సాంగ్ విడుదల.. మాములుగా లేదుగా! వీడియో చూడాల్సిందే
‘టిల్లు స్క్వేర్‌’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్‌ స్క్వేర్‌ నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్.. నేడు తొలి గీతాన్ని రిలీజ్ చేసింది. ‘మా లడ్డు గాని పెళ్లి.. ఇగ చూస్కో లొల్లి లొల్లి’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్ విడుదల అయింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా మంగ్లీ ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాంగ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మ్యాడ్‌ ఎంతగా నవ్వులు పంచిందో.. అందుకు రెట్టింపు స్థాయిలో నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Show comments