Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నెల్లూరు మేయర్‌ రాజీనామా ఆమోదం..
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆమోదించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన లేఖను ప్రతినిధి ద్వారా మేయర్ రాజీనామా లేఖను అందజేయగా, అదే రోజు రాత్రి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేయర్ పదవి ఖాళీ కావడంతో ఇంచార్జ్‌ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఆయన ఇంఛార్జ్‌ మేయర్‌గా కొనసాగనున్నారు. మరోవైపు, క్యాంపు రాజకీయాల్లో భాగంగా పలువురు కార్పొరేటర్లు ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మేయర్ ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జరగనుంది.

గన్నవరంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. వల్లభనేని వంశీని కలిసినందుకు దాడి..!?
గన్నవరంలో మరోసారి తెలుగుదేశం పార్టీ వర్సెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పరిస్థితి మారిపోయింది.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామంలో వైసీపీ క్యాడర్‌పై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కలిశారన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి టీడీపీకి చెందిన వ్యక్తులే పాల్పడ్డారని వారు చెబుతున్నారు. సమాచారం మేరకు, మధ్యాహ్నం సమయంలో ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ మర్లపాలెం గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్‌, కంభంపాటి రామ్మోహనరావు.. వల్లభనేని వంశీ మోహన్‌ను కలిశారు. అయితే, వంశీని కలిసిన కారణంగానే వీరిద్దరిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు హాకీ స్టిక్స్‌తో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడిలో శ్రీధర్‌, రామ్మోహనరావులకు తల, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని పిన్నమనేని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.

పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు.. పిఠాపురంలో ప్రారంభం..
నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. కార్యకర్తల నుంచే నాయకత్వాన్ని తీర్చిదిద్దాలన్న జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌ సూచనల మేరకు.. మూడు రోజుల పాటు ఈ కమిటీల నియామకం జరగనుంది. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు కార్యాలయానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేరుకున్నారు. వార్డు, బూత్, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసే కసరత్తు ప్రారంభమైంది. ప్రతి వార్డులో 10 నుంచి 15 మంది సభ్యులతో వార్డు ఇంచార్జీలను ఎంపిక చేయనున్నారు. అదే విధంగా బూత్, గ్రామ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలకు గుర్తింపు కల్పించేలా ఈ కమిటీల నియామకం జరగనుంది..

పెద్దా రెడ్డికి జేసీ మరో సవాల్.. వచ్చి నిరూపించు..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మధ్య.. సవాళ్లు ప్రతి సవాళ్లు కొత్త విషయం ఏమీ కాదు.. అయితే, తాజాగా, పెద్దిరెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. వచ్చి నిరూపించాలంటూ అంటూ పెద్దారెడ్డికే సవాల్‌ విసిరారు.. ఎర్ర కాలువ, రహదారి ఏర్పాటుకు ఏడు మీటర్లు స్థలం ఓనర్లతో మాట్లాడి పంచాయతీరాజ్ కు అప్పజెప్పడం జరిగింది.. పంచాయతీరాజ్ వద్ద డబ్బులు లేకపోవడంతో ఆర్ అండ్ బీ వాళ్లకు అప్పజెప్పారు. 7 మీటర్లతో సింగల్ రోడ్డు ఏర్పాటు చేస్తే. దాన్ని కాస్త డబుల్ రోడ్డు చేశారు. కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం ప్రైవేట్ ల్యాండే. ప్రైవేట్ ల్యాండ్ అయిన 20 మీటర్లు రోడ్డుకు వదిలి వాళ్లు ప్లాట్లు వేసుకున్నారని తెలిపారు. అయితే, ప్లాట్లు ఎవరు అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారో పెద్దారెడ్డి వచ్చి నిరూపించాలని సవాల్‌ విసిరారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. రేపు ఉదయం పెద్దారెడ్డి నాన్న విగ్రహానికి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని వినతిపత్రం మా కౌన్సిలర్లు అందజేస్తారన్న ఆయన.. పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశాడు.. కాబట్టి ఖచ్చితంగా వచ్చి నిరూపించాలన్నారు.. పెద్దారెడ్డి వచ్చి ఏది అక్రమంగా నిర్మించారని చూపిస్తే దాన్ని నేను పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి..

అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు
అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన మామ కారణంగా కోడలు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందగా, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి నాలుగు రోజుల ముందు గ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లు ఉండగా, వాటిలో 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ప్రత్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ఒక ఓటు చెల్లనిదిగా మారడంతో చివరకి శ్రీవేద ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచినట్లు ఎంపీడీవో ప్రకటించారు. దీంతో కోడలు ముత్యాల శ్రీవేద తన మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంది.

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రాజ్ కుమార్‌ గోయల్‌ ప్రమాణం
ప్రధాన సమాచార కమిషనర్‌గా (సీఐసీ) రాజ్ కుమార్‌ గోయల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాజ్ కుమార్‌ గోయల్‌‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు హజరయ్యారు. రాజ్ కుమార్ గోయల్ గతంలో కేంద్ర ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీగా, లా సెక్రటరీగా పని చేశారు. పలు ముఖ్యమైన పదవులు కూడా నిర్వహించారు. రాజ్ కుమార్.. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవలే చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. గత సెప్టెంబర్‌లో హీరాలాల్ సమరియా పదవీ కాలం ముగియడంతో సీఐసీ పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరంతా త్వరలో కొత్త సీఐసీ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలు పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

OnePlus 15R లాంచ్‌కు ముందే ధర లీక్..! అదిరిపోయే ఫ్యూచర్స్‌..
ఏ మొబైల్‌ వచ్చినా.. దాని ఫ్యూచర్స్‌.. ధర లాంటి అంశాలు.. అది లాంచ్‌ అయిన తర్వాతే తెలుస్తాయి.. కొన్ని సార్లు మాత్రం.. ఇవి ముందే లీక్‌ అవుతుంటాయి.. ఇప్పుడు OnePlus 15R ధర కూడా లీక్ అయింది. షెడ్యూల్‌ ప్రకారం.. OnePlus 15R డిసెంబర్ 17న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ OnePlus 15 సిరీస్‌లో అత్యంత చౌకనదిగా కానుంది.. కొత్త లీక్‌లు ఇప్పుడు ఆ మొబైల్‌ ధరను వెల్లడించాయి. ఒక టిప్‌స్టర్‌ను ఉటంకిస్తూ, మీడియా నివేదికలు బేస్ వేరియంట్ రూ.47,000 కు అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నాయి.. అయితే, దీనిపై ఆ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. OnePlus 15R యొక్క అనేక లక్షణాలను కంపెనీ వెల్లడించింది. కంపెనీ దాని కలర్.. వేరియంట్లు, మొబైల్ చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం, కెమెరాను అధికారికంగా ప్రకటించింది. కంపెనీ జంబో బ్యాటరీ, 7400mAh బ్యాటరీని ఉపయోగించింది. ఈ రాబోయే OnePlus హ్యాండ్‌సెట్ బ్యాంక్ ఆఫర్‌లతో కూడా వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌ల కింద రూ.3,000 నుంచి రూ.4,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండబోతోంది..

ఇయర్‌ ఎండ్‌ సేల్‌.. ప్రతి వస్తువుపై 70 శాతం వరకు తగ్గింపు..
స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు.. ఇలా ఏవైనా కొనాలని చూస్తున్నారా? అయితే, ఇదే మంచి తరుణం.. టీవీల నుండి రిఫ్రిజిరేటర్ల వరకు ప్రతిదానిపై 70 శాతం వరకు తగ్గింపుతో. విజయ్ సేల్స్ ‘ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్’ ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు సహా మరిన్నింటిని డిస్కౌంట్ ధరలతో పాటు బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో స్మార్ట్ టీవీలను కూడా భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ విజయ్ సేల్స్ తన ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్‌ను ప్రారంభించింది. సేల్ బ్యానర్ అధికారిక పోర్టల్‌లో జాబితా చేయబడింది, ఇది 70 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ అమ్మకంలో స్మార్ట్‌ ఫోన్‌లతో సహా అన్ని వినియోగదారు ఉపకరణాల ఉత్పత్తులు ఉన్నాయి . టీవీలు, వాషింగ్ మెషీన్లు, ACలు మరియు మరిన్ని తగ్గింపు ధరలకు లభిస్తాయి. ల్యాప్‌టాప్‌లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వివిధ బ్యాంక్ కార్డులకు వేర్వేరు డీల్స్ జాబితా చేయబడ్డాయి. HDFC ఆఫర్లు గరిష్టంగా రూ.7,500 తగ్గింపును అందిస్తాయి. అదనంగా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రేపే IPL 2026 మినీ వేలం.. ఏ జట్టు వద్ద ఎంత పర్సు ఉందంటే..?
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం రేపు (డిసెంబర్ 16న) అబుదాబీలో జరగనుంది. వేలానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో, పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలపరిచేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి రెండో భాగంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ మినీ వేలంలో మొత్తం 77 మంది ప్లేయర్స్ ని తీసుకోనున్నారు. అయితే, ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు గరిష్ఠంగా రూ.237.55 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రూ.64.3 కోట్ల అత్యధిక పర్సుతో వేలానికి వెళ్తుంది. మినీ వేలం చరిత్రలో ఏ జట్టు దగ్గర కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉండటం గమనార్హం. దీంతో వేలంలో జరిగే బిడ్డింగ్ ను నిర్ణయించే శక్తి కేకేఆర్ చేతుల్లోనే ఉండనుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కూడా రూ.43.4 కోట్ల పర్సుతో వేలంపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులను జట్టులోకి తీసుకోవడంపై సీఎస్‌కే దృష్టి సారించినట్లు సమాచారం. కాబట్టి, ప్రధానంగా కీలక ఆటగాళ్ల కొనుగోలులో కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ అధికంగా ఉంది. మొత్తంగా ఐపీఎల్ 2026 మినీ వేలం జట్ల భవితవ్యాన్ని నిర్ణయించే కీలక ఘట్టం స్టార్ట్ కాబోతుంది. భారీ పర్సులతో బరిలోకి దిగుతున్న జట్లు ఎలాంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకుంటాయి అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

రికార్డుల మోత మోగిస్తున్న ‘దేఖ్‌లేంగే సాలా’..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘దేఖ్‌లేంగే సాలా’ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ అందించిన స్టెపులు ఈ పాట కు బాగా సుటేయ్యాయి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ కృషి కూడా ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చాయి. ఈ పాట ఇంతటి భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో సందేహం లేదు. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలనం తర్వాత, పవన్‌ను మళ్లీ అదే ఎనర్జీతో, పవర్‌ఫుల్ డ్యాన్స్‌తో చూడాలనుకునే అభిమానుల కోరికను ఆయన నెరవేర్చారు. హరీష్ శంకర్ సంగీతం విషయంలో చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్లే, ‘దేఖ్‌లేంగే సాలా’ పాట పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా మారింది. పవర్‌స్టార్ పాత మ్యాజిక్‌ను తిరిగి తీసుకొచ్చినందుకు, హరీష్ శంకర్ బృందానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అద్భుతమైన విజయం ఈ చిత్ర బృందానికి మరింత బూస్ట్ ఇచ్చింది.

‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. ఈ హిందీ సెన్సేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధమవుతోందని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ‘ధురంధర్ ‘ తెలుగు డబ్బింగ్ పనులు చకచకా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 19న విడుదల చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో సినీప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాలీవుడ్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో రణవీర్ సింగ్ నటించిన ‘ఛావా’ చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ తెలుగులో విజయవంతంగా విడుదల చేశారు. ఆ అనుభవం దృష్ట్యా, భారీ వసూళ్లు సాధిస్తున్న ‘ధురంధర్ 2’ ను కూడా ఆయనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో విడుదలయితే, అది కూడా భారీ కలెక్షన్లు సాధించి జాక్‌పాట్‌గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version