NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వమించారు.. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన ఆయన.. ఆయా జిల్లాలలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.. 185 ఎంఎంకు గాను 244 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదు అయ్యిందని ఈ సందర్భంగా వెల్లడించారు.. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.. అయితే, రాష్ట్రంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడి ఉంటాయని.. వీటిపై దృష్టిపెట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేసిన ఇయన.. ఫ్లడ్ మాన్యువల్ ను అధికారులు పాటించాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయట పడుతుంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పని చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతోన్న విషయం విదితమే.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వరదలతో.. పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి.

బీజేపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు.. ఎన్డీఏ కూటమితోనే ప్రగతి సాధ్యం..
బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. అనతరపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పని చేస్తోంది.. దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం అన్నారు.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమమే అన్నారు.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని వెల్లడించారు పురంధేశ్వరి.. మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతోంది గనుక కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పురంధేశ్వరి.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐదేళ్ల వైసిపి అరాచక పాలనని ప్రజలు చూశారు.. 16 సంవత్సరాల బీసీ అమ్మాయి ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపారు.. దీనిపై స్పందించలేదు… ఉత్తరాంధ్రలో డాక్టర్‌ ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు చింపేశారు.. నెల్లూరులో కత్తులతో ఓ మహిళ కార్యకర్తని గాయపరిచారు. లేఖ రాయడం కాదు గుండెలపై చేయి వేసుకొని వైఎస్‌ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వార్నింగ్‌ ఇస్తోంది.. మరోవైపు.. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు స్థానిక సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్.

వీధి కుక్కల బెడద అరికట్టండి.. సీఎం ఆదేశాలతో రంగంలోకి జీహెచ్‌ఎంసీ..
వీధి కుక్కల దాడులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు విచక్షణారహితంగా వారిపై విరుచుకుపడి పీక్కుతింటున్నాయి. దీంతో పిల్లలు ఇన్ ఫెక్షన్ కు గురియై ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. కుక్కల దాడులపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. ఇక మరోవైపు కుక్కల దాడుల్లో చిన్నారులు మృత్యువాత పడటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. వీధికుక్కల వల్ల ముఖ్యంగా పసికందుల వల్ల మరణాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం రాష్ట్ర, మునిసిపల్ స్థాయిలో కమిటీని నియమించింది. ఈ కమిటీలు వీధికుక్కలను జనావాస కేంద్రాలు లేని మారుమూల ప్రాంతాలకు తరలించాలని తెలిపింది. వాటి సంతానం పెరగకుండా శస్త్ర చికిత్సలు చేయడం, కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేయడం వంటి వాటిని నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో గతేడాది అంబర్‌పేట, జోనల్‌ స్టేలో మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్- 2023 ప్రకారం వీటిని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం తెలిపింది. అయితే.. ఈ నేపథ్యంలో కమిటీలు నిర్ణీత వ్యవధుల్లో, అవసరమైన సందర్భాల్లో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించేలా తగిన చర్యలు తీసుకోనున్నారు.

పాతబస్తీలో ప్రారంభమైన బోనాలు.. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు..
ఆషాడమాసంలో తెలంగాణలోనే ప్రసిద్దిచెందిన బోనాలపండుగకు ఓల్డ్ సిటీ ముస్తాబయ్యింది. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుత్​ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగనున్న లాల్​దర్వాజా బోనాల నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ధ్వజారోహణ, శిఖర పూజలతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 వ తేదీన ఆదివారం సాయంత్రం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటం భారీ ఊరేగింపుగా తీసుకు వచ్చి ఆలయాల్లో ప్రతిష్టాపన, తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాలలో ప్రత్యేక పూజల అనంతరం ఈ నెల 28 వ తేదీన బోనాల పండుగ, 29 వ తేదీన రంగం భవిష్యవాణి, సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ సింహవాహిని మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను నగర పోలీస్ ​కమిషనర్​ కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి​​ అట్టహాసంగా ప్రారంభించారు.

23 నుంచి అసెంబ్లీ భేటీ.. 25న బడ్జెట్..
రాష్ట్ర శాసనసభ మూడో సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్య గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత, ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపి సభ తొలిరోజు వాయిదా పడింది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉంది.

మూడు కోట్ల మంది కల నెరవేర్చనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు. మధ్యతరగతి వర్గాలకు పన్ను రాయితీపై దేశంలోని వివిధ వర్గాల నుంచి చర్చలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పేదల అభ్యున్నతిపై దృష్టి సారిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్‌లో మూడు కోట్ల మంది ప్రజల ఇళ్లు కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పెద్ద ప్రకటన చేయనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో ఆమె ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పరిధిని విస్తరించడం గురించి కూడా మాట్లాడారు. అదే సమయంలో మధ్యతరగతి ప్రజల కోసం కొత్త గృహ నిర్మాణ పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్‌లో దీనిపై కచ్చితమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయగలదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిధుల విడుదలతో 2025 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 31.4 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది మోడీ ప్రభుత్వం ప్రధాన పథకం. ‘అందరికీ ఇళ్లు’ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఈ పథకం రూపొందించబడింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మార్చి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశంలో 2.63 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ ఇందిరా ఆవాస్ యోజనలో సమూల మార్పులు చేయడం ద్వారా ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కింద, చాలా రాష్ట్రాల్లో ఇంటి ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాలలో ఈ ఖర్చు కేంద్రం వాటాపై 90 శాతానికి చేరుకుంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాలలో 100 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇక ఏళ్లకు ఏళ్లు బతికేయొచ్చు.. వయసు పెరుగుతుందన్న భయమే అవసరం లేదు
చాలా మందికి వయసు అయిపోతుంది చావుకు దగ్గరవుతున్నామనే భయం ఉంటుంది. చావును ఎదురించి చాలా కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. అయితే, దానిని మరింత పెంచటానికి, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్భలత్వాన్ని అధిగమించటానికి అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో సింగపూర్ సైంటిస్టులు ఓ కీలక అడుగు వేశారు. వయసు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్‌ను వారు ఫస్ట్ టైం కనుగొన్నారు. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వయసు పెరుగుతున్నా కొద్ది సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని గుర్తించారు. తద్వారా సుదీర్ఘకాలం పాటు జీవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింగపూర్‌లోని డ్యూక్‌-ఎన్‌యూఎ్‌స మెడికల్‌ స్కూల్‌ సైంటిస్టులు ఈ పరిశోధన నిర్వహించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్‌ల్యూకిన్‌ అనే ప్రోటీన్‌ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతోందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడి అయింది.

ఆ దేవుడి ఆశీస్సులే నన్ను కాపాడాయి..
రిపబ్లికన్‌ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఎమోషనల్ కు గురయ్యాడు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. ఏ మాత్రం పొరపాటు జరిగినా తాను ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదని చెప్పుకొచ్చారు. యూఎస్ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్‌ అధికారికంగా అంగీకరం తెలిపారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోంది.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై జరిగిన కాల్పుల ఘటనను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్‌ సరిగ్గా తన దగ్గరకు వచ్చిన టైంలో తల పక్కకు తిప్పానని చెప్పుకొచ్చారు. వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్‌ వైపు చూశాను.. ఒక వేళా అలా జరిగి ఉండకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్‌ నా తల లోపలికి చొచ్చుకుని పోయేది అన్నారు ట్రంప్. తాను ఇలా అందరి ముందు నిలబడి మాట్లాడే వాడిని కాదన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులే తనని కాపాడాయి.. ఆ క్షణంలో స్వయంగా దేవుడే తన మృత్యువును అడ్డుకున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
మగువలకు శుభవార్త. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గగా.. నేడు రూ.450 తగ్గింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా రూ.900, రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,350గా ఉంది. నేడు కిలో వెండిపై రూ.1450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.93,250గా నమోదైంది.

విశాఖ, విజయవాడ సహా ఈ నగరాల్లో ఇళ్లకు ఫుల్‌ డిమాండ్.. 94 శాతం పెరిగిన ధరలు..!
ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. అంటే.. మనిషి జీవితంలో ఈ రెండింటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంతేకాదు.. ఇల్లు కట్టడం, పెళ్లి చేయటం రెండూ ఖర్చుతో కూడుకున్నవే.. అనుకున్నదానికంటే ఒకటికి మూడింతలు ఖర్చు అవుతుంది.. మరోవైపు గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నారు.. అయితే, తమ ఆర్థిక స్థోమతు బట్టి.. ఇళ్లను తమకు నచ్చిన విధంగా నిర్మించుకోవడం.. ఒకటైతే.. ఇప్పుడు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం బాగా పెరిగిపోయింది.. బ్యాంకులు హౌసింగ్‌ లోన్లు ఇస్తుండంతో.. క్రమంగా ఇళ్లు కొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. 2023-24తో ముగిసే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 94 శాతం వరకు పెరిగాయి.. నివాసాలకు అధిక గిరాకీయే ఇందుకు కారణమని.. ఉద్యోగ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు మంచి గిరాకీ పెరిగిందని స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. ఆ సంస్థ.. 2023-24లో సగటు ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభ ధరను.. 2019-20 ధరలతో పోల్చి ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో ప్రధానమైన 30 ద్వితీయశ్రేణి మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉండగా.. అమృత్‌సర్, మొహలి, లుధియానా, చండీగఢ్, పానీపట్, దెహ్రాడూన్, భివాండీ, సోనేపట్, జయపూర్, ఆగ్రా, లఖ్‌నవూ, భోపాల్, ఇందౌర్, మంగళూరు, మైసూర్, కోయంబత్తూర్, కోచి, త్రివేండ్రం, రాయపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, సూరత్, నాసిక్, నాగ్‌పూర్, గోవా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. ఇందులో 24 నగరాల్లో ఇళ్ల ధరలు రెండంకెల్లో పెరిగిపోతే.. 6 నగరాల్లో ధరలు ఒక అంకె వృద్ధి సాధించాయని పేర్కొంది.. ఇక, టాప్‌ 10 సిటీల్లో ఇళ్ల ధరలు 54 శాతం నుంచి 94 శాతం పెరిగాయని పేర్కొంది ప్రాప్‌ఈక్విటీ.

ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ ఎంపికయిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించిన వెంటనే.. చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో ఓ ప్రశ్న మెదిలింది. అదే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతాడా? లేదా? అని. వీరిద్దరి మధ్య ఐపీఎల్‌ 2023 సమయంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే అవన్నీ గతమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పకనే చెప్పడం గమనార్హం. శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. తన తొలి పర్యటన కాబట్టి సీనియర్లు అందరూ అందుబాటులో ఉండాలని గౌతమ్ గంభీర్‌ కోరాడు. రోహిత్, కోహ్లీని ప్రత్యేకంగా అడిగాడు. గంభీర్‌ అడగ్గానే మరోమాట లేకుండా వన్డేలు ఆడేందుకు కోహ్లీ అంగీకరించాడు. దీంతో కోహ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట కోహ్లీ తెలిపిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్‌, తనకు మధ్య ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చాడట.

యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్‌ కేసు!
గంజాయి మత్తులో తండ్రి-కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్‌ హనుమంతుపై 67బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు 79, 294 బీఎన్‌ఎస్‌, ఎన్డీపీఎస్‌ చట్టాల కింద పలు సెక్షన్లు జత చేశారు. ప్రస్తుతం ప్రణీత్‌ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌కు సీజన్ 2, 3!
‘#90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో రిలీజైన ఈ సిరీస్‌.. సరికొత్త రికార్డుని సాధించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారతదేశంలోని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించిన తెలుగు సిరీస్‌గా ఇది నిలిచింది. తాజాగా ఈ సిరీస్‌ గురించి ఈటీవీ నెట్‌వర్క్‌ సీఈఓ కె.బాపినీడు ఓ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఈటీవీ విన్‌ ఎప్పుడూ కొత్త ఆలోచల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రతి నెల కొత్త దర్శకులు రూపొందించిన ఓ సిరీస్‌, ఓ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. కుటుంబం మొత్తం కలిసి చూసే కంటెంట్‌ని అందించడమే మా లక్ష్యం. 90sని ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సిరీస్‌కి కొనసాగింపుగా 2, 3 భాగాలను వచ్చే ఏడాదిలో తీసుకొస్తాం’ అని ఈటీవీ నెట్‌వర్క్‌ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు.