Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వీడియో వైరల్‌.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..
అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్‌ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకుని వస్తే మోసం చేశారని వాపోయింది. అయితే, విచారించి కేసు నమోదు కోసం పోలీసులు ఇరు వర్గాలను పిలిపించారు. అంతకు ముందే లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరి మధ్య సమస్యను కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటా మని… అసలు తన వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె కొద్ది గంటల వ్యవధిలోనే రెండో వీడియో విడుదల చేసింది. సూర్య చంద్రపై ఆరోపణలు, లావణ్య వీడియో వైరల్ కావడంతో చర్యలకు పూనుకుంది జనసేన పార్టీ.. నర్సీపట్నం ఇంఛార్జ్‌గా ఉన్న సూర్యచంద్రకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది జనసేన పార్టీ..

ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు.. ‘పెళ్లికి యువతులు కావాలి’.. పెళ్లికాని ప్రసాద్‌ల ఫ్లెక్సీ..
పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. సెటిల్‌ అవ్వక కొందరు లేట్‌ చేస్తే.. సరైన సంబంధం దొరకక మరికొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది.. ఓ వైపు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరో వైపు.. పెళ్లి చేసుకోవడానికి యవతులు కావాలి అంటూ ప్రకటన కూడా వచ్చేలా ఈ ఫ్లెక్సీ రూపొందించారు యువకులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో పశువుల పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు గ్రామస్తులతో పాటు పండుగకోసం వచ్చిన సందర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి, సాధారణంగా శుభాకాంక్షలు, సంప్రదాయ సందేశాలు, పశువుల పూజ ప్రాముఖ్యత వంటి విషయాలతో బ్యానర్లు ముస్తాబయ్యే ఉత్సవాల్లో, ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. పండుగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా, యువకులు తమ ఫోటోలను బ్యానర్లపై ముద్రించించి, వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ “పెళ్లికి యువతులు కావాలి” అనే ప్రత్యేక సందేశాన్ని పొందుపరిచారు. ఈ అసాధారణమైన ఆలోచన పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. బ్యానర్‌ను చూసిన గ్రామస్తులు, సందర్శకులు నవ్వులు చిందిస్తూ, ఈ క్రియేటివ్ ఆలోచనపై ఆసక్తి వ్యక్తం చేశారు. కొందరు యువకుల వినూత్నమైన హాస్యభరితమైన ప్రయత్నం గ్రామంలో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ పండుగలలో ఈ తరహా వినూత్నత అరుదుగా కనిపిస్తుందని, యువత తమ ఆలోచనలకు కొత్తదనం జోడించడం పండుగ జాతరను మరింత ఉత్సాహభరితంగా మార్చిందని పలువురు అభినందించారు. మొత్తంగా ఫ్లెక్సీలో ఎంత మంది ఉన్నా.. అందులో ఫొటో పక్కన స్టార్‌ ఇచ్చిన యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు కావాలి అన్న మాట.. ప్రస్తుతం ఈ బ్యానర్లు కలికిరిపల్లెలో హాట్ టాపిక్‌గా మారి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

ఏపీలో కర్ణాటక అక్రమ మద్యం అమ్మకాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి..
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్సైపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్సై శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, డాబాలు తదితర ప్రాంతాలకు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా మల్లికార్జున మరియు అతని కూతురు కీర్తనను పట్టుకున్నారు. అయితే, తమపై కేసు నమోదు చేయకుండా తప్పించుకునే ప్రయత్నంలో తండ్రి–కూతురు పోలీసులపై రెచ్చిపోయారు. ఈ క్రమంలో కీర్తన ఎస్సై శోభారాణిని చెంపపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై చేయి చేసుకోవడం తీవ్ర నేరమని హెచ్చరించినా వారు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ మల్లికార్జున, కీర్తనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాల కింద కీర్తనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై దాడులు చేస్తే చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు.

కోర్ట్ ధిక్కరణ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్ట్ ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్ తో ట్యాగ్ చేసిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనా? లేక కోర్టా? అన్న కీలక ప్రశ్నలను కూడా ధర్మాసనం లేవనెత్తింది. తెలంగాణ ఎమ్మెల్యేల పిరాయింపు వ్యవహారంలో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానం కొద్దిదూరం నేలకు రాసుకుంటూ వెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపి ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. చికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓర్లాండోకు 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం బయల్దేరింది. అయితే ఓర్లాండో‌లో విమానం ల్యాండింగ్ అవుతుండగా గేరింగ్ నుంచి ముందు చక్కం ఊడిపోయింది. అయితే విమానం ముందుకు వెళ్లి ఆగిపోయింది. అనంతరం ఎమర్జెన్సీ ద్వారాల నుంచి ప్రయాణికులు దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లారు. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సమయం ఆసన్నమైంది.. గ్రీన్‌లాండ్‌పై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
గ్రీన్‌లాండ్ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి లభించేంత వరకు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్‌ను మిత్ర దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఇదే వ్యవహారంపై ట్రంప్ మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా ముప్పు నుంచి తప్పించడంలో డెన్మార్క్ విఫలమైందన్నారు. ప్రస్తుతం సమయం ఆసన్నమైందని.. అది జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. డెన్మార్క్ విఫలం కావడంతోనే అమెరికా జోక్యం చేసుకుంటుందని తెలిపారు. గ్రీన్‌లాండ్ నుంచి రష్యా ముప్పును దూరం చేయాలని నాటో 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు చెబుతోందని… కానీ దురదృష్టవశాత్తు డెన్మార్క్ ఆ విషయంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా భద్రతా దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అవసరం అని… చైనా, రష్యా ఆక్రమణ నుంచి కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ పేర్కొన్నారు.

WhatsAppలో సరి కొత్త ఫీచర్‌.. వెబ్‌లోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్!
వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్‌డేట్‌లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్‌సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలిపింది. ఇంకా బీటా వెర్షన్‌కూడా విడుదల కాలేదని పేర్కొంది. రాబోయే ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా WABetainfo షేర్ చేసింది. ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ చాట్ ఓపెన్ చేస్తే పైభాగంలో వీడియో కాల్ ఐకాన్ కనిపిస్తోంది. అయితే, దానిపై క్లిక్ చేస్తే “Windows యాప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేయండి” అనే సందేశం వస్తోంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, విండోస్ యాప్ అవసరం లేకుండానే నేరుగా వాట్సాప్ వెబ్ నుంచే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, ఇతరుల ల్యాప్‌టాప్ లేదా పబ్లిక్ కంప్యూటర్ ఉపయోగిస్తున్న సందర్భాల్లోనూ వాట్సాప్ వెబ్ ద్వారా గ్రూప్ కాల్స్‌లో పాల్గొనడం సులభమవుతుంది. ముఖ్యంగా ఆఫీసులు, విద్యా సంస్థల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

బంగ్లాదేశ్‌కు ICC డెడ్‌లైన్.. ప్రపంచకప్‌లో ఆడతారా? లేక తప్పుకుంటారా?
2026 టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనాలా? లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా? అనే విషయంపై జనవరి 21 చివరి తేదీగా నిర్ణయిస్తూ ఐసీసీ స్పష్టత ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. భారత్‌కు బదులుగా శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా పరిగణించాలని బీసీబీ కోరుతోంది. అయితే, ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌కే కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. తాజాగా, శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధులు రెండోసారి బీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచకప్‌ను సహ-ఆతిథ్యం ఇవ్వాలన్న తన కోరికను మరోసారి వెల్లడించినప్పటికీ, భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించలేదు. భద్రతా సమస్యల పేరుతో శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా ప్రతిపాదించింది. కానీ, గ్రూప్-సీ లో భాగంగా బంగ్లాదేశ్ ముంబై, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. గత మూడు వారాలుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించడంతో.. ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత భారత్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడటం లేదని, తమ డిమాండ్లు నెరవేరకపోతే టోర్నీ నుంచి వైదొలగే అవకాశం ఉందని బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసింది. ఈ అంశం తొలిసారి జనవరి 4న వెలుగులోకి వచ్చింది.

మమిత బైజు కొత్త ప్రేమకథ.. షూటింగ్ డేట్ లాక్!
‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలే ‘డ్యూడ్’ చిత్రంతో పలకరించిన ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. మమితా బైజు ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో గతంలోనే ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆషిక్ ఉస్మాన్ సమర్పణలో ఫ్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందట. మమిత చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఏ.డి దర్శకత్వంలో నివిన్ పౌలీ సరసన ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా, తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’లో కీలక పాత్ర పోషించిన మమిత, ప్రస్తుతం సూర్య సరసన కూడా ఒక భారీ చిత్రంలో నటిస్తోంది. వరుసగా అగ్ర హీరోలు , యువ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ మలయాళ కుట్టి, తన కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్  హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. ఈ సినిమా నుండి ఆమె మొదటి గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. తొలి సినిమా అయినా కూడా మంచి ప్రదర్శన కనబరిచింది సాత్విక. గ్లిమ్స్ లో ఆమె నటన, హావభావాలు చాలా బాగున్నాయి.  సాత్విక వీరవల్లి విషయానికి వస్తే అమెరికాలో జన్మించిన తమిళ అమ్మాయి. ఆకాశంలోఒకతార చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్ మరియు డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సాత్విక 15 సంవత్సరాలుగా భరతనాట్యం నేర్చుకుంటోంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఆకాశంలో ఒక తారతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ వరుసగా నాలుగవ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version