NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు.. అన్నింటినీ నెరవేరుస్తాం..
కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి.. ప్రజల ఆశలను నెరవేరుస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. భారత స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జెండా ఎగురవేసి శుభాకంక్షలు తెలిపిన ఆయన.. ఆ తర్వాత మాట్లాడుతూ.. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించాం. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నాం. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందాం. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచాం. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందింది.. సంక్షోభం నుంచే అవకాశాలు వెతుక్కున్నాం.. అభివృద్ధికి బాటలు వేశాం. 2014-19 కాలంలో పోలవరం, రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించాం. టీడీపీ అధికారం కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చాయి అన్నారు.. అయితే, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సప్వ నాశనం చేశారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసక పాలన చేపట్టారు. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. అన్ని రంగాల్లో దోపిడీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల అప్పుల భారం పెరిగింది. గత ప్రభుత్వ విధానాల వల్ల తలసరి రుణం భారం పెరిగింది.. తలసరి ఆదాయం తగ్గిందని విమర్శించారు. మద్యం ఆదాయాన్ని.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. విధ్వంసపాలనపై ప్రజలు విసిగిపోయారు.. చైతన్యం వెల్లువెత్తితిందన్నారు సీఎం చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేసి.. కూటమికి అద్భుత విజయం అందించారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రజల ఆశలు నెరవెరుస్తాం అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఏపీ ప్రజలకు ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించింది. సుపరిపాలనకు తొలి రోజు నుంచే కూటమి ప్రభుత్వం నాందీ పలికింది. 100 రోజుల కార్యాచరణ రూపొందించాం. వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రభుత్వం పయనిస్తోందన్నారు.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన పవన్‌.. మాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌.. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు.. ఇది ఆనందించే సమయం కాదు.. స్వాతంత్య్ర సమర యోధులను గుర్తించాలి.. 78 ఏళ్ల క్రితం ఇదే సమయానికి తెలంగాణ, పంజాబ్ కి స్వాతంత్య్రం రాలేదని గుర్తుచేశారు..రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం ముందుకు వెళ్తున్నాం.. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టుకున్నాం.. పేద వారి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసే క్యాంటీన్ లకు ఎన్టీఆర్ పేరు పెట్టామని తెలిపారు. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించిన ఆయన.. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది, స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదు.. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడ రాజీ పడకూడదన్నారు.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి విచ్చలవిడి గా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యింది.. శేషా చలం అడవులు లో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటకలో అమ్ముకున్నారు అని విమర్శించారు.. డిప్యూటీ సీఎంగా నాకు కొన్ని పరిధిలు ఉంటాయి.. కొత్త తరం నాయకులని తయారు చేసుకోవాలి.. మాటలలో కాదు చేతలతో చూపిస్తం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇంకా పవన్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది…
దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగరవేసి.. పోలీసుల గౌరవందనం స్వీకరించారు.. ఆ తర్వాత మాట్లాడుతూ.. మాకు వద్దు తెల్ల దొర తనం, అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.. దేశ స్వాతంత్రం కోసం, తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి.. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో ఏడుగురు ప్రాణ త్యాగం చేశారు అని గుర్తుచేశారు.. ఇక, స్వాతంత్ర కోసం పోరాడిన పోరాడినయోధులకు నివాళులర్పిస్తున్నానన్న లోకేష్.. దేశమంటే భక్తి ఉండాలి.. ఉపాధ్యాయులు పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండాలని సూచించారు. ఈరోజు నేను పాల్గొంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ,నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అన్నారు మంత్రి లోకేష్‌.. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్య్ర పోరాటాన్ని ఏపీ ప్రజలు స్ఫూర్తిగా తీసుకున్నారు.. మొన్న గడిచిన ఎన్నికల్లో అదే శాంతి, అహింస పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి .. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పుడు ప్రతి రాష్ట్ర పౌరుడి కంటిలో ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం ఉండదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌..

కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..
కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఇక, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు.. ఆనాడు 40 కోట్ల మంది దేశ ప్రజలు ఈ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉన్నారు.. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇక, ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు పురంధేశ్వరి.. కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలన్న ఆమె.. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది లక్ష్యం.. వికసిత భారత్ కోసం మనం అంతా కలిసి పని‌చేయాలి.. రాష్ట్ర అభివృద్ధికి అంకితం అయి ముందుకు సాగాలి అన్నారు.. మొన్న ఎన్నికలలో ‌ప్రజలు‌ కూటమికి తిరుగు లేని అధికారం ఇచ్చారు.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించిందన్నారు.. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్ లో ‌కూడా పెడతాం అన్నారు.. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా వినతుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.

కీలక అంశాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు..
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలను ప్రస్తావించారు.. గత ప్రభుత్వంలో అన్న వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శించిన ఆయన.. కూటమి ప్రభుత్వం క్రమంగా అన్ని గాడిలో పెడుతుందన్నారు.. ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం. ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశాం. ఇసుక, మద్యం దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తాం. అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతాం. అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.. రాష్ట్రానికి సాయం చేసిన కేంద్రానికి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతోంది. 53 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా ఉపాధి హామీ పని దినాలను పెంచారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం, తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. వికసిత్ భారత్ లో ఏపీ భాగస్వామ్యం కానుంది. హైదరాబాదులో 2020 విజన్ ఫలితాలు చూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు తెచ్చిన పాలసీలను ఆ తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేస్తాం అన్నారు. ఇక, జులై నెలలోనే ఏపీ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి పొలాలకు అందిస్తాం అన్నారు చంద్రబాబు.. స్వర్ణ చతర్భుజీ స్ఫూర్తితో నదుల అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాం. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం అవసరం అన్నారు.. ఏపీలో కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం. పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం రూ. 990 కోట్లు అవసరం. కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపి పోలవరం పూర్తి చేస్తాం అన్నారు.. ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తాం. విద్యుత్ రంగానికి హై ప్రయార్టీ. సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకుంటాం. కొత్త ఇంధన పాలసీ రాబోతోంది. అన్ని చోట్లా సోలార్ పవర్ ను ప్రొత్సహిస్తాం. సోలార్ పవర్ ద్వారా ఆదాయం వచ్చేలా చేస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ గా ఏపీని మారుస్తాం అన్నారు.

మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..
మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళుటకు అన్ని ప్రాణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ భవననిర్మాణాలు,సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేసామని తెలిపారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా రెండు కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామన్నారు. సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడు లేని విధంగా 110 కోట్లు వెచ్చించి ఒక కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతర నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మిలను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యసేవాలు అందిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల నిర్ములనకు 15 రోజులకు ఒకసారి ఇంటింటికి జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మక్క – సారాలమ్మ గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం కోసం 337 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయనిత తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రజల నుండి అభయ హస్తం ఆరు గ్యారెంటిలకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.

గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..
ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ శ్రేణులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15న దేశo రెండు ముక్కలు కావడం దురదృష్టకరం అన్నారు. ప్రధాని పోస్ట్ కోసం నెహ్రూ, జిన్నా పోటీ పడ్డారని తెలిపారు. ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి పదేళ్ల మోడీ పాలనలో జరిగిందన్నారు. అతి పెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం పటిష్టంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశ అభివృద్ధిని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన శక్తులే నేడు మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ దేశాలుగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కునేoదుకు దేశ యువత సిద్ధం కావాలన్నారు.

భారత ప్రధానులందరిలో సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డును అధిగమించిన మోడీ
స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు 98 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో 2016లో 96 నిమిషాల తన మునుపటి రికార్డును అధిగమించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు, సగటున 82 నిమిషాలు, భారతీయ ప్రధానులందరిలో సుదీర్ఘమైన ప్రసంగాలుగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ 98 నిమిషాలక పాటు తన సుదీర్ఘ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని చేశారు. మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు సగటున 82 నిమిషాలు కాగా.. భారతదేశ చరిత్రలో ఇతర ప్రధానమంత్రుల కంటే ఎక్కువే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2026లో 96 నిమిషాల పాటు మోడీ ప్రసంగించారు. ఇది గతంలో రికార్డుగా ఉండేది. ఆ రికార్డును మోడీ మరోసారి అధిగమించారు. 2017లో మోడీ 56 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇదే మోడీ చిన్న ప్రసంగం. మరోవైపు 11వ సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలిచారు.

‘గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను’.. డైరీలో కోల్‌కతా డాక్టర్ రాసిన చివరి రాతలివే..!
కోల్‌కతా హత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రి.. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో రాసుకున్న వివరాలను వెల్లడించారు. తన కోర్సులో బంగారు పతకాన్ని సాధించడం, ఎండీ పరీక్షలలో అగ్రస్థానం రావడమే లక్ష్యమని రాసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆమె రాత్రి షిఫ్ట్‌కి బయలుదేరే ముందు భయంకరమైన ఘటన జరిగిన రోజున ఈ విషయాన్ని రాసినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె కలలు ప్రతీది ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె రోజంతా పుస్తకాలలో మునిగిపోతుందని, ఆమె చాలా కష్టపడి పనిచేసేదని బాధితురాలి తండ్రి చెప్పారు. తన కుమార్తె ధైర్యసాహసాలకు మెచ్చుకుంటూ.. డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె చాలా పోరాడిందని అన్నారు. ఆమెను పెంచేటప్పుడు తాము చాలా త్యాగాలు చేశామన్నారు. తన కుమార్తెకు దేశవ్యాప్తంగా ఉన్న మద్దతును చూసి తాను పొంగిపోయానన్నారు. ఏమి చేసినా కుమార్తెను తిరిగి పొందలేనని.. కానీ తాను చేయగలిగింది ధైర్యంగా పోరాడడమేనన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మద్దతు ప్రదర్శన న్యాయం కోసం పోరాడటానికి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తోందని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించడం గురించి మాట్లాడుతూ.. తన కుమార్తెను ఏదీ తిరిగి తీసుకురాలేదని, దాని గురించి ప్రత్యేక సంతృప్తి ఏమీ లేదని అన్నారు. తాము ఇప్పుడు కేవలం న్యాయం కోసం ఆశిస్తున్నామని చెప్పారాయన. తన కూతురిని ఇంత కిరాతకంగా చంపినందుకు నేరస్థులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. “వారు ఎంత త్వరగా శిక్షించబడితే అంత మంచిది. మాకు కొంత ఊరట లభిస్తుంది, అయినప్పటికీ మా నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు” అని ఆయన అన్నారు. కాలేజీ యాజమాన్యం తన కూతురిని ఎప్పుడూ ఆదుకోలేదని చెప్పాడు. ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు.

వినేశ్‌ ఫొగాట్‌ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేశ్‌ వేటుకు గురైంది. సెమీ ఫైనల్‌ తర్వాత 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేశ్‌.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు పెరిగింది. ఫైనల్‌కు ముందు తీవ్రంగా శ్రమించినా.. 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. బరువు పెరగడానికి మూడు అంశాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఫైనల్‌కు ముందు వినేశ్‌ ఫొగాట్‌ గ్లాస్ పళ్ల రసం, ఫ్లూయిడ్స్‌, స్నాక్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటి కారణంగానే వినేశ్‌ బరువు ఒక్కసారిగా పెరిగిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం… సెమీస్ సందర్భంగా 300 గ్రాముల జ్యూస్‌ను తాగింది. బౌట్స్‌కు ముందు ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకుంది. దాంతో 2 కేజీల బరువు పెరిగింది. సెమీస్‌ ముగిశాక స్నాక్స్‌ తీసుకుంది. దాంతో ఆమె బరువు మూడు కిలోలు అదనంగా పెరిగింది. సెమీస్‌కు ముందు 49.9 కిలోలు ఉన్న వినేశ్‌.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కిలోలకు పెరిగింది.

తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు ఇండియాలోనే కాదు, వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ డైరెక్ష‌న్‌లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైల‌ర్‌కు సీక్వెల్‌గా జైల‌ర్ 2ను తెరకెక్కించాల‌నుకుంటున్నారు నెల్స‌న్ దిలీప్ కుమార్‌. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. జైల‌ర్ మూవీలో ర‌జినీకాంత్‌తో పాటు శివ రాజ్‌కుమార్‌, మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ కూడా నటించారు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ ఆరు వంద‌ల కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ర‌జినీకాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ ఆఫర్ చేసింది. రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సినిమలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర ఉంది. అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆ ఆఫ‌ర్‌ను రజని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలివుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన నో చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రజినీ సంప్రదించగా అక్కడ నో అనే సమాధానమే వచ్చింది. దీంతో మేక‌ర్స్ ఆ పాత్ర‌కు క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ శివ రాజ్‌కుమార్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్.పి దర్శకత్వం వహిస్తున్నారు..

ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్.. కారణం ఇదే.?
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌ట‌మే కాదు, సీత‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ మనసు దోచేసింది మ‌రాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. రెండవ సినిమాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూప‌ర్ హిట్ కావ‌టంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌లో అవ‌కాశాలు కోసం అమ్మ‌డు అటుగా దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలో పలు తెలుగు సినిమాలకు నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాగా మృణాల్‌ను టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు హ‌ను రాఘవ‌పూడి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ప్రభాస్‌ కు కరెక్ట్ జోడిగా అమ్మడు సెట్ అవుతుందని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఈ విష‌యంలో ఫ్యాన్స్‌కి మృణాల్ నిరాశ‌నే మిగిల్చింది. రీసెంట్‌గా ఓ అభిమాని ప్ర‌భాస్ సినిమా గురించి మృణాల్ ని ప్రశ్నించగా తాను ఆ సినిమాలో చేయ‌టం లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది.