NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రూ.4 లక్షలకు పసికందు..! వాట్సాప్ ద్వారా చిన్నారుల విక్రయం..
సోషల్‌ మీడియాలో గుట్టుగా చిన్నారులకు విక్రయాలు సాగిస్తోంది ఓ కిలాడీ మహిళ.. వాట్సాప్ ద్వారా ముక్కుపచ్చలారని చిన్నారులను అమ్మకానికి పెడుతోంది.. తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ మహిళ ఆఫర్‌ పెట్టడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.. సంతానం లేని.. కుటుంబాన్ని పోషించలేని దంపతులు టార్గెట్ గా సోషల్ మీడియా ద్వారా పసికందుల ఫొటోలు పంపి చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగిస్తోందట.. తాడేపల్లి నులకపేటలో గతం సంవత్సరం వరకు నివసించిన సామ్రాజ్యం అనే మహిళ స్థానికంగా చీరలు, వస్త్రాల వ్యాపారం పేరుతో స్థానికంగా ఉండే మహిళలను పరిచయం చేసుకుంది.. గతంలో ఓ వ్యక్తితో నులకపేటలో సహజీవనం చేస్తూ ఇదే ప్రాంతంలో తాము భార్యాభర్తలుగా స్థానికులను నమ్మించింది.. ఈ నేపథ్యంలో కొంతమంది సంతానం లేని దంపతులకు, కుటుంబ పోషణ సరిగాలేని వారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోన్ నెంబర్లను తీసుకొని చిన్నారుల, పసికందుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ నాలుగు, ఐదు లక్షల రూపాయలకు చిన్నారులను అమ్మడానికి తన వద్ద అందుబాటులో ఉన్నారని అవసరమైన వారు ఎవరైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.

టీడీపీ నేత దారుణ హత్య.. ఖండించిన మంత్రి నారా లోకేష్‌..
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను తీవ్రంగా ఖండించారు మంత్రి నారా లోకేష్‌.. శ్రీనివాసులు హత్య ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన లోకేష్‌.. ”కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌..

జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన వైసీపీ బృందం.. విజయవాడ ఘటనపై ఫిర్యాదు
ఢిల్లీ వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు ఆపివేసి, సీసీ కెమెరాలు ఆపేసి.. ఈ దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు వివరించింది వైసీపీ నేతల బృందం.. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఎస్సీ లపై జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, ఢిల్లీ వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందంలో ఎంపీ గురుమూర్తి , మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం ‘స్టే’
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ‘స్టే’ సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థాన విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది.

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా 7 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చినుకు జనాల్ని వణికిస్తోంది.

మూసీ నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తాం..
మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఉత్సాహం చూపిస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా మంది ఆసక్తి చూపెట్టారని వెల్లడించారు. రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ రోజు ఈ అడుగులు వేసి చూపించామన్నారు. కాగ్నిజెంట్‌తో పాటు ఇతర కంపెనీలు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. వారందరికీ నమ్మకం కల్పించడానికి అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి పర్యటించారని మంత్రి స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పారిశ్రామిక వేత్తలతో మాట్లాడడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉదాహరణలు తీసుకొని మూసీ నది పునర్నిర్మాణం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మూసీ నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశీ పర్యటన మాకు ఎంకరేజింగ్‌గా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్తామనే నమ్మకాన్ని వారిలో కల్పించామన్నారు. తాము విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వస్తాయని ఆలోచించలేదన్నారు. కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇదే విధంగా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.

సీబీఐ అధికారిగా నమ్మించి డాక్టర్ దగ్గర రూ.2.8కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
ఉత్తరప్రదేశ్‌లో పీజీఐ లక్నోకు చెందిన డాక్టర్ రుచికా టాండన్‌ను 6 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.2.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు మొదట డాక్టర్ టాండన్‌కు TRAI అధికారిగా నటిస్తూ నమ్మించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ యజమాని నరేష్‌ గోయల్‌ మనీలాండరింగ్‌ కేసులో పేరు ఇరికిస్తామని బెదిరించారు. ఆ తర్వాత సీబీఐ అధికారిగా నటిస్తూ 6 రోజుల పాటు డిజిటల్‌ అరెస్ట్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.2 కోట్ల 80 లక్షలు కూడా మోసగాళ్లు కాజేశారు. మోసగాళ్ల బారి నుంచి విముక్తి పొందిన తర్వాత, తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ లక్నోలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఖాతాలను సీజ్ చేశారు. అయితే, ఈ చర్య తీసుకునే సమయానికి మోసగాళ్ళు కాజేసిన మొత్తాన్ని వేరే ఖాతాకు బదిలీ చేశారు. వారం రోజుల క్రితం ట్రాయ్ అధికారి పేరుతో మోసగాళ్లు తనకు ఫోన్ చేశారని డాక్టర్ రుచికా టాండన్ పోలీసులకు తెలిపారు.

నిన్న 1000 పెరిగితే.. నేడు 100 మాత్రమే తగ్గింది!
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందని సంతోషపడిన పసిడి ప్రియులు.. రోజు రోజుకీ పెరుగుతున్న రేట్స్ చూసి షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. భారీగా పెరిగి.. స్వల్పంగా తగ్గడంతో మరోసారి గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం కావడమే అని నిపుణులు అంటున్నారు. దేశీయంగా బుధవారం (ఆగష్టు 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,510 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.83,600గా నమోదైంది.

సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నటాషా మరొకరితో ప్రేమలో పడిందని ఇప్పటికే వార్తలు హల్‌చల్‌ చేయగా.. తాజాగా హార్దిక్ ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బ్రిటిష్‌ సింగర్‌, టీవీ నటి జాస్మిన్‌ వాలియాతో హార్దిక్ డేటింగ్‌ చేస్తున్నాడట. హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ.. ఫొటోలకు పోజులిచ్చాడు. అంతకుముందు జాస్మిన్‌ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇద్దరు స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఒకేవిధంగా ఫొటోలు దిగారు. దాంతో హార్దిక్‌, జాస్మిన్‌ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌లకు ఒకరికొకరు లైక్‌ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. గతంలోనూ జాస్మిన్‌ పోస్ట్‌లకు హార్దిక్‌ కామెంట్లు చేశాడు. ఇవన్నీ చూస్తుంటే.. హార్దిక్‌, జాస్మిన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు అర్ధమవుతోంది.

అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న రిలీజైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నాడు కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా పెద్ద హిట్ సాధించే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఐదు రోజుల్లో రూ. 8.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, హీరోలు అభినందనల తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ రామ్ చరణ్ నిహారిక ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయని అభినందించారు.

రెబల్ స్టార్ ‘ది రాజా సాబ్’ అప్ డేట్ వచ్చేసిందోచ్..
బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయినా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్ చూసి ప్రభాస్ ను మళ్లీ వింటేజ్ లో చూసినట్టు ఉందని.. మిర్చి తరువాత మళ్లీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ గ్లోబల్ స్థాయికి వెళ్ళాక హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తో సినిమా చేస్తూ ట్రేడ్ వర్గాలని ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాడు డార్లింగ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి. రాజాసాబ్‌ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలైన మీడియా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రకటించారు.