NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
సంక్రాంతి సంబరాలు ముగిసాయి.. సొంత ఊరికి బైబై చెప్పే… ఉద్యోం, ఉపాధి ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు చాలా మంది.. మరికొన్ని చోట్ల ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సందర్భంగా సీఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకుల మధ్య మాట మాట వచ్చి చిన్న వివాదం చోటు చేసుకుంది.. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. పార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అయితే ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా దారితీసింది. దీంతో రెండు సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్న కుర్చీలను ఒకరికొకరు విసురుకోవటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది.. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇతన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఆధ్వర్యంలోనే అభివృద్ధి..!
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్‌.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావడానికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు.. ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై పరిష్కారానికి సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.. ఆస్తుల విభజనలో ఏపీకి న్యాయం జరిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని సూచించారు.. ఇక, రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ దివాళా పరిస్థితిలో ఉంది.. ఏపీలో ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు హెడ్ ఆఫీస్‌లు తెలంగాణలో పెట్టుకొని పన్నులు అక్కడే చెల్లిస్తున్నారు.. వారు ఏపీలోనే పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు టీజీ వెంకటేష్.. రాయలసీమలో వేల కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు.. మోడీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.. సీమ ఎత్తిపోతల పథకం అనుమతి లేకుండా నిర్మించే ప్రయత్నం చేశారు.. వందల కోట్లు వృథా ఖర్చు చేశారు.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు..

పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు.. తప్పుడు ప్రచారంను నమ్మొద్దు: మంత్రి పొన్నం
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని మంత్రి పొన్నం చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త చెబుతున్నా. అర్హత ఉన్న వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు’ అని తెలిపారు.

పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మాసబ్‌ ట్యాంక్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్‌ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్‌ రెడ్డిని మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడుతున్నారు. అయినా కూడా నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటాను. డిసెంబర్ 4న నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ.. మెట్రో రైళ్లలో వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. దీంతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్‌ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ కారణంగా పడే భారాన్ని కేంద్ర, రాష్ట్రం, ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలనే ప్రతిపాదనలు చేశారు. ఇక, ఢిల్లీ స్టూడెంట్స్ కు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను అంటూ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. విద్యాసంస్థలకు వెళ్లి వచ్చే క్రమంలో వారు మెట్రో రైళ్లపై ఆధారపడుతున్నారు. సదరు విద్యార్థులపై ఆర్థిక భారాన్ని దించేందుకు 50 శాతం రాయితీ అందించాలని ఆ లేఖలో వెల్లడించారు. అలాగే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇప్పటికే మహిళా ప్రయాణికులు బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఢిల్లీ ఎయిమ్స్ వెలువల రోగులను కలిసిన రాహుల గాంధీ.. ఇంతకీ ఏమైందంటే ?
దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు చికిత్స కోసం ఎయిమ్స్ ఢిల్లీలోని ఎయిమ్స్ కు వస్తున్నారు. శీతాకాలంలో దేశ రాజధానిలో పరిస్థితి మరింత దిగజారుతుంది. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల, రోగులు, వారి కుటుంబ సభ్యులు బహిరంగ ప్రదేశాలలో చలిని భరించాల్సి వస్తుంది. ఈ సమస్యలకు సంబంధించి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ వెలుపల రోగులను కలవడానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ రోగుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీనితో పాటు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని రాహుల్ విమర్శించారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ రాత్రిపూట ఫుట్‌పాత్‌లు, సబ్‌వేలపై పడుకున్న చాలా మందితో రాహుల్ మాట్లాడారు. అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వ్యాధుల భారం, తీవ్రమైన చలి, ప్రభుత్వ అసహనం మధ్య, ఈరోజు నేను ఎయిమ్స్ వెలుపల రోగులను, వారి కుటుంబాలను కలిశాను. వారు సుదూర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చారు. చికిత్సకు వెళ్లే దారిలో తాను రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై, సబ్‌వేలపై పడుకోవాల్సి వస్తోందని రాహుల్ అన్నారు. చల్లని నేల, ఆకలి, అసౌకర్యాలు ఉన్నప్పటికీ, మనం ఆశ జ్వాలను వెలిగిస్తూ అక్కడే కూర్చున్నాము. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు రెండూ ప్రజల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయని రాహుల్ సోషల్ మీడియాలో రాశారు.

2024 ఏడాదికి గాను క్రీడాకారులకు పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
నేడు (జనవరి 17)న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ప్రముఖ క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, యూత్ చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ లకు కూడా దేశంలోని అత్యున్నత క్రీడా గౌరవం లభించింది. ఈ వార్షిక గౌరవాలకు ఎంపిక పాయింట్ల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పనితీరుపై గణనీయమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ కార్యక్రమం భారతీయ అథ్లెట్ల అద్భుతమైన ప్రతిభను, అంతర్జాతీయ వేదికపై వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది. ఈసారి అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌) ను సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌) లను అందుకున్నారు. అలాగే ద్రోణాచార్య అవార్డులను (కోచ్‌లు) సుభాష్‌ రాణా (పారా షూటింగ్‌), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ) లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్‌టైం కేటగిరీలో మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్‌) పురస్కారాలను అందుకున్నారు. వీరితోపాటు మరో 32 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు.

ఢిల్లీకి కెప్టెన్‌గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. రిషబ్ పంత్ నిష్క్రమణ తర్వాత జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను జట్టు కెప్టెన్ గా ఎంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే, జట్టు కోసం మెగా వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను కూడా కొనుగోలు చేసింది. ఇదివరకు రాహుల్ గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్‌ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా, ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాధ్యతలు చేపట్టారు. తాజాగా వెలువడిన ప్రముఖ నివేదిక ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించిబాట్లు సమాచారం. అక్షర్ పటేల్ 2019 నుండి ఢిల్లీ జట్టుతో ఉన్నారు. రిషబ్ పంత్ లేకపోవడంతో, అక్షర్ పటేల్ ఇప్పటికీ చాలాసార్లు జట్టుకు నాయకత్వం వహించాడు అయితే, ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా కొనసాగితే.. జట్టులో కేఎల్ రాహుల్ కేవలం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఉండవచ్చు. గత సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు పొందగలరా లేదా అనేది వేచి చూడాలి.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని పట్టుకోవడానికి అనేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడం పోలీసులకు పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఇప్పుడు నిందితుడిని విచారించిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. నిందితుడి దాడిలో గాయపడిన సైఫ్ చికిత్స కోసం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడ అతనికి శస్త్రచికిత్స చేసి, అతని శరీరం నుండి గాజు ముక్కను తొలగించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు ఆ యువకుడిని గుర్తుతెలియని ప్రదేశం నుండి అరెస్టు చేశారు. నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సీనియర్ పోలీసు అధికారులు అతన్ని ఇక్కడ విచారిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు అతని రిమాండ్ కోసం ప్రయత్నిస్తారు. ఈ విచారణలో పోలీసులు దాడికి సంబంధించిన లింకులను అనుసంధానిస్తారు. ఈ దాడిలో అతను ఒక్కడే ఉన్నాడా లేక ఈ కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అనేది పోలీసులకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు అతను అపార్ట్‌మెంట్‌లోకి ఎలా ప్రవేశించాడు. సైఫ్ ఒక్కడేనా ఇతర బాలీవుడ్ ప్రముఖులు అతని టార్గెట్లో ఉన్నారా అనే ప్రశ్నలకు కూడా పోలీసులు సమాధానాలు రాబట్టనున్నారు.

సంక్రాంతికి వచ్చాడు.. వంద కోట్లు రాబట్టాడు
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి అలరించారు. ఇక డే – 1 నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకెళ్లింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 45 కోట్లు రాబట్టి వెంకీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నంబర్స్ రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో రూ. 77 కోట్లు కొల్లగొట్టింది. ఇక లేటెస్ట్ గా మూడు రోజుల కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించింది నిర్మణా సంస్థ. మూడు రోజులకు గాను రూ. 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో తోలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు విక్టరీ వెంకటేష్. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ రాబట్టి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత వసూళ్లు రాబడతాడో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. రెగ్యులర్ డేస్ లో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టడం ఇక్కడ కొసమెరుపు.

డే అండ్ నైట్ మూవీ షెడ్యూల్స్తో తెగ కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’, పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మూవీలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్నందు తాను ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి పంచుకుంది. నిధి మాట్లాడుతూ ‘ఫస్ట్ లాక్ డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ మూవీ కి సైన్ చేశాను. ఈ సినిమాకు దాదాపు మూడున్నర నుంచి నాలుగేళ్ల పట్టింది.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడే, నేను కూడా అందుబాటులో ఉండాలని ప్రొడక్షన్ టీం కోరింది. దీంతో విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ సెట్‌లో చేరడానికి, హైదరాబాద్‌ నుండి ఫ్లైట్‌ పట్టుకుని వెళ్ళేదాని. అది పూర్తవగానే వెంటనే, ఏ రాత్రి అయిన తిరిగి విజయవాడ కు రిటర్న్ అయ్యేదాని. దీంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పడుకుంటే కాసేపు కారులోనే పడుకునేది. శారీరకంగా ఇబ్బంది ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో, పాన్ ఇండియా సినిమాల్లో ఒకేసారి నటిస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. రాజాసాబ్, వీరమల్లు రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ఈ రెండు ప్రాజెక్ట్ లతో 2025 సంవత్సరం నాకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొంది అగర్వాల్ .ప్రస్తుతం ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.