NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మరోసారి ఢిల్లీ బాట.. నేడు హస్తినకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. ఈ రోజు.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకోనున్నారు చంద్రబాబు.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. రేపు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరినట్టుగా తెలుస్తుండగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.. పోలవరం ప్రాజెక్టు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్‌ చేయాల్సిందిగా కోరనున్నట్టుగా తెలుస్తోంది.

అన్న క్యాంటీన్ పేదల కడుపు నింపుతుంది.. నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు..!
పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు.. అన్న క్యాంటిన్‌ను ప్రారంభించిన తర్వాత అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు బాలయ్య.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదల ఆకలి తీర్చేందుకు అప్పట్లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు.. ఇక, నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ.. పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుందన్న ఆయన.. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబుకు హిందూపురం అంటే ప్రత్యేక అభిమానం ఉందన్నారు బాలయ్య.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తాం అని ప్రకటించారు సినీ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

రెడ్‌ బుక్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేష్‌.. అది మ్యాండేటరీ..!
చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది నేను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చారు అన్నారు.. అయితే, రెడ్‌బుక్‌పై జరుగుతోన్న చర్చపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. రెడ్ బుక్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. రెడ్‌బుక్‌ మాకు మ్యాండేటరీ అన్నారు.. గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌.. జోగి రమేష్ కుమారుడు ఏం చేశారు? ప్రజలు తెలుసుకోవాలన్న ఆయన.. అగ్రిగోల్డ్ భూముల పత్రాలకు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి.. ఆ భూములను అమ్మేశారు.. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.. భవిష్యత్‌లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానని, అందుకే ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని తెలిపారు..

సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు..! బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.. ఈ రోజు తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. స్వయంగా టిఫిన్‌ వడ్డించారు.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు.. అయితే, ఈ పర్యటనలోనే ఆయన హిందూపురంను జిల్లా కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.. అంతేకాదు.. సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా.. జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే బాలకృష్ణ ఆందోళన చేపట్టిన విషయం విదితమే.. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు తప్పదా? అనే చర్చ నడుస్తోంది.

హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన.. మరో రెండ్రోజుల పాటు వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారా హిల్స్, మాధాపూర్, హైటెక్స్ సిటీ, పంజాగుట్ట, అమీర్ పేట్ పలు ప్రాంతాలలో వాన కురుస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వర్షం కాస్త ఊరటనిచ్చింది. భారీ వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, మహబూబ్, వరంగల్, సూర్యపేట, హనుమకొండ, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఢిల్లీలో విదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సొంత దేశంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంలోని పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని అభిషేక్ మను సింఘ్వీ కలిశారు. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు వెళ్లనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నా అని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

గుడ్ న్యూస్ .. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు. ఇటీవల, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్‌లు గుడ్‌బై చెప్పాయి. కానీ నెల రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌తోపాటు ఫోన్‌పే ద్వారా ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి.

సంజూ శాంసన్‌పై ప్రశ్న.. పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్‌! ఎంతపని చేశావయ్యా
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్రశ్నకు జవాబు చెప్పలేదు. రెండు లైఫ్‌లైన్‌లు వినియోగించుకున్నప్పటికీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం సంజూనే కావడం ఇక్కడ విశేషం. కేబీసీ 16కు వ్యాఖ్యాతగా అమితాబ్‌ బచ్చన్‌ వ్యవరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో రామ్ కిషోర్ అనే కంటెస్టెంట్‌ పాల్గొన్నాడు. ‘ఐపీఎల్‌ 2024లో కెప్టెన్‌లుగా ఉన్న ఈ ఆటగాళ్లలో భారత్‌ తరఫున టెస్ట్‌ మ్యాచ్‌ ఆడని ప్లేయర్ ఎవరు?’ అని కిషోర్‌ను అమితాబ్‌ అడిగారు. ఆప్షన్‌గా ఎ-శ్రేయస్ అయ్యర్, బి-హార్దిక్ పాండ్యా, సి-సంజు శాంసన్, డి-రిషబ్ పంత్ పేర్లను ఇచ్చారు. ఈ ప్రశ్నకు కిషోర్ సమాధానం చెప్పలేదు. ఆడియన్స్‌ పోల్‌ ఉపయోగించుకున్నా ఆన్సర్ చెప్పకపోవడంతో అమితాబ్‌ మరో లైఫ్‌లైన్ (ఫోన్‌ ఎ ఫ్రెండ్‌, డబుల్ డిప్) ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?
జూన్‌ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచే అసలు విషయం మొదలవుతుంది. భారత జట్టు వచ్చే 5 నెలల్లో నిరంతరం మ్యాచ్‌లు ఆడనుంది. టీమ్ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. సెప్టెంబర్ 19 నుంచి వచ్చే 111 రోజుల్లో (3 నెలల 19 రోజులు) భారత జట్టు 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొత్తం 5 నెలల్లో 10 టెస్టులు కాకుండా 8 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో 5 నెలల్లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు) భారత జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌తో ఇది ప్రారంభమవుతుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్ జరగనుంది. దీని తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగాల్సి ఉంది. ఏడాది చివర్లో, భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్‌ జట్టు ఆ తర్వాత ఇరు జట్లు 5 టీ20, 3 వన్డేల సిరీస్‌ ఆడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 2025లో ఇంగ్లాండ్‌ తో సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం, మిగిలిన సన్నాహాల కోసం తన బలమైన జట్టును తయారు చేయడానికి భారత జట్టుకు ఈ 3 ODI మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ను చూడండి.

‘రాయన్‌’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటించి, తెరకెక్కించిన చిత్రం ‘రాయన్‌’. ధనుష్‌ కెరియర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. జూలై 27న విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో రాయన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. రాయన్‌ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషలలో రాయన్‌ స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది. థియేటర్లో సినిమా చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో ధనుష్‌ తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్‌గా కూడా మెప్పించాడు. తన తమ్ముళ్లు, చెల్లి కోసం రాయ‌న్ ఏం చేశాడు?, రాయ‌న్ కోసం వాళ్లు ఏం చేశారు? అన్నదే ఈ సినిమా కథ.

అరాచకం.. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ బాబు..
నీ దూకుడు.. సాటెవ్వడు.. అని దూకుడు సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ లిరిక్స్ మహేశ్ బాబుకు సరిగ్గా సరిపోతాయని మరోసారి రుజువైంది. సాధారణంగా మహేశ్ సినిమాలకు హిట్ టాక్ వస్తే రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తాయి.కానీ రిరిలీజ్ సినిమాలు కూడా రికార్డులు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. గతేడాది పోకిరి, ఒక్కడు రీరిలీజ్ లతో సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించాయి మహేశ్ బాబు సినిమాలు. తాజాగా మరోసారి మహేశ్ సినిమా మరో సారి అల్ టైమ్ రికార్డు సాధించింది. ఆగస్టు9 న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్బంగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన మురారి సినిమాను 4K క్వాలిటితో రీరిలీజ్ చేసారు ఫ్యాన్స్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా మురారి మళ్లోసారి అంటూ రీరిలీజ్ చేసారు. వారం రోజులపాటు ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించారు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత రిలీజైన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. 6 రోజులకు గాను మురారి 9.12 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రీరిలీజ్ రికార్డును తన పేరిట నమోదు చేసాడు మహేశ్. ఇక ఓవవర్శిస్ లోను ఈ చిత్రం 60,144 డాలర్లు రాబట్టి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మరోపక్క హైదరాబాద్ లోని రఆర్టీసీ క్రాస్ రోడ్డులో టాప్ 5 రీరిలీజ్ సినిమాలలో రూ. 62 లక్షల రూపాయలతో అల్లా టీమ్ రికార్డు సెట్ చేసాడు. రీరిలీజ్ లో ఈ విధమైన కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు మహేశ్.

NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్‌..
నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో NTVతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేచురల్‌స్టార్‌ నాని. ట్రైనీ పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని నాని ని కోరారు ఓ పోలీస్ అధికారి. ఆ ప్రశ్నకు సమాధానంగా నాని మాట్లాడుతూ ” చాలా మంది డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ వల్ల యువత పాడైపోతారని చెప్పడమే తప్ప.. దాంతో వచ్చే సమస్యలు ఏమిటో ఎవ్వరూ చెప్పట్లేదు. అసలు వాటితో వచ్చే సమస్యలు ఏంటో తెలియకపోతో, అవి ఎందుకు చెడో అర్ధం కాదు. చాలా మంది పిల్లలు, యువత డ్రగ్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి మొదట తీసుకుని తరువాత బానిస అయిపోతున్నారు. కానీ అది వాస్తవానికి మనశ్శాంతిగా ఉండే మన జీవితంలో ఒకసారి దానికి అలవాటు అయితే అది తీసుకోకుండా ఏ పని చేయలేని పరిస్థితికి డ్రగ్స్ తీసుకెళ్తాయి. చాలా మంది తెలియక డ్రగ్స్ తీసుకుంటే ఎదో జాయ్ ఫీలింగ్ వస్తుంది అని అనుకుంటారు.. కానీ మీ జాయ్ ని, ఆనందాలను డ్రగ్స్ హరిస్తాయి. సినిమాలలో చూపించే విధంగా డ్రగ్స్ ఉండవని.. డ్రగ్స్ అంటే పాయిజన్” అని నాని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ మంచిది కాదు అనే కాక అవి ఏ రకంగా హాని కలిగిస్తాయో వివరించాలని సూచించారు.