NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. ఆదిత్యుని పాదాలను తాకిన సూర్య కిరణాలు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని ఆదుత్యి మూలవీరట్‌ పాదాలను తాకాయి లేలేత సూర్యకిరణాలు. అరుణ వర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం 6:05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది. ఆ సమయంలో స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు.. రేపు కూడా మళ్లీ స్వామి వారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1 , 2 తేదీల్లో.. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో మూల విరాట్ ను నేరుగా సూర్యకిరణాలు తాకనున్నాయి. స్వామివారి మూలవిరాట్టును స్పృశించని కిరణ దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం పర్యంతమయ్యారు.

పండుగ పూట గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ ఆర్టీసీ..
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక ప్రజల ముఖ్య పండుగల్లో దసరా ఒకటి. దుర్గమ్మ ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏపీలో నలుమూల నుండి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం సాగిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. విజయవాడ నుండి రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులను యథావిథిగా నడుపుతుంది. వివిధ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు, నగరాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ నెల 4 నుండి 20 వరకు మొత్తం 6,100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు, 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ నెల 4 నుంచి 11 వరకూ 3,040 బస్సులు, 12 నుంచీ 20 వరకూ 3,060 బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 275 బస్సులు, చెన్నై నుండి 65 బస్సులు పలు పట్టణాలకు రన్‌ చేస్తారు. విశాఖపట్నం నుండి 320 బస్సులు, రాజమండ్రి నుండి 260 బస్సులు, విజయవాడ నుండి 400 బస్సులు, ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు 730 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తరువాత హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 330 బస్సులు, చెన్నై నుండి 70 బస్సులు తిప్పుతారు. ప్రయాణికులపై భారం మోపొద్దన్న లక్ష్యంతో… సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు తిప్పుతారు. ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టిన UTS మెషీన్లతో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టారు. ఫోన్ పే, గూగుల్ పే, QR కోడ్ స్కాన్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉండడంతో ఈసారి ప్రయాణీకులకు మరింత సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కృషి చేస్తుంది.

నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.. 1, 2 లైన్లపై యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు.. మరోవైపు.. రైలు పట్టాలు తప్పడంపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు.. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు రైల్వే సిబ్బంది చెబుతున్నారు.. ఇక, పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు రైల్వే సిబ్బంది.. కర్ణాటక లోని బెటిపిన్ నుండి కాకినాడకు వెళ్తున్న ఖాళీ డీజిల్ ట్యాంక్‌ రైలు.. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాకినాడ సమీపం లోని గంగినేని ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరింది. రైలు స్టేషన్ చేరుకోగానే కేవలం 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు చివరి 3 బోగీలు పట్టాలు తప్పాయి… అయితే, 5 వ లైన్ లో జరగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది రాలేదు. మరో రైలును తెప్పించి పట్టాలపైకి ఎక్కించారు. యుద్ధ ప్రాతిపదికపై లైన్ పునరుద్దన పనులు చేపట్టారు

రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. కలెక్టర్‌ ఫొటో డీపీగా పెట్టి ఎమ్మార్వోలతో చాటింగ్..
టెక్నాలజీ పెరుగుతోన్న కొద్ది.. సైబర్‌ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.. సోషల్‌ మీడియాలోని ఇతరుల ఖాతాలను హ్యాక్‌ చేసి.. వారి పేరుతో చాటింగ్‌ చేస్తూ.. వారి ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేస్తున్నారు.. డబ్బులు అడుగుతున్నారు.. అత్యవసరం.. రేపే ఇచ్చేస్తా.. ఎల్లుండి తిరిగి చెల్లిస్తాను అంటూ నమ్మబలుకుతున్నారు.. చివరి వారి ఊబిలో చిక్కుకుని కొందరు జేబులు గుల్లచేసుకుంటున్నారు.. ఇక, ఇప్పటికే వరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా.. ఇలా కొన్ని సోషల్‌మీడియాలో హ్యాండిల్స్‌కు పరిమితమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు వాట్సాప్‌కు కూడా తాకింది.. వాట్సాప్‌ను సైతం హ్యాక్‌ చేసి కొందరు.. ప్రముఖుల ఫొటోలను డీపీలుగా పెట్టి మరికొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఇక, తాజాగా, ఈ వ్యవహారం కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్‌ను తాకింది.. కలెక్టర్‌ షాన్‌ మోమన్‌ పేరుతో సైబర్ మోసం చేసే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు.. 88819 42520 నెంబర్ కి కలెక్టర్ ఫొటోను డీపీగా పెట్టిన కేటుగాళ్లు.. కాకినాడ జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మార్వోలకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు.. తాను అత్యవసర మీటింగ్ లో ఉన్నానని.. డబ్బులు తిరిగి రెండు రోజుల్లో రిటర్న్ చేస్తానని మెసేజ్‌లు పెట్టిన కేటుగాళ్లు.. తనకు అత్యవసరంగా రూ.50 వేలు కావాలని మెసేజ్‌లు పెట్టారు.. అయితే, కలెక్టర్‌ ఫొటో డీపీగా ఉన్నా.. కొత్త నంబర్‌ కావడంతో కొందరు ఆరా తీశారు.. అది ఫేక్‌ అని వారికి అనిపించడంతో.. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో.. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్‌.. కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గింపు..
కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150.. రూ.160.. రూ.170 ఇలా పలుకుతుండగా.. దాయితపై కిలో కందిపప్పును రూ.67కే అందించనుంది ప్రభుత్వం.. మరోవైపు.. కిలో షుగర్‌ ధర.. బహిరంగ మార్కెట్‌లో రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది.. నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేసేలా చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.. తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో కందిపప్పు.. షుగర్‌ విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పు, షుగర్‌ను పంపణీ చేస్తోంది. ఇక, గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. ఇక, తెనాలిలో ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర, కందిపప్పు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు కందిపప్పు, చక్కెర అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. తక్కువ ధరలకు కందిపప్పు, చక్కెర అందించడం వల్ల 4.32 కోట్ల మంది లబ్ది పొందుతారని తెలిపారు.. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర తగ్గించిన ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.

మైనంపల్లి ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా?
మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్‌ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్‌లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్‌ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించిన అనంతరం మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లేందుకు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారని.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే సగం మునుగుతుందని.. మూసీ ప్రక్షాళన చేస్తే కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు. హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో.. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తానూ పది కోట్ల రూపాయలు సేకరిస్తామన్నారు.

మూసీ రివర్‌ బెడ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మూసీ రివర్ బెడ్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్‌పేట పరిధిలోని శంకర్‌ నగర్‌లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. పునర్నివాసంలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు అందజేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి షిఫ్ట్ అయ్యిన వారి నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. 47 గంటల పాటు కూల్చివేతలు కొనసాగనున్నాయి. చాదర్‌ఘాట్ సమీపంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతోంది. మూసీ రివర్‌ బెడ్‌లో కూల్చివేతలతో తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా ప్రకటించింది. మరోవైపు అంబర్‌పేట్‌ నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్‌లో మూసీ పరీవాహక ప్రాంత వాసులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తులసిరాం నగర్‌లో ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చిన అందరూ అడ్డుపడాలన్నారు. ఏం ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దన్నారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్లు ఇంట్లో ఉండకూదన్నారు. అందరికీ అండగా ఉంటామన్నారు.మీకు అండగా ఉండాలని, మిమ్మల్ని పరామర్శించమని కేసీఆర్ చెప్పారన్నారు. అందుకే వచ్చామన్నారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం!
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఖర్గేతో పాటు పార్టీ అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. చాలాకాలంగా పెండింగ్ ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దసరా (అక్టోబర్ 12) కు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ తగ్గాయి. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 తగ్గగా.. 24 క్యారెట్లపై 330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నేడు (అక్టోబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,910గా నమోదైంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.95,000గా కొనసాగుతోంది.

రోహిత్.. ఔటైనా ఫర్వాలేదు అన్నాడు: కేఎల్ రాహుల్
కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డగౌట్‌లోని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ నుంచి తమకు స్పష్టమైన సందేశం వచ్చిందని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పాడు. ఔటైనా ఫర్వాలేదు కానీ.. వేగంగా ఆడి ఎక్కువ పరుగులు చేయాలని సూచించాడని తెలిపాడు. కెప్టెన్ ఆదేశాలకు తగ్గట్టుగానే ఆడినట్లు రాహుల్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఆధిపత్యం కొనసాగించింది. అయిదో రోజు ప్రారంభానికి ముందు రాహుల్ మాట్లాడాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘ముందునుంచి మా లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉంది. రెండు రోజుల ఆట వర్షం వల్ల రద్దైంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించకూడదు. మిగిలిన సమయంలో ఏం చేయగలమనే దానిపై మేం దృష్టిపెట్టాం. బంగ్లాదేశ్‌పై విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాం. మేం బ్యాటింగ్ చేస్తుండగా.. డగౌట్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్‌ శర్మ నుంచి మాకు స్పష్టమైన సందేశం వచ్చింది. ఔటైనా ఫర్వాలేదు.. వేగంగా ఆడమని సూచించాడు. మేం అలానే చేశాం. ఆ తర్వాత మా బౌలర్లూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు’ అని చెప్పాడు.

బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో అభిమానులు
బాలీవుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి. బాలీవుడ్ నటుడు గోవిందా కాలికి బుల్లెట్ తగిలింది. గోవిందకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. తుపాకీని శుభ్రం చేస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. మూలన ఉన్న తుపాకీని తీసి… బాలీవుడ్ నటుడు గోవిందా చెక్ చేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలిపోయింది. ముంబైలోని ఇంటి నుంచి బయలు దేరుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఉదయం 4.30 గంటల ప్రాంతంలో బుల్లెట్ గాయాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. వెంటనే అతని సిబ్బంది.. గోవిందను ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నవంబర్ 14న రానున్న వరుణ్ తేజ్ ‘మట్కా’
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మట్కా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం, టీమ్ వరుణ్ తేజ్, ఫైటర్స్‌తో కూడిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి్స్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో మట్కా నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం కార్తీక పౌర్ణమికి ముందుగా నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఇంతకు ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ తో అదరగొట్టిన మేకర్స్ సెకండ్ లుక్ కూడా తీసుకొచ్చారు. వరుణ్ తేజ్ పోస్టర్‌లో రెట్రో అవతార్‌లో సూట్‌లో సిగరెట్‌తో నోటిలో మెట్లపై నడుస్తున్న ఫోటో ఆకట్టుకుంది వరుణ్ తేజ్ నిజానికి రెండు విభిన్నమైన రూపాల్లో అద్భుతంగా కనిపించాడు. కరుణ కుమార్ బలమైన స్క్రిప్ట్‌ తో రానున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే ఈ చిత్రానికి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారు. అతను వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ లో వరుణ్ తేజ్ వైవిధ్యమైన లుక్స్ అదరగొట్టాయి. ఇప్పుడు విడుదల తేదీని కన్ఫాం చేయడంతో మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో వస్తామని హామీ ఇచ్చారు. వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న గ్లోబల్ స్టార్ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. తాజాగా సినిమా నుంచి మాస్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా అదరగొడుతుందని చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గ్రేస్.. థమన్ మాస్ బీట్స్ తో మెగా ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసినట్లు కనిపిస్తుంది. అలా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. తక్కువ సమయంలోనే 10 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఒక్క తెలుగు వెర్షన్ లోనే రాబట్టి.. మన టాలీవుడ్ రీసెంట్ ఫస్ట్ సింగిల్స్ లో అదరగొడుతుందని అని చెప్పాలి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశారు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ రేస్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.