NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

ఏపీ సర్కార్‌ చొరవ.. కువైట్‌ నుంచి క్షేమంగా స్వదేశానికి బాధితురాలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత… బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు.. తనను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వేడుకున్నారు.. ఇక, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తితో స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారతశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. కవితను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేశారు.. ఇలా.. కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లింది కవిత.. కానీ, పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురయినట్లు వీడియో ద్వారా వెల్లడించింది.. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వీడియో ద్వారా మొరపెట్టుకుంది.. ఇక, తక్షణమే స్పందించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. ప్రవాసంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో సంప్రదింపులు జరిపారు.. కవితను తన స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. నిన్న ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఏపీ ఎన్‌ఆర్‌టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు స్పందించిన ఏపీ ఎన్నార్టీ 24 గంటల అత్యవసర విభాగం కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళిని ఫోన్ ద్వారా సంప్రదించింది.. మురళి తోపాటు అక్కడే ఉన్న రషీదా బేగం అనే ప్రవాసాంధ్ర మహిళ ఇరువురు కలిసి కవిత ఆశ్రయం పొందిన ప్రాంతానికి వెళ్లి, ఆవిడను సురక్షితంగా దేశానికి తిరిగి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. గతరాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత ఈరోజు ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది.. ఈ విషయంపై స్పందించిన కవిత భర్త వెంకటేశ్వర్లు తాము ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశాలకు తన భార్య వెళ్ళిందని, ఆ పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో తాను తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. చివరి ఆశగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించడం, ఆయన తక్షణమే స్పందించడంతో స్వదేశానికి తిరిగి తన భార్య వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు..

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. మరోసారి వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో.. మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్‌ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, విచారణకు సహకరించాలని వైసీపీ నాయకులకు షరతు పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈ రోజు విచారణ చేయనున్నారు పోలీసులు.. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే మధ్యాహ్నం వైసీపీ నేతలు విచారణకు వస్తారా..? లేక మరో రోజు వస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ సహా పలువరు వైసీపీ నేతలు.. వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఇక, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. అయితే, దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది సూప్రీంకోర్టు.. ఇదే సమయంలో ఈ కేసు విచారణకు సహకరించాలని పేర్కొంది.. పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్‌ చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని సూచించింది.. నలుగురు విచారణకు పూర్తిగా సహకరించాలని పేర్కొంది.. ఇక, కేసు తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసిన విషయం విదితమే. కానీ, ఆ వెంటనే మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది.

లీడర్లు అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. స్పందించే మనసు ఉండాలి..
లీడర్ అంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోక పోగా.. ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు. గత ఐదేళ్లుల్లో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తుగా పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యం, వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేక పోతున్నాడు.. ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్ కు ఉందా? జగన్, కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలుకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. ఇక, పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞాని లాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారు అని ఎద్దేవా చేశారు మనోహర్‌.. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కల్యాణ్‌ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదన్నారు.. పిఠాపురంలో మీ జగనన్న కాలనీ ఎందుకు పరిశీలించలేదు? అని నిలదీశారు. ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు.. గత ఐదేళ్లు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. వర్షాలు ఎక్కువుగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలి.. జగన్ ఏనాడైనా జేబులో నుంచి లక్ష రూపాయలకు సామాన్యునికి సాయం చేశారు? సీఎం హోదాలో ఉండి.. ప్రజలకు కనిపించకుండా పరదాలు కప్పుకుని తిరిగారు అని మండిపడ్డారు.. అన్నమయ్య ప్రాజెక్టు మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా..? దీనికి గురించి జగన్ కు మాట్లాడే అర్హత ఉందా? అని ఫైర్‌ అయ్యారు.. పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్.. మీ పార్టీ శ్రేణులను వరద సహాయక చర్యలు ఎందుకు చేయించలేదని మండిపడ్డారు.

అవును జగన్‌ అన్నదే కరెక్ట్.. ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్..!
వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్‌ అన్నారు.. ఇది కరెక్ట్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు… కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల్లో ఏలేరు పొంగి ప్రవహించింది.. భారీ వర్షం నమోదైంది.. కానీ, ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టం తప్పిందన్నారు.. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నపుడు 17 వేల క్యూసెక్కుల నీరు వస్తే కాకినాడ వరకూ నీళ్లు వచ్చాయి.. ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా.. ముందు చూపుతో నీటిని వదిలి నష్టాన్ని నివారించారని స్పష్టం చేశారు.. ఇక, జగన్ కు క్యూ కెక్కులు తెలీదు.. టీఎంసీలు అంటే తెలియదు అని ఎద్దేవా చేశారు.. ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో అంటే కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు సోమిరెడ్డి.. ప్యాలస్‌లో కూర్చుని పాలించాడు.. జగన్ హయాంలో జలవనరులు.. వ్యవసాయ శాఖలు మూత పడ్డాయి.. జగన్ వల్ల పీఎల్‌ఆర్‌ కంపెనీ బాగు పడింది.. జగన్ హయంలో ఉన్న జలవనరుల శాఖ మంత్రి డాన్స్ లకు పరిమితమయ్యారు అని విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి టపాకాయలు కాల్చడం ఎంతవరకూ సబబు? అని ప్రశ్నించారు వరద బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్.. ముద్దులు పెడుతున్నారు.. ఏలేరు ప్రాంతంలో ఒకే రోజు 17 సెంటీమీటర్ల వర్షం వచ్చింది.. అందువల్లే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ఏలేరు ఆధునికీకరణకు జగన్ హయాంలో నిధులు ఇవ్వలేదు.. వరద బాధితుల కోసం జగన్ కోటి రూపాయలు మాత్రమే విరాళం ఇచ్చారు.. దేశంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో జగన్ మూడవ వారు.. అలాంటి వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. వరద బాధితులు జగన్ పరామర్శించలేదు.. కేవలం తన అనుచరులు ఉన్న ప్రాంతంలో మాత్రమే పర్యటించారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..

ఆంధ్రోళ్ల పై కౌశిక్‌ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా..
ఆంధ్రోళ్ల పై కౌశిక్‌ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా అని కాంగ్రెస్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ కూడా మాట్లాడారు.. ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టాడన్నారు. మా పార్టీ విపరీత వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని అన్నారు. బిర్యాని మాది..పెండ మిది అని అనలేదా ? అని ప్రశ్నించారు. మీ ఎంఎల్ఏ ఇప్పుడు మాట్లాడారన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆంధ్రోళ్ల పై మాట్లాడిన వీడియో నీకు పంపుతా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు భంగం వాటిల్లేలా చేస్తుంది ప్రతిపక్షం అంటూ మండిపడ్డారు. మీ ఎంఎల్ఏ రెచ్చ గొడితే తప్పు కాదా..? గాంధీ ఐనా కౌశిక్ ఐనా దాడులు తప్పు అని తెలిపారు. కేటీఆర్ అసహనంతో ఉన్నాడన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి..అధికారం పోవడంతో అసహనంలో ఉన్నాడన్నారు. పార్టీ ఫిరాయింపుల లో ప్రొఫెసర్లు బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు. టీడీపీ ఎంఎల్ఏ లను , కాంగ్రెస్ ఎంఎల్ఏ లను మంత్రులను చేసింది బీఆర్ఎస్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేని మంత్రిని చేసింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. మేము ఫిరాయింపుల ప్రోత్సహించలేదని క్లారిటీ ఇచ్చారు. మీరే మా సర్కార్ కూల్చుతం అన్నారు.. కాదా..? కూలగొడతం అంటే.. ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ సహకారం తీసుకుని మా సర్కార్ నీ దెబ్బతీసేలా మాట్లాడలేదా? అని అన్నారు. మా పై మాట్లాదేవాడే చిల్లర గాళ్ళు.. చిల్లర గాళ్ళ గురించి మాట్లాడొద్దు అని సీఎం చెప్పారన్నారు. మా పోలీసు అధికారులు కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళే.. సీపీ కార్యాలయంలో ఏమైంది అనేది సీఎం సమీక్ష చేస్తారన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..
బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు అంటూ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసాము. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే అన్నారు. ప్రాంతీయతత్వంపై దాడులు గతంలోనూ లేవని ఇప్పుడూ ఉండవని అన్నారు. బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరినవ్? దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏపార్టీలో ఉన్నాడో చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో హేడ్ లైన్ మేనేజ్మెంట్ నడుతుందన్నారు. అసమర్థుడు జీవన్ యాత్ర లాగా పాలన నడుస్తుందని తెలిపారు. వంద రోజులలో అన్ని చేస్తామని చెప్పారు చేయలేదన్నారు.

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..
తెలంగాణ కేబినెట్ సమాశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అద్యక్షతన ఈ సమావేశం ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై, హైడ్రాకు చట్టబద్దత అంశం, అలాగే 2 లక్షల రుణాల మాఫీ చెల్లింపు, 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఆర్డినెన్సు రైతు భరోసాపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీటిపై చర్చించి విధి విధానాలపై ఖరారు చేయనున్నారు. కేబినేట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే హైడ్రాపై ప్రజల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రజ్వల్ రేవణ్ణపై మూడో ఛార్జ్‌షీట్
హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ అధికారులు మూడ‌వ ఛార్జ్‌షీట్ ను దాఖ‌లు చేశారు. జేడీఎస్‌ పార్టీకి చెందిన ఓ మ‌హిళ‌ను తుపాకీతో బెదిరించి ప‌లుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది. 2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మ‌హిళ‌పై ప్రజ్వల్ లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. 1691 పేజీలు ఉన్న ఈ ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. లైంగిక చర్యకు సంబంధించిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం క‌న‌బ‌డ‌కుండా చేసి బెదిరింపుల‌కు పాల్పడినట్లు సిట్ అధికారులు తెలిపారు. వీడియోల ఆధారంగా మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఛార్జీషీట్‌లో వెల్లడించారు. ఇక, తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్‌ ఎం.నాగ ప్రసన్న తోసిపుచ్చింది. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుంది.. కానీ, ప్రజ్వల్‌ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని చెప్పుకొచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొనింది.

బిగ్ బాస్ లోకి హార్దిక్ పాండ్యా మాజీ భార్య..?
సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు కంటెస్టెంట్స్‌ పేర్లను వెల్లడించకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు మేకర్స్ మరో వివాదాస్పద కంటెస్టెంట్ నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించారు. ఇది మాత్రమే కాదు, ఆమె స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కూడా ఈ కార్యక్రమంలో చూడవచ్చని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. షోలో, మేకర్స్ కొన్ని కారణాల వల్ల వివాదాలలో భాగమైన కంటెస్టెంట్‌లను మాత్రమే సంప్రదిస్తారు. షో టీఆర్‌పీ విపరీతంగా పెరగడానికి ఇదే కారణం. గతంలో రాజ్ కుంద్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. అడల్ట్ ఫిల్మ్ మేకింగ్ కారణంగా రాజ్ కుంద్రా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాదు., ఆ దాని వల్ల జైలుకు కూడా వెళ్లాడు. నటాషాను సంప్రదించడానికి ఆమె వ్యక్తిగత జీవితమే కారణం కావచ్చు. ఆమె షోకి వస్తే, తన పెళ్లి జీవితంలో విడిపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె టీవీలో వెల్లడించవచ్చు. అయితే ఈ షోలో నటాషా రాకకు సంబంధించిన వార్తలను ప్రస్తుతానికి ధృవీకరించడం లేదు. మేకర్స్ లేదా నటి నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ షోకి నటాషా రాకతో చాలా పెద్ద సీక్రెట్స్ రివీల్ అవుతాయి.

సెంచరీ చేసిన ప్రథమ్ సింగ్.. భారీ లీడ్‭లో ఇండియా A జట్టు..
దులీప్ ట్రోఫీ మూడో మ్యాచ్‌లో ఇండియా A ఓపెనర్ ప్రథమ్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ (122) సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా A జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా D 183 పరుగులు మాత్రమే చేసింది. ప్రథమ్ రెండో ఇన్నింగ్స్‌లో తన ఇన్నింగ్స్‌ను సాఫీగా కొనసాగించాడు. చెత్త బంతుల్లో భారీ షాట్లు కొడుతూ సెంచరీ పూర్తి చేశాడు. ఇకపోతే మొదటి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్‌కు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ప్రథమ్ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి 33 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ 56 పరుగులు చేశాడు. అతని అవుట్ అయిన తర్వాత, ప్రథమ్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. మ్యాచ్ మూడో రోజు సెంచరీ పూర్తి చేశాడు. 189 బంతుల్లో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని బ్యాట్ నుంచి 12 ఫోర్లు, ఒక సిక్స్ వచ్చాయి. ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 32 ఏళ్ల ప్రథమ్‌కి ఇది రెండో సెంచరీ. అతను ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడాడు. అతని 50 ఇన్నింగ్స్‌ లలో 35 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 1,697 పరుగులు వచ్చాయి. ఇందులో 2 సెంచరీలతో పాటు 10 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. రైల్వే క్రికెట్ జట్టులో ఈ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 169* పరుగులు. ప్రథమ్ ఢిల్లీ నివాసి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ప్రథమ్ గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్లలో భాగంగా ఉన్నాడు.

ఎంఎస్ ధోనీని వద్దనుకున్న సీఎస్‌కే!
ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. తన అద్భుత కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో సీఎస్‌కేకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. సీఎస్‌కే అంతలా సక్సెస్ అవ్వడానికి కారణం మిస్టర్ కూల్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ లేకుండా చెన్నై జట్టుని ఊహించలేం. అయితే ఒకానొక సందర్భంలో దిగ్గజ ధోనీనే సీఎస్‌కే మేనేజ్మెంట్ వద్దనుకుందట. ఈ విషయాన్ని భారత మాజీ ఆటగాడు ఎస్‌ బద్రీనాథ్‌ చెప్పాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌ బద్రీనాథ్‌ మాట్లాడుతూ… ‘2008 ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఎంఎస్ ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్‌ని తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ అనుకుంది. అప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నై జట్టు కూర్పులో భారత మాజీ ఆటగాడు వీబీ చంద్రశేఖర్‌ కీలక పాత్ర పోషించాడు. ధోనీ చెన్నై జట్టులోకి రావడానికి ముఖ్య కారణం చంద్రశేఖరే. దిగ్గజ సారథిని ఇచ్చిన ఆయనకు నేను కృతజ్ఞుడిని’ అని చెప్పాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఎస్‌ బద్రీనాథ్‌ ఆడిన విషయం తెలిసిందే. భారత జట్టు తరఫున మాత్రమే కాదు.. సీఎస్‌కేలో కూడా బద్రీనాథ్‌ ఆడాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. భారీ సిక్సులతో అభిమానులను అలరించాడు. అయితే ఐపీఎల్‌ 2025లో అతడు ఆడతాడా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. మహీ షాకులిస్తాడన్న విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్  ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.  దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా దేవర సినిమాపై ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో హద్దులు దాటిన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుండి ఆ ట్రోలింగ్ మరింత ఎక్కవ అయింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులుకాని మరెవరు కూడా ఈ ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెయ్యట్లేదు. రిలీజ్ నాటికి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయితే అది సినిమాపై ప్రభావం చూపుతుందడంలో సందేహం లేదు. మరోవైపు దేవర తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ ను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మేకర్స్. దీనిపై నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. రిలీజ్ కు కేవలం 13 రోజులు ఉండగా కనీసం పోస్టర్స్ కూడా రిలీజ్ చేయట్లేదని,  సాంగ్స్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అటు హిందీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, కపిల్ శర్మ కామెడీ షో  దేవర టీమ్ తో ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. దేవర తెలుగు ప్రమోషన్స్  ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సినిమాను మరింతగా ఆడియన్స్ లోకి ఎలా తీసుకువెళ్తారో చూడాలి.

విజయ్ చివరి సినిమా ఫుల్ డీటైల్స్ ఇక్కడ చదవండి..
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. గత నెలలో TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ చివరి ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అట్లీ, వెట్రిమారన్ ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. తాజగా విజయ్ సినీ కెరీర్ లో నటించబోయే సినిమాను తమ బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసాయి. విజయ్ 69వ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతమే అందిస్తున్నాడు. మాస్టర్, తెలుగు దసరా సినిమాలకు పని చేసిన సత్యన్ సూరన్ విజయ్ సినిమాకు సినిమాటోగ్రాఫార్ గా వర్క్ చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన నేడో రేపో రానుంది. విజయ్ నటించిన రీసెంట్ సినిమా GOAT ప్రస్తుతం థియేటర్లో ఉంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన GOAT  మిశ్రమ ఫలితం రాబట్టింది.  H. వినోద్ దర్శకత్వంలో రానున్న చివరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  మరి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Show comments