NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. లేటెస్ట్‌ రిపోర్ట్..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవబోతున్నాయి.. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. అయితే, ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇక, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.. మరోవైపు.. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని సూచించింది.. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదని స్పష్టం చేసింది.. పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలి.. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు..

కొనసాగుతున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ.. కొత్త లిక్కర్ బ్రాండ్లు రెడీ..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.. మొత్తం 3396 దుకాణాల్లో ఇప్పటివరకు దాదాపు 1500 షాపుల కేటాయింపు పూర్తి అయ్యింది.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 86 దుకాణాల కేటాయింపు పూర్తి కాగా.. కర్నూలు జిల్లాలో మందకోడిగా లాటరీ.. కేవలం 19 షాపులకే లాటరీ పూర్తి చేశారు.. మిగతా మద్యం దుకాణాల కోసం 26 జిల్లాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మద్యం దుకాణాలు దక్కనట్టుగా తెలుస్తోంది.. లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 16 నుండి నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుంది.. ప్రైవేటు మద్యం షాపుల్లో కొత్తగా రానున్నాయి లిక్కర్ బ్రాండ్లు.. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకుంటున్నాయి ప్రీమియం బ్రాండ్ ల మద్యం బాటిళ్లు.. బ్లాక్ అండ్ వైట్, మైక్ డోవెల్ లగ్జరీ, రాయల్ ఛాలెంజ్, సియాగ్రామ్, వాట్ 69 స్కాచ్, విస్కీ బాటిళ్లు సహా మరికొన్ని బ్రాండ్‌లో అందుబాటులోకి రానున్నాయి.. బీర్లలో ఎలిఫెంట్, హెన్కిన్ వంటి పాత బ్రాండ్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అంటున్నారు స్టాక్ పాయింట్ అధికారులు.. మొత్తంగా ప్రీమియం లిక్కర్ కిక్కు కోసం ఎదురు చూస్తున్న మందుబాబులు ఇక నుంచి పండుగ చేసుకొనే సమయం వచ్చేస్తోంది.. వీటిలో 8 రకాల బీర్లు, వందల రకాల IML బ్రాండ్లు వున్నాయి అంటున్నారు.. వీటిలో KF తో పాటుఎలిఫెంట్, హేనికిన్ బీర్లకు డిమాండ్ ఎక్కువగా వుంది. ఇక, ప్రీమియం లిక్కర్ లో బ్లాక్& వైట్ , మెక్ డోవెల్, ఇంపీరియల్ బ్లూ , రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ల తో వైన్ షాపులు కళకళ లాడబోతున్నాయి.. కొత్త మద్యం బ్రాండ్లతో గోడౌన్లు నిండిపోతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన మద్యం బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్స్ గోడౌన్స్ కు చేరుకున్నాయి. మద్యం షాపులకు లాటరీ ద్వారా వ్యాపారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే రేపటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నారు. కొత్త మద్యం షాపులలో కొత్త మద్యం బ్రాండ్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడం కోసం ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఐఎంఎల్ గోడౌన్స్‌కు మద్యం లారీలు చేరుకున్నాయి. లిక్కర్, బీర్లు.. ఇలా ఇప్పటికే గోడౌన్లకు చేరుకోగా మరికొంత రేపటిలోగా చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.. కాగా, రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..

ఏపీలో భారీ వర్షాలు.. కలెక్టర్లు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తెల్వారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. ఇక, నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు.. ఇక, టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.. పర్యవేక్షణ ఉంచాలి. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి.. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు.. చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలి.. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి.. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలి.. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని తెలిపారు..

దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. దివ్వాంగులు ఆఫీసర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాలని తెలిపారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు.. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని గుడ్ న్యూస్ చెప్పారు. అందుకోసమే పోస్టల్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామన్నారు. ప్రైవేట్ జాబ్ లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచెందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. డిసబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమము, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా మాకే..మీ సమస్యలను షేర్ చేయొచ్చని తెలిపారు. మెసేజ్ పాస్ చేస్తే చాలు మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

లారెన్స్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు..?
ముంబైలో ఎన్సీపీ(అజిత్ వర్గం) నేత, మాజీ మంత్రి బాబా బాబా సిద్ధిక్ హత్యలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయాన్ని ముంబై పోలీసులు నిర్ధారించారు. అయితే, గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యొక్క కస్టడీని పొందడంలో అనేక సవాళ్లను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. అతని పేరు హై ప్రొఫైల్ కేసులలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసంలో జరిగిన కాల్పుల ఘటనలో కూడా బిష్ణోన్ ప్రమేయం ఉందనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ముంబై పోలీసులు పలు దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ.. సదరు గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు. కాగా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాధ్యత వహించడంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి అరెస్టు చేసిన షూటర్లు కూడా ముఠాకు చెందినవారేనని పేర్కొంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్‌ను తరలించడాన్ని నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం దీనికి ప్రధాన కారణం. ఆర్డర్ మొదట ఆగస్టు 2024 వరకు అమలులో ఉండగా..ఇప్పుడు పొడిగించబడినట్లు తెలిపారు.

నస్రల్లా చనిపోయిన 2 వారాల తర్వాత హిజ్బుల్లా ఆడియో సందేశం రిలీజ్..
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ హసన్ నస్రల్లా యొక్క ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది. ఆ ఆడియోలో, మాజీ హిజ్బుల్లా చీఫ్ తన అనుచరులను “దేశాన్ని రక్షించండి” అని కోరడం వినవచ్చు. గత నెలలో దాహియేహ్‌లోని హిజ్బుల్లా యొక్క భూగర్భ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా మరణించారు. మీ ప్రజలు, మీ కుటుంబాలు, మీ దేశం, మీ విలువలు, మీ గౌరవాన్ని రక్షించడానికి ఈ పవిత్రమైన భూమిని, మా ప్రజలను రక్షించడానికి మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నామని హసన్ నస్రల్లా హిజ్బుల్లా సభ్యులతో చెప్పిన ఆడియోను రిలీజ్ చేశారు. అయితే, సెప్టెంబరులో బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హసన్ నస్రల్లా మరణించాడు. ఇజ్రాయెల్ వైమానిక దళం విడుదల చేసిన దృశ్యాలు సెకన్లలో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. హిజ్బుల్లా యొక్క సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకితో సహా పలువురు సీనియర్ నాయకులు మరణించారు. ఈ దాడులు ఆరుగురు మరణించాగా, 91 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నస్రల్లాను హత్య చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది. ఇక, ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా డ్రోన్లతో దాడి చేసింది. ఇందులో నలుగురు సైనికులు మరణించగా, మధ్య- ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై హిజ్బుల్లా డ్రోన్ దాడిలో 60 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 22 మందిని మరణించారు.. దీనికి ప్రతీకారంగా హిజ్బుల్లాహ్ ఆదివారం రాత్రి డ్రోన్లతో దాడులు చేసింది.

పండుగ సీజన్‌లో షాకిచ్చిన ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్‌లో ఎంత పెరిగిందంటే ?
ఈసారి టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల కనిపించింది. గత నెలలో అంటే సెప్టెంబర్‌లో ఇది 1.84 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో అంటే ఆగస్టు 2023లో ఇది 1.13 శాతంగా ఉంది. సెప్టెంబర్ 2024లో టోకు ద్రవ్యోల్బణం 0.26 శాతంగా ఉంది. ఈ ద్రవ్యోల్బణం రేటు ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల కారణంగా పెరిగింది. అయితే, ఈ పెరుగుదల మార్కెట్ నిపుణులు, ఇతరుల అంచనాల కంటే తక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 1.90 శాతంగా ఉంటుందని అంచనా. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ముఖ్యంగా పెరిగి 9 శాతం దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోకు ఆహార ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, తయారీ, మోటారు వాహనాల నిర్మాణం, యంత్రాలు, పరికరాల తయారీ మొదలైన వాటిలో ధరల పెరుగుదల కనిపించింది. టోకు ద్రవ్యోల్బణం సూచిక సంఖ్య, అన్ని వస్తువులు, WPI భాగాల ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం రేటులో పెరుగుదల కనిపించింది.

ఏం తాగావ్‌రా నాయనా..? కొండచిలువ పైకి ఎక్కినా లేవ లేదు..!
నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం సింగనపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.. అది ఎంతలా అంటే.. కిక్కులో నిద్రపోతున్న అతడిపైకి కొండ చిలువ వచ్చి చేరినా సడిసప్పుడు లేదు.. పీకలదాకా తాగి చలనం లేకుండా మత్తులోకి వెళ్లిపోయాడు ఓ లారీ డ్రైవర్.. అయితే, మత్తులో ఉన్న మందు బాబుపై ఒళ్లంతా అటూ ఇటూ పాకి చూడసాగింది కొండచిలువ.. అతడిపై పట్టుకోసం ప్రయత్నించసాగింది.. అయితే, మందుబాబు పై ఎక్కిన కొండచిలువను గుర్తించన స్థానికులు.. అప్రమత్తం అయ్యారు.. దానిని అదిరిస్తూ.. బెదిరిస్తూ.. కర్రల సహాయంతో కొండ చిలువను తొలగించారు.. మొత్తానికి కొండ చిలువ బారినుండి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు మందుబాబు.. ఆ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో.. వైరల్‌గా మారిపోయాయి..

దీపావళి రేసులో అరడజను సినిమాలు.. సౌండ్ చేసేదెవరు..?
దసరా కానుకగా రిలీజ్ అయిన సినిమాల సందడి దాదాపు ముగిసింది. సోమవారం కాసిని టికెట్లు తెగాయి. రానున్న వర్కింగ్ డేస్ లో ఈ మాత్రం కూడా ఉండక పోవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రానున్న దీపావళి పైనే. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు దివాళి రేస్ లోకి వచ్చి చేరగా మరికొన్నీ తప్పుకున్నాయి. అందరి కంటే ముందుగా వంకాయ బాంబు లాంటి దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అనుకున్న డేట్ కంటే ఒక్కరోజు ముందుగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి సౌండ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక అక్టోబరు 31న సీమ టపాకాయ్ ని పోలిన నిఖిల్ నటిస్తున్న అప్పుడో ఇపుడో ఎపుడో రెడీ గా ఉంది, అలాగే తారాజువ్వ లాంటి సత్యదేవ్ జీబ్రా కేసుల అదే రోజు వస్తొంది. ఇవి చాలవన్నట్టు చిచ్చుబుడ్డి వంటి తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ‘అమరన్’ కూడా రేస్ లో నిలిచింది. తానేమి తక్కువ కాదని భూచక్రం అయిన జయం రవి లీడ్ లో తెరకెక్కిన బ్రదర్ వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో సూపర్ హిట్ టాక్ తో దీపావళికి సౌండ్ చేసేది ఏ సినేమానో అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజుల వరకు ఆగాలి.

G.O.A.T ను నాలుగు రోజుల్లో లేపేసిన వేట్టయాన్.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వేట్టయాన్. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో  రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది.  జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా వేట్టయాన్ సూపర్ కల్కేక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉండగా వేట్టయాన్ ఇటీవల విజయ్ నటించిన G.O.A.T సినిమా కేరళ, ఏపీ, తెలంగాణ రాష్టాల కలెక్షన్స్ ను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ గోట్ కేరళలో రూ. 31 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి అటు అటుగా రూ. 20 కోట్లు నష్టాలు మిగిల్చింది. కాగా వేట్టయాన్ తొలి నాలుగు రోజుల్లో రూ. 12 కోట్లు కలెక్ట్ చేసి గోట్ ఫుల్ రన్ ను బీట్ చేసింది. అలాగే తెలుగు రాష్టాల్లో కూడా మొదటి రోజు రూ. 5.20 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టి గోట్ (రూ. 4.17కోట్లు) క్రాస్ చేసింది. దసరా కానుకగ రిలీజ్ అయిన వేట్టయాన్ తెలుగు స్టేట్స్ లో సూపర్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. వరల్డ్ వైడ్ గా కేవలం నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది వేట్టయాన్.