NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కోడి పందాల్లో ఉద్రిక్తత.. బీరు సీసాలతో వీరంగం.. పగిలిన తలలు..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు హుషారుగా సాగుతున్నాయి… ఎక్కడా తగ్గేదే లే … అన్న విధంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఓ వైపు కోడి పుంజులు కాలికి కత్తిగట్టి గాలిలోకి ఎగురుతున్నాయి… మరోవైపు పోట్లగిత్తలు రంకెలేస్తూ రయ్యి.. రయ్యిమంటూ కుమ్ముతున్నాయి. అయితే, కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాల శిబిరం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కంకిపాడులో చలువాది రాజా ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడ వణుకూరు – పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. బీరు సీసాలతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.. ఈ ఘటనలో కొందరు యువకుల తలలు కూడా పగిలాయి.. దీంతో, బాధితులను ఆసుపత్రికి తరలించారు.. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్టకేలకు రంగ ప్రవేశం చేశారు పోలీసులు.. కేవలం కోడి పందాల శిబిరాల వద్ద లైట్లు ఆపివేసి జనాల్ని తరిమికొట్టారు.. అయితే, ఇంత జరిగినా పేకాట శిబిరం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది..

పండుగ పూట మందుబాబులకు గుడ్‌ న్యూస్‌..
మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి. మరోవైపు, ధరల తగ్గింపుతో మరింతగా సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్నాయి మద్యం కంపెనీలు. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించటంతో ఇతర కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో మరొకొన్ని కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాలపై నిఘా పెరిగింది. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పై 20 నుంచి 80 రూపాయల వరకు ధరలు తగ్గుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. మాన్సన్‌ హౌస్‌ కంపెనీ క్వార్టర్‌పై 30 రూపాయలు తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు 10 రూపాయలు తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి 80 రూపాయలు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఐతే, కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. మందుబాబులు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తిరుపతి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి..
తిరుపతిలో తొక్కిసలాట ఘటన కలకలం రేపుతోంది.. అయితే, సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు.. కూటమి ప్రభుత్వం జరిగిన ఘటనపై స్పందించిన తీరు సరికాదని.. క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమన్నారు.. బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. టీటీడీ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందన్నారు.. ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. టీటీడీ చైర్మన్, ఈవోల మధ్య మనస్పర్థలు ఉంటే బయట చూసుకోవాలి.. కానీ, భక్తులను ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు.. రాబోయే రోజుల్లో తిరిగి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని అసంతృప్తితో ఉన్నారన్నారు.. పల్లెల్లో సంక్రాంతి క్షోభ కనిపిస్తుందని విమర్శించారు వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

సంక్రాంతి జరుపుకోని ఊరు ఉంది..! అక్కడ అంతా రివర్స్‌.. ఎక్కడ..? ఎందుకంటే..?
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్‌.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ చేసుకుంటే మీరు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పండుగలో పాల్గొంటారు.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి పంచాయితీ ఓబులాపురం గ్రామంలో దాదాపుగా 100 కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల ప్రజలంతా బసవన్నలను (గంగిరెద్దులు) ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామంలోని ప్రజలందరూ గంగిరెద్దులాడించుకుంటూ కర్ణాటక రాష్ట్రం వైపుకు వెళ్తామని.. పక్క రాష్ట్రాల వారు తమను సాంప్రదాయంలో భాగంగా అదేపనిగా బసవన్నలతో సహా పిలుచుకుంటారని అక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకుంటామని.. అందరూ సంక్రాంతికి సొంత ఊర్లకు వస్తే.. ఈ గ్రామ ప్రజలు విచిత్రంగా సొంత గ్రామం నుండి పక్క రాష్ట్రాలకు వలస వెళ్తామని.. అందరూ సంక్రాంతికి ఎక్కడ నుంచో సొంత ప్రాంతాలకు వస్తే మేం మాత్రం మా గ్రామం వదలి వెళ్తామని తెలియజేశారు. కర్ణాటకలోని బెంగుళూరు మరియు ఆంధ్ర సరిహద్దు ప్రాంతలలో బెంగుళూరు, టున్కూర్, దవనగిరి, హో బెంగుళూరు ఇంకా అనేక ప్రాంతాలలో సంక్రాంతి పండుగకి కాక వారి వివాహాలలో సన్నాయిమెలం, బ్యాండ్ మేళం వాయించేందు వెల్తామని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే గంగిరెద్దుల పాడించే ఆట సాంప్రదాయాన్ని విడనాడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలు ను చదివించుకుంటున్నమని కొందరు గంగి రెడ్డుల కళాకారులు తెలిపారు.

జోరుగా కోడి పందాలు.. ఈ రకం కోళ్లే విన్నర్స్‌ ..!
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, క‌ర్ణాట‌క‌, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల నుంచి కూడా ఈ పందేల‌ను చూడ‌టానికి వ‌స్తున్నారు. సామాన్యుల‌తో పాటు రాజ‌కీయ‌, సినీ, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. దీంతో పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి… ఇక కోడి పందేల్లో కాకి, నెమ‌లి, డేగ‌, ప‌చ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హ‌వానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొన‌సాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హ‌వా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది. గరిష్టంగా ఒక్కో పందెం రూ. 25 లక్షల వరకు కాస్తున్నాంటే కోడి పందేలా మజాకా అనుకోక తప్పదు. ఈ రేంజ్‌లో పందేలు కాసిన తర్వాత గంటల్లోనే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇక ఈ మూడు రోజులు ఒక్కో బరిలో పదుల కోట్ల రూపాయల వరకు పందెం పేరుతో డబ్బు చేతులు మారుతుందనే అంచనాలు ఉన్నాయి. పందెంలో డబ్బులు లెక్కపెట్టేందుకు అక్కడక్కడా ఏకంగా కౌంటింగ్ మిషన్లు సైతం ఏర్పాటు చేశారు. కోడిపుంజు పందెం బరిలో దిగింది.. కాకి డేగ, కాకి నెమలి, సీతువా లాంటి రకాలు ఎక్కువగా పందేలు గెలుస్తున్నాయి.. పందెం బరిలో గెలుపు గ్యారెంటీ అంటూ తొడగొడుతున్నాయి కోళ్ళు.. రంగు ప్రధానంగా గెలుపును ఇస్తుందంటున్నారు పందెంగాళ్ళు..

పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ..
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ఏ దన్‌పాల్ మాట్లాడుతూ.. “నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇచ్చిన హామీ నెరవేర్చి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ, సంక్రాంతి కానుక ఇచ్చారు.” అని తెలిపారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ లో మరి కాసేపట్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కానుంది. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొననున్నారు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ఉచితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 ఎన్నికల వాగ్దాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థ యాత్ర, బస్సు ప్రయాణాలతో పాటు, ఆప్ మ్యానిఫెస్టో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ ‘‘మోడీ కి గ్యారెంటీ’’ నినాదంలో ముందుకు వెళ్లింది, ఈ సారి ఆప్ కూడా ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల బరిలోకి వెళ్తోంది.

ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..
ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న ‘‘గాజా యుద్ధానికి’’ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధవిరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయిలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయిల్ ,దాని మిత్ర దేశాలకు చెందినవారిని బందీలుగా తీసుకెళ్లింది. ఇప్పటికీ 94 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని, వీరిలో 34 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది. హమాస్‌తో ఒప్పందం ప్రకారం 33 మంది బందీలను విడుదల చేయనున్నారు, వీరిలో కొందరు సజీవంగా ఉండకపోవచ్చని ఇజ్రాయిల్ సీనియర్ అధికారులు చెప్పినట్లు సమాచారం. వచ్చే సోమవారం తన ప్రమాణ స్వీకారానికి ముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చుకోవచ్చని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బహుశా ఈ వారం చివరి నాటికి సంధి కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ కూడా ఇదే రకమైన వాదనలు చేశారు.

టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బిగ్ షాక్.. వారితో స్టేయింగ్ టైం కుదింపు..?
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు్కు ఘోర పరాభవం ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోవడంతో పాటు అంతకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌ను వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో శనివారం బీసీసీఐ సమీక్ష సమావేశం చేపట్టింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు ఇచ్చింది. టీమ్ ఎంపికతో పాటు సహాయక కోచ్‌లను తనకు ఇష్టమైన వారిని తీసుకొనే ఛాన్స్ ఇవ్వగా.. కానీ, ఫలితాలు మాత్రం జీరో వచ్చాయి. దీంతో పాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఇక, కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇక, 2019 నుంచి విదేశీ టూర్లకు భారత సీనియర్ క్రికెటర్లు వెళ్లే టైంలో.. వారితో పాటు కుటుంబ సభ్యులకూ బీసీసీఐ పర్మిషన్ ఇచ్చేది. కానీ, ఇప్పుడు ఇదే ప్లేయర్స్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బీసీసీఐ అనుకుంటుంది. అయితే, ఇప్పటి నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబ సభ్యులకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్‌ నామినేషన్లు మరోసారి వాయిదా
లాస్‌ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్‌ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్‌ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్‌ క్రేమర్‌, అధ్యక్షురాలు జానెట్‌ యాంగ్‌ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా.. కార్చిచ్చు కారణంగా జనవరి 17కు వాయిదా వేశారు. అయినప్పటికీ, మంటలు ఇంకా తగ్గకపోవడంతో నామినేషన్లను జనవరి 23న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. లాస్‌ ఏంజెలెస్‌ చుట్టుపక్కల ప్రదేశాల్లో తీవ్రమైన కార్చిచ్చు కారణంగా హాలీవుడ్‌ పరిశ్రమతోపాటు అనేక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీనితో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని అకాడమీ నిర్ణయించింది. ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్ల బరిలో భారత్‌ నుంచి ఆరు చిత్రాలు నిలిచాయి. కంగువ (తమిళం), గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌ (హిందీ, ఇంగ్లిష్‌), ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ (మలయాళం), ది గోట్‌ లైఫ్‌ (హిందీ), సంతోష్‌ (హిందీ), స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ (హిందీ) సినిమాలు ఆస్కార్‌ నామినేషన్ల బరిలో ఉన్నాయి. ఈ చిత్రాలు ఆస్కార్‌ నామినేషన్లలో చోటు సంపాదించగలిగితే, భారతీయ చిత్ర పరిశ్రమకు ఇది గొప్ప గౌరవంగా నిలుస్తుంది.

వాలెంటైన్స్‌డే నాడు రాబోతున్న ‘దిల్‌రూబా’
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా ‘దిల్‌రుబా’ తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన కొత్త లుక్ ఫుల్ స్వాగ్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం మంచి హ్యాండ్సమ్ లుక్‌తో పాటు, కలర్‌ఫుల్ బ్యాక్‌ డ్రాప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ యాక్షన్ మిక్స్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం స్టైలిష్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పెద్ద ఎట్రాక్షన్ కానుంది. ‘దిల్‌రుబా’ సినిమాకు డెబ్యూట్ డైరెక్టర్ విశ్వ కరుణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్, సరిగమ ఇండియా లిమిటెడ్‌కి చెందిన యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం, యాక్షన్ మిశ్రమంతో ‘దిల్‌రుబా’ ఈ వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు వచ్చి కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఎంతవరుకు విజాయామ్ సాధిస్తాడా వేచి చూడాల్సిందే.

Show comments