NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అసలే బాడీ బిల్డర్స్‌.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు..!
ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.. పోటీలకు విచ్చేసిన బాడీ బిల్డర్స్ గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో, ఏలూరు ప్రభుత్వ వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరిని చెల్లా చెదురు చేశారు.. అయితే పోలీసులు వచ్చేసరికే ఘర్షణకు దిగిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఘర్షణకు కారణం అయినా విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని అక్కడ ఉన్నటువంటి వారిని పోలీసులు కోరారు.. సీఐ కోటేశ్వరరావు విద్యార్థులకు, పోటీలకు హాజరైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేశారు.. అనవసరంగా గొడవలకు దిగితే ఇబ్బందుల్లో పడుతారని హెచ్చరించారు.. పోలీసులు కేసులు నమోదైతే భవిష్యత్తు అంధకారమవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది.

స్టీల్ ప్లాంట్ వారికి రాజకీయం… మాకు సెంటిమెంట్..
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం మరోసారి పొలిటికల్‌ హీట్ పెంచుతుంది.. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. స్టీల్ ప్లాంట్ వైసీపీకి రాజకీయం.. కానీ, మాకు సెంటిమెంట్‌ అని స్పష్టం చేశారు.. తెలుగుదేశం పార్టీ దయతో ఎమ్మెల్సీగా గెలిచిన ఓ సీనియర్ నేత.. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు చేస్తున్నారు… కానీ, స్టీల్ ప్లాంట్ కోసం నా రాజీనామా ఆమోదించకుండా మూడేళ్లు కాలయాపన చేశారు అని దుయ్యబట్టారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరం గనున ఓటు హక్కు రాకుండా అడ్డుకుందామనే దురుద్దేశ్యంతో అప్పటికప్పుడు ఆమోదించారని మండిపడ్డారు.. అయితే, స్టీల్ ప్లాంట్ పై మా విధానం క్లియర్… కచ్చితంగా కాపాడుకుంటామని స్పష్టం చేశారు గంటా శ్రీనివాసరావు.

ఇంట్లో బాణాసంచా తయారీ.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఇల్లు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. రావులచెరువులో ఓ ఇంట్లో బాణా సంచా తయారు ‌చేస్తుండగా పేలుడు సంభవిచింది.. అప్పటికే నిల్వ చేసిన బాణాసంచా ఓవైపు.. తయారీ చేస్తున్న టపాసులు మరోవైపు ఉండడంతో.. జరిగిన ఈ ప్రమాదంలో పెట్ట నష్టం జరిగింది.. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం పట్టణంలోని ఓ ఇంటిలో నిలువ చేసిన బాణాసంచా పేలిపోయి ఇల్లు కుప్పకూలింది.. ఇంట్లో ఆ సమయంలో 14 మంది ఉండగా.. అందరికీ గాయలయ్యాయని చెబుతున్నారు.. అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో.. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.. బాణాసంచా పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం తునాతునకలు అయ్యింది.. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారీతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. అమలాపురం పట్టణ పోలీసులు.. అయితే, పేలుడు దాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు.. భయంతో పరుగులు పెట్టారు..

స్టీల్‌ ప్లాంట్‌ కోసం రాజీనామాలు అవసరం లేదు.. ఆ ఒక్క మాట చెబితే చాలు..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తాం అంటున్నారు.. రాజీనామాలు అవసరం లేదు.. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు.. విశాఖపట్నంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యసభలో నేను కేంద్ర మంత్రిని అడిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారని గుర్తుచేశారు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయ్యడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.. అయితే, కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలి? అంటూ నిలదీశారు.. కూటమి సపోర్ట్ వల్లే కేంద్రంలో అధికారం వున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుటుంది? అని నిలదీశారు.. ఎన్నికల ముందు కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయనీయబోమని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపటానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.. కూటమి నేతల వలన.. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని వ్యాఖ్యానించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు.

రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము..,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆవిష్కరిస్తామన్నారు. యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శం.. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టం.. రాజీవ్ చిరస్మరణీయుడు అని ఆయన అన్నారు. విగ్రహంపై అనవసర రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. రాజీవ్ పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తా.. రాజీవ్ విగ్రహం కూలగొడతం అంటే చూస్తూ ఊరుకోము.. ఒ్కసారి విగ్రహం టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. మరి సెక్రటేరియట్ కట్టెప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మాకు ఎవరి పట్ల వివక్ష లేదు.. అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులను అందరికి సముచిత గౌరవం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మునుగోడులో వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
నల్లగొండ జిల్లాలోని మునుగోడు పట్టణంలో వైన్ షాపులను ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్స్ పరిశీలన చేశారు. వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూములను సైతం ఆయన పరిశీలించారు. పర్మిట్ రూముల్లో ఉదయాన్నే మద్యం తాగుతున్న మందు బాబులకు క్లాస్ పీకారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉదయాన్నే పర్మిట్ రూంలలో కూర్చుంటే కుటుంబ పరిస్థితి ఏంటని సీరియస్ అయ్యారు. ఇక, మందు బాబులను పర్మిట్ రూముల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటికి పంపించారు. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి ఎవరికి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యజమానులకు హుకుం జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. బెల్డ్ షాపులకు మద్యం విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు..
హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు. సిటీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్‌ పై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఇక, బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని సీపీ ఆనంద్ తెలిపారు. కాబట్టి, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (లెఫ్ట్ టర్నింగ్), ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొహంజాయి మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కేజ్రీవాల్‌పై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. దీని తర్వాత ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన చూసి ప్రపంచం మొత్తం షాక్ అయ్యిందని అన్నారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. బెయిల్ తెచ్చుకుని ప్రజల్లోకి వెళతానని చెప్పి సిట్టింగ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి అని ప్రతి వీధిలో చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ పన్నిన కుట్రకు వ్యతిరేకంగా తన ఏజెన్సీల ద్వారా పోరాడి సీఎం కేజ్రీవాల్‌ బయటకు వచ్చి ప్రజల్లో అగ్నిపరీక్ష పాసైన తర్వాతే కుర్చీలో కూర్చుంటానని అనడం ఈరోజు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈరోజే ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలు మళ్లీ అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఢిల్లీ ప్రజల్లో ఎంతో ఉత్సుకత ఉందని, ముఖ్యమంత్రి జైలులో రాజీనామా చేయకపోవడమే మంచిదన్నారు. బీజేపీపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. సీఎం కేజ్రీవాల్‌ గురించి మాట్లాడుతూ.. తాను ఐఐటీ చేశానని, ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ బీజేపీ ఓ నిజాయితీపరుడిని జైలులో పెట్టిందని, జైలు నుంచి బయటకు రాగానే ఇప్పుడు కేజ్రీవాల్‌ అధికార పీఠాన్ని వీడారన్నారు. రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేసిన సత్యయుగంలో ఇది జరిగిందని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాముడు కాదని, ఆయనకు రాముడితో పోలిక లేదని, హనుమంతుడి భక్తుడు, రామభక్తుడు అని, కానీ అరవింద్ కేజ్రీవాల్ పరువు కోసం కుర్చీని వదిలేశారని అన్నారు.

ఎడ్జ్‌ 50 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్ ఇవే!
ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. ఎడ్జ్‌ సిరీస్‌లో తీసుకొచ్చిన ఫోన్లకు లభించిన ఆదరణతో కంపెనీ గత ఆగష్టులో ‘మోటోరొలా ఎడ్జ్‌ 50’ను ఆవిష్కరించింది. నేడు ‘మోటోరొలా ఎడ్జ్‌ 50 నియో’ని లాంచ్ చేయనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ ఈ ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. ఇందుకు సంబందించిన పోస్టర్స్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. మోటోరొలా ఎడ్జ్‌ 50 నియోలో 6.4 ఇంచెస్ సూపర్ హెచ్‌డీ ఎల్‌టీపీఓ అడాప్టివ్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఐపీ 68 రేటింగ్‌తో వస్తోన్న ఈ మొబైల్‌ను తడిచేతితోనూ వినియోగించే సదుపాయం ఉందని కంపెనీ చెబుతోంది. ఎడ్జ్‌ 50 నియో ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్ మరియు పోయిన్సియానా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తోంది.

పెరుగుదలకు నో బ్రేక్.. తులం బంగారంపై నేడు ఎంత పెరిగిందంటే?
బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160.. 22 కారెట్లపై రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,050గా నమోదైంది. శుక్రవారం రూ.1300.. శనివారం రూ.440 పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోల్డ్ రేట్ 75 వేలు దాటింది. మరోవైపు వెండి ధరలు కూడా గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. గత వారం రోజుల్లో ఏకంగా ఐదుసార్లు రేట్స్ పెరగడం విశేషం. నేడు కిలో వెండిపై రూ.1000 పెరిగింది. సోమవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.93,000గా కొనసాగుతోంది.

వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…
తమిళ స్టార్ హీరో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్  చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్‌ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్  భారీ బ‌డ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో రజినీ కాంత్ నటిస్తున్ననాలుగవ సినిమా వెట్టైయాన్ . ఈ సినిమాను దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా అక్టోబ‌ర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు మూవీ మేకర్స్.

దర్శకుడు తేజ చేతుల మీదుగా ప్రారంభమైన “ఈగిల్ ఐ సినీ స్టూడియో”
ప్రతిభ గల యువ నటీనటులకు శిక్షణ ఇచ్చి అవకాశాలు అందించే ఉద్దేశంతో ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో “ఈగిల్ ఐ సినీ స్టూడియో” హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు తేజ ఈగిల్ ఐ సినీ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢీ విన్నర్ అక్సాఖాన్, యువ నటి గాయత్రి రమణ, ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ – ప్రసాద్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. మా సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీనటులను ఇచ్చేవారు. ఆయన మంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారుచేస్తాడు. సినీ పరిశ్రమలో నటీనటులుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరం. ఈగిల్ ఐ సినీ స్టూడియోలో మీకు అవసరమైన అలాంటి శిక్షణ ఇచ్చి అవకాశాలు కూడా చూపిస్తారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన యువ నటీనటులు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Show comments