NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్‌ కసరత్తు..
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేలా చూసేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది.. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.. ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకునేందేకు రెడీ అవుతున్నారు.. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రీయల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ. మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో కార్యకలాపాలు నిర్వహించనుందట అశోక్ లేలాండ్. గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగి రానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ నిలవనుంది. ఇక, అశోక్ లేలాండ్ సహా 10 కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారట యార్లగడ్డ. మల్లవల్లిలో త్వరలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ ఆచి మసాలా సంస్థ కూడా సిద్ధం అవుతోందని చెబుతున్నారు.. మరోవైపు.. విస్తరణ దిశగా HCL కంపెనీ ఆలోచనలు చేస్తోందట.. విశాఖ, బందరు, తిరుపతి, అనంతపురం జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో కంపెనీలను తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్.. విశాఖలో సాఫ్ట్ వేర్, అనంత, తిరుపతి కేంద్రంగా హార్డ్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, బందరులో బీపీసీఎస్ కంపెనీల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.. సీఆర్డీఏలోకి వివిధ సంస్థలను తిరిగి రప్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

శ్రీశైలం.. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం..
శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో.. అయితే, దిగువన్న ఉన్న నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరారు సాగర్ అధికారులు.. దీంతో.. 3 టీఎంసీల వరకు నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. సాగర్ కి విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా.. శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు.. అయితే.. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్‌ ఫ్లో నిల్‌గా ఉంది.. విద్యుత్‌ ఉత్పత్తి నేపథ్యంలో.. ఔట్ ఫ్లో 15,919 క్యూసెక్కులుగా ఉంది.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 812.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.9850 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. అయితే, జులై 15వ తేదీ దాటినా.. చెప్పుకో దగిన స్థాయిలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీరు చేరడం లేదు.. దీంతో.. శ్రీశైలం ఎప్పుడు నిండుతుందా.. నాగార్జున సాగర్‌కు నీరు చేరేది ఎప్పుడు.. ఇలా దిగువ ప్రాజెక్టుల్లో నీటి కోసం.. రైతులు ఎదురుచూస్తున్నారు.

గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాలి..
గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్ల లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి.. అన్యాక్రాంతం అయిన భూములు వెనక్కి తీసుకుని పేదలకి ఇవ్వాలని కోరారు.. అదానీకి చట్ట విరుద్ధంగా కేటాయించిన భూములు కూడా అందులో ఉన్నాయి.. గత ఐదేళ్లలో ఎస్ఈజెడ్ పేరిట తీసుకున్న భూములలో పరిశ్రమలు రాలేదు.. ఇన్వెస్టర్ కారిడార్, ఎస్ఈజెడ్ లకు ఇచ్చిన భూములు ఐదేళ్ళు పైబడినవి పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. 2014-19 తరహాలో పంటల భీమా పథకం వల్ల రైతులకు న్యాయం జరగదు అన్నారు. ప్రైవేటు కంపెనీలు 80 శాతం వాటా కలిగి ఉన్న భీమా… ఇచ్చేది ప్రభుత్వం.. తీసుకునేది ప్రైవేటు కంపెనీలు అని.. రైతుల‌ వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.. ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు.. ఇక, స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేయాలని మా డిమాండ్‌ అన్నారు.. ఢిల్లీకి రెండోసారి వెళుతున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేకహోదా అంశాలపై క్లారిటీ తీసుకోవాలని సూచించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.

అప్పటి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల ముందు ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురాబోతోంది. తాజాగా ఎన్నికల ముందు ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుక వచ్చేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలు కాబోతున్నట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పానములను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అలాగే తల్లికి వందనం లాంటి హామీలను మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ విషయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పథకం అమలు అవుతున్న పథకంపై నివేదికలను కోరినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలలో రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో.. అలాగే ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న విషయాలను పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రైతు రుణమాఫీ పై కండిషన్స్ అంటే ఎలా?.. డీకే అరుణ ఫైర్‌..
నిబంధనలు లేవని కండిషన్స్ అంటే ఎలా అని రైతు రుణమాఫీపై డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. మహబూబ్ నగర్ లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై MP డీకే అరుణ మండిపడ్డారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోందని ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్ లో ఏలాంటి నిబందనలు లేకుండా ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభూత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పుర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయిలొ రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుందన్నారు.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
అంగన్‌వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌లకు పదవీ విరమణ ప్రయోజనాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ‘అమ్మ మాట – అంగన్ వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్ రహ్మత్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వాటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్నారు. వాటిని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే తీసుకొచ్చారు. కాగా.. జియో 10 రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జులై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను, ఎమ్మెల్యేలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో అంగన్ వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలి..
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని అన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని వివరించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ సమీక్ష.. వెలుగులోకి 7 అంశాలు..!
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో రాష్ట్రాలలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను కమలం పార్టీ నిర్వహిస్తోంది. ఇందులో ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్నారు.. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మీటింగులు నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర నేతలతో పాటు కేంద్ర స్థాయి నేతలను కూడా పరిశీలకులుగా పంపుతుంది. ఇక, యూపీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఇలాంటి ఫలితాలను చూడాల్సి వచ్చిందన్న ఆసక్తికర ప్రశ్నలు కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తుతున్నారు. ఈ సమావేశాల్లో 7 విషయాలు వెలుగులోకి వచ్చాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాగా, రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకార్లు పుట్టించాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు. ఇది కాకుండా మహారాష్ట్రలో కూడా సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా ఈ పుకార్ల వల్ల పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరిగిందన్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పుకార్లను ఎన్డీయే ఎదుర్కోలేకపోయిందని ఆయన అంగీకరించారు అని కమలం పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

మోడీ సారథ్యంలో బీజేపీ టైటానిక్‌లా మునుగుతోంది..
సొంత పార్టీపై సీనియర్‌ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్‌ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు. కాగా, బీజేపీ బీటలు వారి మునగడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. ఈ విషయంపై నెటిజన్లు సైతం విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఓ వర్గం సుబ్రహ్మణ్య స్వామిని సపోర్ట్‌ చేస్తూ వ్యాఖ్యనిస్తున్నారు. మీరు చెబుతున్నది నిజమే.. ఎందుకంటే మీ కెప్టెన్‌ దేశ ప్రజల కోసం పని చేయడం లేదు.. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారంటూ వ్యాఖ్యనిస్తున్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?
తనపై కాల్పుల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు ట్రంప్.. మిల్వాకీలో జరిగిన కన్వెన్షన్‌లో పాల్గొన్నారు.. గాయమైన కుడి చెవికి బ్యాండేజీతో కన్వెన్షన్‌కు హాజరైన ట్రంప్‌.. ఎలాంటి ఉపన్యాసం చేయకపోయినా.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ అధికారికంగా ఎన్నికయ్యారు.. ప్రతినిధులు ఓట్లు వేసి తమ అభ్యర్థిగా ట్రంప్‌ను ఎంపిక చేశారు.. ఆ తర్వాత జేడీ వాన్స్‌ పేరును ప్రకటించారు ట్రంప్‌.. సుదీర్ఘ చర్చల తర్వాత జేడీ వాన్స్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు.. అతడు సమర్థవంతమైన నేతగా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు ట్రంప్‌.. అంటే ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కానున్నారు.. అయితే, ఆయన భార్య తెలుగు మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరి వాన్స్.. యునైటెడ్ స్టేట్స్‌కి రెండవ మహిళ కానున్నారు.. కాగా, డొనాల్డ్‌ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత.. ఈ కుట్ర వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందంటూ ట్వీట్‌ చేసి కొత్త చర్చకు తెరలేపారు రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు మాత్రం ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.. ఇక, వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి.. ఒకప్పుడు డెమెక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ళ కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే, ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇది తెలుసుకోవడానికి గూగుల్‌ సహా వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ పామ్‌ను పెద్ద సంఖ్యలు సెర్చ్‌ చేశారు.. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం భారతీయ వలసదారుల బిడ్డ.. భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి.. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఇక, ఉషా కూడా అక్కడే పుట్టారు..

త్వరలోనే స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోమ్ డెలివరీ..?
లిక్కర్ కోసం ఇకపై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది మందు బాబులకు.. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి దగ్గరకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను కూడా హోమ్ డెలివరీ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు ఆలోచన చేస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో అమలు జరుగుతుండగా.. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జాతీయ మీడియాలో న్యూస్ ప్రచారం జరుగుతుంది. కాగా, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ లాంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది. ఈ విధానం ద్వారా లాభ నష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కాగా కోవిడ్ -19 టైంలో మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ గఢ్, అస్సాంలో తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆన్ లైన్ డెలివరీల ద్వారా అమ్మకాలు 20- 30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు వెల్లడించారు. కాగా, గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాచేసిన సర్వేలో 100 శాతం మంది హైదరాబాదీలు మద్యం హోం డెలివరీ సేవలు స్టార్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.

ఈ పదేళ్లలో నాకు ఇష్టమైన సినిమా అదే: హీరో నాని
ఈ పదేళ్ల కాలంలోనే తనకు ఇష్టమైన సినిమా బలగం అని హీరో నాని తెలిపారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకం కావాలని కోరుకున్నారు. ప్రియదర్శిపై తనకు చాలా నమ్మకం ఉందని, తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా అని నాని చెప్పారు. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్‌ ప్రీరిలీజ్ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం. వచ్చే నెల సరిపోదా శనివారం ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్రియదర్శి వలన కొంచెం ముందుగానే స్టార్ట్ అయినాయి. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. డార్లింగ్ టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉన్నాయి. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి.. కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. గతేడాది లవ్ స్టొరీ, ఎమోషన్ కలిపి హాయ్ నాన్నతో వచ్చాను. ఈ ఏడాది లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ వస్తోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. కామెడీ ఎమోషన్ లవ్ యాక్షన్.. ఇలా అన్నీ జోనర్ సినిమాలు రావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది. లేడి అపరిచితుడు లాంటి కాన్సెప్ట్ సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో వూహించగలను. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది’ అని అన్నారు.

భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 161కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 28.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. కానీ డివైడ్ టాక్ తో రెండవ రోజు కలెక్టన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. తమిళనాడులో మాత్రమే ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవడంతో భారతీయుడు -2 చూసేందుకు ప్రేక్షకులు కరువయ్యారు.