NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ఈ రోజు ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇచ్చినపుడు ఒక్క నెల రోజుల్లో 34,305 ఎకరాలు ఇచ్చారు.. గత ప్రభుత్వం రైతు సోదరులను ఇబ్బంది పెట్టిందన్నారు.. టెండర్లు అన్నీ సమయానికి పూర్తవుతాయి.. ప్రపంచ టాప్ 5 సిటీలలో ఒకటిగా అమరావతిని చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ.. మరోవైపు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో అడవి జంతువులను, చిట్టడవిని పెంచారు.. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు నిర్ణయించారు అని తెలిపారు.. గత ప్రభుత్వం లో పోలీసు పరిపాలన సాగించారు.. అసైన్డ్ కౌలు వేయడం లేదని చాలామంది రైతులు అడిగితే రెండు విడతలుగా కౌలు వేశామని వెల్లడించారు ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్..

టెంపుల్ సిటీలో మరోసారి రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్‌..
టెంపుల్ సిటీ తిరుపతిలో గంజాయి బ్యాచ్ లో మరోసారి రెచ్చిపోయింది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌, గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతోంది.. ఇక, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో గంజాయి కేసుల విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు.. అయినా.. చాప కింద నీరుల తిరుపతి రూరల్ ప్రాంతంలో గంజాయి సేవించిన యువత.. మత్తులో స్థానికులపై వరుసగా దాడులకు పాల్పడితున్నారు.. ఈ వరుస ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. ఓటేరు, తిరుచానూరు సమీపంలో అలా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్దానికులు‌.. తిరుపతి సమీపంలోని ఓటేరులో రెచ్చిపోతుంది గంజాయి బ్యాచ్.. రైల్వే ఉద్యోగి వాసుదేవనాయుడు ఇంటి తలుపులు కొట్టి ఆయన భార్య చైతన్య పై దాడి చేశారు.. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది.. 2 రోజుల వ్యవధిలో చంద్రబాబు దంపతులు, రిటైర్డ్ ఎస్ఐ వెంకటర్రామరాజులపై కూడా దాడి జరిగింది.. అంతకు ముందు శ్రీవారి నగర్ లో భార్యా పిల్లలతో కలిసి టీటీడీ ఉద్యోగి ధర్మేంద్ర వాకింగ్ చేస్తుండగా కూడా ఇలాంటి దాడే చేశారు.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ కుటుంబం బెంగళూరుకు మకాం మార్చినట్టుగా తెలుస్తోంది.. ఇప్పుటికే ఐదు కుటుంబాలు.. గంజాయి బ్యాచ్ ఆగడాలతో వలస వెళ్లినట్లు సమాచారం.. పోలీసులు జోక్యం చేసుకుని గంజాయి బ్యాచ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు..

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతి రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రకటించారు.. ఇక, సీఆర్డీఏ‌ బిల్డింగ్ అప్పటి మా ప్రభుత్వంలోనే పూర్తి అయ్యిందన్నారు.. ఇంకా, మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికే ఈ పునః ప్రారంభం అన్నారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికి భూములిచ్చాం అన్నారు మంత్రి నారాయణ.. పెట్టుబడులు పెట్టిన వారికి మౌళిక వసతులు అవసరం.. ట్రంక్ రోడ్లు, కాలువలు, నీరు వంటి వసతులు కల్పిస్తాం అని వెల్లడించారు.. అన్ని టెండర్లు నిర్ణీత సమయంలో పూర్తవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. జనవరి నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు జరిపిస్తాం అన్నారు అన్నారు మంత్రి పొంగూరు నారాయణ.

మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు..
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. అయితే, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ రైడ్స్‌ సాగుతున్నాయి.. మధురవాడ భూమి కొనుగోలు కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు.. రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది.. ఎండీ జగదీశ్వరుడు, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌ ఓనర్‌ రాధారాణి ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.. ఇక, తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ… గీతాంజలి, అభినేత్రి, నీవెవరు లాంటి సినిమాలు తీశారు ఎంవీవీ.. ఈ నేపథ్యంలో 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది.. ఎంవీవీ ఆడిటర్‌ వెంకటేశ్వరరావుతో పాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన అధికారుల బృందాలు.. అయితే సోదాల సమయంలో ఎంవీవీ ఇంటి గేటుకు తాళాలు వేశారు సిబ్బంది.. ఈ సమయంలో ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో లేరని చెబుతున్నారు.. ల్యాండ్ గ్రాబింగ్, పలు అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఈడీ అధికారుల సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది..

వారికి రైతు భరోసా ఇవ్వలేము.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు. రూ.25 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పంట వేయని భూములకు ఇచ్చిందన్నారు. రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు.

రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నాకు రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఇట్ల మీడియా ముందు మాట్లాడతమా? అని ప్రశ్నించారు. నేనే కాదు… ఎవరితోనైనా దోస్తానా? ఉంటే ఫోన్ లో మాట్లాడుకుంటరే తప్ప మీడియాతో మాట్లాడరు కదా అని అన్నారు. అంతెందుకు మీ అయ్యకు కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా? అన్నారు.
ఆ కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?’’ అంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ను కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు తీవ్రస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నరు కదా.. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది కదా? ఎందుకు తేల్చలేకపోయారు? ఎందుకు ఆ కేసును నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది మీకా? మాకా? అన్నారు.

జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణం..
కేంద్రపాలిత ప్రాంతం జమ్ము అండ్ కాశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌, ఆప్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఇక, ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బాధ్యతలను తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో కొత్త అసెంబ్లీ కొలువుదీరబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేశారు.
ఇక, శ్రీనగర్‌లోని రాజ్‌ భవన్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) పార్టీ సీనియర్‌ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. ముబారక్‌ గుల్‌ చేత ప్రమాణం చేయించారు. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరితో గుల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. అలాగే, ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్‌ ఇటీవల సమావేశమై జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని తొలి తీర్మానం చేసింది.

జైలు నుంచి బయటకు వచ్చి జైన దేవాలయం దర్శించిన జైన్‌ దంపతులు
ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (అక్టోబర్ 18) ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని జైలు పాలకమండలిని కోర్టు ఆదేశించింది. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల పనిని ఆపడానికే తనను జైలుకు పంపారని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఇప్పుడు మన నేతలంతా బయటకు వచ్చారని అన్నారు. ఇప్పుడు మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి చూపిస్తా అని అన్నారు. ఇకపోతే, సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో మే 2022 నుండి జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన సత్యేందర్ జైన్‌కు ఆప్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ సీఎం అతిషి, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తీహార్ జైలుకు చేరుకుని కౌగిలింతలతో స్వాగతం పలికారు. అయితే రోస్ అవెన్యూ కోర్టు సత్యేంద్ర జైన్‌కు రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు మూడు షరతులు విధించింది కోర్టు. మొదటిది, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఏ సాక్షిని లేదా వ్యక్తిని సత్యేంద్ర జైన్ సంప్రదించకూడదు. రెండవది, అతను కేసును ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. మూడవది, AAP నాయకుడు కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశం వెలుపల ప్రయాణించకుండా కూడా నిషేధం.

యహ్యా సిన్వార్‌ లేకపోయినా హమాస్‌ ఉనికికి ఢోకా లేదు..
హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు. ఇజ్రాయెల్ దాడిలో అతడు చనిపోయినా హమాస్‌ ఇంకా ఉనికిలోనే ఉంది.. ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. శత్రువులు తమపై విపరీత దాడులకు పాల్పడుతున్నప్పటికి.. సిన్వార్‌ వారికి ఎదురు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ వ్యూహాలకు దీటుగా ఆయన సమాధానం ఇచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వెల్లడించారు. ఇక, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించి సిన్వార్ దెబ్బ కొట్టిన తీరును ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్‌ చీఫ్‌ హసన్ నస్రల్లా చనిపోయిన తర్వాత లెబనాన్‌లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ రెడీగా ఉందని ఆ దేశ ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.

భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్‌! నవ్వుకుండా ఉండలేరు
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకిగా మారింది. నాలుగో రోజైన శనివారం తొలి సెషన్‌ చివరలో వర్షం రావడంతో.. అంపైర్లు ఆటను నిలిపివేసి లంచ్‌ విరామాన్ని ప్రకటించారు. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్‌ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) ఉన్నారు. అయితే నాలుగో రోజు ఆటలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ 56వ ఓవర్‌లో సర్ఫరాజ్‌ ఖాన్, రిషబ్ పంత్ మధ్య సమన్వయలోపంతో రనౌట్ అయ్యే ప్రమాదం తృటిలో తప్పింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 56వ ఓవర్‌లో మొదటి బంతి వేయగా.. సర్ఫరాజ్‌ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పంత్.. మొదటి రన్ పూర్తిచేసి రెండో పరుగు కోసం పరుగెత్తుతున్నాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడంను గమనించిన సర్ఫరాజ్‌.. నో, నో అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించని పంత్.. పరుగెత్తుతూ వచ్చాడు. దాంతో సర్ఫరాజ్‌ భాయ్ వెనక్కి వెళ్లిపో అంటూ గట్టిగా అరుస్తూ.. పిచ్‌పై గంతులేశాడు. ఇది చూసిన పంత్ వెనక్కి వెళ్ళిపోయాడు.

దేవర పార్ట్ – 2 గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అజయ్..
జూనియర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఆంధ్ర నుండి అమెరికా దాకా దేవర కలెక్షన్స్ దండయాత్ర చేసాడు. మరి ముఖ్యంగా ఆంధ్రాలోని మారుమూల సీ సెంటర్స్ లో మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్లకు దేవర రూపంలో హౌసేఫుల్ బోర్డ్స్ పెట్టె రేంజ్ కు దేవర వెళ్ళింది. అంతటి ఘాన విజయం సాధించిన దేవరలో యాక్టర్ అజయ్ కీలక పాత్రలో నటించాడు. సెకండ్ పార్ట్ లో అజయ్ పాత్ర సినిమా ముఖ్య భూమిక పోషించనుంది. దేవర, మత్తువదలరా 2 సక్సెస్ తో అజయ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాడు. కాగా అజయ్ పొట్టెల్ అనే సినిమాలో పటేల్ అనే పాత్రలో విలన్ గా నటించాడు. ఈ శుక్రవారం పొట్టెల్ ట్రైలర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు అజయ్. అయితే ఓ జర్నలిస్ట్ దేవర పార్ట్ – 1 లో మీ రోల్ ఎక్కువగా చూపించారు. పార్ట్ -2 లో మీ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది అని ప్రశించగా, అజయ్ సమాధానంగా బదులిస్తూ ” ఇప్పుడు అది చెప్తే చంపేస్తారు. అసలు దేవర పార్ట్ -2 గురించి నేను ఒక్క మాట మాట్లాడిన దర్శకులు కొరటాల శివ చంపేస్తారు. అది చాలా సెన్సిటివ్ ఇష్యు, ఇప్పడు దాని గురించి వద్దు, పార్ట్ -2 లో నాది కీ రోల్’ అని అన్నారు.  విలన్ గా అజయ్ కు విక్రమార్కుడు లాంటి పేరు తెస్తుందని టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు అజయ్ ను అభినందిస్తున్నారు.