NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నాకు ముందస్తు బెయిల్‌ ఇవ్వండి.. హైకోర్టుకు ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం విదితమే కాగా.. అయితే, ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. వర్మ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చటంతో.. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు, పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు.. ఇక, ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరిన విషయం విదిమే.. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడ ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది..

ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు..
ఒక ఉద్ధానంలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలన్నారు.. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఉన్నారు.. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలి.. ఈ లోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలని స్పష్టం చేశారు.. అయితే, అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

ఏపీ అప్పులపై మండలిలో రచ్చ..
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు.. అయితే, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అని ప్రశ్నించారు టీడీపీ సభ్యులు.. ఇక, గత ప్రభుత్వం 9,74,000 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని వ్యాఖ్యానించారు మంత్రి పయ్యావుల.. రాజ్యాంగ విరుద్ధంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేశారని దుయ్యబట్టారు.. అయితే, ఈ విషయంపై గవర్నర్, కేంద్ర మంత్రికి అప్పుడే ఫిర్యాదు చేశామన్నారు.. శాసన సభ, మండలి పర్యవేక్షణలో రాకుండా నిధులు సేకరించారని ఆరోపించారు.. చట్ట సభలకు తెలియకుండానే ఖర్చు చేశారంటూ ఫైర్ అయ్యారు.. దీంతో.. సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.. మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యలపై మండిపడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్‌యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.. దీంతో.. శాసనమండలి కాసేపు రచ్చరచ్చగా మారంది..

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్..!
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ.. త్వరలోనే ల‌బ్దిదారుల స‌మ‌స్యలు ప‌రిష్కరించేలా ముందుకెళ్తున్నాం అన్నారు.. శాస‌న‌మండ‌లిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమ‌ల నాయుడు, దువ్వార‌పు రామారావు అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. గ‌త ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు.. టీడీపీ ప్రభుత్వం 5 ల‌క్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమ‌తులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గ‌త టీడీపీ ప్రభుత్వంలో హైటెక్నాల‌జీ, హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాం. గ‌త ప్రభుత్వం పై మాపై క‌క్షతో ల‌బ్దిదారుల ప‌ట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు.. ఇళ్లు ఇవ్వని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్ లు తీసుకోవ‌డంతో ల‌బ్దిదారులు ఇబ్బందులు ప‌డుతున్నారని.. ల‌బ్దిదారుల‌కు తిరిగి చెల్లించాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో మున్సిప‌ల్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక, గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టేశారని దుయ్యబట్టారు మంత్రి నారాయణ.. అయితే, టిడ్కో ఇళ్లకు రంగులు మార్చడం కోసం ఏకంగా 300 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని మండిపడ్డారు.. టిడ్కో ఇళ్లకు మౌళిక‌వ‌స‌తుల క‌ల్పన కోసం 5200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామని.. త్వర‌లోనే ల‌బ్దిదారుల స‌మ‌స్యలు ప‌రిష్కరించేలా ముందుకెళ్తున్నాం అని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..

సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైర్..
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైర్ అయ్యారు. “కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకు పోయావ్. కాళోజీ నారాయణరావు నీకు పరిచాయమా? ఎప్పుడైనా కలిశావా? రేవంత్ రెడ్డి పిచ్చిమాటలు బంద్ చేయాలి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏడాదిలో నువ్వేం చేశావ్.. నువ్వు చేసేవన్ని కేసీఆర్ పథకాలే. ప్రజలు కాదు కోటీశ్వరులు అయ్యేది నీ బంధువులే. కేసీఆర్ అనే చెట్టు మళ్ళీ మొలవనియ్య అంటున్నావ్.. నిన్న మీ మీటింగ్ కు మంత్రులు వచ్చారా? మంత్రి ఉత్తమ్, తుమ్మలనీ మీటింగ్ కు ఎందుకు రాలేదు. సోనియా గాంధీని బలి దేవతా అని.. ఇప్పుడేమో అమ్మ అంటున్నావ్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నీకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారా? నీ పరిస్థితి నీకు అర్థం అవుతుందా? ” అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. నిన్న జరిగింది వంచన సభ.. రేవంత్ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ స్పీకర్ మధుసూదనా చారి డిమాండ్ చేశారు. వరంగల్ లో చాలా మంది ముఖ్య మంత్రుల సభలు పెట్టారని.. కానీ రేవంత్ లాగా మాట్లాడలేదన్నారు. కల్లుతాగిన కోతిలాగా రేవంత్ మాట్లాడారని.. తుమ్మితే ఊడే ముక్కునీ పదవి అని విమర్శించారు. రేవంత్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. మీ మంత్రుల సహకారమే నీకు లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని మొలకెత్తనీయకుండా చేసే మొనగానివా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం వరాల జల్లు.. ఏకంగా రూ. 694.50 కోట్లతో..
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చూడతారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేపడతారు.

ఇండియా గేట్ వద్ద టవల్‌తో మోడల్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కోల్‌కతా మోడల్ తెల్లటి టవల్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మోడల్ సన్నతి మిత్రా.. టవల్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. మిస్ కోల్‌కతా పోటీలో 2017 విజేతగా సన్నతి పేర్కొంది. ఇంతకు ముందు కూడా ఆమెకి చెందిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. దుర్గాపూజ పండల్ వద్ద టాప్స్ ధరించిన మరో ఇద్దరు మహిళలతో ఆమె వివాదాస్పద చిత్రంలో కనిపించింది. సన్నతి మిత్రా.. దుర్గాపూజ పండల్ వద్ద ఆమె వేషధారణపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇంతకుముందు, ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న చిత్రాలలో మిత్రా ఒక స్నేహితుడితో కలిసి దుర్గాపూజ పండల్‌కు హాజరయ్యేందుకు వెళ్ళింది. ఆమె తొడపైన చీలికతో కూడిన పొడవాటి నల్లటి గౌనును ధరించింది. అయితే ఆమె స్నేహితుడు మోకాళ్ల వరకు ఉన్న బూట్‌లతో కూడిన నారింజ రంగు దుస్తులు ధరించాడు. తాజాగా ఆమె కొత్త వీడియో మరోసారి ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఆమె దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలోని పాటకు డ్యాన్ చేయడం వీడియోలో కనిపిస్తోంది. తెల్లటి టవల్, చెప్పులు ధరించి ఇండియా గేట్ ముందు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ నృత్యాన్ని అక్కడున్న ప్రేక్షకులు, అందులో చిన్న పిల్లలు కూడా చూశారు. అంతే కాకుండా వీడియోలో డ్యాన్స్ చేస్తే చుట్టూ తిరుగుతుంది. టవల్ కూడా తెరవడం కనిపిస్తుంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలతో ఈ వీడియోను మోడల్ షేర్ చేసింది. క్యాప్షన్‌లో.. “అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ మీ ధైర్యం, దయ, సానుభూతితో ఇతరులను ప్రేరేపించడం, ప్రోత్సహించడం కొనసాగించండి.” అని రాసుకొచ్చింది. ఈ వీడియోను కేవలం రెండు గంటల్లోనే 200,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. చాలా మంది వినియోగదారులు సన్నతి మిత్రను విమర్శించారు. ఎక్కువ మంది వీక్షణలు పొందడానికి ఇది ఒక మార్గం అని పేర్కొన్నారు. మరికొందరు బహిరంగ ప్రదేశంలో అశ్లీల నృత్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్‌ కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులోనే గెలిచి.. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌ సాధన చేశారు. ఈ నలుగురు స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ముఖం మీదకు ఓ క్యాచ్ వచ్చింది. అది సులువైన క్యాచే అయినా సర్ఫరాజ్ భిన్నంగా ప్రయత్నించి నేలపాలు చేశాడు. ఇది చూసిన కోహ్లీ, పంత్, జురెల్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. పంత్ అయితే కిందపడి మరీ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడనున్నాయి. కుమారుడి పుట్టిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాడని తెలుస్తోంది. రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా ఆడనున్నాడని తెలుస్తోంది. దాంతో అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశ తప్పదు. వన్‌ డౌన్‌లో గిల్‌ స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడతాడు. రిషబ్ పంత్ ఐదులో ఆడనుండగా.. ధ్రువ్‌ జురెల్‌ను ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని ప్రచారం సాగుతోంది. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి అరంగేట్రం దాదాపు ఖాయమే. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉండనున్నాడు. ఆస్ట్రేలియా-ఏతో పాటు ఇంట్రాస్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో నితీశ్ మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్.

తమిళనాడు నిర్మాతల కౌన్సిల్ సంచలన నిర్ణయం
తమిళనాడు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత మంది యూట్యూబ్‌ ఛానల్స్‌, నెటిజన్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూయార్స్ వారి వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూ స్ ఇస్తున్నారని భావిస్తూ సంచలన డెసిషన్ తీసుకుంది  తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌.  ఈ ఏడాది తమిళ్ లో విడుదలైన చాలా సినిమాలు నెగిటివ్ వలన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేదని నిర్మతల మండలి చెప్తోంది. కొందరు కావాలని తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయితే సినిమా చూడకుండే రివ్యూలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘ఇండియన్‌ 2’ పై యూట్యూబ్ ఛానెల్స్ దారుణమైన థంబ్ నెయిల్స్ తో సినిమాను దారుణంగా ట్రోల్ చేసారు. ఫలితం తమిళ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ‘వేట్టయన్‌’ సంగతి కూడా ఇదే పరిస్థితి . ఇక సూర్య నటించిన ‘కంగువా’ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓవర్సీస్ టాక్ ను ఆధారంగా చేసుకుని తమిళ్ లో మొదటి ఆట ముగియకుండానే పబ్లిక్‌ టాక్‌, పేరుతో యూట్యూబ్‌ ఛానల్స్‌ చీల్చి చెండాడాయి.   రానున్న రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుందని భావించిన  తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌  ఇక  యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని, ఫస్ట్‌ డే.   రిలీజ్ రోజు  థియేటర్‌ వద్ద పబ్లిక్‌ రివ్యూలకు చెప్పే వెసులుబాటు ఇవ్వొద్దని థియేటర్ ఓనర్స్ కు సూచిస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఇకపై  అలా చేస్తే చూస్తూ ఉరుకోము’’ అని పేర్కొంది.

కియారా కెరీర్లో టర్నింగ్ పాయింట్ కానున్న ఆ మూడు సినిమాలు
కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో మొన్నటిదాకా సూపర్ ఫామ్ కొనసాగించిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆఫ్టర్ మ్యారేజ్ కాస్త దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా అమ్మడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది. ఈ ఇయర్ అయితే ఒక్క సినిమా కూడా అమ్మడిది రిలీజ్ కాలేదు. గేమ్ చేంజర్ ఈ సంవత్సరం వస్తుందని అనుకున్నారు. కానీ అది కూడా 2025 సంక్రాంతికి వాయిదా పడింది. ఐతే తర్వాత మాత్రం కియరా కెరీర్ కి మాంచి కిక్ ఇచ్చే సినిమాలే ఉన్నాయని చెప్పొచ్చు. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న కియరా మొదటి సారి కలిసి చేసిన సినిమాతో డిజాస్టర్ అందుకున్నా.. ఈసారి అన్నీ పక్కా కాలిక్యులేషన్స్ తో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కియరా చాలా హోప్స్ పెట్టుకుంది. మరోపక్క అమ్మడు ఈ సినిమాతో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 లో కూడా నటిస్తుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 లో కియరా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అమ్మడు క్రేజ్ తెచ్చుకోనుంది. ఈ రెండు సినిమాలే కాకుండా కె.జి.ఎఫ్ ఫేమ్ యష్ చేస్తున్న టాక్సిక్ లో కూడా అమ్మడు ఓకే అయింది. కియరా రాబోతున్న సినిమాలు చూస్తే ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా.. పెళ్లి తర్వాత అమ్మడు పట్టిందల్లా బంగారం అయినట్లు ఉంది. ఈ సినిమాల్లో ఏది కూడా అసలు తీసి పారేయడానికి లేదు. మూడు సినిమాలు మూడు కూడా భారీ హైప్ తో భారీ టార్గెట్ ఉన్నవే. అంతేకాదు గేమ్ ఛేంజర్ తో పాటుగా వార్ 2, టాక్సిక్ ఈ రెండు సినిమాలు కూడా 2025లో రిలీజ్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా మొత్తం కియరా పేరు మార్మోగిపోనుందని చెప్పొచ్చు. అందం అభినయం రెండింటితో అదరగొట్టేస్తున్న కియరా రాబోతున్న సినిమాలతో నేషనల్ లెవెల్ లో సత్తా చాటనుందని చెప్పొచ్చు. కచ్చితంగా ఈ సినిమాలు కియరా కెరీర్ కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంటాయని ఫిక్స్ అవ్వొచ్చు.