జమిలీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలు మాత్రం అప్పుడే..!
జమిలీ ఎన్నికలపై కేంద్ర వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది.. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఎల్లుండి పార్లమెంట్ ముందుకు రాబోతోంది జమిలీ ఎన్నికల బిల్లు.. అయితే, ఈ నేపథ్యంలో.. మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
అమరావతితో హైవే కనెక్టివిటీ.. రోడ్లను పరిశీలించిన మంత్రి నారాయణ
రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.. 1. E 13 – NH16 junction near DGP office , 2. E11 – AIIMS Junction , 3. E13 AIIMS Road crossing , 4. E13 AIIMS Campus Roundabout , 5. E13 crossing ROB, 6. E11- NH544F mangalagiri crossings , 7. E11 – Yerrabalem temple, 8. E11 Yerrabalem road crossing రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. ఇక, ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటి ఉండాలి అన్నారు.. గత ప్రభుత్వం తీసేసిన జీవోలు అథారిటీ సమావేశం ద్వారా తీసుకొచ్చాం.. మరో 20 వేల కోట్ల టెండర్లకు అథారిటీ అనుమతులు వచ్చే సోమవారం తీసుకుంటాం అన్నారు.. 16 రోడ్లను నేషనల్ హైవేకి కలపాలి.. అందులో E11, E13, E15.. మొదటి దశలో NHకు కలిపాలని నిర్ణయించాం.. E11 లో 39 ఎకరాలు, E13లో 22 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది.. ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన నిర్మాణాలున్నాయి.. చాలా తక్కువ గృహాలు డ్యామేజీ అవుతాయన్నారు.. E11 రోడ్డు 4.63 కిలోమీటర్లు AIMS పక్కన సర్వీసు రోడ్డులో కలుస్తుంది.. E13 రోడ్డు ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద కలుస్తుంది.. ఈ రోడ్లు 80 నుంచీ 100 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలిగేలా నిర్మిస్తామని వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా..!
పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా… నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆరోపిస్తున్నారు జేసీ.. గతంలో జిల్లా ఎస్పీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవాణా శాఖ అధికారులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అప్పటి రవాణా మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో… జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.. ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. తనకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదు.. దీనిపై హైకోర్టుకు వెళ్తాను… అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పలు కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే.. అయితే, తమపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని ఆరోపిస్తూ వచ్చింది జేసీ ఫ్యామిలీ.. ఆయా కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ కూడా అయిన విషయం తెలిసిందే..
రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు.. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ..
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి 29 డిసెంబర్ 2022న TGPSC ప్రకటన విడుదల చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసినా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పారు. అభ్యర్థులు మంగళసూత్రం, కంకణాలు ధరించవచ్చని, చెప్పులు ధరించి రావాలని సూచించారు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్‌లను సమర్పించాలని పేర్కొంది.
మాకు ఎలాంటి కక్ష లేదు.. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీతక్క కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వస్తున్న వార్తలకు మంత్రి సీతక్క స్పందించారు. అల్లు అర్జున్ పైన మాకు ఎలాంటి కక్ష లేదని క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్ లో విద్యార్థులకు పెట్టె టిఫిన్ పరిశీలించారు మంత్రి. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టులో ఎవ్వరి జోక్యం లేదని అన్నారు. అల్లు అర్జున్ పైన మాకు ఎలాంటి కక్ష లేదని అన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తరుపున సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చుట్టం అయి ఉంటారన్నారు. కక్ష పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని మంత్రి సీతక్క అన్నారు. తొక్కి స లాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిందని గుర్తు చేశారు. చట్టం ప్రకారం వాళ్ళు చేసారని అన్నారు. చట్టం ఎవ్వరి చుట్టం కాదన్నారు. అందులో ఎవ్వరు జోక్యం చేసుకోలేదని మంత్రి సీతక్క అన్నారు.
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది. ఎమ్మెల్యేల షెడ్యూళ్లకు తగ్గట్టుగా మంత్రివర్గ విస్తరణ శనివారం కాకుండా ఆదివారం జరుగుతోంది. మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు.. కేబినెట్‌లో చేర్చుకోవాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకారోత్సవం తేదీపై ప్రాథమిక అనిశ్చితి ఏర్పడింది. ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ ముంబైలో శనివారం కార్యక్రమం కోసం సన్నాహాలు చేసింది. అయితే అధికారిక సమాచారం లేకపోవడంతో ఆదివారానికి వాయిదా వేయాలని నిర్ణయించారు. కీలక పోర్ట్‌ఫోలియోల కేటాయింపుపై ఊహాగానాలు చుట్టుముడుతున్నాయి. పట్టణాభివృద్ధి, పర్యాటకం.. MSRDC వంటి కీలకమైన శాఖలు ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నియంత్రణలో ఉంటాయని మూలాధారాలతో పాటు, కీలకమైన పోర్ట్‌ఫోలియోల కేటాయింపుపై కూడా ఊహాగానాలు ఉన్నాయి. అయినప్పటికీ.. రెవెన్యూ పోర్ట్‌ఫోలియోపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తుది నిర్ణయాల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు.
ఈనెల 16న లోక్‌సభ ముందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు
భారతదేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లబోతుందని అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే, లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, అధికార బీజేపీ ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రణాళిక అమలు దిశగా అడుగులు వేస్తుంది. అలాగే, మూడు కేంద్రపాలిత (పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశ్మీర్) ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానం చేసేలా.. చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో పాటు మరో రెండు ముసాయిదా చట్టాలకు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాల సూచనల మేరకు ఇవి ఆమోదం పొందాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది. ఇందు కోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని సూచించింది. అయితే, స్థానిక ఎన్నికలనూ పక్కన బెట్టిన కేంద్రం.. కేవలం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.
వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో భారీ వర్షం కురిసి మైదానమంతా నీటితో నిండిపోయింది. గ్రౌండ్ అంతా చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా రెండున్నర సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (19*), మెక్‌స్వీనీ (4*) ఉన్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు జరిగాయి. అశ్విన్, హర్షిత్ రానాల స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో వచ్చింది. స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.
అరెస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?
సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కొంతసేపు అక్కడ గడిపారు.. పలువురు దర్శకులు, నిర్మాతలు.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. బన్నీని పరామర్శించారు.. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయల్దేరి తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్.. బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు భార్య స్నేహారెడ్డి.. పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతూ బన్నీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.. వాళ్ల అమ్మ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నాడు.. అభిమానులకు అభివాదం చేశారు.. గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు.. ఇక, తన అరెస్ట్‌పై స్పందించారు అల్లు అర్జున్.. ఇంటికి చేరుకోగానే మొదట కుటుంబ సభ్యులను కలిసిన ఆయన.. ఆ తర్వాత.. గేట్ వరకు వచ్చి మీడియాతో మాట్లాడారు.. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెప్పారు పుష్పరాజ్..
రేవతి కుటుంబానికి అండగా ఉంటా.. పుష్పరాజ్ హామీ
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన ఆయన.. బెయిల్ మంజూరు అయిన.. తగిన సమయానికి బెయిల్‌పత్రాలు జైలుకు చేరుకోకపోవడంతో.. చంచల్‌గూడ జైలులోనే గడపాల్సి వచ్చింది బన్నీ.. ఇక, ఈ రోజు ఉదయమే 6.30 గంటలకు జైలు నుంచి విడుదలైన బన్నీ.. నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.. వారిని ఓదార్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు.. ఈ సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్.. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ఆయన.. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను అన్నారు.. కాగా, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం విదితమే.. పీఎస్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు.. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో ప్రవేశపెట్టారు.. అయితే, కోర్టు.. బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది.. దాంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. కానీ, బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సరైన సమయానికి జైలుకు చేరుకోకపోవడంతో.. రాత్రి జైలులోనే గడిపారు అల్లు అర్జున్.. అండర్ ట్రైల్ ఖైదీగా 7697 నంబర్‌ను బన్నీకి కేటాయించిన చంచల్‌గూడ జైలు అధికారులు.. మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ తరపు లాయర్ రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరిండెంట్ కు సమర్పించిన తర్వాత జైలు నుంచి విడుదలైన విషయం విదితమే..
రేవతి కుటుంబానికి క్షమాపణ.. శ్రీతేజని పరామర్శించనున్న అల్లు అర్జున్
మరోసారి మీడియా ముందుకు వచ్చారు హీరో అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అర్జున్‌ను వరుసగా సినీ ప్రముఖులు వచ్చిన పరామర్శించారు.. ఆ తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు.. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు బన్నీ.. నాకు మీరు అందించిన ప్రేమ అభిమానులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.. నా అభిమానులకు రుణపడి ఉంటాను అన్నారు.. అయితే, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదన్నారు.. గత 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తున్నారు.. దాదాపు 30 సార్లు ఆ థియేటర్‌కు వెళ్లిఉంటానని గుర్తుచేసుకున్నారు.. కానీ, అది అనుకోకుండా జరిగింది.. రేవతి కుమారుడు శ్రీ తేజని స్వయంగా నేను వెళ్లి పరామర్శిస్తాను అన్నారు హీరో అల్లు అర్జున్..
చిరు భార్య చేతిని ముద్దాడిన బన్నీ
అరెస్టయిన కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలులో గడిపి ఈరోజు ఉదయమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ క్యూ కట్టారు. అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వారందరూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసంలో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ నిలిపివేసి తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఉదయాన్నే సురేఖ తన మేనల్లుడిని చూసేందుకు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ఇక అక్కడ అల్లు అర్జున్ తన మేనత్తను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఆ తర్వాత ఆమె చేతిని ముద్దాడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ మేనత్త మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చర్చ జరుగుతోంది. మరోపక్క అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ వెళుతున్నారు. హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, శ్రీకాంత్ వంటి వాళ్ళు ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి సహా కొరటాల శివ వంటి వాళ్ళు సైతం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించారు.