NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ కొట్టివేత..
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టులో చుక్కెదురైంది.. రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చే శారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. అయితే, రేపు విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టారని రాంగోపాల్ వర్మపై అభియోగాలున్నాయి.. ఆ అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టు మెట్లు ఎక్కగా.. హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురైంది..

గత ప్రభుత్వ వైఫల్యాలే నేరాలు పెరగడానికి కారణం.. హోం మంత్రి అనిత ఫైర్
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు.. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్‌, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి..? అని నిలదీశారు.. అయితే, వైసీపీ హయాంలో కంటే మా హయాంలోనే క్రైం రేటు తగ్గిందన్నారు.. కానీ, అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.. దిశ చట్టానికి అసలు చట్టబద్ధతే లేదు అని దుయ్యబట్టారు హోం మంత్రి అనిత.. నిర్భయ చట్టం ఉన్నా.. దిశ లేని చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు.. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నాం అన్నారు.. అయితే, ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. కానీ, పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు.. వైసీపీ హయాం నాటిదే అని విమర్శించారు.. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని గుర్తుచేశారు.. ప్రతిపక్షాలు ముచ్చుమర్రు కేసు విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.. 3 సంవత్సరాల బాలిక చనిపోవడం దారుణమైన విషయం.. ముచ్చుమర్రు కేసు విషయంలో నిందితులకు శిక్ష వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ఏపీ కేబినెట్‌ సమావేశం ఎల్లుండికి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది.. అయితే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితే.. దీంతో, ఢిల్లీ, మహారాష్ట్రల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నారు.. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నవంబర్‌ 20వ తేదీన వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్..

ఆర్టీసీలో 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల కొరత..
ఏపీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన.. ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. EHS ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని మా దృష్టికి వచ్చిందని వివరించారు.. అయితే, ఉద్యోగుల‌ మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు.. కానీ, గత ప్రభుత్వంలో బస్టాండులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టతరం అయ్యిందని.. రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఇక, ఆన్ కాల్ డ్రైవర్లు సరైన విధానం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఆర్టీసీ డ్రైవర్లుగా అనుభవం లేని వారిని తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ బస్టాండును పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.. వర్షం కురిసిందంటే చాలు గుడివాడ బస్టాండ్‌ నీటమునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆ ఇబ్బంది మళ్లీ రాకుండా బస్టాండ్‌ను పునర్నిర్మించాలని శాసన సభలో విజ్ఞప్తి చేశారు..

వైసీపీ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు నమోదు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.. గతంలో ట్వి్ట్టర్‌ (ఎక్స్) లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పొస్టింగులపై స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదుతో ఓ కేసు నమోదు చేసిన విషయం విదితమే కాగా.. ఇవాళ దానికి సంబంధించి ఓ నోటసు ఇచ్చారు.. దీంతో పాటు ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఉన్న మరో మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. 41 సీఆర్పీసీ కింద ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు నోటీసులు ఇచ్చారు.. యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందచేశారు.. అయితే, పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగా తమ నేతపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ న్యాయపోరాటం చేసేందుకు సిద్దమయ్యారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టులు.. అరెస్ట్‌లు.. కేసుల వ్యవహారం కాకరేపుతోంది.. వ్యక్తులను.. వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ కొందరు పోస్టుంగులు పెడుతుండగా.. వాటిని సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌.. కేసులు.. అరెస్ట్‌ల వరకు వెళ్తోంది.. కానీ, విపక్షాలు మాత్రం.. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం విదితమే..

సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ బీజేపీ ఎంపీలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని ఆరోపించారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి.. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండని సూచించారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు.

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..
ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ ల కూపంలో పడొద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు. అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. త‌మ స్వ‌లాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. వారి ప్రాణాల‌ను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శ‌క్తులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ‌కుల్లారా!! ఈజీగా మ‌నీ సంపాదించాల‌నే ఆశ‌తో ఇలాంటి సంఘ విద్రోహ శ‌క్తుల మాయ‌మాటల్లో ప‌డ‌కండి అని సూచించారు. బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకోకండి అని తెలిపారు. జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి షార్ట్ క‌ట్స్ ఉండ‌వు.. మీ క‌ష్టాన్ని న‌మ్ముకోండి. విజ‌యం దానంత‌ట అదే మీ ద‌రికి చేరుతుందని తెలిపారు. జీవితంలో ఎదగాలంటే ఇలాంటి బెట్టింగులకు అలవాటు పడవద్దని తెలిపారు. బెట్టింగులు వ్యసనంగా మారి అప్పుల ఊబిలో పడొద్దని సూచించారు. సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచనలంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా యువత మేలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

బీజేపీలోకి ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్..?
ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గహ్లోట్.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం భారతీయ జనాత పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆప్‌ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా ఆయన ఆదివారం రాజీనామా చేశారు. కాగా, నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా గెలిచిన గహ్లోట్ ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు. అయితే, కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆప్ సర్కార్ అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా చెప్పుకొచ్చారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శలు గుప్పించారు. ఇక, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని కైలాష్ గహ్లోట్ ఆరోపించారు. యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామన్నారు.. కానీ, ఆ పని చేయలేకపోయింది.. బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని ఆరోపించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా ‘శీష్ మహల్’ చుట్టూ వివాదం కొనసాగడంపై కూడా ఆయన మండిపడ్డారు.

నేటితో ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం
నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల్లో రెండు కూటములు తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికల కోసం సన్నాహాలు కొనసాగుతున్న వేళ.. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపును ఇండియా, ఎన్డీయే కూటములకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే, ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా, జార్ఖండ్ లో 38 స్థానాలకు, మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు ముందుకెళ్తున్నారు. ప్రచారానికి నేడు చివరి రోజు కావటంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందస్తు సమాచారం లేకుండా.. 10 వేలలో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన ‘వివో’!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ‘వివో వై18టీ’ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్‌ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంది. అయితే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్‌ మాత్రం కాదు. వివో వై18టీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో వై18టీ ఫోన్‌ 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర భారతదేశంలో రూ.9,499గా ఉంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. 1612 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. 269 పిక్సల్‌ డెన్సిటీ, 840 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఈ ఫోన్‌ Unisoc T612 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్‌.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్‌ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్‌ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డారు. ఓ క్రీడా ఛానల్‌తో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఒక ఛాంపియన్ ఆటగాడు. అతని వన్డే గణాంకాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి. గతంలో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో మంచి విజయాలు సాధించాడు. 2014లో నాలుగు సెంచరీలు చేశాడు. 2018లో ఒక సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాలో అతని రికార్డులు బాగున్నాయి. ఆస్ట్రేలియాలో 6 టెస్టు సెంచరీలు చేశాడు. ఇది మాములు విషయం కాదు. 28, 29, 30 సంవత్సరాల వయస్సులో గేమ్ భిన్నంగా ఉంటుంది. 36, 37 సంవత్సరాల వయస్సులో మరోలా ఉంటుంది. ఆసీస్ గడ్డపై ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు’ అని చెప్పారు.

స్టార్ హీరో మనవరాలితో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి
టాలీవుడ్ లో మరోసారి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అక్కినేని నాగా చైతన్య, శోభిత ధూళిపాళ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబరు లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గాజరగనున్నటు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అతడు మరెవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి సినిమాల్లో నటించాడు శ్రీ సింహ. ఇక ఇటీవల విడుదలైన మత్తువదలరా -2 తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీసింహ. గత ఆదివారం ఈ కుర్ర హీరో పెళ్లికి సంబందించిన వేడుక హైదరాబాద్ లోని గోల్కొండ ఫోర్ట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మనమరాలు మాగంటి రాగతో శ్రీ సింహ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు నరేష్, పవిత్రతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎమ్మెల్యేలు హాజరయి నూతన జంటను దీవించారు. త్వరలో వీరి వివాహవేడుకకు సంబంధించి తేదీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధనికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేశ్ బాబు న్యూ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఓటీటీలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ.. ఎలా ఉందంటే?
స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. దీనికి అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈరోజు (నవంబర్ 18) నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విడుదల నేపథ్యంలో.. హీరో ధనుష్, నయనతార మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్‌కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పనిచేసింది. వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. ‘నానుమ్ రౌడీ డాన్’ షూటింగ్ లొకేషన్స్ నుండి 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు ధనుష్ తనకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ లీగల్ నోటీసు పంపినట్లు నయనతార లేఖలో పేర్కొంది. అయితే ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేసిన విజువల్స్ ను ఎట్టకేలకు డాక్యుమెంటరీ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. దాదాపు 1 గంట 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో నయనతార జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావించారు. ఇది సినిమా ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆమె ప్రేమ కథ, ఆమె వైవాహిక జీవితాన్ని వివరిస్తుంది. ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ నయనతార కుటుంబం, ఆమె బాల్యం, చదువు వంటి విషయాలను చర్చిస్తూ ముందుకు సాగింది. చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూడని నయన్ కు మలయాళంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? వంటి విషయాలను డాక్యుమెంటరీలో వివరించారు. నయనతార తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నిరాశను ఎదుర్కొన్న తర్వాత ఎలా తిరిగి వచ్చిందో ఇది వివరించింది.

పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన  రష్మిక మందన్న హీరోయిన్ గా  నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది. కాగా పుష్ప ది రూల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బన్నీ యాక్షన్ కు సుకుమార్ డైరెక్షన్ కు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. మరో వైపు పుష్ప ట్రైలర్ పట్ల స్టార్ హీరోలు, దర్శకులు స్పందిస్తున్నారు. ఈ దశలోనే దర్శక ధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్ పట్ల స్పందించారు. అయన ఎక్స్ ఖాతాలో  “పుష్ప వైల్డ్ ఫైర్ పాట్నాలో స్టార్ట్ అయి దేశమంతా వ్యాపించింది. Dec 5th విధ్వంసం జరగబోతుంది. పుష్ప పార్టీ కోసం  ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఎక్స్ లో హల్ చల్ చేస్తోంది. రాజమౌలి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బన్నీ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇంతవరకు రాజమౌళితో సినిమా చేయకుండా ఈ పాన్ ఇండియా రేంజ్ కు చేరుకున్న హీరో బన్నీ మాత్రమే దటీజ్ బన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments