NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు.. వైద్య సిబ్బంది ఆగ్రహం..
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు.. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై విరుచుకుపడ్డారు.. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు మంత్రి.. ఇక, మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.. తన ఆకస్మిక పర్యటనలో.. ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మార్పులకు కీలక సూచనలు చేశారు. ఇక, ఏలూరు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు సౌకర్యాలు పెంచడంపైన ఎక్కువ దృష్టి పెట్టాం అన్నారు.. నర్సులు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నట్టుగా గుర్తించాం.. వీల్ చైర్స్ సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సతో పాటు, స్పెషాలిటీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. మహిళలకు గుడ్‌న్యూస్‌..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది… ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు… తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా.. ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు.. సచివాలయంలో ఉదయం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్‌ సమావేశంలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది.. ఇక, పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు.. గీతకార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మరోవైపు.. కేబినెట్‌ భేటీ అనంతరం.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది.

తాడిపత్రి సీఐ ఫోన్‌ ఆడియో లీక్‌.. మరీ ఇంత పచ్చిగా..? విచారణకు ఎస్పీ ఆదేశం..
రాజకీయాల్లో ఎప్పుడూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా ఉంటుంది.. అయతే, ఇప్పుడు జేసీ వ్యవహారంలో తాడిపత్రి అర్బన్‌ సీఐ, ఓ వ్యక్తి మధ్య సాగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వేరేవాళ్లతో ఫోన్‌ చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడన్న రాంపులయ్య అనే వ్యక్తి.. తనకు జేసీ ఫోన్‌ నంబర్‌ కావాలంటూ సీఐ సాయిప్రసాద్‌ను అడగడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది.. చివరకు అసభ్యపదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్లింది..అయితే, ఇప్పుడు అనంతపుంర జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది తాడిపత్రి అర్బన్ సీఐ సాయిప్రసాద్ ఆడియో.. తాడిపత్రికి చెందిన రాం పుల్లయ్య అనే వ్యక్తి… తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది.. తనను వేరే వాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నాడని… జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నంబర్ కావాలని.. సీఐ సాయిప్రసాద్ ని అడిగారు రాం పుల్లయ్య.. అయితే, నేను నీ కింద సర్వెంట్ ను కాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నంబర్‌ నేనెందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు సీఐ.. దీంతో రాంపుల్లయ్య కూడా రెచ్చిపోయారు.. దీంతో.. సీఐ, రాంపులయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు రాం పుల్లయ్య, సీఐ సాయి ప్రసాద్.. అక్కడితో ఆకుండా లైవ్‌ లొకేషన్‌ పెట్టు.. అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుంటాను అంటూ.. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కూడా సాగింది.. మొత్తానికి సీఐ సాయి ప్రసాద్.. రాంపుల్లయ్య మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ అవ్వడంతో.. విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ జగదీష్..

కడప జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. శనివారం రోజు సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక, అదే రోజు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇవ్వబోతున్నారు.. మరోవైపు.. ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.

రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి
ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి, మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే వినోద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో అయన పోషించిన పాత్ర గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పుకొచ్చారు. నేడు దివంగత కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినోద్ కుమార్, మందుల సామెల్ సహా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ‘జైపాల్ రెడ్డి చేవెళ్ల ప్రాంతాన్ని ఎంపీగా అనేక విధాలుగా అభివృద్ధి చేశారు. వారు చూపించిన మార్గంలో నడవడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు జైపాల్ రెడ్డిని మర్చిపోకుండా ఉండాలి. మా ప్రాంతంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అయన పేరు పెట్టడం సంతోషకరం’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌!
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్‌ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మాజీ మాత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా బాష్ప వాయువు, వాటర్‌ కెనాన్ల వాహనాలను కూడా పోలీసులు తెప్పించారు. కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభమైంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.

సైఫ్, కరీనాలపై దాడికి కారణం అదేనన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి భిన్నమైన చర్చను ప్రారంభించారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి సాధారణ సంఘటన కాదని, దాని అన్ని అంశాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. అత్యంత నాగరిక ప్రాంతాల్లో నివసించే సినిమా తారలు కూడా సురక్షితంగా లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లపై ద్వేషపూరిత ప్రకటనలు ఎలా జరిగాయో ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో విషం వ్యాపించింది. ఆ వెంటనే నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్ పై ఒక దొంగ దాడి చేశాడు. ఇదంతా ముంబైలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తుందన్నారు. ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తన ట్వీట్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ట్యాగ్ చేశారు. ఫడ్నవీస్ జీ, కనీసం ముంబై ఇమేజ్ గురించి కొంచెం జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. అత్యంత నాగరిక ప్రాంతాల్లో నివసించే సినిమా తారలు కూడా సురక్షితంగా లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇది సాధారణ సంఘటన కాదు, దాని అన్ని అంశాలను లోతుగా పరిశోధించాలంటూ రాసుకొచ్చారు.

కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్‌ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా చెప్పుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. కుంభమేళాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అశాంతి, అలజడికి కారణమయ్యే ఎటువంటి చర్యలకు ప్రభుత్వం సహనంగా ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి లక్నోలో నైట్‌ షెల్టర్‌ను సందర్శించి.. అక్కడ చలిలో బాధపడుతున్న వారికి దుప్పట్లు, స్వెటర్లను పంపిణీ చేశారు.

మొన్న సల్మాన్, నిన్న సిద్ధిఖీ, నేడు సైఫ్….. ముంబై భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత, ముంబై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు అని శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. ఇక్కడ సెలబ్రిటీలు సురక్షితంగా లేకుంటే ఎవరు సురక్షితంగా ఉన్నారు? అంటూ విరుచుకుపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేశాడు. సైఫ్ కు ఆరు గాయాలు అయ్యాయి, వాటిలో రెండు లోతైనవి. అతన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు, పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది ఉద్యోగుల మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫ్ పై దాడి తర్వాత, ప్రియాంక చతుర్వేది ముంబై భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం ఎంత సిగ్గుచేటు అని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి మరోసారి ముంబై పోలీసులపై, హోంమంత్రిపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పెద్ద పెద్ద వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ముంబైని బలహీనపరిచే ప్రయత్నం జరగడం ఇది చూపిస్తుందని ఆయన అన్నారు. బాబా సిద్ధిఖీ దారుణ హత్య తర్వాత, అతని కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తోంది.

హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి.. హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. దీని తరువాత, సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. గుర్తు తెలియని దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న సైఫ్ అలీఖాన్‌పై దాడి జరుగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర గాయాలపాలైన అతడికి ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సైఫ్ అలీఖాన్‌ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని, అందులో రెండు లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తి పోట్లు లోతుగా దిగాయని వివరించారు. వెన్నెముకలో కత్తి విరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స పూర్తయిందని ప్రాణాపాయం ఏం లేదని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా తన అభిమానుల కోసం ఈ సందర్భంగా ఆయన బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ‘‘మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా, అభిమానులు ఓపికగా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇది పోలీసు విషయం. పరిస్థితిపై మేము మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాము.’’ అన్నారు.

రామ్ చరణ్ 16 కోసం న్యూలుక్ లో జగ్గుభాయ్.. వీడియో వైరల్
గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా  RC 16 ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను  తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా RC16 లోని తన పాత్రకు సంబందించి లుక్ మేకింగ్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ‘చాలా కాలం తర్వాత బుచ్చి బాబుసన RC 16 కోసం మంచి పనిపెట్టాడు. ఈ సినిమాలో నా గెటప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా ఉందని ట్వీట్ చేసాడు జగ్గు భాయ్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆ మధ్య కర్ణాటక లోని మైసూరులో ఫినిష్ చేసాడు దర్శకుడు బుచ్చి బాబు. దాదాపు 15 రోజులు పాటు కీలక సన్నివేశాలను షూట్  చేసారు. ఇక రెండవ షెడ్యూల్ ను  హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీకరించనునున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ తో కలిసి మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వెంకి మామ
2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమా విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా దూసుకుపోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‏కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జనవరి 14న విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ అడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమాలో తన ఒకప్పటి స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా మెప్పించారు. ఫ్యామిలీ అడియన్స్ కు సరిపోయే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్‏ను అందించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అది ఎంతలా అంటే సినిమా హాలులో ఉన్న కుర్చీలు సరిపోక బయటి నుండి కుర్చీ తెప్పించి షో లను వేశారంటే నమ్మండి. ఇకపోతే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. అదికాక ఇంకా సంక్రాంతి సెలవులు ఉండడంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మరింత మద్దతు వస్తుండటంతో, సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు మరెంతో దూరంలో లేదు.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత “మంగళవారం” మూవీ సూపర్ హిట్ తో పాయల్‌ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేనంత ఫర్ఫామేన్స్ తో. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నం. 1’ చిత్రం సిద్ధం కాబోతుంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను చిత్ర ప్రారంభం రోజున మూవీ మేకర్స్ ప్రకటిస్తారట మేకర్స్. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చూస్తున్న పాయల్ కు ఈ సినిమాతో ఆ స్టేటస్ ను అనుకుంటుందని పాయల్ రాజ్ పుత్ ధీమా వ్యక్తం చేస్తోంది.