Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

డీజిల్ బస్సులకు గుడ్‌బై.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే..!
డీజిల్‌ బస్సులకు గుడ్‌బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్‌ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం పై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ఈ పథకం మా కోసం చాలా ఉపయోగపడుతోంది.. ప్రతిరోజూ ఉద్యోగాలు, కళాశాలకు ప్రయాణించడానికి ఇది చాలా ఉపశమనంగా ఉంది అని మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కోసం APSRTC కు ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం పై తప్పుగా ప్రచారం చేసిన వారు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. APSRTC ను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డీజిల్ బస్సులకు గుడ్‌బై చెబుతాం.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామన్నారు.. ఇకపై డీజిల్ బస్సులను కొనం… రాబోయే మూడు సంవత్సరాల్లో కొనబోయే ప్రతీ బస్సు ఎలెక్ట్రిక్ బస్సు మాత్రమే అన్నారు.. అంతేకాక భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ బస్సులు నడిపే ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని తెలిపారు రాంప్రసాద్‌ రెడ్డి.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి..

రూ.1201 కోట్ల పెట్టుబడులు.. రేమాండ్‌ ప్రాజెక్టుకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన..
విశాఖపట్నం వేదికగా జరుగుతోన్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లాలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు.. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్ .. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేశారు.. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్ .. ఇక, అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది.. మరోవైపు, అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు.. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ..

విశాఖలో అక్రమంగా గోమాంసం నిల్వ.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌..
విశాఖలో అక్రమంగా గో మాంసం నిల్వ ఘటనపై సీరియస్‌ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. గో మాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపడాలంటూ.. విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా.. ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే.. పవన్ కల్యాణ్ స్వయంగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారో? ఎక్కడి నుంచి తెచ్చారో? ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారో? వీటి అన్నిటి పై ఆయన వివరంగా ఆరా తీశారు. DRI అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో.. 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు.. ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వివరించారు. దాడుల సమయంలో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోందని కూడా తెలిపారు. ఈ గోమాంసం ఎక్కడి నుంచి తెచ్చారు? అక్రమ రవాణా నెట్‌వర్క్ ఎంత పెద్దది? అవసరమైన అనుమతుల విషయంలో ఏయే ఉల్లంఘనలు జరిగాయి? ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కూడా హామీ ఇచ్చారు. NDA ప్రభుత్వం గోమాంసం నిషేధంపై ఎంత దృఢంగా పనిచేస్తుందో.. ఈ కేసు మరోసారి నిరూపించిందని అన్నారు పవన్ కల్యాణ్‌. అక్రమ గోవధ, గోమాంస విక్రయం, లేదా ఎగుమతి.. ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గతంలో పిఠాపురం జంతు వధశాల ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే.. దానిపై చర్యలు తీసుకొని వధశాలను మూసివేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్‌రావు, కేటీఆర్‌పై సెటైర్లు..!
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కుట్రలు జరిగాయని కవిత ఆరోపించారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లపై పరోక్షంగా సెటైర్లు వేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ ని మోసం చేశారని ఆరోపించారు. హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ భజనపరులు భజన చేశారనర్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్ కేసీఆర్ ఫోటో నెత్తిపై పెట్టుకుని పెట్టి.. తానే చేశాను అకున్నారన్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్టు ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారన్నారు. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు.. వీళ్ళకి హరీష్ రావు సపోర్ట్ చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు కృష్ణార్జునల బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారు.. వీళ్ళకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడానికి సరిపోతుందన్నారు. వీళ్లకు వీళ్ళు ట్వీట్‌లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్.. ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం..
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్‌లో అంతరాయం ఏర్పాడింది. హైకోర్టు సైట్‌లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్‌ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. Hyderabad సైబర్‌ అభియోగాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాకర్లు ఎలా యాక్సెస్‌ చేశారు? సర్వర్‌లో ఏదైనా లోపాలున్నాయా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొద్దిసేపు హైకోర్టు వెబ్‌సైట్‌ సేవలు అంతరాయం చెందగా, ఆర్డర్ కాపీలు, కేసు వివరాలు తెరవడంలో అవాంతరాలు ఎదురయ్యాయి. సిస్టమ్‌ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి టెక్నికల్ టీమ్స్‌ చర్యలు ప్రారంభించాయి. ఈ హ్యాకింగ్ కేసు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

“ఇది ఒక యాక్సిడెంట్”.. శ్రీనగర్ పేలుడుపై స్పందించిన డీజీపీ..
శ్రీనగర్ పేలుడుపై జమ్ము కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు. నౌగాం పోలీస్ స్టేషన్‌లో బ్లాస్ట్ ఓ యాక్సిడెంట్.. ఇదొక దురదృష్ట ఘటన అన్నారు. దీనిపై ఎలాంటి ఊహగానాలు చేయవద్దని స్పష్టం చేశారు. “నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో వెలుడు పదార్థాలు ఉంచాం.. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11 గంటలకు 20 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగింది. దీనిపై ఎలాంటి ఊహగానాలు వద్దు. ఇదొక దురదృష్టకర ఘటన.. 9 మంది చనిపోయారు.. ముగ్గురు ఎఫ్‌ఎస్ఎల్ నిపుణులు చనిపోయారు.. 27 మంది పోలీసులు గాయపడ్డారు..” అని స్పష్టం చేశారు.

బడ్జెట్‌లో HD LED TVలు.. 32 ఇంచ్‌ల టీవీ ధర 7 వేల లోపే..
ఎవరికైనా ఎల్ఈడీ టీవీ పెద్దది కొనాలని చూస్తుంటారు.. అయితే, ఎక్కువ ధర ఉండడంతో.. విరమించుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, మీరు తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చినట్టే.. ఎందుకంటే మీరు రూ.7,000 కంటే తక్కువ ధర నుండి టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్‌లో, మీరు స్మార్ట్ టీవీలు మరియు సాధారణ టీవీలు రెండింటికీ ఎంపిక చేసుకోవచ్చు.. వివిధ బ్రాండ్‌ల నుండి రూ.7వేల లోపే మీకు ఇచ్చిన టీవీలను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది..

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర తులంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గగా.. కిలో వెండి ఏకంగా రూ.8వేలకు పైగా పడిపోయింది.. దీంతో, బంగారం, వెండి కొనే ప్లాన్‌ చేసుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు విశ్లేషకులు.. కాగా, ఆల్‌ టైం హై రికార్డు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. పైకి.. కిందకు కదులుతూనే ఉన్నాయి.. తగ్గినప్పుడు కాస్తా తగ్గిన.. పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి.. కానీ, ఈ రోజు కొంత ఊరట కల్పిస్తూ.. పసిడి, సిల్వర్‌ ధరలు భారీగానే దిగివచ్చాయి.. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ1,960 తగ్గడంతో రూ.1,25,080కి దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ1,800 తగ్గడంతో రూ.1,14,650కి పడిపోయింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.8,100 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,75,000కు దిగివచ్చినట్టు అయ్యింది.. ఈ రోజు హైదరాబాద్ లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,508గా ఉండగా.. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,465 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.9,381గా ఉంది.. ఇదే సమయంలో.. ఒక గ్రాము వెండి ధర రూ.175 గాను ఒక కిలో వెండి ధర రూ.1,75,000 గాను ఉంది. కాగా, తరతరాలుగా బంగారం స్థిరమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్ల మధ్య, బంగారం తరచుగా దాని విలువను నిలుపుకుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, బంగారం ఒక అద్భుతమైన ఎంపికగా చూస్తారు.. పెళ్లి, ఇతర శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కొందరైతే.. దీనిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్యే ఎక్కువగా ఉండే విషయం విదితమే..

మొదటి రోజు కలెక్షన్స్..బానే రాబట్టిందే!
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూనే, రానాతో కలిసి నిర్మించిన తాజా చిత్రం, ‘కాంత’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆయనకు దర్శకుడిగా ఇది మొదటి చిత్రం. ప్రమోషన్స్‌లోనే అందరి చూపు ఈ సినిమా మీద పడేలా చూసుకుంది సినిమా యూనిట్. ఇక ఈ క్రమంలోనే, తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది. నవంబర్ 14వ తేదీన సినిమా రిలీజ్ అవ్వగా, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. తెలుగులో, తమిళంలో అయితే రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక మొత్తంగా చూసుకుంటే, ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి ఏకంగా ఈ సినిమాకి 10 కోట్ల 36 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక హీరో, మరో దర్శకుడి మధ్య వచ్చే ఈగో వార్ ఎలాంటి పరిణామాలకు తీసింది అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమా రూపొందించారు. సినిమా రిలీజ్ అవ్వకముందు, తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న త్యాగరాజ భాగవతార్ అనే వ్యక్తి బయోపిక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత అది నిజం కాదని తేల్చారు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం, ఇది కేవలం కల్పిత కథ అనే విషయం అర్థమైంది. మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల 36 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టడం గమనార్హం.

మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
‘దబాంగ్’ ద్వారా పాన్‌ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, స్టార్ కుటుంబానికి చెందినప్పటికీ తన కృషితోనే ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంది. ‘రౌడీ రాథోర్’, ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘హాలీడే: ఏ సోల్జర్ ఇజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ వంటి వరుస విజయాలతో సోనాక్షి తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పరుచుకుంది. గ్లామర్ పాత్రలు చేసిన, కథాబలం ఉన్న సినిమాల పైనే ఫోకస్ చేసిన నటిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతేడాది ‘హీరామండీ’తో తనలోని మరో వైపు బయటపెట్టిన ఆమె, ఇటీవల కాలంలో ‘జటాధర’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి తన ఆలోచనలతో అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోంది. అయితే తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సోనాక్షి సిన్హా తన జీవితానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది.

జక్కన్నలా చెక్కుతున్న బాబీ
తనను మెగాస్టార్ అభిమానిగా చెప్పుకునే బాబీ కొల్లి ఇప్పటికే ఆయనతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్లానింగ్‌గా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడం లేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న బాబీ, మెగాస్టార్ చిరంజీవి సూచనలతో సినిమా షూటింగ్ డిసెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది జనవరి నెలకు మార్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేసే పనిలోపడ్డారు. మెగాస్టార్ చిరంజీవిని మునుపెన్నడూ చూడనటువంటి ఒక మాస్ అవతారంలో ఈ సినిమాలో చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతోనే తెలుగులో సినీ నిర్మాతలుగా అడుగుపెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాని ముగించే పనిలో ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై
డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలిగ్స్‌తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకున్నట్టున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ భజరంగీ బాయ్‌జాన్‌కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి ధౌజండ్ క్రోర్ టార్గెట్ మిస్‌ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, భజరంగీ సినిమాలకు విజయేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావడం యాదృచ్చికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ స్థాయిలో క్రేజ్‌,ఫేమ్‌, ఫ్యాన్ బేస్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో సినిమా ప్లాపైనా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ప్లాపులు వెంటాడుతున్న వేళ సలార్‌తో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ మూవీ ఢంకీని డైరెక్ట్‌గా ఢీ కొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్‌ని దేశమంతా నార్త్, సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేసులో డార్లింగ్‌ ప్రభాస్‌ బాక్సాఫీసును రూల్ చేసాడు. అంతే కాదు ఢంకీతో థౌజండ్‌ క్రోర్‌ కలెక్షన్స్‌తో హాట్రిక్‌ కొట్టాలని చూసిన షారుక్‌ఖాన్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈసారి ప్రభాస్‌, వచ్చే 2026లో సౌత్‌ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోను టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇళయ దళపతి విజయ్ జన నాయగన్‌తో పోటీకి దిగుతున్నాడు. తమిళనాడు, కేరళలో విజయ్ ది డామినేషన్ కాగా, తెలుగు, హిందీలో ప్రభాస్‌ ది హవా. అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపథీతో వస్తున్నాడు. కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జానర్‌లో రాజాసాబ్‌తో బాక్సాఫీస్‌ వార్‌కి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మరీ ఈ సారి ప్రభాస్ దళపతిని ఢీ కొట్టి పై చేయి సాధిస్తాడా.. చూద్దాం…

Exit mobile version