Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కొత్త బార్లకు స్పందన కరువు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొత్త.. బార్ పాలసీని ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ లో 840 బార్లు ఉన్నాయి.. వీటిలో 10 శాతం రిజర్వ్డ్ కేటగిరీలో కల్లు గీత కార్మికుల కు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం.. 5 లక్షల ఫీజ్ తో నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు.. దీంతో పాటు బార్ లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15 శాతం రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది.. దీని వల్ల ఒక్కో లైసెన్సి కి అదనంగా 30 లక్షలు భారం పడనుంది.. పర్మిట్ రూమ్ లకు కూడా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ కారణాలతో కొత్త బార్ల ఏర్పాటుకు ఆశించినంత స్పందన రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీ వచ్చే నెల 1 నుంచి అమలు లోకి రానుంది… దీంతో కొత్త బార్ లకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం.. 840 బార్లు ఓపెన్ క్యాటగిరి.. 10 శాతం కల్లు గీత కార్మికులకు రిజర్వ్ చేశారు. వీటిలో కేవలం 466 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఓపెన్ క్యాటగిరి లో 388 బార్లకు 1657 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వ్డ్ కేటగిరీ లో 78 బార్లకు 564 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా బార్ల కేటాయింపు జరిగింది.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో. డ్రా… ఆఫ్ లాట్స్.. లాటరీ నిర్వహించారు. ఓపెన్ కేటగిరి లో 388. రిజర్వ్డ్ కేటగిరి లో 78 బార్లకు సంబంధించి డ్రా తీశారు.. ఓపెన్ క్యాటగిరిలో 37 బార్లకు.. రిజర్వ్డ్ లో 3 బార్లకు నాలుగు కన్నా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.. దీంతో మరో రెండు రోజులు అంటే రేపు సాయంత్రం వరకు గడువు ఇచ్చారు.. ఎల్లుండి డ్రా తీస్తారు.. మిగిలిన బార్ లకు సంబంధించి త్వరలో రీ నోటిఫికేషన్ ఇస్తారు.

రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరింది.. మాధవ్‌ ఫైర్‌
కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్‌ అయ్యారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాధవ్.. రాహుల్ గాంధీని తరిమికొడతామని హెచ్చరించారు.. ఎన్నికల కమిషన్ విసిరిన సవాల్ కు రాహుల్ గాంధీ తోకముడిచారి కామెంట్ చేశారు.. మోడీ తల్లిపై అనుచితి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఇక, కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడించారు మాధవ్‌.. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి షెకావత్ అధ్యయనం చేశారని తెలిపారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పుష్కరాలు నిర్వహిస్తాయన్నారు.. గోదావరి పుష్కరాలు పేరుతో రాజమండ్రిలో శాశ్వత కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తామని, దీనిలో భాగంగా హేవలాక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. దేశంలో మోడీ పరిపాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే చాయ్ పే చర్చ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల నుండి అనుహ్యా స్పందన లభిస్తుందని అన్నారు పీవీఎన్‌ మాధవ్.. కాగా, అంతకు ముందు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం యాత్ర చేపట్టారు. రాజమండ్రి ఏకేసీ కాలేజ్, ఎన్టీఆర్ పార్క్ వద్ద స్థానికులతో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో మోడీ పరిపాలన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను పలువురు మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తెలంగాణలో వరుసగా 9 , 10, 11, 12 తరగతులు చదువుతేనే లోకల్‌ అంటూ తీర్పు వెలువురించింది సుప్రీంకోర్టు.. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్టు అయ్యింది.. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. ఇంటర్మీడియట్ కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 33ని సమర్ధించింది సుప్రీంకోర్టు.. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో వాదించింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది సుప్రీంకోర్టు.. ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనుంది లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు.. ఇక, ఈ సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం..

గత ప్రభుత్వ జీవో రద్దు చేయకున్నా.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు, ఎలాగంటే?
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంకు అనుమతి తప్పనిసరి అని జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ సమ్మతి (General Consent)ని రద్దు చేసింది. అంటే.. సీబీఐకి దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రవేశించేందుకు ప్రతి కేసులో ప్రత్యేక అనుమతి అవసరం. ఈ నిర్ణయం జీవో ఎంఎస్ నెం.51 ద్వారా 30 ఆగస్టు 2022న జారీ చేయబడింది. ఈ జీవో ప్రకారం.. గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఈ నిర్ణయం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 (DSPE Act) సెక్షన్ 6 ప్రకారం తీసుకోబడినది. ఈ జీవోను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయకున్నా.. సీబీఐకి అనుమతిస్తూ కాళేశ్వరం కేసు అప్పగించాల్సి ఉంటుంది. సీబీఐకి రాష్ట్రంలో విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని కేసును సీబీఐకి సాధారణ సమ్మతి లేదా ప్రత్యేక సమ్మతి ఇచ్చి అప్పగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సాధారణ సమ్మతి ఇచ్చినప్పుడు సీబీఐకి ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి అనుమతి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గతంలో సాధారణ సమ్మతి ఉపసంహరించుకున్నాయి. తెలంగాణ సీబీఐకి అనుమతిపై బీఆర్ఎస్ ఇచ్చిన జీవో రద్దు చేయాలి. ప్రత్యేక సమ్మతి విషయంలో.. ఒక ప్రత్యేక కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశం ద్వారా సీబీఐకి అప్పగిస్తుంది. దీనికి గజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఆదేశం జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అనంతరం సీబీఐ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేపడుతుంది.

సీబీఐ దర్యాప్తు ఆపాలంటూ.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌, హరీష్‌రావు!
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనల్ని కోర్టుకు వినిపించనున్నారు. వాదనల అనంతరం కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.

ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదా? కొత్తగా రాబోతున్న Aadhaar యాప్!
ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ ను లాంచ్ చేసేందుకు యుఐడిఏఐ సిద్ధమవుతుందని సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే మీ మొబైల్ లోనే మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ ఇలా చాలా వివరాలను అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది. ప్రస్తుతం ఎవరైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. దీనివల్ల చాలా సమయం, డబ్బు ఖర్చు అవుతుంది.

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం అదే.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి చేర్చుకోవాలన్న పాశ్చాత్య దేశాల వైఖరే ఈ సంక్షోభానికి అసలు కారణమని పుతిన్ తేల్చి చెప్పారు. ఆక్రమణతో పుట్టికొచ్చిన సంక్షోభం కాదని.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడంతోనే ఈ యుద్ధం మొదలైందని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారత్-చైనా చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలను పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్‌ను గద్దె దింపడం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని.. అదే యుద్ధానికి మూల కారణంగా చెప్పారు. అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సంభాషణ వివరాలు.. జిన్‌పింగ్‌తో సహా ప్రపంచ నాయకులతో పంచుకున్నట్లు వెల్లడించారు.

ఒకే కారులో మోడీ-పుతిన్.. ఆసక్తిరేపుతోన్న ప్రయాణం
చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ప్రముఖంగా మోడీ-పుతిన్ కలయిక చాలా హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు సంభాషించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మరొకసారి మోడీ-పుతిన్-జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా.. కనీసం పట్టించుకోకుండానే మోడీ వెళ్లిపోయారు. గ్రూప్ ఫొటో దిగాక కూడా అలానే చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఎస్‌సీవో సమావేశం తర్వాత ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ఇప్పటికే అమెరికా కారాలు-మిరియాలు నూరుతోంది. ఇప్పుడు ఏకంగా పుతిన్‌తో మోడీ రాసుకుపూసుకుని తిరగడం మరింత ఆసక్తి రేపుతోంది.

ఖగోళ అద్భుతం.. ఆ రోజే Blood Moon దర్శనం!
సెప్టెంబర్ 7వ తేదీ ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన ఆకాశాన్ని అలరించబోతోంది. అదే ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, రాగి రంగులలో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. భారత్‌లో కూడా ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల ప్రజలు దీన్ని చూడవచ్చు. అయితే, ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు, మేఘావరణం లేదా కాలుష్యం దర్శనాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడిపై భూమి నీడ పూర్తిగా పడుతుంది. అయినా చంద్రుడు పూర్తిగా చీకటిగా మారిపోడు. దీనికి కారణం భూమి వాతావరణం. సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు నీలి రంగు కాంతి వ్యాపిస్తుంది. కానీ ఎరుపు, నారింజ కిరణాలు మాత్రం వంగి చంద్రుడిని చేరుతాయి. అందువల్ల చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతాడు.

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..
బాలీవుడ్‌ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఎప్పటికీ గోప్యంగానే ఉంచుకుంటుంది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్‌లో ఆమె పెళ్లి రహస్యం వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం దర్శకురాలు ఫరా ఖాన్ వేసిన సరదా కామెంట్. ఆ ఈవెంట్‌కు నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా హాజరయ్యాడు. రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ఫరా ఖాన్, టోనీని ఉద్దేశించి.. ‘టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు’ అని చెప్పింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంటే నర్గీస్ – టోనీ పెళ్లి చేసుకున్నారని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అందరికీ స్పష్టమైంది. సమాచారం ప్రకారం, 2025 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో వీరిద్దరూ నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. తర్వాత స్విట్జర్లాండ్‌లో హనీమూన్‌కి కూడా వెళ్లారు. కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి నర్గీస్ ఎక్కడ స్పందించకపోవడం, ఫోటోలు పంచుకోక పోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కొంతమంది ఇది ప్రైవసీని కాపాడుకోవడమే అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ’అంత ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకోక పోవడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌లో రాక్‌స్టార్ సినిమాతో అడుగుపెట్టి తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్న నర్గీస్ ప్రజెంట్ బారీ ప్రాజెక్ట్ లలో బీజి గా ఉంది.

ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కార్తీ..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు వా వాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కార్తీ పోలీసాఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనుక స్టార్టైన సత్యం సుందరం, సర్దార్ రిలీజ్ అయి హిట్ గా అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ డిలే కార్తీకి ఇబ్బంది మారింది. ఒకనొక దశలో వా వాతియార్ సినిమా ఆగిపోయిందని టాక్ కూడా వినిపించింది. అనేక ఇబ్బందుల తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత జూన్‌లో అనుకుంటే.. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కలేదు. సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేసారు అది కుదరలేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది చివరి డిసెంబరులో వా వాతియార్ ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు మేకర్స్. మొత్తానికి ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version