Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..?
మెడికల్‌ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.. వారికి సంఘీభావంగా అసెంబ్లీ వద్ద ధర్నా చేపట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ.. పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? అని ప్రశ్నించారు.. ప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం.. దోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు.. ఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం.. గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదు.. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారు.. ఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు అని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరం అన్నారు బొత్స.. ఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాం.. కళ్లుండి చూడలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని మండిపడ్డారు.. ఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..? అని ప్రశ్నించారు. ఇక, మెడికల్‌ కాలేజీలపై మేం ఎంత ఖర్చు చేశామో వాళ్లే చెప్తున్నారు.. కానీ, పీపీపీ అంటే దోపిడీ.. నా పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? అని నిలదీశారు.. ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు.. చేతకాకపోతే ఏదీ కాదు.. ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి అని సూచించారు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ..

వైసీపీకి షాక్..! టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌..
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్‌.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే వైస్సార్సీపీలో సుదీర్ఘ కాలంగా పని చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. వైస్సార్సీపీలో సరైన గుర్తింపు రాలేదంటూ.. వైస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్ పని తీరు నచ్చక పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు.. గత కొన్ని నెలలు క్రితం వైస్సార్సీపీకి, శాసనమండలి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు..

అమరావతికి అదనంగా మరో రూ.14,200 కోట్లు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పనులు చకచకా సాగుతుండగా.. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.. ఇక, మరో 11 వేల కోట్ల రూపాయల రుణం ఇస్తోంది హడ్కో.. అదనపు రుణం మంజూరైతే మొత్తం 40 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి.. కాగా, మొత్తం 88 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో వివిధ పనులకు ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికి 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్.. అమరావతిలో పలు ఇతర ప్రాజెక్టుల కోసం ఎస్.పి.వి. ఏర్పాటు చేయుంది రాష్ట్ర ప్రభుత్వం.. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ – ఏడీబీకి దరఖాస్తు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా, అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం అంటే రూ.14,200 కోట్లు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది..

మూడు రోజుల ముందే ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల ముందుగానే ముగియనున్నాయి.. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.. అంటే, ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఇక, ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయం, 23న శాంతిభద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్‌పై చర్చ సాగనుండగా.. 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. మరోవైపు, 26న లాజిస్టిక్స్‌, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ జరుగుతుంది.. 27న సూపర్‌ సిక్స్‌ అమలుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగింపు సందేశం ఇవ్వనున్నారు.. కాగా, కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతుండగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న విషయం విదితమే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు, శాసనమండలిలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వైసీపీ..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అదనంగా మరో రెండు రోజులు సెలవులు..
దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొదట పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన సర్కార్.. అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయి.. కానీ, పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు… ఇక, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా పండుగ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు అంటే.. మొత్తంగా 11 రోజుల పాటు దసరా సెలవులు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు..

బెంగళూరులో అమానుషం.. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో బాయ్‌పై మూక దాడి
బెంగళూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో డెలివరీ ఏజెంట్‌‌ను కొందరు యువకులు ఇష్టానురీతిగా దాడి చేశారు. ఆదివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుత వానాకాలంలో ఎప్పుడు వాన కురుస్తుందో.. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇక మెట్రో సిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. చిన్న వర్షానికి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. డెలివరీ రావాలన్నా.. ఎవరైనా ఇంటికి రావాలన్నా సమయం పడుతుంది. అయితే ఆర్డర్ చేసుకున్నది ఆలస్యంగా తీసుకొచ్చాడని జొమాటో డెలివరీ బాయ్‌ను పట్టుకుని కొందరు యువకులు మూక దాడికి పాల్పడ్డారు. చేతికి ఏది దొరికితే వాటిని తీసుకుని ఇష్టానురీతిగా బాదారు. అయితే ఈ దాడిని ఎవరో మొబైల్‌లో షూట్ చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మోడీ మంచి స్నేహితుడే కానీ..! బ్రిటన్ టూర్‌లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా మోడీతో చాలా దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించారు. గురువారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తే పుతిన్ దిగొస్తారని వ్యాఖ్యానించారు. చమురు ధర తగ్గితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరిస్తారని తెలిపారు. మోడీ బర్త్‌డే రోజున శుభాకాంక్షలు తెలియజేసినట్లు గుర్తుచేశారు. మా ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉందని వివరించారు. మోడీ, భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నానని చెప్పారు.

మళ్లీ జాబ్ లో చేరండి.. మహిళా నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు
మళ్లీ ఉద్యోగానికి రావాలనుకుంటున్న మహిళా నిపుణుల కోసం ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌’ పేరిట ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నియామకాలకు అర్హత సాధించాలంటే, మహిళా అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు విరామంలో ఉండాలని కంపెనీ రూల్ పెట్టింది. జావా, .నెట్, ఎస్‌ఏపీ, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫర్మేటికా, సెలానియం టెస్టింగ్‌లలో డెవలపర్, టెక్‌ లీడ్, మేనేజర్‌ స్థానాలకు మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తుంది. పెళ్లయిన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యలతో చాలా మంది మహిళలు జాబ్ కి బ్రేక్ వేస్తుంటారు. తర్వాత వారు ఒక్కసారిగా మళ్లీ జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్న జాబ్ దొరకక చాలా ఇబ్బందులు పడతారు. వారి కోసేమే ఇన్పోసిస్ మంచి ఆఫర్ ప్రకటించింది. ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తమ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2030కు మొత్తం ఉద్యోగుల్లో 45% మంది మహిళలు ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో దాదాపు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మహిళల వాటా 39 శాతంగా ఉంది. విజయవంతమైన రిఫరల్స్‌ ఇచ్చిన తమ ఉద్యోగులకు రూ.50,000 వరకు ప్రోత్సాహకాలను సంస్థ అందిస్తోంది.

చిన్న బ్రేక్.. మళ్లీ మొదలైన బంగారం ధరల మోత!
ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గాయి. పెరుగుదలలో చిన్న బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు.. మరలా పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,02,200గా.. 22 క్యారెట్ల ధర రూ.1,11,480గా నమోదైంది. పండగ సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ధరల పెంపు నిరాశ కలిగిస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో.. బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి.. ఈరోజు రూ.2000 పెరిగింది. దాంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,33,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 43 వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో లక్ష 31 వేలుగా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవి.

శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్‌ బ్యాటర్!
ఆసియా కప్‌ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్‌మెంట్‌కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రి మరణవార్త తెలియకముందే.. దునిత్ వెల్లలాగేకు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. అఫ్గాన్‌ బ్యాటర్ మహమ్మద్ నబీ అతడి బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌ దునిత్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది.. అఫ్గాన్‌కు ఊహించని స్కోరు అందించాడు. 20 ఓవర్లలో అఫ్గాన్‌ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్‌ మెండిస్ (74) హాఫ్ సెంచరీ చేయగా.. కుశాల్‌ పెరీరా (28), కమిందు మెండిస్‌ (26 నాటౌట్‌) రాణించారు.

పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కుమార్తె ‘అన్షు మాలిక’ తన అద్భుతమైన నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నప్పటి నుంచే రచయిత్రిగా పలు పుస్తకాలను రాసి, అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అన్షు, అక్కడ కూడా తన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు మాలిక, ఇటీవల ప్రతిష్టాత్మకమైన “మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025-26” ( Maureen Biggers Leadership Award)ను అందుకున్నారు. ఈ అవార్డును యూనివర్శిటీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరీన్ బిగ్గర్స్ పేరిట టెక్నాలజీ రంగంలో మహిళల సాధికారతకు కృషి చేస్తున్న వారికి అందిస్తారు. ఈ ఏడాది ఈ గౌరవం అన్షు మాలికకు దక్కింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. షారూఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఓటీటీ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్.. సెప్టెంబర్ 18 నుండి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొడుకు కోసం సిరీస్‌లో సగం బాలీవుడ్ స్టార్లను నింపేశాడు ఫాదర్ కమ్ ప్రొడ్యూసర్ కింగ్ ఖాన్. అలాగే బాలీవుడ్ చీకటి కోణాన్ని ఆవిష్కరించిన ఆర్యన్ ఖాన్.. తన పర్సనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడిన ఓ అంశాన్ని సెటెరికల్ వేలో చూపించాడు. ఇప్పటికే విలేజ్ లవ్ స్టోరీ కన్యాకుమారి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 12 ఏళ్ల తర్వాత శ్రీ విష్ణు, శ్రీ ముఖి, హర్ష వర్థన్ రాణే, రీతూ వర్మ, వితిక నటించినప్రేమ ఇష్క్ కాదల్ ఓటీటీ బాట పట్టింది. ఈటీవీ విన్‌లోప్రసారమవుతుంది. ఇక హాలీవుడ్ క్రైమ్ మిస్టరీ, హారర్ యాక్షన్ థ్రిల్లర్స్ బ్లాక్ రాబిట్, సిన్నర్స్ పెప్టెంబర్ 18 నుండే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక మలయాళ సినిమాల విషయానికి వస్తే.. థ్రిల్లర్స్ సెప్టెంబర్ 19 నుండి సందడి చేస్తున్నాయి. శ్వాసిక రందాం యామం, ధ్యాన్ శ్రీనివాసన్ ఐడీ దీ ఫేక్, టూ మెన్ కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర, సేమ్ డే విత్ సమ్ వన్, బెలెన్, షి సెడ్ మేబి, ది ట్రైయల్ సీజన్2 సిరీస్, బిల్లినియర్స్ బంకర్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బన్నీ, వంశీ కష్టపడితే.. అల్లు అరవింద్ క్రెడిట్ కొట్టేస్తారు
బండ్ల గణేష్ నిర్మాతగా, నటుడుగా అందిరికి సుపరిచితుడే. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటరేనిది ఒప్పుకోలేని వాస్తవం. అది సినిమా వేడుకైనా, పొలిటకల్ ఈవెంట్ అయిన తనదైన మార్క్ స్పీచ్ తో అదరగొడతాడు బండ్ల. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లోను బండ్ల గణేష్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ మరొక నిర్మాత అల్లు అరవింద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బండ్ల  మాట్లాడూతూ ‘ రూ. 500, 1000 కోట్ల సినిమాలు కాదు,  లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఎక్కువగా రావాలి. ఈ సినిమాను కేవలం రూ. 2.5 కోట్లతో తీసారని చేప్పారు. బన్నీవాసు, నందిపాటి వంశీ మీ ఇద్దరు కష్టపడితే లాస్ట్ లో అల్లు అరవింద్ వచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేస్తారు. మీరు చాలా కస్టపడి తీసి అల్లు అరవింద్ సినిమా ఇది అని అంటున్నారు. అది ఆయన అదృష్టం.. మీ దురదృష్టం. నిజంగా అరవింద్ ఏమి చేయరు. లాస్ట్ మినిట్ లో వస్తారు.. ఆహా అంటాడు క్రెడిట్ మొత్తం కొట్టేస్తాడు. అది అయన జాతకం. అరవింద్ సార్ మీ షర్ట్ నలగదు.. మీ హెయిర్ స్టైల్ మారదు కానీ డబ్బులు మాత్రం సంపాదిస్తారు. టీమ్ అంత కస్టపడి పని చేసాక లాస్ట్ లో వచ్చి క్రెడిట్ కొట్టే అల్లు అరవింద్ కు కృతజ్ఞతలు’ అని అన్నాడు.  ఈ కాంట్రవర్సీ వ్యాక్యలపై బండ్ల ఉద్దేశం ఏంటో.

Exit mobile version