కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ప్రియురాలి కూతురే..!
ఏపీలో కానిస్టేబుల్ హత్య ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద్ద కంబులూరుకి చెందిన కానిస్టేబుల్ ఫరూక్.. మంగళగిరి లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ నాలుగు రోజుల క్రితం అదృశ్యం కాగా.. మృతదేహం నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద బయటపడింది. నాలుగు రోజుల క్రితం సెలవుపై వచ్చిన ఫరూక్ ఆచూకీ దొరకకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఫరూక్ మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది. ఈ హత్యకు ఓ మహిళతో వివాహేతర సంబంధం, ఆ మహిళ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, కుమార్తె ప్రియునితో వివాదం వెరసి హత్యకు దారుతీసినట్లు సమాచారం.
సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు.. టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు..!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు.. అయితే, వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉండే వారిపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు.. సిట్ కావాలనే ఇదంతా చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గుడులు, బడుల దగ్గర బెల్ట్ షాపులు పెరిగాయని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారని వ్యాఖ్యానించారు.. నేరుగా టీడీపీ ఎమ్మెల్యేనే కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.. గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలపై కాదు.. సిట్ విచారణ కూటమి ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారంపై చేయాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్..
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ పై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశం అయ్యింది.. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.. కోరం సరిపోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు ఇంచార్జ్ కమిషనర్, విశాఖ కలెక్టర్ హరేంధీర ప్రసాద్.. ఆ తర్వాత కూటమి.. విశాఖ మేయర్ పీఠం దక్కించుకుంది.. దీంతో, మేయర్ హరివెంకట కూమారి ఇక, మాజీ కానున్నారు.. గత నెల రోజులుగా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓవైపు కూటమి ప్రయత్నాలు.. మరోవైపు.. తిరిగి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఉత్కంఠగా మారిపోయాయి.. కానీ, గ్రేటర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడంతో.. ఆ ఉత్కంఠకు తెరపడింది.. కార్పొరేటర్లు చేతులు ఎత్తడం ద్వారా.. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. దీంతో, మేయర్ తన పదవిని కోల్పోయారు.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారు..?
రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కాకినాడ పోర్ట్ లో పట్టుబడిన రేషన్ బియ్యం వ్యవహారం చల్లబడిపోయింది అంటున్నారు.. అసలు ఎందుకు చల్లబడిందో.. ఎలా చల్లబడిందో.. ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అన్నారు.. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై మంత్రి స్టేట్‌మెంట్లకే పరిమితం కాకూడదు.. రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు.. 30 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇమ్మని ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు.. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్‌గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.. వారికి మనమే అవకాశం ఇస్తున్నాం.. విజిలెన్స్ విచారణ, కేసులు వలన ఏంటి ఉపయోగం? అని నిలదీశారు.. అయితే, 80 శాతం ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారు.. తినే బియ్యం ఇస్తే ప్రజలు ఎందుకు అమ్ముకుంటారు? అని ప్రశ్నించారు.. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారు? 50 శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుక్కోలేరా? రేషన్ బియ్యం కేజీ కి 13 రూపాయలు ఇచ్చేస్తామంటే సరిపోతుందా? అంటూ హాట్ కామెంట్లు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కాగా, అప్పట్లో కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం వ్యవహారం సంచలనంగా మారింది.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వాటిపై చర్చ సాగినా.. కొంతకాలంగా దీనిపై ఎలాంటి కామెంట్లు వినపడం లేదు.. దీంతో.. జ్యోతుల నెహ్రూ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..
ఆ చిన్నారి మాటలకి కంటతడి పెట్టుకున్న హరీష్ రావు..
సిద్దిపేట పట్టణంలో విద్యార్థులకు భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఇక, హరీష్ రావు మాట్లాడుతూ.. జీవితమంటే మార్కులు, ర్యాంకులు కాదు.. జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారు.. అమ్మ నాన్న చెప్పిన మాట వింటే తలెత్తుకొని బతుకుతారు అని తెలియజేశాడు. ఇక, స్టూడెంట్స్ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడకండి.. పుస్తకాలు చదవండి అని పేర్కొన్నారు. అలాగే, మాతృభాషను మర్చిపోవొద్దు.. తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ కీలక ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలిచే వాళ్ళం.. మొన్న 2023లో కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని స్థానాలు మనమే గెలిచాం.. హైదరాబాద్ వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మనల్ని గెలిపించారు.. ఔటర్ అవతల ఉన్న వాళ్లు కాంగ్రెస్ మాటలకు మోసపోయారు అని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం చేస్తుంది.. హైడ్రాతో పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు అంటూనే.. మూసి సుందరీకరణ చేస్తాను అంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఇక, సందట్లో సడెమియా లాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేంద్రంలో ఒక సహాయ మంత్రి, మరో నిస్సహాయ మంత్రి ఉండి ఎలాంటి లాభం లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటే.. అందరూ ఎంపీలు భుజాలు తడుముకుంటున్నారు.. బయటకు వచ్చి బీజేపీ ఎంపీలు నన్ను తిడుతున్నారు.. సోనియా, రాహుల్ గాంధీల మీద చార్జ్ షీట్ వేస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేశారు.. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడలేదు.. బీజేపీ, నరేంద్రమోడీతో చోట భాయ్- బడా భాయ్ బంధం ఉంది కాబట్టే రేవంత్ మాట్లాడడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
జనాలను రెచ్చగొట్టడానికే ఒవైసీ మీటింగ్ పెట్టారు..
జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వాస్తవాలను మీరు చెప్పలేరు.. వక్ఫ్ భూములు అమ్మించింది మీరే.. కబ్జా చేసింది మీరే అని పేర్కొన్నారు. తక్కువ రెంట్లకు తీసుకుంది మీరే.. అల్లాహ్ ఇచ్చిన ల్యాండ్ అమ్మ వద్దని ఎప్పుడు గుర్తుకు రాలేదా.. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్ సేఫ్ గా ఉండాలని ఈ చట్టం తీసుకొచ్చిందని రాజా సింగ్ తెలిపారు. అయితే, వక్ఫ్ భూములు జాగ్రత్తగా ఉండాలని, తక్కువ రెంట్ కు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది అని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. వక్ఫ్ బిల్లుపై తప్పుగా మాట్లాడాలని ఒవైసీ అనుకుంటున్నారు.. రెచ్చ గొట్టడానికి ఒవైసీ మీటింగ్ పెట్టీ తప్పు చేస్తున్నారు అని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా ఆందోళన చేస్తే మీకే నష్టం జరుగుతుందని ముస్లింలకు తెలియజేశారు. దయచేసి ముస్లిం సోదరులు ఆలోచన చేయాలి.. మేలుకోవాలి అన్నారు. ఎంత చేసిన వక్ఫ్ చట్టం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని బీజేపీ నేత రాజా సింగ్ వెల్లడించారు.
మా తమిళనాడులో అమిత్ షా మార్క్ చాణక్యం నడవదు..
2026లో తమిళనాడులో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిప్పికొట్టారు. మా తమిళనాడు రాష్ట్రం ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణలో ఉండదని అన్నారు. “పార్టీలను విచ్ఛిన్నం చేయడం, సభ్యులను బెదిరించడమే బీజేపీ ప్రణాళికలు.. అవి తమిళనాడులో పని చేయవని పేర్కొన్నారు. బలవంతంగా హిందీని రుద్దడంతో పాటు డీలిమిటేషన్ తో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని అంగీకరించలేదన్నారు. “తమిళ ప్రజలకు గుర్తింపు, గౌరవం లేని బీజేపీతో ఏఐడీఎంకే జతకట్టడం.. రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం వంటిదే” అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
అమెరికాలో వీసాలు తిరస్కరించబడిన విద్యార్థులలో 50 శాతం మంది భారతీయులే..
అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) నివేదిక ప్రకారం, ఇటీవల ఆ సంస్థ సేకరించిన 327 వీసా రద్దులలో సగం భారతీయ విద్యార్థులవే ఉండడం గమనార్హం. ‘ది స్కోప్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్షన్స్ ఎగైనెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్’ అనే శీర్షికతో AILA విడుదల చేసిన నివేదిక ప్రకారం, వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులలో 50 శాతం మంది భారత్ నుంచి, 14 శాతం మంది చైనా నుంచి ఉన్నారు. ఈ డేటాలో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. గత నాలుగు నెలలుగా అమెరికా విదేశాంగ శాఖ మరియు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విదేశీ విద్యార్థుల కార్యకలాపాలతో సహా వారి డేటాను పరిశీలిస్తోంది.
తీవ్ర విషాదం.. నదిలో పడవ బోల్తా.. 148 మంది మృతి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా నివేదికలు శుక్రవారం తెలిపాయి. మటాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్‌బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాదాపు 100 మందిని స్థానిక టౌన్ హాల్‌లోని తాత్కాలిక ఆశ్రయానికి తరలించినట్లు స్కై న్యూస్ నివేదించింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులలో చేర్చారు. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కాంగోలోని గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుంటారు. దీంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 2023లో, కాంగోలో ప్రయాణిస్తున్న పడవ ఈక్వేటర్‌లో మునిగిపోవడంతో కనీసం 47 మంది మరణించారు.
పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!
మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి, బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు భాగాలుగా వచ్చింది. అంతే కాదు ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్ అవ్వగా.. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు.. ప్రతి భాషలోనూ భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా దృశ్యం మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమవుతుందనే వార్త తెగ వైరల్ అవుతుంది. అతి కూడా ఒరిజినల్ మోహన్ లాల్ వెర్షన్‌ని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఉన్నారట నిర్మాత ఆంటోనీ పెరువంబూర్. దర్శకుడు జీతూ జోసెఫ్ కథని సిద్ధం చేశారని, ఫైనల్ వెర్షన్‌ని త్వరలోనే లాక్ చేసి ది కంక్లూజన్ పేరుతో ముగింపు ఇస్తారు అని టాక్. ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రేక్షకులకు మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ కనెక్ట్ కాకపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దృశ్యం మూవీని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు. సో అని భాషలో మోహన్ లాల్ హీరో అంటే ప్రేక్షకులు అంగీకరించక పోవచ్చు. అలాంటప్పుడు దృశ్యం 3 బిజినెస్ పరంగా రిస్క్ అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాలీవుడ్‌లో ఆల్రెడీ అజయ్ దేవగన్ మూడో భాగం కోసం వేరే కథను సిద్ధం చేయిస్తున్నాడట. దర్శకత్వం ఎవరనేది తేలినప్పటికీ బాలీవుడ్ లో ఈ టాక్ మాత్రం వినిపిస్తోంది.
నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. అనురాగ్ కశ్యప్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. అతని సినిమా విషయం పక్కన పెడితే తన మాటలతో ఎప్పుడు ఏదో ఓ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ వర్గం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ‘పూలే’ సినిమా విడుదల సమయంలో ఆయన బ్రాహ్మణుల పై అనుచిత కామెంట్స్ చేశాడు. దీంతో తీవ్ర వివాదం నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా అనురాగ్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ పంచుకున్నాడు. ‘నా మాటలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. అందుకుగాను నేను క్షమాపణలు చెబుతున్నా. నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నా కుమార్తెపై కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఆమె కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీమల్ని కామెంట్ చేసింది నేను సో కావాలంటే నన్ను నిందించండి. కానీ, నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకురావద్దు. మీరు నా నుండి క్షమాపణ కోరారు నేను మీ అందరికీ బహిరంగంగా సారీ చెబుతున్నాను’ అని నోట్ విడుదల చేశారు. ప్రజంట్ ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
