Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు.. ఈ ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్‌, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడవనున్నాయని వెల్లడించారు శ్రీధర్‌… సంక్రాంతి ప్రయాణానికి నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు తెలిపారు. అయితే, ముందస్తు బుకింగ్‌ల కారణంగా రిజర్వేషన్లు ఇప్పటికే వేగంగా నిండిపోతున్నాయని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి మార్గాల్లో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉందని సీపీఆర్వో వెల్లడించారు. జనవరి 24వ తేదీ వరకు 400కు పైగా ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా, సౌకర్య చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని కూడా దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

“సర్పంచ్” ఫలితాలపై పీసీసీ సమీక్ష.. 18 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్..
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు రెండు, మూడు రోజులగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 18న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12,702 గ్రామ పంచాయతీల్లో మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశారన్నారు. 4221 సర్పంచ్ లను బీజేపీ బీఆర్ఎస్ కూటమి గెలుచుకుందన్నారు. 33 శాతం గెలుచుకున్నారని తెలిపారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్ తెలిపారు. కంటోన్మెంట్.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. 94 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 87 నియోజక వర్గాల్లో మెజారిటీ సాధించిందని కొనియాడారు..

ఢిల్లీని కప్పేసిన పొగ మంచు.. 100 ఫ్లైట్స్ క్యాన్సిల్.. 50 రైళ్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. మధ్యాహ్నం దగ్గర పడుతున్నా వెలుతురు లేదు. పూర్తిగా దృశ్యమానత పడిపోయింది. జోరో స్థాయికి కాంతి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దట్టంగా పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. మనుషులు కనిపించలేదని పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం వాతావరణం పరిస్థితి బాగోలేక పోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అప్రమత్తం అయింది. దాదాపు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రగతి మైదాన్, భైరత్ మార్గ్, ఆనంద్ విహార్‌లో దృశ్యమానత తగ్గిపోయింది. మధ్యాహ్నం అవుతున్న కూడా వాహనదారులు హెడ్‌లైట్లు ఉపయోగించి డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ఎయిర్‌పోర్టులకు వచ్చే ప్రయాణికులు వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. క్యాన్సిల్ అయిన విమాన ప్రయాణాలు మార్చుకోవచ్చని.. పూర్తి వాపసు కూడా ఇస్తామని చెప్పాయి. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లో దట్టమైన, చాలా దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. శనివారం గాలి నాణ్యత చాలా పేలవంగా ఉండే అవకాశం ఉందని.. ఆది, సోమవారాల్లో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. ముందస్తుగానే వాతావరణ శాఖ శనివారం ‘ఆరెంజ్’ హెచ్చరిక జారీ చేసింది.

బైడెన్ ప్రభుత్వం ఖజానాను దోచుకుంది.. ఇప్పుడు గాడిన పడిందన్న ట్రంప్
జో బైడెన్ ప్రభుత్వంపై మరోసారి ట్రంప్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ఖజానాను దోచుకుందని ట్రంప్ ఆరోపించారు. శనివారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఒక సంవత్సరం క్రితం వరకు మన దేశం ఆర్థికంగా చచ్చిపోయిందని.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఉన్నత దేశంగా ఉందని.. అధ్యక్షుడిగా ఉన్న తానే అమెరికాను మొదటి స్థానంలో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. తన విధానాల కారణంగానే దేశం మళ్లీ పునరావృతం అయిందని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్, కాంగ్రెస్‌లోని దాని మిత్రదేశాలు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాదాపు బైడెన్ కాలంలో ట్రిలియన్ల డాలర్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. బైడెన్ దుష్ప్రవర్తన కారణంగానే ధరలు పెరగడానికి ఆజ్యం పోసినట్లైందని తెలిపారు. అంతేకాకుండా అమెరికన్లపై అదనపు ఆర్థిక భారం పడిందని ఆరోపించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో బిగ్ షాక్.. అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్ది రోజులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై అనేక రకమైన పుకార్లు నడిచాయి. జైల్లో హత్యకు గురయ్యారంటూ వదంతలు వ్యాప్తించాయి. అనంతరం ఇమ్రాన్ ఖాన్ సోదరి చూసి రావడంతో అనుమానాలకు నివృత్తి జరిగింది. ఇంతలోనే అవినీతి కేసులో శనివారం 17 ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు పాకిస్థాన్ కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నుంచి జైల్లోనే ఉంటున్న ఆయనకు తాజా తీర్పు మరో పిడుగు పడినట్లైంది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను హెపటైటిస్‌తో బాధపడుతున్న రోగులతో ఉంచినట్లుగా బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా జైలు అధికారులు మానసికంగా వేధిస్తున్నారని సోదరీమణులు ఆరోపించారు.

టెస్ట్‌లు అవసరం లేదు..! ఈ లక్షణాలతో డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఇట్టే పట్టేయొచ్చు..!
డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అయిపోయింది.. లైఫ్‌ స్టైల్‌లో ఉండే మార్పులతో చాలా మంది వీటి బారిన పడుతున్నారు.. వీటిని ప్రధానంగా జీవనశైలి వ్యాధులుగా పరిగణిస్తారు. తరచుగా, ప్రజలు పరీక్షలు చేయించుకోరు.. అంతేకాదు, లక్షణాలను గమనించే వరకు తమకు సమస్య ఉందని కూడా వారు నమ్మరు.. కానీ, వైద్యులు మీ కళ్లను చూడటం ద్వారా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను చెప్పవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.. తరచుగా, మనం కంటి సమస్యలను కేవలం దృష్టితోనే ముడిపెడతాము, ఉదాహరణకు అస్పష్టమైన దృష్టి, తలనొప్పి లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కలిగే చికాకు. అయితే, కళ్లు ఆరోగ్య సమస్యలను సులభంగా వెల్లడిస్తాయని వైద్యులు నమ్ముతారు. మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు తరచుగా ప్రారంభంలో ఎటువంటి ప్రధాన లక్షణాలను కలిగించవు.. కానీ వాటి మొదటి సంకేతాలు కళ్లలో మరియు కళ్ల చుట్టూ కనిపిస్తాయి. ఈ సంకేతాలు వ్యాధిని నిర్ధారించవు, కానీ వాటిని విస్మరించకూడదు అంటున్నారు వైద్యులు.. కనురెప్పలపై పసుపు మచ్చలతో కూడా డయాబెటిస్‌ పట్టేయొచ్చు అంటున్నారు.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, మీ కనురెప్పలపై మరియు వాటి లోపలి మూలల దగ్గర పసుపు లేదా లేత తెల్లని మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే, వాటిని క్శాంథెలాస్మా అని పిలుస్తారు.. తరచుగా రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతం కావచ్చు అని హెచ్చరిస్తున్నారు. కంటి విద్యార్థి చుట్టూ తెలుపు-బూడిద రంగు వలయం కూడా.. మాయో క్లినిక్ ప్రకారం, కొన్నిసార్లు ఐరిస్ చుట్టూ తెలుపు లేదా బూడిద రంగు వలయం కనిపిస్తుంది. దీనిని కార్నియల్ ఆర్కస్ అంటారు. ఇది వృద్ధులలో వయస్సు-సంబంధిత సాధారణ మార్పు కావచ్చు, కానీ, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఇది కనిపించడం అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ వలయం కార్నియాలో కొవ్వు నిల్వల వల్ల సంభవిస్తుంది మరియు సాధారణంగా దృష్టిని ప్రభావితం చేయదు.

ఉద్యోగులకు గూగుల్ సీరియస్‌ వార్నింగ్.. అమెరికా వీడొద్దు..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. విదేశీయులను టార్గెట్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాలతో.. భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి ఆ నిర్ణయాలు.. ఇక, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ? ఏ పన్నులు పెంచుతారు కూడా తెలియని పరిస్థితి.. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది గూగుల్.. H-1B వీసా వివాదం నేపథ్యంలో అమెరికాలోని కొంతమంది ఉద్యోగులు విదేశాలకు వెళ్లవద్దని గూగుల్ కోరింది. కంపెనీ బయటి న్యాయవాది, BAL ఇమ్మిగ్రేషన్ లా, బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. అమెరికాలోకి తిరిగి ప్రవేశించడానికి కొత్త వీసా స్టాంప్ అవసరమయ్యే వారు నెలల తరబడి విదేశాలలో చిక్కుకునే ప్రమాదం ఉందని.. అనేక రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్‌లు తీవ్రమైన అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్‌లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు 12 నెలల వరకు వీసా స్టాంపింగ్ జాప్యాలను నివేదిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ప్రభావిత ఉద్యోగులు అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సిఫార్సు చేసింది గూగుల్‌.. H-1B, H-4, F, J, మరియు M వీసాలపై ఉన్న కార్మికులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. కొన్ని US రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్‌లు వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్ జాప్యాలను ఎదుర్కొంటున్నాయని.. దయచేసి ఇది గమనించండి, ప్రస్తుతం ఇది 12 నెలల వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయంటూ మెమోలో పేర్కొంది..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత కన్నుమూత..
సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి విచారకరమైన వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాసన్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు శ్రీనివాసన్‌.. అయితే, శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే, ఈ రోజు ఆయన మరణించారు. శ్రీనివాసన్‌ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పరిశ్రమ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు, ప్రముఖులు సహా ప్రతి ఒక్కరూ కన్నీటి నివాళులర్పిస్తున్నారు.. శ్రీనివాసన్.. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటుడిగా ఎదిగారు.. ఆయన 48 సంవత్సరాల సినీ కెరీర్‌లో 200కి పైగా సినిమాల్లో నటించారు. శ్రీనివాసన్ సినిమాలు సామాన్యుల సమస్యలను తేలికగా చిత్రీకరించడానికి ప్రసిద్ధి చెందాయి. ఆయన నటన చాలా ప్రామాణికమైనది, ఆయన పాత్రలు ప్రతి ఒక్కటి ప్రజల హృదయాలను తాకాయి. ఆయన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. నేటికీ ప్రజాదరణ పొందిన కొన్ని చిరస్మరణీయ మలయాళ చిత్రాలను కూడా ఆయన రచించి దర్శకత్వం వహించారు. నటన మరియు రచనతో పాటు, శ్రీనివాసన్ “వడక్కునొక్కియంత్రం” మరియు “చింతవిష్టాయ శ్యామల” వంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

డబ్బు కోసమే చేశా.. కానీ ఆ భయం ఇప్పటికీ వెంటాడుతోంది
సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల వల్ల దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కేవలం డబ్బు అవసరం కోసమే ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కానీ ఆ సెట్స్‌లో తనకు ఎదురైన అనుభవాలు చాలా భయంకరంగా ఉండేవని’ ఆమె పేర్కొన్నారు. మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో తాను ఒక్కరే అమ్మాయి ఉండేదాన్నని, కనీసం తన వ్యక్తిగత సిబ్బందిని కూడా లోపలికి అనుమతించేవారు కాదని రాధిక చెప్పారు. సెట్‌లో తన శరీరం గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారని, చెస్ట్ ప్యాడింగ్ వాడమని ఒత్తిడి చేసేవారని, ఆ సమయంలో తాను ఎంతో అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు.. “నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను, కానీ ఆ రోజుల గురించి తలచుకుంటే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది” అని ఆమె ఎమోషనల్ అయ్యారు. కేవలం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లోని కొందరు పెద్ద మనుషుల నిజస్వరూపాలు కూడా తనకు తెలుసని, వారి పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారని రాధిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version